సెక్యులర్ మేధావులు – భాషా అనర్థాలు, అపార్థాలు

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 4
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

క్రితంలో వ్రాసిన “అబ్దుల్ కలాం – దళిత, మైనార్టీ, సెక్యులర్ వాదుల డొల్లతనం” వ్యాసంలో కొందరు మేధావుల లోని వైరుధ్యాలను, ద్వంద్వప్రవృత్తులను వివరిస్తూ, కొన్ని మౌలికమైన ప్రశ్నలను వారికి వేయడం జరిగింది. ఈ వ్యాసంలో ఆ మేధావుల ’భాషా డొల్లతనా’న్ని ప్రశ్నించడం జరిగింది.

ఇంతకంటే ఉపోద్ఘాతం అవసరం లేదు గనుక ఇక వ్యాసంలోకి….

భాష గురించి కొన్ని విషయాలు:

వెండీ డానిగర్ అనే పాశ్చాత్య రచయిత్రి వ్రాసిన “ది హిందూస్ : ఆల్టర్నేటివ్ హిస్టరి” అన్న పుస్తకంపై గత సంవత్సరపు ఆరంభంలో చర్చ జరిగింది. సురేశ్ కొలిచాల గారు వెండీ డానిగర్‍ను సమర్థిస్తూ ఈమాట.కామ్ లో ఓ వ్యాసం వ్రాసారు. ఈ వ్యాసంపై జరిగిన చర్చలో నేను పాల్గొన్నాను. ఆపై మాలిక.కామ్ లో “ఉదారవాదం Vs. తత్వవాదం అన్న శీర్షిక క్రింద సురేశ్ కొలిచాల గారి వ్యాసాన్ని విమర్శించడం జరిగింది. అందులో భాష గురించి వ్రాసిన మాటలను ఇక్కడ ఉటంకిస్తున్నాను.

“భాషా వ్యక్తార్థ వాచా” –మానవుల పరస్పర వ్యవహారాల్లో ఉపయోగపడే సాధనం భాష. అంతేగాదు, ఒక వ్యక్తి లక్షణాల్ని, స్వరూపాన్నీ కూడా భాష తెలియజేస్తుంది. ’మాట’గా మారి ఇతరులకు చేరుతుంది గనుక ఆ భాషలో మన లక్షణం, స్వరూపం వికృతాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసమే తెలుగు వారు కూడా “మాట ఘనం మానిక పిచ్చ” అన్న సామెతను పుట్టించారు. కన్నడిగులు సైతం ’మాతే ముత్తు – మాతే మృత్యు’ (మాటే ముత్యం – మాటే మృత్యువు) అని చెప్పుకొచ్చారు. కారకమైనా, మారకమైనా మాట మీదే ఆధారపడివుంటుంది గనుక మాటను పలకాలన్నా, వ్రాయాలన్నా జాగ్రత్తగా ఉండక తప్పదు.

ఆవిధంగా ’భాష’ను సరిగ్గా అర్థం చేసుకున్న పిదప దానిని ఉపయోగించడం ఉత్తమం. లేనిపక్షంలో ఆ ప్రయోగం అనేక అపార్థాలకు, అనర్థాలకు దారితీస్తుంది. ఈ అపార్థాల అనర్థానికి తాజా ఉదాహరణ అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక ’సారంగ’లో ప్రచురితమయిన “కలాం – హారతిలో ధూపం ఎక్కువ” అనే శీర్షిక.

Products from Amazon.in

హారతి ధూపం – సెక్యులర్ మేధావుల పాపం:

కలాం గారిని ’హారతి’లోని ’ధూపం’గా పోలుస్తూ హేళన చేయడానికి సారంగ వ్యాస రచయిత శీర్షికలోనే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే నిజానికి వారు కలాం గారిని కాక అటు సంస్కృత, తెలుగు భాషలను ఇటు ప్రసిద్ధ సాహితీవేత్త, విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకులూ అయిన సారంగ నిర్వాహకుణ్ణీ హేళనకు గురి చేసారు. ఇది ఎలా జరిగిందో చూద్దాం!

ఒక వ్యాఖ్యాత వ్రాసిన వ్యాఖ్యకు బదులిస్తూ రచయిత ఇలా అనడం జరిగింది – “మీరు టైటిల్ అబ్సర్వ్ చేసినట్టు లేరు. ” హారతిలో ధూపం ఎక్కువ ” హారతి పట్టడాన్ని విమర్శించడం లేదు. అందులో ధూపం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది .”  

