“శుక సప్తతి” తెలుగు సేత కర్త – పాల వేకరి కదిరీపతి

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

“శుక సప్తతి” తెలుగు సేత కర్త – పాల వేకరి కదిరీపతి – ఇంటి పేరు, ఊరు, సీమలు :- 

ప్రాంతాలను , సీమలను, దేశాలనూ పరిపాలించిన వ్యక్తులే,  మహా పద్య, వచన కావ్యాలను వెలయింపజేయడం గొప్ప విశేషమే! కరవాలమును పట్టిన చేతితోనే, ఘంటం కూడా పట్టి, రచనలు చేయడం మాననీయము. అతి ప్రాచీన కాలం నుండీ- చక్రవర్తులు, తత్ అధికార గణములోని వారూ- అనగా మంత్రి, సేనాధిపతి ప్రభృతులు కవులుగా కూడా తమ జీవిత పరమార్ధ భాగ్యాలను ఇబ్బడి ముబ్బడిగా ఇనుమడింపజేసుకోవడం జరిగింది.

రాజకవులు గణనీయ సంఖ్యలో పరిఢవిల్లి, మన దేశ చారిత్రక గగనాన్ని, మనోజ్ఞ భాషా ప్రాభవములతో  పరిపూర్ణమైన కావ్య కాంతి కిరణముల తేజో యశస్సులను ఆర్జించి, నింపినారు. మనకెంతో గర్వకారణమైన కవి చక్రవర్తుల, రాజకీయ రంగములోని కవుల పట్టిక పెద్దదే ఔతుంది.త ప్పకుండా ఈ కోణంలోని ఈ విశేషం గిన్నిస్ బుక్ రికార్డులలో తలమానికమౌతుంది. కాబట్టి, చరిత్ర, సాహిత్య అభిమానులు- ఈ లిస్టును సోపపత్తికంగా సమర్పిస్తూ-  గిన్నీస్ రికార్డ్ లో స్థానం సమకూర్చే  మహత్కార్యము పరిశోధకులకు గొప్ప పనియే ఔతుందనడంలో సందేహం లేదు.

సరే! ప్రస్తుతం ఒక రాజకవిని గమనించుదాము.  పాల వేకరి కదిరీపతి మహారాజు అలాటి రచయిత. సంస్కృతంలో ప్రసిద్ధి కెక్కినది “శుక సప్తతి” అనే శృంగార కావ్యము. అద్దానిని పద్య ప్రబంధముగా, తెలుగులో మొట్టమొదటి అనువాదం చేసిన కీర్తి శ్రీ పాల వేకరి కదిరీపతి కి దక్కినది. పంచదార పలుకుల రామచిలుకమ్మ- కథానాయికకు వరుసగా ప్రతి రాత్రీ వివరించినట్టి 70 కథలు ఉన్నవి. 10 వ శతాబ్దానికి మున్నే లోకవ్యవహారంలో ఉన్నవి – గ్రంథస్థములైన కథారూపాలను సంతరించుకున్నవి.

పాల వేకరి కదిరీపతి ఎవరు? ఈయన ఎప్పటి వాడు? ఇత్యాది విషయాలు-అనేక క్రొత్త సంగతులను ఆవిష్కరించినవి. 1-20, 21 పద్యలలో “… భోగసుత్రాముడు తాడిగోళ్ళ పుర ధాముడు శ్రీ పెద యౌబళుండిలన్” 1) వీరి ఇంటి పేరు మొదట- పాల వేకరి. పెద ఔబళ రాజు- తాడిగోళ్ళ నగరమును చేరిన నాటినుండి- “తాడిగోళ్ళ” వారైనారు.2) ఆశ్వాసాంత గద్యలు- అన్నింటిలోనూ – రెండు గృహనామములు కూడా వ్రాసాడు కవి పాల వేకరి కదిరీపతి. “అచ్యుత గోత్రుడను, చంద్ర వంశ క్షత్రియుడిని” అనినాడు. కంఠోక్తిగా వక్కాణించాడు.

మూల పురుష గౌరవ స్థానమును అందుకున్నపెద ఔబళ రాజు నుండి క్రమేణా వారి వంశ క్రమమును వర్ణించినాడు పాల వేకరి కదిరీపతి.

పెద ఔబళ రాజు  తనయుడు ఆ] నారపరాజు. ఈతనికి తొమ్మిది మంది కుమారులు. వారిలోని ఒకడు- ఔబళరాజు, పత్ని బాలమ్మ. వీరి పుత్రుడు కరె మాణిక్య రాజుకు నలుగురు భార్యలు. వీరికి నలుగురు సుపుత్రులు. వీరిలోని రెండవ వాడైన – రామరాజు యొక్క తనూజుడు రఘునాథ రాజు.

అలాగే- నాలుగవ వాడు కదుర రాజు  యొక్క కుమారుడు “వెంకటాద్రి”. ఈ ఆరవ తరము వాడే – మన కృతికర్త ఐన పాల వేకరి కదిరీపతి. ఇలాగ సంశయం లేకుండా, పాల వేకరి కదిరీపతి – కృత్యాదిలోనే విపులంగా వక్కాణించినాడు.

శ్రీకృష్ణ దేవ రాయలు పాలనాధికార వారసుడు  తరువాతి తరములలో – అళియరామరాయలు. అళియ రామ రాయలు- కొనసాగించిన జైత్ర యాత్రలలో పాల్గొన్న వీరుడు పెద ఔబళ రాజు. అందువలన అళియ రామ రాయలుకు- పెద ఔబళ రాజు సమకాలీనుడు.

