పిచ్చి పోలి

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 10
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

భళ్లున తెల్లవారడంతోనే పోలి ప్రసవించింది.

పండంటి మగపిల్లాడిని కన్నది అన్న వార్త వూరంతా పాకింది. శాంతకు తెలియకుండానే పోలికి పుట్టిన బిడ్డ కోసం లావాదేవీలు మొదలయ్యాయి. సరుకుల కొట్టు కాంతయ్యకు పెళ్లయి యిరవై యేళ్లయినా పిల్లలు కలగలేదు. దగ్గిర బంధువుల పిల్లలని పెంచుకుంటే రోజూ వాళ్లు వచ్చి యేదో వొకదానికి పేచీలేస్తారని యిన్నాళ్లు ఆలోచించాడు. పోలి కొడుకయితే తల్లి పిచ్చిది కులంలోంచి వెలివేయబడ్డది అటువంటి బిడ్డని డత్తత చేసుకుంటే యెవరి ప్రమేయం వుండదని పోలి తల్లిదండ్రుల వద్దకెళ్లి తన అభిప్రాయాన్ని తెలియజెప్పి వాళ్లకి కొంత డబ్బాశ చూపాడు.

కులపెద్ద చలమయ్య మధ్యవర్తిత్త్వం చేసి కొంత డబ్బు తప్పు చెల్లిస్తే పోలిని కులంలో కలుపుకుంటామని పోలిని యింటికి తెచ్చుకోవచ్చని ప్రకటించాడు. ఈ విషయమంతా శాంత గోపాలరావులకు వీరమ్మ ద్వారా తరువాత తెలిసింది.

అందరూ కూడగట్టుకుని పదిగంటలకి గోపాలరావు యింటికి వచ్చారు. శాంత ఆశ్చర్యంగా భర్తని చూసింది. ఏమీ మాట్లడవద్దని సౌంఙ్ఞ చేసాడు. వాళ్లు పోలి వద్దకు వెళ్లి “పిచ్చి పోలీ బాగున్నావా? నీ బిడ్డని కాంతయ్యకిస్తే నువ్వు మీ అమ్మ కాడకి యెలిపోదువు గాని. నిన్ను కులంలో కలుపుకుంటా”మని చలమయ్య అనగానే పోలి స్పందన యెలా వుంటుందోనని ఉభయులం కుతూహలంగా గమనిస్తున్నాం. యెప్పుడూ నోరువిప్పి మాట్లాడని పోలి సమాధానం ఎలాచెప్తుంది ఏమిటిచెప్తుంది అని.

Products from Amazon.in

ఈమాటలు వినగానే పోలి పసివాడిని బట్టలోచుట్టి జాగ్రత్తగా గుండెలకి హత్తుకుంది. అందరి వైపు చూసి “నా కొడుకుని నానెవ్వురికి యియ్యను నానే పెంచుతా చలమయ్యమామా! నానే కులంలో పెరిగినానో నాకెరికనేదు. నానెక్కడికి రాను. కూలి నాలి సేసుకుని నాకొడుకుని పెంచి పెద్ద సేసుకుంటాను నా కొడుకుని యెవురికి యివ్వను.” అంటూ బిడ్డని గుండెల్లో దాచుకున్న ఆ మాతృ హృదయాన్ని  అర్ధంచేసుకున్న మేము అవాక్కయ్యాము.

పోలి నోటివెంట వచ్చిన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆణిముత్యం. అక్కడున్నవారంతా నిశ్చేష్టులై నిలుచున్నారు. ఆపైన ఒక్క ముక్క మాట్లాడటానికి సాహసించలేదు. ముందుగా గోపాలరావు తేరుకుని “యిప్పటికైనా అర్ధం అయింది కదా! యింకా ఆమెని పిచ్చిది అంటే మర్యాదగా వుండదు. ఇకనైనా ఆమె బ్రతుకుని ఆమె యిష్టానికి వదలి వెళ్లండి.” అని అన్నాడు. మాటలు శాంతంగావున్నా అందులో వున్న దృఢత్వం అక్కడున్న వారికి అర్ధమయి వెనుదిరిగారు.