ఏమిటీ వివరణ? హారతిలో ధూపమా! వివరంగా చూద్దాం.

శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, పుస్తక రచయిత అయిన కలాం గారిని అనేక రకాలుగా విశ్లేషించి, వారిలోని లోపాలను ’హారతి’ పట్టి చూపించిన రచయితకు ’ఆ(హా)రతి’ వేరు, ’ధూపం’ వేరు అని తెలియకపోవడం విషాదకరం. ఈ శీర్షికను నిర్ధారించే ముందు ఒక్కసారైనా ఓ గుడికి వెళ్ళి అక్కడ పూజ జరుగుతున్నప్పుడు ’ఆరతి’ అంటే ఏమిటి ’ధూపం’ అంటే ఏమిటి అని చూసి తెలుసుకునే ప్రయత్నం చేసివుంటే బావుండేది. లేదా ఓ పూజారిని అడిగినా బావుండేది. సెక్స్ వర్కర్ల జీవితాలను అధ్యయనం చేయడానికై ఆ ప్రాంతాలను సందర్శించడం ఎలానో అలానే పై రెండు పనులలో ఒకదాన్నైనా సారంగ రచయిత చేసివుంటే పత్రికను అవహేళనకు బలికానివ్వకుండా కాపాడడం జరిగేది. కానీ రచయిత తన స్వబుద్ధిని నమ్ముకుని, ఆ రెండు పదాలకు ఉన్న సిసలు అర్థాలు తనకే తెలుసుననుకొని పొరబడ్డారు. ఈ పొరబాటు ఏమిటో వివరిస్తాను.

సనాతన పూజా పద్ధతిలో భాగంగా షోడశ ఉపచారాలను (16 సేవలు) నిర్వహించడం పద్ధతిగా వస్తోంది. ఇందులో అభిషేకం, అలంకారం వంటి ఉపచారాలతో బాటు ’ధూపం,’ ’దీపం’, ఆపై ’ఆరతి’ని సమర్పించడం జరుగుతుంది. కనుక అమలులో ఉన్న ఆచారం ప్రకారం చూస్తే ’ధూపం’ వేరు, ’ఆరతి’ వేరు అన్న విషయం స్పష్టమవుతోంది. పూజాక్రమంలో ఈ రెండింటికి వేరు వేరు మంత్రాలు ఉన్నాయి గనుక ఇవి వేరు వేరు సేవలుగానే తెలియాలి. ఒకవేళ సారంగ రచయిత భావించినట్టుగా ’హారతిలో ధూపం’ ఉండవచ్చు గదా అని ఆశంకిస్తే అప్పుడు 16 సేవలకు బదులు 15 సేవలు మాత్రమే వచ్చి “షోడశ” అన్న లెక్క తప్పుతుంది. ఈవిధంగా కూడా ’ఆరతి’ వేరని, ’ధూపం’ వేరని చెప్పక తప్పదు.

రచయితలు అప్పుడప్పుడూ చేసే ఇటువంటి ’సాంకేతిక’ తప్పిదాలను సరి చేయవలసిన సంపాదకులు కూడా ఆ తప్పును యథాతథంగా ఆమోదించి, ప్రచురించడం ద్వారా అక్కడి సెక్యులర్ మేధావుల ’అవగాహనా డొల్లదనం’ అనే ప్రహసనం ఆవిధంగా పూర్తయింది. (కానీ ఈ వ్యాసం ఇంకావుంది)

వ్యంగ్యం వల్ల సిద్ధాంత స్థాపన జరగదు గనుక గంభీర విమర్శన తరువాత నాకు అర్థమయింది ఏమిటంటే ఆ సారంగ రచయిత చెప్పదల్చుకున్న విషయం – “[కర్పూర] ఆరతిలో ధూమం ఎక్కువ” అని.

సంస్కృతంతో పరిచయం లేని జిజ్ఞాసువులకు ’ధూపం’, ’ధూమం’ పర్యాయ పదాలనే భావన కలిగి నేనేదో రంధ్రాన్వేషణ చేస్తున్నట్టుగా అనిపించవచ్చు. కానీ నేను రంధ్రాన్వేషణ చేయడం లేదని నిరూపిస్తాను.

