సనాతన ధర్మములో ’రజస్వల’ స్థితి నిరూపణము

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 1 Average: 5]

భారతీయ తత్వశాస్త్రము భౌతిక, రసాయనిక, ఖగోళ విజ్ఞానములతో బాటు అతీంద్రియ, ఆధ్యాత్మిక సమన్వయము కలిగి, ఏకరాశిగా కనిపించెడి జ్ఞానసర్వస్వము. ఈ శాస్త్రము ఆర్తులకు అభయమును, జిజ్ఞాసువులకు ప్రహేళికలను, అర్థులకు ఉపాధిని, జ్ఞానులకు సాధనా సంపత్తిని అందిస్తున్నది. సర్వశాస్త్రబృంహితమయిన ఈ విశాల జ్ఞానసాగరాన్ని ఒక జన్మలో ఈదడము కుదరదు. ఈదడము కాదు గదా సమగ్ర పరిచయము కూడా అసాధ్యము. గనుక సనాతన శాస్త్ర విమర్శ చేయదలచిన వారు సమన్వయముతో కూడిన అధ్యయనము చేయవలెను.

వేగము తప్ప వివేకమునకు పెద్దపీట వేయని నేటి కాలములో, సమన్వయ సహితమైన అధ్యయనము అత్యంత విరళము. అయినను, సమాజము పట్ల, శాస్త్రము పట్ల శ్రద్ధ గలవారు ఇంకనూ ఉన్నారు. అటువంటి వారికై ఈ వ్యాసము ఉద్దేశించబడినది.

గత నెలలో కేరళ రాష్ట్రముకు చెందిన ఒకానొక మహమ్మదీయుడు శబరిమల దేవాలయములో స్త్రీల ప్రవేశముపై నిషేధమున్నదని, అది అన్యాయమని, లింగవివక్షతకు ప్రత్యక్ష నిదర్శనమని ఆరోపించి, సర్వోన్నత న్యాయస్థామును ఆశ్రయించినాడు. సదరు న్యాయస్థానము వారు సనాతన ధర్మశాస్త్రములలో అట్టి నిషేధములేవీ లేవని, అదంతయూ మధ్యయుగముల నాటి సంకుచిత ధోరణియని వ్యాఖ్యానించివున్నారు.

శబరిమల దేవాలయమందు కేవలము రజస్వలలగు స్త్రీల ప్రవేశముపై మాత్రమే నిషేధమున్నదని తెలుసుకొనుట అవసరము. అయితే, ఈ నిషేధము కేవలము శబరిమలలోనే కాక దక్షిణ భారతదేశము నందలి గల అన్ని పుణ్యక్షేత్రములలోనూ ఆచరణలో ఉన్నది. ఈ నిషేధమును హృత్త్పూర్వకముగా, ఎవరి బలవంతము లేకనే ఆచరించు మహిళామణులు ఎందరో ఉన్నారు. కొందరు మహిళలకు ఈ వివక్ష బాధాపూర్వకముగా ఉండవచ్చును. వారిలో ఆవేశపరులు సరైన శాస్త్రభ్యాసము లేకుండచే విపరీత వ్యాఖ్యలను చేసివున్నారు.

ఈ నేపధ్యములో, ధర్మశాస్త్రములలో గల యథాతథ విషయములను సంపూర్ణముగా కాకున్నా సంక్షిప్తముగానైనా వివరించి, ఆ సద్విషముల ఆధారముతో పాఠకులు ఎవరికి వారు సత్యాసత్య విచారణకు ప్రేరేపించుటకై ఈ వ్యాసము ఉద్దేశించిబడినది.

*****

Products from Amazon.in

 “నారీ దేహమ్ బహుదుఃఖభాజనం” అని గరుడ పురాణంలో గరుత్మంతునికి ఉపదేశించాడు కృష్ణుడు.

“భగవంతుడే అలా ఎందుకు అన్నాడు?” అంటే స్త్రీకి స్త్రీత్వాన్ని తెచ్చిపెట్టే ఋతుచక్రం రావడము, పోవడము అన్నవి ఆమెను అనేక మానసిక, దైహిక హింసలకు గురిచేస్తుంది కాబట్టి. 

ఈ రెండింటి మధ్య నెల నెలా జరిగే స్రావము కూడా అనేకమందికి బాధాకరంగా పరిణమిస్తూవుంటుంది గనుక.

ఇవన్నీ కాకుండా గర్భాన్ని ధరించి, మరొక జీవికి జన్మనిచ్చే క్రమం కూడా బహుదుఃఖ భాజనమే.

