విశ్వ స్వరూప సందర్శనము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
Like-o-Meter
[Total: 1 Average: 3]

రచయిత : డా|| ఎస్. ఎల్. ఎన్. జి. కృష్ణమాచారి, బెంగుళూరు.

సేకరణ : ప్రభల శాస్త్రి, ముంబై


 

“ అక్షయ లింగ విభో, స్వయంభో

అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో “

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు రచించిన యీ కీర్తనను మనము తరచు సంగీత కచేరీలలో వింటూ ఉంటాము. దీక్షుతులవారు సంగీత మూర్తి త్రయములో ఒకరు. ఈ మూర్తి త్రయమువారైన త్యాగరాజు, శ్యామశాస్త్రి గారల సమకాలికుడు (1776-1836). వీరివలె సంగీత శాస్త్రములోనే కాక, వేద, పురాణ, ఇతిహాస, జ్యోతిష శాస్త్రాలలో కూడా నిష్ణాతుడు. ఈ శాస్త్రాలలోని కొన్ని విషయాలను వీరి సంగీత సాహిత్య రచనలలో తెలియపరుస్తూ ఉంటారు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండము గురించి తెలుసుకోవాలని జిజ్ఞాసపరుడైన మానవుడు అనాధిగా కృషిచేస్తూ, ఉన్నాడు. వీటి వలన యిప్పటి వరకు లభ్యమైన విషయాలు కొన్నింటిని యిక్కడ పరిశీలించుదాము.

నిర్మలమైన ఆకాశములో రాత్రివేళ చంద్రుడులేని సమయాలలో చూచినట్లైతే మనకు ప్రకాశవంతమైన శుక్ర, బుధ, శని, కుజ, గురు గ్రహములు కనబడతాయి, యివికాక తూర్పు, పడమర దిశగా వ్యాప్తిస్తూ కొంత వెడల్పుగా ఒక దట్టమైన నక్షత్ర సమూహము గోచరిస్తుంది. దీనినే పాలపుంత (మిల్కీవే-Milky way) అంటారు. దీనిలో కోట్ల సంఖ్యలలో నక్షత్రాలు ఉంటాయి. వీటిలో కొన్ని దగ్గరగా ఉన్న గుంపులను మనవారు కొన్ని జంతువుల రూపాలలో ఊహించుకొని మేషము, వృషభము, మొదలుగా 12 రాశుల పేర్లు పెట్టారు. ఈ రాశులలో ప్రకాశవంతములైన 27 నక్షత్రాలను అశ్వని మొదలుగా కొన్ని దేవతల, ఋషుల పేర్లతో వ్యవహరిస్తున్నారు.

Products from Amazon.in

ఈ పాలపుంతలోని నక్షత్రాలే కాక ఆకాశములో అన్ని దిశలలోనూ వివిధ పరిమాణములతోను, వివిధ కాంతులతోను, కొన్ని లక్ష సంఖ్యలలో నక్షత్రాలు కనబడతాయి. ఇవి మన సూర్యుని కన్న (సూర్యుడు కూడా ఒక నక్షత్రమే! ఎన్నో వేలు పెద్దవయినప్పటికినీ, చాల దూరములో ఉన్నందువలన చాల చిన్నవిగా కనబడుతాయి. ఈ దూరాలను మనము సాధారణంగా ఉపయోగించే మైళ్లు, కిలోమీటర్లలో గాక వెలుతురు-వత్సరాలలో (లైట్-యియర్స్-light years) పరిగణిస్తారు. వెలుతురు కిరణాలు ఒక సెకండుకు 1,86,200 మైళ్లు పయనిస్తాయి. ఇవి ఒక సంవత్సరములో 5,91,000 కోట్ల మైళ్లు పోతాయి, ఒక లైట్-యియర్ అంటే ఇంత దూరమన్న మాట. ఈ లైట్-యియర్ కోలమానములో కొన్ని నక్షత్రాలు కొన్ని వేల, లక్షల లైట్-యియర్స్ దూరములో ఉన్నాయి.