శ్రీకృష్ణదేవరాయలు – విజయనగర సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి, మువ్వురికి ఇచ్చాడు. త్రిలింగదేశము:- “పెనుగొండ” రాజధానిగా శ్రీరంగ దేవరాయలు స్వీకరించాడు. కన్నడ ప్రాంతము:- “శ్రీ రంగ పట్టణము” రాజధానిగా “రామదేవరాయలు” గైకొన్నాడు; ఈతని పేరోలగములోని వాడు, మరియూ సామ్రాట్టుకు “సరి గద్దె నెక్కిన గౌరవాలను” పొందిన వ్యక్తి – కరె మాణిక్యరాజు. ఈ పాలనా కాలము 1618- 1630. చంద్రగిరి- కేంద్ర పట్టణంగా తమిళ ప్రాంతాధిత్యాన్ని నెరిపిన మూడవ వాడు వెంకటపతిరాయలు.

వీరి పాలనాకాలము నాడు జరిగిన కొన్ని తిరుగుబాటులను అణుచుటలో తాడిగోళ్ళ రామరాజు విశేష సహాయం తోడ్పాటు ఉన్నవి. ఈ రామరాజు మనుమడు, శుక సప్తతి కావ్య రచయిత ఐన పాల వేకరి కదిరీపతి. ఇతను 17 వ శతాబ్దం ఉత్తరార్ధములో – సాహితీ కృషీవలత్వం చేసాడు.

పాల వేకరి కదిరీపతి నివాస స్థలము, తిరిగిన ప్రదేశ వివరాల గూర్చి జిజ్ఞాస సహజము.

పాల వేకరి కదిరీపతి ధామము నామము “తాడి గోళ్ళ”. నేడీ తాడిగోళ్ళ ఒక కుగ్రామము. కడప జిల్లాలోని నేటి – తాడిగొట్ల- కావొచ్చునని ఊహ. తాడిగోళ్ళ పురము – కోలారు మండలములోనిది- అని వాదము ఒకటి.

వీరి ఇలవేల్పు “కదిరి నరసింహమూర్తి”. ఆనాడు కదిరి మండలము, అనంతపురము దక్షిణ భాగం నుండి మైసూరు రాజ్యంలోని “శివ సముద్రము” దాకా వ్యాపించినది. పెద ఔబళుడు ఏలికగా “కదెరాకమున “తెర్క” మొదలుగా కలిగిన….”

కావేరీనదికి ఉపనది – గుండ్లు నది. గుండ్లుపేట తాలూకాలో “తెరకణాంబె” అనే పల్లె ఉన్నది. త్రికంబరి ఈశ్వరి కోవెల ఈ ప్రాంతాల ప్రసిద్ధి ఐన మహిమాన్విత దేవళము. తెర్కణాంబయే “తెర్క” ఐఉండవచ్చును.

ఉత్పలమాల:

ఆ రసికావతంసకుల మాతృ సముద్భవ హేతుభూతమై

ధీరతఁ బాలవెల్లి జగతిం దగె దన్మహిమం బపారగం

భీర ఘనాఘ సంభరణ భీమ బల ప్రతిభాప్తిఁ గాంతు నం

చార యఁ బాలవేకరి కులాఖ్య వహించె ను సుదంచితోన్నతిన్.

[1-20]

ఉత్పలమాల:

ఆ మహితాన్వవాయ వసుధాధిపు లచ్యుత గోత్రపాత్రులు

ద్ధామ భుజా పరాక్రమ విదారిత ఘోర మదారి వీరులౌ

భూమి భరించి రా నృపుల భూతి మహోన్నతి నేలె భోగ సు

త్రాముడు తాడిగోళ్ళ పురధాముడు శ్రీ పెద యౌబళుండిలన్.       [1-21]


ఇదీ శుకసప్తతి కావ్యములోని ఊళ్ళకు  ఆధారములు.


సీస పద్యము:

కావ్య నైపుణి శబ్ద గౌరవ ప్రాగల్భ్య

మర్ధావనాసక్తి యతిశయోక్తి

నాటకాలంకార నయ మార్గ సాంగత్య

సాహిత్య సౌహిత్య సర సముద్ర

సకల ప్రబంధ వాసన సువాక్ప్రౌఢిమా

న్విత చతుర్ విధ సత్కవిత్వ ధాటి

లక్ష్య లక్షణ గుణ శ్లాఘ్యతా పటిమంబు

నైఘంటిక పదానునయని రూఢి.”


గనిన నీకు నసాధ్యంబె గణుతి సేయ

ధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్ళ

ఘన కులకలాప “కదురేంద్రు కదుర భూప”

చెలగి వాక్ప్రౌఢిచేఁ గృతి సేయు మవాణి.


పాల వేకరి కదిరీపతి విద్వత్కవి, రక్షణానుసంధాయకుడే కాదు, తానే స్వయంగా ఘంటమును చేపట్టి, కావ్య రచన చేయగల మేధావి. కనుకనే పాల వేకరి కదిరీపతి సంస్కృత శుకసప్తతిని ఆంధ్రీకరణ చేయగలిగాడు.

కళాత్మకంగా తెలుగున “శుకసప్తతి”ని తీర్చిదిద్దిన, ఈ ప్రయత్నంలో ప్రథమ తాంబూలం పొంది, అటు చరిత్రలోనూ, ఇటు కావ్య చరిత్ర పేరోలగములోనూ ప్రత్యేక స్థానాన్ని గడించిన ఈ రాజకవి ధన్యుడు.

You may also like...

Leave a Reply