యిప్పటికీ పోలిని పిచ్చిపోలి అనడం యెంత అవివేకమో వచ్చిన నలుగురికీ అర్ధమయివుంటుంది. గోపాలరావు చర్యతో శాంత దృష్టిలో ఆకాశమంత యెత్తుకెదిగిపోయాడు. గర్వంగా చూసింది భర్తని. శాంత యీ షాకునుండి తేరుకుని పోలికి తినడానికి యివ్వాలని లోపలికి వెళ్ళింది.

మధ్యాహ్నం తీరికగా కూర్చున్న సమయంలో రెండేళ్ల క్రితం తను  ఆ వూరు వచ్చినప్పటి జ్ఞాపకాల పుటలు తెరుచుకున్నాయి. ఆ చిన్నవూరికి సోషల్ డెవలెప్మెంట్ ఆఫీసరుగా భర్తకి బదిలీ అవడంతో అక్కడ వుండటానికి వసతైన యిల్లు వెతుక్కొవడం చాలా కష్టమయింది. దొరికిన యింటికి చుట్టూ పూరిళ్లే. అందరూ కాయకష్టం చేసుకుని బ్రతికేవాళ్లే.

యిల్లు సదుపాయంగా వున్నప్పుడు మిగతావాటికి ప్రాముఖ్యత యివ్వాల్సిన పనిలేదని వాళ్లతో యిబ్బంది వుండదని ఆ యింట్లో దిగారు. ఉన్న ఒక్క కొడుకు యింజినీరింగు చదువుకని వేరేవూర్లో వుంటున్నాడు. ఉద్యోగరీత్యా పల్లెటూర్లు తిరగటం అలవాటే. గోపాలరావు ఆఫీసుపని మీద టూర్ కూడా వెళ్ళవలసి వస్తూంటుంది. శాంత పేరుకే కాదు స్వభావంలో కూడా శాంతే. చుట్టు పక్కల వున్నవారి యోగక్షేమాలు కనుక్కోవడం ఆరోగ్యసూత్రాలు చెప్పడం, తోచిన సహాయం చెయ్యడంతో శాంతమ్మగారంటే చుట్టుపక్కల అందరికీ గౌరవం అభిమానం కొద్దిరోజుల్లోనే యేర్పడింది.

ఆరోజు భర్త ఆఫీసుకెళ్లాక వీధిలో యేదో గొడవగా వుందని బయటికి వచ్చింది శాంత. తమ యింటికి నాలుగిళ్ల అవతల పిచ్చిపోలిని తల్లి తండ్రి గద్దిస్తున్నాడు – “ఆడెవుడో పేరు సెప్పు కులానికి సెడ్డ పేరు తెచ్చినావు.” ఎంతగా అడిగినా పెదవి విప్పలేదు. దాంతో నాలుగు తన్ని యింటినుంచి బయటికి తోసేశారు. ఏడుస్తోందే తప్ప పోలి యెటూ పోలేదు. ఒక పక్కగా ఒదిగి కూర్చుంది. జనం పదిమందీ పోగయి విచిత్రం చూస్తున్నారు.

చివరికి తండ్రి “నిన్నింటిల పెట్టుకుంటే నన్ను కులంనుంచి యెలేస్తారు పో నీ బతుకెలా బతుకుతావో నీ యిట్టం”అంటూ రోడ్డు మీదకు నెట్టాడు. తల్లి గోలున యేడుస్తోంది.

ఏమై వుంటుందా అని అలోచిస్తున్నాను. ఇంతలో పనిమనిషి వీరమ్మ వచ్చింది.

ఆతృతనాపుకోలేక “యేమయింది వీరమ్మా? పోలిని యింట్లోంచి వెళ్లగొట్టేరెందుకు?”

అందుకు బదులుగా “ఆల్లుమాత్తరమేటి సేత్తారమ్మా? యీడొచ్చిన పిల్ల. మతిలేదు గాని పెల్లిపెటాకులు నేకుండ నెలతప్పినాదంటే యింటిల యెట్టా యెట్టుకుంటారమ్మా?దాన్ని యింటిల వుంచితే కులంలోంచి యెలేస్తామని కులపెద్ద సెప్పాడు. వున్న ముగ్గురు పిల్లల నోటికింత బువ్వ పెట్టలంటే యీ పిల్లని బయటికి తోలక తప్పదు కదమ్మా?”

నిశ్చేష్టురాలినయ్యాను. యిటువంటివి హైసొసైటీలో జరిగితే గుట్టు చప్పుడు కాకుండా బయటపడతారు.