ఇదే విధంగా వీటి నుండి బయలుదేరిన కాంతి కిరణాలు మనలను చేరడానికి అన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను యీనాడు మనం ఆకాశంలో చూస్తున్నాము. ఇంతటి దూరంలో ఉన్న నక్షత్రాలను పరిశీలించుటకుగాను. అతిశక్తివంతమైన దూర దర్శనులను (టెలిస్కోపు-telescope) ఉపయోగిస్తున్నారు. ఇటువంటి టెలిస్కోపులు భూమ్మీద ఎత్తైన ప్రదేశములలో అమర్చిబడి వున్నాయి. మన దేశంలో కోడైకనాల్, కావలూరు, నైనిటాల్, హైదరాబాదులలో పని చేస్తున్నాయి. ఇవిగాక, పూనా, బెంగుళూర్లలో రేడియో టెలిస్కోపులు కూడా పనిచేస్తున్నాయి.  యివి వెలుతురు కిరణాలకు బదులు రోడియో తరంగాలను ఉపయోగించి అంతరిక్షాన్ని పరీక్షిస్తాయి. ఈ భూతలం మీదనున్న టెలిస్కోపులుగాక ఉపగ్రహాలపై (సైట్ లైట్స్ – satellites) అమర్చబడిన దూరదర్శనులు. తదితర పరిశోధనా పరికరాలున్నాయి.

అంతరిక్షంలోనున్న నక్షత్రాలు చెదురుమదురుగా కాకుండా గుంపులు, గుంపులుగా ఉంటాయి. వీటిని నక్షత్రకూటములు (గెలక్సీ –galaxy) అంటారు. ఈ గేలక్సీలు కొన్ని దీర్ఘవర్తులాకారములోనూ, కొన్ని సర్పిలాకారము (స్పైరల్ – spiral) లోనూ ఉంటాయి. మన సూర్యుడు ఉన్న గెలక్సీని మిల్కీవే గేలక్సీ (Milky Way) అంటారు. ఇది సర్పిలాకారముగానున్న గేలక్సీ. ఈ గేలక్సీలోని చివరి వలయంలో మన సూర్యుడు ఉన్నాడు. మన మిల్కీవే గేలక్సీలో సూర్యుడిలాంటి నక్షత్రాలు సుమారు రెండు వేలకోట్లు ఉన్నాయి. మన గేలక్సీ వ్యాసము ఒక కోటి లైట్-ఇయర్సు, విశ్వాంతరాళంలో యిటువంటి గేలక్సీలు కొన్ని కోట్లు ఉన్నాయి. దీనిని బట్టి మన విశ్వం ఎంత విశాలమైనదో ఊహించుకొనవచ్చును ! మొదట చెప్పిన కీర్తనలోని “అక్షయ కోటి లింగాల“ను అంతరిక్షంలో అసంఖ్యాకంగా నున్నాయీ గేలాక్సీలతో పోల్చుకొనవచ్చునేమో ?

ప్రాచీన భారతీయ, పాశ్చాత్య, ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని వందల సంవత్సరాలుగా గ్రహాల, నక్షత్రాల గమనాలను పరిశీలించి వీటి కక్ష్యలను నిర్ణయించి, లెక్కలు కట్టి చెప్పుటకు వీలైన సూత్రాలను కనుగొన్నారు. ఈ సూత్రాల ఆధారంతోనే నేటి పంచాంగ కర్తలు గ్రహముల స్థితి గతులను, తిథులను, సంక్రమణములను, సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించే కాలాలను చెప్పగలుగుతున్నారు. మన ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులలోని అగ్రగణ్యులైన వారిలో ఆర్యభట్టు (క్రీ.శ. 476), ప్రామాణిక గ్రంధాలు రచించారు. వీరి గౌరవార్ధం మన ఇస్రో సంస్థ వారు తమ తొలి ఉపగ్రహములకు ఆర్యభట (1975), భాస్కర (1979, 1981) అని పేర్లు పెట్టారు.

