విశాఖలో ఆ ఇంకో సముద్రం ఏదీ?!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

“అఫ్సర్ గారూ! వచ్చెయ్యండి! శాస్త్రి గారొచ్చారు!”

ఇంటర్కమ్ లో పురాణం గారు అనెయ్యడమే ఆలస్యం, నేను ఆఘ మేఘాల మీద మెట్లు దిగి పురాణం గారి ఆఫీస్ లో వాలిపోయాను. అప్పటికే, పురాణం గారు తన టేబులు మీద కాయితాలన్నీ సర్దేసి, “ వచ్చారా?దుకాణం బంద్! పదండి పోదాం తోసుకు పోదాం.  ఇక!”

అలా రావిశాస్త్రి గారో, చాగంటి సోమయాజులో, రోణంకి అప్పల స్వామో, ఇస్మాయిల్ గారో వచ్చినప్పుడు పురాణం గారు పసి పిల్లాడి కన్నా అన్యాయమైపోతారు! రాక రాక వచ్చే పండగ, అదేదో వొక రోజు ముందే వచ్చేసినంత సంబరపడి పోతారు.

అది 1984లో ఏదో ఒక సాయంకాలం. నేను అప్పుడే ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేరిన కొత్త రోజులు. కుటుంబ ఆర్ధిక పరిస్తితి బాగుండక, పదహారేళ్ళ వయసులో నేను ఆంధ్రజ్యోతి కి పని చెయ్యడం మొదలెట్టాను. 1983లో ఆంధ్రజ్యోతి వారపత్రిక ఉగాది కథల పోటీలో నాకు బహుమతి వచ్చినప్పుడు నండూరి రామమోహన రావు గారు “నువ్వు వుండాల్సింది అక్కడ కాదు, బెజవాడలో” అంటూ బెజవాడ పిలిపించి, తన చాంబర్ ఎదురుగా  ఓ కుర్చీ ఓ టేబులూ చూపించి  “ఇవాల్టి నించి నువ్వు నా సబ్ ఎడిటర్ వి!” అనేశారు.  అప్పటికే  ఎమ్మే ఇంగ్లీషు ఎంట్రన్సులో మొదటి ర్యాంకు వచ్చినా, ఫీజులు కట్టుకునే స్తోమతు లేక నా చదువు ఆగిపోతున్నందుకు లోపల్లోపలే మా నాన్న గారు సతమత మవుతున్న కాలంలోఆ ఉద్యోగం కొండంత అండ! నెలకి రెండు వందల యాభై అయిదు రూపాయలు జీతం.

ఆ కృతజ్ఞతా భారం వల్ల నేను రోజులో పదహారు గంటలు ఆఫీసులోనే వుండే వాణ్ని. ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలతో సహా నాకు ఇష్టం లేని స్పొర్ట్స్ వార్తలు కూడా రాసిపెట్టేసే వాణ్ని. వెండి బంగారం ధరలు లిస్టు కట్టి, బిజినెస్ కాలం లో పెట్టే వాణ్ణి. గ్రాంథికం లో వచ్చే రాశిఫలాలు వాడుక భాషలో తిరగ రాసే వాణ్ణి. రాత్రి బానర్ వార్త, దానికి లీడ్లు రాసుకొని, అచ్చులో చూసుకొని  మహదానంద పడిపోయే వాణ్ని.

అలా వేళ కానీ వేళల్లో కూడా పెన్ను దాచుకోకుండా పని చేసే కాలంలో పురాణం గారు తన దగ్గిరకి పిలిపించుకొని, “ఈ కథ ఎలా వుందో చెప్పండి, అఫ్సర్ గారూ!” అనే వారు, ఒక కథ ఇచ్చి!

అప్పుడు నాకు నిండా ఇరవై కూడా లేవని పురాణం గారికి తెలుసు, కానీ, ఎందువల్లనో ఆయన “గారు” అనే ఆ తోక మరిచిపోయే వారు కాదు. “గారు అనడం బాగు లేదని” వొక సారి అంటే,  “మీకు డొక్కశుద్ధీ, చిత్తశుద్ధీ రెండూ వున్నాయి, అవి వున్నవాడికి ఏకవచనం ప్రయోగిస్తే నాకే సిగ్గు చేటు. ఆ మార్కెటింగ్ గాళ్ళకీ, ఫైనాన్సు గాళ్ళకి గారు అని ఏడుస్తూ తగిలిస్తా. మీకు గారు తగిలించడంలో నాకు ఆ పాప విమోచనం అవుతుంది ” అనేశారాయన.

సరే,అలాంటి కథలూ కబుర్లూ చాలా వున్నాయి కానీ, అది అలా వుంచితే, మేమిద్దరం ఆఫీసులోంచి బయట పడి, బందరు రోడ్డు మీదికి రాగానే, పురాణం గారి రిక్షా వాలా సిద్ధంగా వున్నాడు.

“పద…పద…మబ్బుల మీద…మబ్బుల మీద  వెళ్లిపోవాలి” అని రిక్షావాలాని తొందర పెడ్తున్నారు. ఇంకో వైపు “ఇవాళ మిమ్మల్ని రావిశాస్త్రి గారిని  కలుపుతున్నా. ఆయన్ని కలవడమే పండగ!” అంటూ.