అన్నిటికన్నా పోలి మతిమాలిన పిల్ల యిటువంటి పరిస్థితిలో బయటి ప్రపంచంలో యెలా బతుకుతుంది?

అదే అడిగితే అందుకు వీరమ్మ – “అన్నిటికీ బాగమంతుడే వున్నాడమ్మా! నారు పోసినోడు నీరుపొయ్యకుండ వుంటాడా? వూరిల యింతమందుండగా పిచ్చిదాని గురించి సింత పడతారెంటమ్మా? “

వీళ్లకున్న ధైర్యం మనకి వుండదు చింతపడకుండాయెలా?

యీ వూరు వచ్చిన దగ్గరనుంచి చూస్తున్నాను, పోలిది విచిత్రమైన ప్రవర్తన. స్నానం చెయ్యటానికి గొడవపెడుతుంది. వంటినున్న బట్టలు మాసి చిరిగినా మార్చటానికి యిష్టపడదు. చిరిగిన బట్టలని ఎక్కడికక్కడ ముడులు కడుతూంటుంది. జుట్టు అట్టలు కట్టినా దువ్వనివ్వదు.

ఒకసారి పోలి తల్లిని పోలి గురించి అడిగితే నాలుగేళ్ల వరకు బాగుండేదని ఒకసారి చెట్టు మీందనుంచి పడి తలకి దెబ్బ తగిలిందని అప్పటినుండి విచిత్రంగా ప్రవర్తిస్తోందని చెప్పింది. ఆకలివేసినా అన్నం తింటాననేది కాదు తల్లి ఏదో ఒక వేళకి కసిరితే యింత తినడం. అప్పటినుంచి పిల్లలూ పెద్దలూ పిచ్చిపోలి అంటూ పిలవడం మొదలు పెట్టారు. తనకేం కావాలో తెలియని పిల్లని రోడ్డు మీదకు నెట్టేయడం ఎంత సమంజసమోఅర్ధం కాలేదు. తప్పో ఒప్పో తెలియని మనస్థితి అది అర్ధం చేసుకునేవాళ్లే లేరు.

చుట్టూ మూగిన జనం తలో మాట అనుకుంటూ వెళ్లారు. ఇదే సహజంగా పెళ్లై నెలతప్పితే ఎంతో అపురూపంగా కాలు కిందపెట్టకుండా చూసుకుంటారు. పోలి జీవితం ఎలా గడుస్తుంది అనుకుంటూ లోపలికెళ్లాను.

రోజులు వారాల్లోకి నెలల్లోకి మారుతున్నాయి. పోలి గర్భవతి అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. వీరమ్మని అడిగాను పోలి యిన్నాళ్లనుంచి ఎలాబతుకుతొందని చెరువు దగ్గర శివకోవిల దగ్గర ఎక్కువకాలం గడుపుతుందని, కోవెల పూజారి ప్రసాదం పెడుతూంటాడని చెప్పింది.

అందరినీ కాపాడే అదృశ్య శక్తికి జోహార్లర్పించాను.

పూర్వంలా పోలి తనలో గొణుక్కోవడం బట్టలు ముడులు కట్టడం చేయడంలేదని గమనించాను. కడుపులో బిడ్డ పెరగడంతోపాటు ఆమె మనస్థితి కూడా మెరుగు పడుతోందనుకున్నాను.

ఒకరోజు గుమ్మం ముందు నిలుచున్న పోలిని అడిగాను “ఏమయినా తింటావా?” అని. “సరే” అన్నట్లు తలూపింది.

లోపలినుంచి నాలుగు యిడ్లీలు, చట్నీ యిచ్చాను అపురూపంగా తిన్నది. పాత చీరలు రెండు యిచ్చాను మర్నాడు కట్టుకుని వచ్చింది.చూసి చాలా ఆశ్చర్యపోయాను. నెలలు నిండుతూంటే ఆమె స్థితికి కడుపు తరుక్కుపోయింది.ఆరాత్రి మావారిని అడిగాను – “వూర్లో యింతమంది వుండి పోలిని ఎవరూ పట్టించుకోరేం? మీరు సొసైటీని ఉధ్దరించడానికే కదా యిటువంటి పరిస్థితి బాగుచెయ్యడానికి వుపాయమేం లేదా? ” “అంటే యిది మరీ బాగుంది నేనేం చెయ్యగలను?” అంటూ తప్పించుకున్నారు.