సూర్యుడు గ్రహాలను తన చుట్టూ నిర్ణీత కక్ష్యలలో క్రమబద్ధంగా త్రిప్పుకొనే శక్తిని గురించి తెలుసుకొవాలని ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రయాత్నాలు జరిపారు. ఇటువంటి ప్రయత్నాలు జరిపిన తొలి గణిత శాస్త్రవేత్త రెండవ భాస్కరాచార్యుడు. ( క్రీ. శ. 1114) ఈయన తన “సిద్ధాంత శిరోమణి” అనే గ్రంథంలో, భారమైన వస్తువులను భూమి ఆకర్షణ శక్తి వలన తనవైపు ఆకర్షించుకొనునని వ్రాసారు. ఐతే ఈ శక్తి ఏ విధంగా పని చేస్తున్నదనే విషయం గురించి వివరాలు ప్రస్తావించలేదు.

ఈ విషయాలను దాదాపు 550 సం.ల తరువాత ప్రఖ్యాత బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్త ఐజక్ న్యూటన్ (Issac Newton) (1642-1727) తన గురుత్వాకర్షణ సిద్ధాంతMలో (థియరీ ఆఫ్ గ్రేవిటేషన్ – Theory of gravitation) తెలియపరచారు. ఈయన క్రీ. శ. 1687 లో ప్రకటించిన “ప్రిన్స్పియా మేథమేటికా” (Principia Mathematica) (గ్రంథంలో ఏ రెండు వస్తువుల మధ్యనైనా ఒక పరస్పర ఆకర్షణ శక్తి పని చేస్తుందని, యీ శక్తి అ రెండింటి ద్రవ్య పరిమాణముల (mass) గుణ లబ్ధమునకు అనులోమ నిష్పత్తిలోను, వాటి మధ్యనున్న దూరము యొక్క వర్గమునకు విలోమ నిష్పత్తిలో ఉంటుందని తెలియపరచారు.

ఈ గురుత్వాకర్షణ సిద్ధాంతమూలముగా లభ్యమైన గమన సమీకరణముల (Equation of motion) ఆధారంతో సూర్యుని చుట్టూ గ్రహాల దీర్ఘ వృత్తాకార (elliptical) కక్ష్యలలోపయనిస్తున్నవని తెలియపరచారు. ఈ సూత్రాలవల్ల వాటి వేగంను, అవి సూర్యుని చుట్టి వచ్చే కాలాన్ని కనుగొన్నారు. అంతవరకు దృశ్యమూలంగా కనుగొనిన గ్రహ సంచారాన్ని సిద్ధాంతపరంగా ఋజువు చేయకలిగారు. ఈ గమన సమీకరణాలే గ్రహాలు, వాటి చుట్టూ పోయే ఉపగ్రహాలు, కృత్రిమ ఉపగ్రహాలు, నక్షత్రాలు మొదలైన సమస్త వస్తువుల గమనాల్ని నిర్ణయిస్తున్నవి.

దాదాపు మూడు వందల సంవత్సరాల తరువాత న్యూటన్ గమన సమీకరణాలలో కొన్ని సవరణలు చేయవలసి వచ్చినది. 1905 సంవత్సర౦ లో ప్రఖ్యాత జర్మన్ శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ విశేష సాపేక్ష సిద్ధాంతమును (special theory of relativity) రూపొందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం యిది వరకు న్యూటన్ ఉహించినట్లుగా వస్తువుస పరిమాణము (mass) స్థిరం కాదని, అది వేగాన్ని బట్టి మారుతుందని, అతి వేగంగా, దాదాపు వెలుతురు వేగంతో పయనిస్తునప్పుడు, దాని ద్రవ్య పరిమాణం గణనీయంగా హెచ్చుతుందని, వెలుతురు వేగ నర్గము (C2) తో గుణించుట వలన లభ్యమయ్యే శక్తి అత్యధికంగా ఉంటుంది. ఈ పరమాణు సంయోగశక్తియే హైడ్రోజన్ బాంబులో పనిచేస్తుంది.