రిక్షా బీసెంటు రోడ్డు వైపు దూసుకుపోతున్నంత సేపూ రావిశాస్త్రి గారి గురించి కబుర్లు చెప్తూనే వున్నారు పురాణం గారు. ఆ కబుర్లలో  ప్రేమలూ కోపాలూ తాపాలూ అన్నీ వున్నాయి. ఇక నవ్వులకి లెక్కా పత్రం లేదు!

రిక్షా మోడర్న్ కేఫ్ దగ్గిర ఆగడం, పురాణం గారూ నేనూ పరుగులాంటి నడకతో శాస్త్రి గారి రూములోకి దూసుకెళ్ళడం జరిగిపోయాయి. “ఇదిగో శాస్త్రి గారూ, కత్తిలాంటి మనిషిని పట్టుకొచ్చా..చూడండి” అంటూ నన్ను శాస్త్రి గారికి పరిచయం చేశారు పురాణం గారు. ముగ్గురం కలిసి కిందకి వెళ్ళి, అక్కడ కాఫీ తాగుతూ చాలా సేపు కూర్చున్నాం.

“అబ్బ! ఈ కాఫీ తాగుతూంటే, ప్రాణం లేచోచ్చింది పురాణంగారూ!” అన్నారు రావిశాస్త్రి గారు కాఫీ కానిస్తూ. ఆ కాఫీ అంటే నాకూ మహా ఇష్టమే! కానీ, ఎదురుగా వొక మహా రచయిత కూర్చొని వుంటే, ఆ కాఫీ ఇంకాస్త పరీమళంతో ఘుమఘుమలాడుతోంది.

రావిశాస్త్రి గారు మనుషుల్ని బాగా చదువుతారు, మంచి ప్రశ్నల్తో గొప్ప సమాచారం రాబడ్తారు. ఆయన కథల్లో పాత్రల్లో, సన్నివేశాల్లో అంత వివరం వుండడానికి అదొక కారణం. సహజంగానే ఆయనకి వొక మనిషిని తెలుసుకోవాలన్న ఆరాటం ఎక్కువగా వుండేది. ఆయన వీక్షణం విలక్షణం!

చాలా సేపు కబుర్లు చెప్పుకున్న తరవాత వున్నట్టుండి:

“అఫ్సరయ్య అనంబడు తురక బ్రాహ్మడా! ఇంగ చెప్పు! ఈ తెలుగు వైపు ఎందుకొచ్చావ్? ఆ అమ్మ భాషలో అయితే కాసింత గొప్ప కవిత్వమయినా చదివే వాడివి కాదా?!”అని మాటల మధ్యలో వొక ప్రశ్న రువ్వారు ఆయన.

కొంచెం తత్తరపడ్డాను. అప్పటి వరకూ  ఆ ప్రశ్న ఎవరూ నన్ను అడగలేదు. అసలు ఉర్దూ నాకు అమ్మ భాష అని నాకు స్పృహే లేదు. అమాసకో పున్నమకో మసీదుకి వెళ్ళే వేళల్లో తప్ప ఇంకెప్పుడూ నేను సాయిబునన్న ఆలోచన కూడా వచ్చేది కాదు.

నేను సమాధానం వెతుక్కుంటూన్న సందిగ్ధ అవస్థలో వుండగా,‘న్యాయవాది గారూ, పాయింట్ లేని ప్రశ్న అడుగుతున్నారు!” అని పురాణం గారు అనేశారు రావిశాస్త్రి గారి వైపు తిరిగి.

“లేదు, పాయింట్ వుంది! అతి కొద్ది కాలంలో మీరు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోబోతారు!” ( ఇదేదో చైనా హోటేల్ వాడి ఫోర్చ్యూన్ కుకీ లాంటి వాక్యం! ఈ ఫార్చ్యూన్ కుకీ అప్పుడు తెలియదు లెండి! కబుర్ల మధ్య రావిశాస్త్రి గారు ఇలాంటి వాక్యాలు రువ్వెవారు గమ్మత్తుగా! )

“మీరు అలాంటి సమాధానం ఏమయినా వెతుక్కునే ప్రయత్నంలో ఇప్పుడు వున్నారా?” అన్నాను నేను కాస్త నెమ్మదిగా.

“ఇప్పుడు లేను. కానీ, తప్పక వెతుక్కొని తీరాలి. నేను బ్రాహ్మడినని ఎవరూ గుర్తు చెయ్యకర్లా! నేను పెరిగిన కాలంలో ఆ గుర్తుకి పెద్ద ఉనికి లేదు. పైగా, నా మీద ’70 ల ప్రభావమే ఎక్కువ! అంటే, నాకు వర్గం పట్టింపు వుంటుంది. కానీ, చూస్తూండగానే వర్గం పోతుంది, కులం వస్తుంది!” అన్నారాయన మళ్ళీ.

“అది జోస్యమా?”