“పోనీ మీరు పర్మిషనిస్తే మన పెరటి షెడ్డులో ప్రసవించేదాకా వుండమనవచ్చుకదా! ఆస్థితిలో వున్న ఆడదానికి రెండుపూటలా యింత అన్నం పెడితే మనకేమీ తరిగిపోదుకదా? యిటువంటి సలహా అయినా మీరు చెప్పవచ్చుకదా” అంటే మావారు నవ్వుతూ “సరే! నువ్వు దీనజనోధ్దరణ చెయ్యాలనుకుంటే నాకేం అభ్యంతర లేదు. కానీ నాకై నేను సలహా యిస్తే యిందులో నాహేండుందని అనుమానించే ప్రమాదం వుంది. ఈ భయానికే వూర్లోవాళ్లు జాలిపడ్డా సహాయం చెయ్యడానికి ముందుకి రాలేదేమో”

భర్త అంగీకారం దొరకడమే తరువాయి మర్నాడు పొద్దుట వీరమ్మని పంపి పోలిని మా పెరట్లోని షెడ్డులో వుండే ఏర్పాటు చెయ్యడం క్షణాల్లో జరిగింది. హమ్మయ్య అనుకుంది శాంత.

ఆరోజు యింటికి బంధువులు రావడంతో వుదయంనుండి రాత్రివరకు అతిధి మర్యాదలు చేస్తూ అలిసిపోయింది రాత్రి పోలికి అన్నం పెట్టి నిద్రపోయింది. రాత్రి పదకొండు నుంచి వురుములు మెరుపులతో వాన విపరీతంగా పడింది. అలిసి పడుక్కున్న శాంతకు యిదేమీ తెలియ లేదు. తెల్లవారు ఝామున నాలుగు గంటలకు లేచిన శాంత వాతావరణంలో మార్పు గమనించి బయటకు చూస్తే వాన పడుతోంది పోలి ఎలా వుందోనని టార్చి తీసుకుని షెడ్డులోకి పరిగెత్తింది

అక్కడి దృశ్యం చూసి నోటమాట రాలేదు. లైటు స్విచ్చి వేసింది. షెడ్డులో ఒక మూల పోలి మూలుగుతోంది కాళ్ళ దగ్గర మురికిలో బాలభాస్కరుడిలా మగబిడ్డ కదులుతున్నాడు. వెంటనే భర్తని లేపి వీరమ్మని పిలిచి నర్సుని తెప్పించి పిల్లడికి బొడ్డు కోయించి స్నానం చేయించి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేయించింది. పోలిని బిడ్డని పొడిగా వెచ్చగా వున్న ప్రదేశంలో పడుక్కోపెట్టించి చాలా హడావిడి పడింది శాంత.

తెల్లవారేవరకు పోలి నెలతప్పిన నాటినుంచి జరిగిన సంఘటనలు తలుచుకుంటూ గడిపింది. అట్టలు కట్టిన జుత్తు దుర్గంధ భూయిష్టమయిన శరీరం మసిబారి ముడులు కట్టిన జీర్ణ వస్త్రాలు యిటువంటి పోలినిమీద మనసు పడ్డ మహానుభావుడెవరోగాని తనకి యీ సహాయం చేసే అవకాశం కలిగించాడు అనుకుని మనసులోనే నవ్వుకుంది.

పోలికి యింత అన్నం వండిపెడదామని తయారు చేస్తూంటే పదింటికి పోలి తల్లి తండ్రి కాంతయ్య, చలమయ్యలు రావడంతో వాతావరణం వేడెక్కింది.కాని పోలి యిచ్చిన సమాధానంతో మబ్బులు విడిపోయినట్లయింది.

యివన్నీ చూసిన తరువాత కూడా పోలిని పిచ్చి పోలి అనడం ఎంత పిచ్చితనమో అర్ధమయింది యిక పోలి జీవితం గురించి చింత పడాల్సిన పనిలేదని నిబ్బరంగా వూపిరి తీసుకున్నాం.

@@@@@

You may also like...

1 Response

 1. Sandhya says:

  నమస్కారం.
  మతిస్థిమితం లేని పోలిలో తన కలంతో మాతృత్వపు పరిమళాన్ని నింపిన….కాదు…నిరూపించిన, రచయిత్రికి అభినందనలు.

Leave a Reply