Products from Amazon.in

సూర్యునిలో యీ సంయోగము వలన జనించే శక్తి కొన్ని వేల హైడ్రోజన్ బాంబుల శక్తికి సమానం. కొన్ని నక్షత్రాలలో వాటి పరిమాణ దశ ననుసరించి లిథియం (lithium), నైట్రోజన్ (Nitrogen), కార్బన్ (carbon) మొదలైన కేంద్రకములు కూడా సంయోగక్రియలోపాల్గొంటాయి. సూర్యునిలో ఉద్భవించిన యీ శక్తి విద్యుత్-అయస్కాంత తరంగాల (ఎలక్ట్రో మేగ్నటిక్ వేవ్స్- Electromagnetic waves) రూపంలోను, విద్యుదావేశిత రేణువుల (charged particles) రూపంలోను అన్ని దిశలా వ్యాపిస్తుంది. ఈ విద్యుత్-అయస్కాంతతరంగాలు వివిధ తరంగ పరిమాణాలలో ఉంటాయి. అతి సూక్ష్మములైన X రే తరంగాలనుండి(తరంగ పరిమాణం ఒక సెంటిమీటరులో కోటివంతు) నీలలోహిత కిరణములు (అల్ట్రావైలట్ రేస్ – ultraviolet rays), వెలుతురు కిరణములు (ఒకసెంటిమీటరులో ఒక లక్షవవంతు), ఇన్ఫరా రెడ్ కిరణములు (ఒక సెంటిమీటర్లో వందవవంతు), మైక్రోవేవ్స్ (micro waves) ( 1 మిల్లి మీటరు), రేడియో తరంగాలు (మీటరు నుండి కిలోమీటర్లు వరకు) ఇవి అన్నియు విద్యుత్ అయస్కాంత తరంగాల కోవకు చెందినవే. సూర్యుని నుండి బయలుదేరిన తరంగశక్తిలో ఒక కోటి వంతు కన్న తక్కువ భాగమే మన భూమిని చేరుతున్నది. ఈ కొద్ది పాటి శక్తియో భూమి మీద నున్న సకల చరాచర జీవరాసులకు ప్రాణదానము చేస్తుంది. వృక్షమువ ఆకులలోని పచ్చని పదార్ధము (క్లోరోఫిల్ –chlorophil) సూర్యరశ్మిలోని పచ్చరంగుకిరణాలను గ్రహించి కిరణజన్య సంయోగక్రియ (ఫోటో-సింథసిస్-photo-synthesis) ద్వారా కార్బో హైడ్రేట్ (carbohydrate) అనే ఆహార పదార్ధాన్ని తయారు చేస్తుంది. ఈ కార్బోహైడ్రోటులే వృక్షాలకు ఆహారపదార్ధములు. ఆ వృక్షాలే జంతువులకు, మానవులకు పోషకానికి కావలసిన ఆహార పదార్ధాన్ని అందజేస్తున్నాయి.

భూమి మీద నున్న వృక్ష సంపద ఏ మాత్రము క్షీణించినా జీవరాసుల మనుగడకి ముప్పు వస్తుంది. సూర్యుని నుండి వస్తున్న అతి నీలలోహిత కిరణములు (ultra violet rays) మన శరీరానికి హాని కలిగిస్తాయి.వాతావరణములోనున్న ఓజోన్ (ozone) యీ అతినీలలోహిత కిరణాలను హరించి మనలను కాపాడుతున్నది. యీ వాతావరణము ఏ మాత్రము కాలుష్యమైన ఓజోన్ శాతము తగ్గి మనకు అపరిమితమైనహాని కలిగిస్తుంది. సూర్యునిలోని హైడ్రోజన్ మొదలైన ఇంధన పదార్ధము పూర్తిగా వినియోగింపపడిన తరువాత సూర్యుడు నుండి మనకు వచ్చే సూర్యరశ్మి నిలిచిపోయి భూమి మీద జీవరాసులు అంతర్ధానమవుతాయి.

