వరమా? శాపమా?

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఉచ్ఛ్వా, నిశ్వాసాల్లో స్వచ్ఛంగా ఒదిగివున్న గాలి మానవునిపై అవిశ్వాసం ప్రకటిస్తోంది. చిల్లు పడిన ఆకాశం గుండె నుండి దూసుకొస్తున్న నిశాత సూర్యకిరణాలు నిశాంతం దిశగా నడుస్తున్నాయి. ఉల్లాసభరితమైన సముద్రపు అలలు తీరాన్ని దాటి ప్రళయాల్ని సృష్టిస్తున్నాయి.

ఐనా ఈ మానవుడేంటి ఇలా వారగా నిలబడి ఆధునిక ప్రగతి వికృతి రూపానికి దొంగ రంగులద్దాని చూస్తున్నాడు! ఈ జగతిలో ప్రతి భూచర, ఖేచర, జలచరం ఈ చరాచరాన్ని నిలపడానికి ప్రయాస పడుతుంటే ఈ మానవుడు కనీసం కన్నెత్తైనా చూడడేం! అలసత్వం వీడి వారసత్వమా?

మన యుగయుగాల అనుభూతులకు శ్రోతలుగా, ప్రేక్షకులుగా ఉన్న పంచభూతాలు నేడు మృత్యుగీతాలను ఆలపిస్తున్నాయంటే కారణం ఎవరు? కారుణ్యమయియైన ప్రకృతి కార్పణ్యశీలి అవడానికి కారణం ఎవరు?

ముసలిదైపోయింది ఈ భూమి
మూర్ఖులైన తన కొడుకుల్ని నమ్ముకొని

అన్న కవి మాటలు నిజమౌతున్నాయా?

* * * * *

 

 

సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే
విష్ణుపత్నే నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే

నిద్రలేచి లేవగానే మంచం పైనుండి కాలు క్రిందపెట్టేముందు మా తాతగారు చెప్పే శ్లోకం. దీని అర్థం తెలుసుకొన్న రోజున (కాలేజీ రోజుల్లో) నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి కాలు నేల మీద పెట్టడానికి క్షమాపణలు చెప్పుకోవాలా? వెర్రి కాకపోతేనూ? మధ్యలో ఆ స్తనాల ప్రసక్తి ఎందుకు? అని న్యూస్ ఛానల్లోని స్క్రోల్ బార్ లా ప్రశ్నలు బుర్రలో పరుగెత్తేవి. నాన్నగారిని అడిగితేనేమో “అదంతేలే!” అని దాటవేసేవారు.

అలా నా ప్రశ్నలకు నాకే వదిలేసి ఆయన మంచిపని చేసారని అనిపిస్తోంది ఇప్పుడు. అప్పుడే ఏదో సర్దిచెప్పేసి ఉంటే అక్కడితోనే ఆగిపోవాల్సి వచ్చేది కాబోలు.

* * * * *

కొన్ని నెలల క్రితం ఒక పర్యావరణ పరిరక్షణా సంస్థ నిర్వహించిన సెమినార్ కు అనుకోకుండా వెళ్ళాను. చాలామంది మంచి మంచి విషయాలను చెప్పారు. అందులో కొన్ని ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి.

ప్రపంచంలో కెల్లా అతి ఎక్కువ చెత్తను అమెరికా ఉత్పత్తి చేస్తోంది. ఆ చెత్త విలువతో మనదేశంలో చాలా మంది పిల్లలకు ఒక పూట భోజనం ఇవ్వవచ్చంట.

మనం వాడే మస్కిటో రెపల్లెంట్ వల్ల నష్టపోతున్నది మనుష్యులేనంట. ఇలా వాడుకొంటూ వెళితే ఆఖరున దోమలు మిగిలి మనుష్యులు చస్తారట.  ఇప్పుడు అమెరికా శాస్త్రజ్ఞుల సలహా ఏమిటంటే రిపల్లెంట్ కాకుండా దోమతెరలు వాడమని.