గరుడ పురాణం ప్రకారమైతే 72 ఎముకలు ఒక్కసారిగా విరిగితే ఎంత బాధ కలుగుతుందో అంతటి బాధ ప్రసవ సమయంలో స్త్రీ అనుభవిస్తుంది.

వేదములు “మాతృదేవోభవ” అనే నమస్కార క్రమాన్ని మొదలుపెట్టుడ వెనుక స్త్రీమూర్తులు సహనముతో భరించే ఈ కష్టముల యొక్క పరిగణన ఉన్నది.

 

ఈ కారణముల చేతనే భగవంతుడు “మాతృగయా” అన్న ప్రత్యేక క్షేత్రాన్ని తల్లి ఋణం తీర్చడానికే సృష్టించినాడు. తండ్రి ఋణము తీర్చడానికి ప్రత్యేక క్షేత్రం అవసరం లేదు సర్వపిత్రులకు క్షేత్రమైన గయా క్షేత్రమే చాలునన్నాడు దేవుడు. సనాతన దృక్పథములో స్త్రీలకు గల ఈ గుర్తింపు. స్త్రీ దుఃఖాలను అర్థం చేసుకున్న తీరును మొదట అర్థము చేసుకుని, పిదప అదే క్రమములో ’రజస్వల’ విషయమును విమర్శించవలెను. లేనిచో అంధగజన్యాయము వలే పరిస్థితులు చెడును.

రజస్వల అను పదమునకు మూలమైనది రజస్సు. ఈ రజస్సు అంటే ఏమిటి? అన్న విచారమును సంక్షిప్తముగానైన చేయవలెను.

రజస్ అనిన పరాగము (పుష్పధూళి) అనెడి అర్థముతో బాటు రజోగుణం అను మరొక అర్థము ఉన్నది. రజోదర్శనం్ము మొదలైననాటి నుండి బాలికలో దాంపత్య జీవనానికి అవసరమయ్యే స్త్రీత్వ లక్షణాలు పొడసూపుతాయి గనుక తొలిసారిగా రజస్వల అయిన బాలికను “పుష్పవతి” అని పిలవడము పరిపాటి. “పుష్య వికసనే” అన్న ధాతువు ప్రకారం వికసించిన బాలికను పుష్పవతి అని అనడం సరియే!

ఋతుమతి అయిన స్త్రీలో కనిపించే రజస్సు “ఆర్తవం” అనే స్రావమని ఆయుర్వేదము వివరిస్తున్నది.

 

శుద్ధే శుక్రార్తవే సత్వః స్వకర్మక్లేశచోదితః

గర్భస్సంపద్యతే యుక్తివశాదగ్నిరివ అరణౌ

(వాగ్భటాచార్య రచిత అష్టాంగయోగహృదయము, ప్రథమ సూత్రము)

 పై సూత్రానికి వావిళ్ళ వారి తెనుగు వ్యాఖ్యానము ఈ క్రింది విధముగా ఉన్నది:

 

“పురుషులకు సప్తధాతురూపమైనది శుక్రము, స్త్రీలకు ప్రసవమార్గము నుండి ప్రతిమాసము వెడలునట్టి రక్తము ఆర్తము. అయ్యది కొంచెము నలుపురంగు కల్గి, గంధరహితమై, వాతము చేత ప్రేరితమై ప్రతి మాసమునను ప్రసవ మార్గము నుండి బైట వెడలును. జీవుడు తాను పూర్వజన్మమున జేసిన శుభాశుభ కర్మముల చేతను, అవిద్య, అస్మిత, రాగద్వేషములు, అభినివేశము, అను ఈ క్లేశముల చేతను ప్రేరితుడై వాతపిత్తకఫములచే చెడకుండు పై జెప్పిన (తల్లిదండ్రులకు సంబంధించిన) శుక్ర-ఆర్తవములయందు యుక్తవశముగ జేరి, ఆరణులయందు మంథిప్రమంథుల సంధించి మంథనమును యుక్తియుక్తముగా జేసినపుడు అగ్ని పొడసూపు భంగి గర్భరూపముగ పరిణమించును.”

ఈ ఆర్తవమును రక్తమేనని అనుకోకూడదు. శరీరంలోని రక్తం రక్తకణాల వల్ల ఉత్పత్తి అవుతుంది. ఈ ఆర్తవము ఆహార పదార్థాల నుండి తయారవుతుంది. ఈ ఆర్తవం నుండే సంతానోత్పత్తికి కారణమయ్యే అండం విడుదలవుతుంది.