సంస్కృత పదాల అసలు అర్థం తెలుసుకోవాలంటే ఆ పదాల మూలాలైన ధాతువుల్ని తెలుసుకోవాలి. అలా ధాతువుల ఆధారంగా ’ధూప’ పదాన్ని, ’ధూమ’ పదాన్ని అధ్యయనం చేస్తే ఇవి రెండూ పరస్పర సంబంధం లేనివని అంటే పర్యాయ పదాలు కానివని స్పష్టమవుతోంది. జిజ్ఞాసువులైన పాఠకులకై ఈ రెండు పదాల ధాతుపాఠాలను క్రింద ఇస్తున్నాను:

ధూప = ధూపయతి రోగాన్ ఇతి ధూప (ధూప సంతాపే)

ధూమ = ధూంగ్ కంపనే

పై ధాతువుల వల్ల ’ధూప’ మనేది రోగాలకు సంతాపాన్ని కలిగించేది అనగా రోగాలను పోగొట్టేదని, ధూమమంటే కంపింప జేసేదని తెలుస్తోంది.

సనాతన ధర్మంలోనే గాక ఇస్లాం మతీయులైన ఫకీర్లు కూడా వాడే సాంబ్రాణి లేక గుగ్గిలంను ధూపానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సాంబ్రాణి ధూపం పొగలా కనబడినా అది ’కంపన’ను పుట్టించదు. పైగా ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. దీని విరుద్ధంగా పచ్చికట్టెలను మండించినపుడు లేచే ఘాటైన పొగను ’ధూమా’నికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ పొగను పీల్చినవారు దగ్గుతో ’కంపించ’డం సహజమే. కనుక అందరికీ అనుభవపూర్వకమైన ఈ రెండు ప్రత్యక్ష ప్రమాణాల ఆధారంగా ఎటువంటి విభేదాలకు తావులేకుండా ’ధూపం’ వేరని ’ధూమం’ వేరని స్థిరపరచవచ్చు.

ఇవేవీ అధ్యయనం చేయని సారంగ రచయిత ’హారతిలో ధూపం’ అంటూ సనాతన పూజా విధనాన్ని కించపరచబోయి స్వయం ’కించిత్’ అయ్యారని చెప్పక తప్పదు.

“ధూపం వేరు, ధూమం వేరయితే “[కర్పూర] హారతిలో ధూమం” అన్న నీ ఊహ ఎలా కుదురుతుంది?” అని జిజ్ఞాసువులు నన్ను ప్రశ్నించవచ్చు. దానికీ వివరణ ఉంది.

నెయ్యిలో తడిపిన వత్తుల కంటే రసాయన పదార్థమైన కర్పూరంతో ఇచ్చే ఆరతికి ధూమం (పొగ) ఎక్కువ. కర్పూరం కంటే నెయ్యి వత్తులు ఆరతికి శ్రేష్ఠం. కానీ వాటిని తయారుచేయడానికి సమయం వెచ్చించాలి గనుక కర్పూర వాడకం ఎక్కువయింది. అలా పొగలు (ధూమం) చిమ్ముతూ కంటబడిన కర్పూర ఆరతిని ఎక్కడో, ఎప్పుడో చూసిన సారంగ రచయిత తాను విమర్శించబోతున్న వ్యక్తిని (కలాం గారిని) ఎద్దేవా చేయడానికి అదే సరైన ప్రతీకగా భావించివుండాలి. కానీ ఏ కారణం చేతనో శీర్షికను వ్రాస్తున్న వేళ ధూమం స్థానంలో ధూపం వచ్చి కూర్చుంది. (బహుశా చట్టంలానే ధర్మం కూడా తన పని తాను చేసుకుపోతుందేమో!)

అలా ఆ రచయితకు గుడికి వెళ్ళి చూడ్డమో, పూజారిని వాకబు చేయడమో నచ్చదు గనుక స్వబుద్ధికి తోచిన విధంగా శీర్షికను తయారు చేసివుండాలి. సకల దుర్మార్గ భూయిష్టమని వారు భావించే సనాతన ధర్మాన్ని ఎండగట్టడమనే బాధ్యతను నిర్వహిస్తూ తమ శీర్షికకు పదభ్రష్టతను అంటగట్టారు. ఈ కారణాల మూలంగా ’అయ్యవారి బొమ్మను చేయబోతే కోతి అయిం’దన్న చందాన విశిష్ట శీర్షికగా వెలుగొందాల్సింది కాస్త దుష్టార్థ సంక్లిష్టయై, భావ లోపభూయిష్టమై, నష్టార్థయుక్తమై అలరారింది. ఇందువల్ల “” హారతిలో ధూపం ఎక్కువ ” హారతి పట్టడాన్ని విమర్శించడం లేదు. అందులో ధూపం ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది .”  అన్న సారంగ రచయిత ధూప వివరణ కడుంగడు హాస్యాస్పదం, అవైజ్ఞానికం.