ఐతే యిది యిప్పటిలో జరుగుతుందని భయపడవలసిన అవసరములేదు. సూర్యునిలో యిప్పుడు ఉండే ఇంధనములు ఇంకొక 50 కోట్ల సంవత్సరాల వరకు వస్తాయి. సూర్యుడు మొదలైన నక్షత్రాలు వాటి ఇంధన పదార్ధము కోల్పోయిన తరువాత వాటి పరిస్థితి ఏమౌతుందనే అంశముపై ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞులు (ఏస్టోఫిజిసిస్టులు-astrophyscists) విశేషమైన కృషి జరిపారు. ఈ శాస్త్రజ్ఞులలో ప్రముఖమైన శ్రీ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఒకరు. ఈయన శ్రీ C. V. రామన్ గారి అన్న కుమారుడు. C. V. రామన్ తన పేరుతోనున్న రామన్ ఎఫెక్ట్ ను (Raman effect) కనుగొని 1930 సం||లో విజ్ఞానంలో నోబుల్ (Nobel) బహుమతి పొందిన ప్రప్రథమ భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ చెన్నైలోని ప్రెసిడెన్సి ఖళాశాలలో పట్టభద్రుడై లండన్లోని కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయములో డాక్టరేట్ సంపాదించి అచ్చట నుండి 1934 సం||లో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయములో చేరి అచ్చటనే స్థిర నివాసము ఏర్పరచుకొని ఖగోళ భౌతిక శాస్త్రములో నక్షత్ర పరిణామ చరిత్రపై అపారమైన పరిశోధనలు జరిపారు. ఈయన నక్షత్రములు వాటి భారముననుగురించి పరిణామ దశలు చెందుతాయని సిద్ధాంతరీకరించారు. సూర్యుని కన్న ఒకటిన్నర రెట్లకు తక్కువగా భారముండే నక్షత్రాలు (యీ పరిమితి చంద్రశేఖర్ పరిమితి Chandra Sekhar limit అని పిలవబడుతున్నది) వాటి ఇంధనాలు పూర్తిగా వినియోగమైన తరువాత వైట్ డ్వర్ఫ్ లు (white dwarfs) గాను, యీ పరిమితి కన్న ఎక్కువ భారమున్న నక్షత్రములు న్యూట్రాన్ (Neutron) నక్షత్రములుగాను, మరీ విపరీత భారమున్నవి బ్లాక్ హోల్స్ (black holes) గాను మారుతాయని తెలియపరచారు. ఈ బ్లాక్ హోల్స్ వాటి అత్యధిక భారము వలన అత్యధిక గురుత్వాకర్షణశక్తి కలిగినవై వెలుతురును కూడా బయటకు రాకుండా బంధించి చేయుట వలన మన కంటికి కనిపించవు.

ఐన్ స్టయిన్ విస్తారిత సాపేక్ష సిద్ధాంతము యీ బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడినది. చంద్రశేఖర్ సిద్ధాంతము ప్రయోగాత్మకముగా రూఢియైన పిమ్మట ఆయనకు 1982 సం.లో నోబుల్ బహుమతి బహుకరించారు. ఈయన గౌరవార్ధం అమెరికాలోని నాసా సంస్థవారు చంద్రా X-రే చెలిస్కోపును 1999 సం||లో అంతరిక్షములో ప్రవేశ పెట్టారు. ఈ టెలిస్కోపు నక్షత్రాల నుండి వెలువడే ఎక్స్ రే లను గ్రహించి వాటి ఎక్స్ రే ఛాయాచిత్రములను మనకు అందజేస్తున్నది.

1929 సం|| వరకు ఖగోళ శాస్త్రజ్ఞులు యిప్పుడు మనము చూస్తున్న విశ్వము అనాది కాలం నుండి యధాతధంగా ఉంటున్నదని భావించారు. దీనినే స్టడీస్టేట్ థియరీ (steady state theory) అంటారు. కాని 1929 సం||లో ఎడ్విన్ హబుల్ (Edwin Huble) అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు వివిధ గేలాక్సీలలోని నక్షత్రాల వర్ణమాపకములను (spectra) నిశితంగా పరీక్షించి వీటిలోని వర్ణరేఖల (spectral lines) తరంగ పరిమాణము వృద్ధి అగుచున్నదని కనుగొనినారు. దీనిని బట్టి అవి ఒకదానినుండి మరియొకటి అతివేగముగా దూరమవుతున్నవని నిర్ధారించారు. అంటే విశ్వము తటస్థముగా నుండక నిరంతరము వ్యౌకోచము చెందుతున్నదని తెలియపరచారు. దీనినే వ్యాకోచిత విశ్వము (expanding universe) అంటారు. వేగముగా పయనిస్తున్న యీ గేలాక్సీలు ఒకానొకప్పుడు (కొన్ని కోట్ల సంవత్సరములకు పూర్వము) ఒకచోట ఐక్యముగా ఉండియుండవలెనని నిర్ధారించిరి. దీనిని ఏకైకము ( సింగ్యులారిటీ-singularity) అంటారు.