 

బీజాత్మకై ర్మహాభూతైః సూక్ష్మైస్సత్వానుగైశ్చ సః

మాతుశ్చాహార రసజైః క్రమాత్కుక్షౌ వివర్ధతే

(వాగ్భటాచార్య రచిత అష్టాంగయోగహృదయం ద్వితీయ సూత్రము)

 

పై సూత్రానికి వావిళ్ళ వారి తెనుగు వ్యాఖ్యానం ఈ క్రింది విధముగా ఉన్నది:

పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అను ఈ పంచ మహాభూతములును గర్భమును కలిగింప సమర్థములైన శుక్రార్తవములయందు మిక్కిలి సూక్షములై యోగి మనోదృశ్యములై చేరియుండును. మరియు నయ్యవి యట్టి బీజరూపమునొంది జీవునితో గూడ నియతముగ జేరియుండును. అట్టి పరమాణురూపములై శుక్రార్తవములయందు జేరి జీవునితో నిత్యసంబంధముగల మహాభూత సూక్ష్మాంశములచే కుక్షియందలి గర్భము నానాట వృద్ధినొందును. మరియు తల్లి భుజించు ఆహారరసమున గల్గు మిక్కిలి సూక్షములైన పంచమహాభూతములచే గూడ గర్భము నానాట వృద్ధినొందును.

[తల్లి భుజించిన ఆహారము పక్వముగనై రసముగ నేర్పడును. అట్టి రసము తల్లి యొక్క కుక్షియందుండునపుడు (నీటిచే చెరువు నిండియున్నప్పుడు చెరువుకట్టకు చేరువగా నున్న పైరు ఆ నీటి ఊట చేతనే పెరుగు విధముగ) తల్లియొక్క ఆహార రసమునకు సమీపముననున్న గర్భంబును వృద్ధినొందునని భావము]

కనుక స్త్రీలు తాము తినెడి ఆహారము పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యకరమైన పదార్థములను తింటే ఆర్తవం వ్యత్యాసమై అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయడంతో బాటు సంతానలేమికి కూడా కారణము కాగలదు.

ఉపనిషత్తులు కూడా ఈ విషయమును అత్యంత సూక్షముగా ఉపదేశించినవి. ఉదాహరణకు శారీరిక ఉపనిషత్తు నందు ఈవిధముగా ఉల్లేఖితమైవుంది:

 

ఓమ్ అథాతః పృథివ్యాది మహాభూతానాం సమవయం శరీరం

యత్కఠినంపృథివియద్ద్రావంతదాపోయదుష్ణంతత్తేజోయత్సంచరతి

వాయుర్యత్సుసిఅరమ్తదాకాశం

 

ఈ విషమును మరింత విశదపరుస్తున్నది గర్భోపనిషత్తు

 

పంచాత్మకం పంచసు వర్తమానం షడాశ్రయం షడ్గుణయోగయుక్తం|

తత్ సప్తధాతు త్రిమలం ద్వియోని చతుర్విధాహారమయం శరీరం||

 

అర్థము: శరీరము పంచభూతాత్మకము. షడ్రుచియుక్తము. షడ్గుణమయము. సప్తధాతుపూరితము. మలినత్రయోపేతము. స్త్రీ-పురుష భేదాత్మకము. చతుర్విధ ఆహార పోషితము.

ఈ విధముగా ప్రాచీన భారత శాస్త్రకారులు మానవ శరీరమును భౌతిక, అతీంద్రియ, ఆధ్యాత్మిక సమన్వయ కేంద్రముగా పరిగణించినారు. వారి దృష్టిలో శరీరము కేవల భౌతిక వస్తువు కాదు. అట్లని హేతురాహిత్యమయమైన అంధవిశ్వాసపాత్రమూ కాదు. కనుక ధార్మిక గ్రంథములను విమర్శించదలచిన వారు ఈ ప్రాచీన దివ్యదృష్టిని సంపూర్ణముగా గ్రహించిన పిదప విమర్శించుట ఉత్తమము.

ఇక ధర్మశాస్త్ర దృష్టిలో చూస్తే రజస్సు అంటే త్రిగుణాత్మకమైనది అని ఒక అర్థం. అందులో రాజస, తామస గుణముల మేళవమే ఎక్కువ. కనుక సాత్విక విషయములైన పూజ, వ్రత, దేవాలయ దర్శనాలకు రజస్సు ఒక ప్రతిబంధకము. అయితే, ఇక్కడ సంప్రదాయస్తులకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే “రజస్సులో రాజస, తామసాలున్నాయనడానికి ఆధారాలేవి?” అన్న ప్రశ్న.

 

దీనికి రెండు విధములయిన సమాధానాలు ఉన్నవి.