కానీ, దీని కంటే వింత గొలిపే విషయం మరొకటుంది!

విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకులు పెద్దదిక్కుగా ఉన్న సారంగ సంపాదక బృందానికి రచయిత చెప్పదల్చుకున్నది ’ధూపం’ కాదు ’ధూమం’ అని స్ఫురించకపోవడమే ఆ వింత! ఇది బహుశా పని ఒత్తిడి వల్ల కావొచ్చు లేక ఆ క్షణంలో సరైన పదం బుద్ధికి తట్టకపోవడమూ కావొచ్చు లేదా ఆ శీర్షిక వల్ల సంభవించనున్న సనాతన ధర్మ హేళనను తలుకుచుకుని ఒడలు పులకరిస్తూ ఉండడమూ కావొచ్చు. ఏది ఏమైనా బయటి వ్యక్తిగా నేను ఊహల్ని మాత్రమే చేయగలను. లోగుట్టు ’సారంగ సారథు’లకే ఎరుక!

ఇటువంటి అనర్థదాయకమైన భాషా ప్రమాదాలను నివారించాలంటే రచయితలు, సంపాదకులు భాష పట్ల జాగురూకులై ఉండాలి. తెలియని పద్ధతులకు సంబంధించిన పదాలను వాడబోయే ముందు వాటి మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో కులానికి గానీ, మతానికి గానీ స్థానమే లేదు. ఎందుకంటే ప్రపంచంలోని ఏ భాష అయినా మానవుల పరస్పర భావ వినిమయానికి మాత్రమే పుట్టికొచ్చింది. కానీ ఆ సారంగ రచయితకు, సారంగ సారథులకు భాషకు కూడా కుల మతాల రంగుల్ని అద్ది చూపాలన్న తాపత్రయం ఎక్కువగా ఉన్నట్టు అక్కడ జరిగిన భాషా ప్రమాదం వల్ల స్పష్టమవుతోంది.

@@@@@

 ఈ నేపధ్యంలో నాలో ఈ క్రింది ప్రశ్నలు ఉద్భవించాయి:

 • తాము వాడుతున్న పదాలకు అర్థం తెలియని వారిని మేధావులని పరిగణించవచ్చునా?
 • అటువంటి వారు వ్రాసినదంతా అక్షరసత్యాలని ప్రజలు నమ్మాలా?
 • విమర్శించదల్చుకున్న విషయాలలోని ప్రక్రియల పట్ల కనీస అవగాహన లేని ఈ మేధావులు ’విమర్శ’ పేరుతో చేస్తున్న ప్రచారాన్ని విషప్రచారమని అనకూడదా?
 • ఒక విమర్శను చేయాలంటే మొదట ఆ విషయం పట్ల సరైన పరిశోధన చేయాలని ఈ మేధావులకు తెలియదా?
 • అలా పరిశోధన చేయాలంటే విమర్శించ దల్చుకున్న విషయం పై అక్కసుతో గాక నిర్మత్సరతతో విషయ సేకరణ చేయాలన్నది వీరికి తెలియదా?
 • ఇవేవీ తెలియకుండా/తెలుసుకోకుండా వ్యాసాలు ఎందుకు వ్రాస్తున్నారు?
 • ఇటువంటి అసత్య/అర్ధసత్య ప్రతిపాదకులు ఎన్ని రాతలు వ్రాసినా ’కిమ్ ప్రయోజనమ్?’

ఇప్పుడు నేను అడుగుతున్నాను గనుక నన్ను మతఛాందసుడని, మనువాదియని, అభ్యుదయ విరోధియని ఇంకా వారి పడికట్టు పదాలన్నింటితోనూ నిందించవచ్చు గాక! ఆ నిందలన్నీ వారు చేసిన భాషా ద్రోహం ముందు బలాదూరనే భావిస్తాను.

క్రితం వ్యాసంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు వచ్చినా రాకున్నా ఈ వ్యాసంలో లేవనెత్తిన సమస్య కులమూ కాదు, మతమూ కాదు భాషది. కనుక నేను ఎత్తి చూపిన వారి భాషా లోపాలకు, అవగాహనా లేమికి సూటిగా, డొంకతిరుగుడు లేని సమాధానాలను ఆశిస్తున్నాను. లేకుంటే విజ్ఞులైన పాఠకులు ఈ మేధావుల్ని నిర్గంధధూప’కేతువులు గా భావించే అవకాశం ఉంది!

@@@@@

Raghothama Rao C

Raghothama Rao C

Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.

You may also like...

Leave a Reply