ఈ ఏకైకము సుమారు 1370 కొట్ల సంవత్సరముల క్రితము మహత్ విస్ఫోటము (బిగ్ బాంగ్-Big Bang) చెంది పదార్ధమంతయు విశ్వంలో వెదజల్ల బడిన దనియు యివి క్రమేపీ గేలాక్సీలుగా రూపొంది ప్రస్తుతము మనము చూస్తున్న విశ్వరూపములోనికి వచ్చిందని తెలియపరచారు. హబుల్ గౌరవార్ధము నాసా సంస్థవారు 1990 సంవత్సరంలో హబుల్ స్పేస్ టెలిస్కోపు అనే శక్తివంతమైన దూరదర్శినిని అంతరిక్షములో ప్రవేశపెట్టారు. ఇది అనేక వేల లైట్-యియర్స్ లో నున్న నక్షత్రములను, గేలాక్సీలను పరిశీలించి వాటిలో నిరంతరము జరుగుతున్న పరిణామ సంఘటలను మనకు వర్ణ ఛాయా చిత్రములుగా పంపిస్తున్నది. 

ప్రస్తుతము మనకు తరచు పత్రికలలోను, టి. వి. లోను చూస్తున్న అంతరిక్ష వర్ణ ఛాయా చిత్రాలు, యీ హబుల్ స్పేస్ టెలిస్కోపు పంపుచున్నవే. వ్యాకోచము అగుచున్న గేలాక్సీలు కొంతకాలమైన తరువాత (కొన్ని కోట్ల సంవత్సరములు) సంకోచించుట ప్రారంభమైమరికొన్ని కోట్ల సంవత్సరములకు మహత్ అంతస్ఫోటనము చెంది (బిగ్ క్రంచ్-Big crunch) ఏకైకంగా మారి యీ ఏకైకము మరల మహత్ స్ఫోటము చెంది క్రొత్త విశ్వం సృష్టించబడుతుందనియూ, విస్ఫోటనము-అంతస్ఫోటనము పునరావృతంగా జరిగే క్రియయనియు (cyclic phenomenon) విశ్వాధ్యయన శాస్త్రవేత్తలు కాస్మోలజిస్టులు – cosmologists) సిద్ధాంతరీకరించారు.

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమైఎవ్వనియందుడిందు…“ అని పోతనగారు పరమేశ్వరుని గురించి వ్రాసిన వర్ణనలు యీ ఏకైకమునకు (సింగ్యులారిటీ) కూడా వర్తిస్తుంది కదా !

మనము యింత వరకు విశ్వ స్వరూపాన్ని గురించి తెలుసుకొన్న విషయాలు ఒక వంతు అయితే దీనికి ఎన్నో రెట్లు యింకను తెలిసికొనవలసి యున్నవి, ముఖ్యంగా విశ్వంలో అధికభాగంగా (95 శాతము) ఉన్న అగోచరశక్తి (డార్క్ ఎనర్జీ-dark energy), అగోచర పదార్ధము (డార్క్ మేటర్-dark matter) లను గురించి తెలుసుకొనవలసియున్నది. ఇది తెలుసుకొనే జ్ఞానము ఆ జగన్నాధుడు అలనాడు అర్జునికి కురుక్షేత్ర యుద్ధభూమిలో జ్ఞానోదయము చేసి విశ్వరూపము సందర్శింపజేసినట్లుగా, మనకు కూడా ఒకనాడు ప్రసాదిస్తాడని ఆశించుదాము.

@@@@@

Products from Amazon.in

You may also like...

Leave a Reply