ఒక కోక్ క్యాన్ మన చేతిలోకి రావాలంటే దాదాపు 73 రోజులు పడుతుందట.  అంటే ఒక కోక్ క్యాన్ ఉత్పత్తిలో వాడే కరెంటు మొదలైన వనరుల్ని ఒక కుటుంబం నెలరోజుల పాటు వాడుకోవచ్చునట.


ఇంకా చాలానే ఉన్నాయి కానీ నాకు ఇవి మాత్రమే గుర్తున్నాయి.

ఈ మాటల్ని వింటున్నంత సేపూ నా మనసు “సముద్రవసనే” చుట్టూ తిరుగుతూనే ఉంది. మనిషి చేస్తున్న అకృత్యాలవల్ల నష్టపోతున్న వాతావరణం గురించి వింటున్న కొద్దీ ఈ శ్లోకంలో ఇన్ని రోజులూ దాగివున్నరహస్యాలేవో ఒక్కటొక్కటీ ప్రత్యక్షమౌతున్నట్టు అనిపించ సాగింది. 

కార్యక్రమం చివరలో సభికులలో ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు అని చెప్పగానే చటక్కున లేచాను. ఏం మాట్లాడాలో స్పష్టంగా తెలియకపోయిన మాట్లాడాలనే మనసు ఉరుకుతోంది. వెళ్ళి మైక్ అందుకొన్నాను.

అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా ప్రసంగించిన వారందరూ చక్కటి విషయాలను చెప్పారు. మనము, మన ముందు తరాలు అనుభవించబోయే దుష్పరిమాణాల్ని సాక్ష్యాలతో సహా నిరూపించారు. ఇప్పటికే మనలో ఆలోచనలు సుడులు తిరగడం మొదలై ఉంటుంది. నాలో తల ఎత్తిన కొన్ని భావాలను మీతో పంచుకోవాలని అనుకొంటున్నాను.

చిన్నప్పుడు మా తాతగారు ఒక శ్లోకం చెప్పేవారు….సముద్రాన్ని చీరగా చుట్టుకొని, కొండలను స్తనాలుగా కలిగిన, విష్ణుపత్ని నీపై కాలు మోపుతున్నాను నన్ను క్షమించు అని. అప్పట్లో దాని అర్థం తెలిసినా అర్థం యొక్క లోతు చిక్కలేదు. ఈరోజు హఠాత్తుగా ఆ లోతుల్లోకి మునిగి తేలాను.

ఈ ప్రపంచం 90% నీళ్ళల్లోనే మునిగి ఉంది. చీర స్త్రీ శరీరాన్ని దాదాపు కప్పుతుంది. అందుకేనేమో భూదేవికి సముద్రమే చీర అన్నారు. పర్వతాలనుండి దుమికే జలపాతాలు నదులుగా మారి మన దాహాన్నితీరుస్తున్నాయి. అవి అమ్మ ఇచ్చే పాలు లాంటివేగా! ఇందుకే కాబోలు భూదేవికి కొండలే స్తనాలు అన్నారు. అలాంటి అమ్మను ఇప్పుడు వివస్త్రను చేసి, తాగిన రొమ్ముల్నే గుద్దుతున్నాము మనం. ఇది ఆరోపణ కాదని నిష్టురమైన సత్యమేనని ఇంతసేపూ మనం చూసిన నివేదికలు చెబుతున్నాయి.

ఆధునిక విజ్ఞాన ఫలాలను అనుభవించడం మన వరమా? ఆ ఫలాలు క్రక్కే విషాన్ని జీర్ణించుకోలేకపోవడం మన భావి తరాలు పొందుతున్న శాపమా?” అని ముగించాను.

ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు. కొట్టివుంటే నాకు ఏడుపే మిగిలేది.

మండుతున్న గుండెకు సాంత్వన మౌనంలోనే కానీ సంతలో దొరకదు.

@@@@@

You may also like...

Leave a Reply