 

మొదటిది: ప్రపంచంలో కంటికి కనిపించని వస్తువులు, విషయములు, సంగతులు అనేకములు ఉన్నవి. ఉదా: గాలి కంటికి కనబడదు. ప్రేమ, అభిమానము, కోపము, దుఃఖము, వేదన, తృప్తి, తెలివి మొదలైనవి కూడా కంటికి కనబడనివే. అయితే, ఇవన్నీ అనుభవము ద్వారా భావనాత్మక రూపములలో తెలుసుకోవచ్చు. అదే విధముగా ’రజస్సు’లో రాజస, తామసాలనే అతీంద్రియ గుణాలున్నాయని తెలుసుకోవడం మూర్ఖత్వం కాబోదు.

రెండవది: నవీన వైద్యశాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా శోధించి రజస్వలకు సంబంధించిన రెండు రుగ్మతలను కనుగొన్నారు. (1) Premenstrual Stress మరియు (2) Post Menstrual Stress. ఈ రెండింటిని PMS అన్న సంక్షిప్తనామంతో పిలుస్తారు. వీటిలో మొదటిది రజస్వల సమయానికి కొద్ది రోజుల ముందుగా ఏర్పడితే, రెండవది రజస్సు నిలచిన తరువాత కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రెండు రుగ్మతలు కూడా రజస్వలలో ఓ మాదిరి నుండి అతి తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయని వారు నిర్ధారించారు. వేదాంత, ధర్మశాస్త్రాలు మానవుల్లోని నకారాత్మక ప్రవర్తన (negative activity/response) అన్నది రాజస, తామస గుణాల వల్ల వస్తుందని వివరించాయి. కనుక PMS  అనేది రాజస, తామస గుణసంబంధమైనదని మనం నిర్ధారించవచ్చు. (More about PMS can be read here: http://www.pmscomfort.com/pms-pmdd-symptoms/pmdd.aspx). ఈ కారణము వల్లనే శుద్ధ సాత్విక క్షేత్రమైన దేవాలయానికి వెళ్ళడం రజస్వల అయిన స్త్రీకే కాదు ఇతర ఆలయ దర్శకులకు కూడా మంచిది కాదని ప్రాచీనులు అభిప్రాయపడినారు.

రజస్వల సమయమనేది స్త్రీలకు వారి మానసిక స్థిరత్వానికి ప్రకృతి పెట్టే పరీక్ష అని అనుకోవచ్చు. ఇటువంటి క్లిష్ట సమయంలో వారిపై మరింత ఒత్తిడిని పెంచకుండా ఉండడానికై శాస్త్రం “బహిష్ఠు” అన్న స్థితిని విధించింది. బహిష్ఠు అనగా “బహిర్ తిష్ఠతి ఇతి” అని అర్థం. అనగా ఇంటి నుండి దూరముగా ఉన్నవారని అర్థము. ఈ స్థితిలో స్త్రీలను రోజువారీ ఇంటి పనులు, వాటి సంబంధిత ఒత్తిడుల నుండి వేరు చేసి, విడిగా ఓ గదిలో విశ్రాంతి తీసుకొమ్మని చెప్పడమే “బహిష్ఠు” పదానికి ఇవ్వగల నిర్వచనం.

ఈ పద్ధతి స్త్రీల పట్ల క్రౌర్యాన్ని గానీ, అవమానాన్నీ గానీ చూపించేది కాదు. ఈ విషయాన్నే వివరిస్తూ మనువు తన స్మృతిలో ఇలా చెప్పాడు:

 

“జరా శోక సమావిష్టం రోగాయతనమాతురం

రజస్వలమనిత్యం చ భూతావాసమిమం త్యజేత్”

కనుక ఋతు సమయంలో స్త్రీలను పురుషులు దైనందిక కార్యక్రమాల (సంభోగం సహా)కై వినియోగించరాదు. ఆ దూరాన్ని ఉంచడానికే స్త్రీలను ఇంటికి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది.

ఇదీ సంక్షిప్తంగా ఋతుచక్రం, రజస్వల చిత్రణం.

సహనము, అసూయరాహిత్యము, కేవల సత్యశోధనము లక్ష్యముగా గల వారు పై విచారములను కూలంకషముగా పరిశీలించవచ్చును. లోపదోషాదులను గుర్తించి విమర్శించవచ్చును. “వాదే వాదే జాయతే తత్వజ్ఞాన”మని పెద్దలు నుడివినట్టు ఫలకారియగు చర్చ వలననే సత్యాసత్యముల నిర్ధారణ జరిగి సమాజమునకు హితము చేకూరగలదు.

****

You may also like...

Leave a Reply