రావిశాస్త్రి గారు : “జోస్యం అంటే ఏమిటనుకున్నారు?అనుభవం అనే స్కేలు మీద వర్తమానాన్ని లేదా భవిష్యత్తుని  చూడడం!”

“కానీ, ఇలాంటివి జోస్యం చెప్ప తరమా?” అన్నాను నేను మళ్ళీ.

“చెప్పొచ్చు!”

ఆ సంభాషణ ఆ రోజున అలా ముగిసిన తరవాత కొన్ని వారాలకి ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. అందులో వొక సంఘటనకి అప్పటికి ఆంధ్ర జ్యోతిలో సీరియల్ గా వస్తున్న నవలకీ సంబంధం వుంది. ఆ నవలలో వొక పాత్ర “కంసాలి నా కొడకా!” అని ఇంకో పాత్రని తిడుతుంది. అంతే, కంసాలి వాళ్ళంతా ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ధర్నాకి దిగారు. ఇంకో సారి, ఆంధ్రజ్యోతి వారపత్రికలోనే పురాణం గారు వొక చిన్న వ్యాసానికి మహమ్మద్ ప్రవక్త రేఖా చిత్రం వేయించారు, దాని పర్యవసానం తెలియక! అంతే, తెల్లారేటప్పటికి కొంత మంది ముస్లింలు ఆఫీస్ ముందు బైఠాయింపు. ఆ రెండు సందర్భాల్లో కూడా పురాణం గారు ఆ కులస్తులకి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. “ఇంత మంది ముస్లింలు మన పత్రిక చదువుతున్నారని నాకు తెలియనే తెలియదు సుమండీ!” అని ఆ రోజు సాయంత్రం పురాణం గారు నాతో అన్నారు. “అలా ధర్నాలూ ఘెరావ్ లూ చెయ్యడానికి పాఠకులు కానక్కరలేదు!” అన్నాను నేను. “అవునవును” అన్నారు పురాణం గారు.

ఇది జరిగిన వారం రోజులకి మళ్ళీ రావిశాస్త్రి గారి బెజవాడ నగరప్రవేశం జరిగింది. మామూలుగానే, పురాణం గారూ, నేనూ పోలోమంటూ మబ్బుల రిక్షా ఎక్కి ఆయన ముందు వాలిపోయాం. ఆ కబుర్లూ ఈ కబుర్లూ అయ్యాక, రావిశాస్త్రి గారు “ఆహా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ రెండు ధర్నాలూ ఘెరావ్ లూ చూశాక ఏమంటారు?” అని మా ఇద్దరినీ అడిగారు.

‘అది వొక ఆవేశం అనుకుంటాం!” అని ఇద్దరం వొక్క సరిగా అన్నాం మేమేదో ముందే కూడబలుక్కున్నట్టు!

“అదే మీ పొరపాటు! మీ చుట్టూ లోకంలో ఏం జరుగుతుందో మీరు చూడడం లేదు. లోకాన్ని కూడా మీ కంటి నించే చూస్తే ఎలా? మీ కన్ను మిమ్మల్ని మోసం చేస్తోంది!” అన్నారాయన.

“వొక చిన్న సంఘటన నించి అంత పెద్ద తీర్మానమా?” అన్నాను నేను సందేహంగా.

‘ఏం, అన్నీ తుపానులే కావాలా నీకు? చినుకు చాలదా, వర్షం ఎట్లా పడబోతుందో చెప్పడానికి!” (మరో ఫార్చ్యూన్ కుకీ!)

ఆ పూటకి దాన్ని గురించి పెద్దగా ఆలోచించలేదు కాని, ఆ తరవాత నాకు చాలా కాలం పట్టింది.  – “అందుకే, రావిశాస్త్రి గారు మహా రచయిత అయ్యారు” అనుకోవడానికి !

ఆ కాలం కాని కాలం వచ్చేసరికి –పూర్వ జన్మలో నండూరి, పురాణం లాంటి గొప్ప సంపాదకుల దగ్గిర పని చేసిన నేను ఖర్మ కాలి ఇంకో పాడు జన్మలో ఇంకో సంపాదక చింపాంజీ దగ్గిర కూడా – పని చేయాల్సి వచ్చింది, కూటి కోసం!

ఆ కాలం కాని కాలం లో వొక సాయంకాలం  ఆ సంపాదక చింపాంజీ నన్ను పిలిచి –

“ఏమయ్యా, అఫ్సర్! రవిశాస్త్రి చనిపోయాడట! నాలుగు ముక్కలు రాసి, ఆ స్పొర్ట్స్ పేజీలో పడెయ్యి!” అనేశాడు రాజాధిరాజ శాసనంలాగా.

“మీరేమీ అనుకోకపోతే  వొక మాట. చనిపోయింది రవిశాస్త్రి కాదు, రావి శాస్త్రి. మన కాలపు మహా రచయిత!” అన్నాను కాస్త శక్తి కూడదీసుకొని!

“ఓహ్, అట్లానా! అయితే, సింగల్ కాలం చాల్లే!”

జర్నలిస్టుగా నేను చనిపోయిన అనేక క్షణాల్లో అదొకటి!

You may also like...

Leave a Reply