పండుగ అంటే ఏమిటి?

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 5
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares
Like-o-Meter
[Total: 1 Average: 5]

ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది. అందరూ కొత్తబట్టలు కట్టుకోని, తీపి వంటకాలను ఆరగించి, తృప్తిగా రోజును గడిపేస్తారు. మరుసటి రోజునకు సగటు జీవితపు చట్రములో చిక్కిపోతారు. మరి పండుగకు అర్థమేమిటి?

కొత్తబట్టలు, తీపి వంటకాలేనా? ఏదో ఋణం తీర్చినట్టు పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చేస్తే, ఆ తర్వాత సాగే మూడు సినిమాలు, అరవై పాటలేనా? లైటింగ్ అరేంజిమెంట్లు, మైకు సెట్లు, గోలలేన?

అసలు పండుగకు నిజమైన అర్థమేమిటి?

భక్త్యాతుష్యతి కేశవః, నతు ధనైః, భక్తప్రియ కేశవః” అని భాగవతం చెబుతున్నది. స్వచ్ఛమైన, నిర్మలమైన భక్తినే దేవుడు కోరుకునేది. దానికే తృప్తి పడేది. దీనికి ఎలాంటి అలంకరణలు, హంగులు అవసరం లేదు.

ప్రతిరోజు కాకపోయినా, మనకు చేతకాకపోయినా – కనీసము పండుగరోజునైనా వ్యర్థమైన హంగులను వదిలితే మేలు. రెడీమేడ్ తిళ్ళను కొని తెచ్చి చేసేది పండుగెలా అవుతుంది? ఉన్నదానిలో గంజినైనా వండుకొని, భగవంతుని ప్రసాదమని స్వీకరించడమే నిజమైన పండుగ. కామక్రోధాలను వీడి, అతిథి-అభ్యాగతులను ఆదరించడమే పండుగ.

తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించి నమస్కరించడమే పండుగ. ఋణరూపము కాని వ్యవహారమే పండుగ. దేహానికి, మనసుకు రోగము రాకుండుటే పండుగ. నాలుకపై మంచి మాట, దైవస్మరణ దొరలుటే పండుగ. ఒకరిని నిందించి, అపహాస్యము చేయకపోవడమే పండుగ. దంపతులు విడిపోక కలసి ఉండుటయే పండుగ. పరుల ఉన్నతి కాంచి ఈర్ష్య పడకపోవడమే పండుగ. సుజ్ఞానమును పొందుటే పండుగ. అజ్ఞాన నివృత్తియే పండుగ. నుదుటి వ్రాతకు కుంగిపోకుండటయే పండుగ.

ఇవి నా మాటలు కావు. అనేక పురాణ కథలలో విజ్ఞులైన భక్తుల జీవితాలు తెలియజెప్పిన విషయాలు. మనము ఎంతవరకు ఇట్టి నిజమైన పండుగను ఆచరిస్తున్నామో ప్రశ్నించుకోవలసిన అవసరముంది.

Time bound అన్న మాట అందరికీ తెలిసినదే కదా! మనిషి జీవనము కాలాధారము. పుట్టిననాటి నుండి చిట్టచివరి శ్వాస వరకూ ప్రతి అడుగూ కాలానుగుణంగా నడవవలసిందే. యుగాది అటువంటి కాల విశేషమును తెలుపు పండుగ.

 

ఇతరులకు లేనివి, మనకు ఉన్నవి అరువది సంవత్సరాలు. ప్రభవ నుండి మొదలుగొని అక్షయ వరకూ గలవే అరువది సంవత్సరములు. ప్రభవ అంటే పుట్టినది. మామూలుగా పుట్టడము కాదు, ఉత్కృష్టమైన పుట్టుక (ప్రకర్షయేతి భవాః). అక్షయమంటే నాశనము లేనిది (న క్షయమితి అక్షయం). కాలమూ అంటే సర్వోత్తముడైన భగవంతుని మరో రూపమే “కాలము”. కల ప్రాపణే అని సంస్కృత వ్యుత్పత్తి. అంటే “పొందించునది” అని అర్థం. కాలము సకలాన్ని అందజేస్తుంది. వసంత, శిశరాలు, శీతోష్ణ, సుఖదుఃఖాదులన్నీ కాలానుగుణంగా వచ్చిపోవునవే. ఇవి మనకు తెలియని నాటి నుండి ఉత్కృష్టమై, అనంతమై, అప్రతిహతమై, అమోఘమైసాగిపోతూనే ఉన్నాయి. అందువల్లనే ఇది అక్షయం. కాలానికి అంతులేదు.

ఈ ప్రభవ, అక్షయాల మధ్య ఎన్నేన్నో వత్సరాలు మన స్థాయీ భావాల యొక్క వివిధ రూపాల వలే వస్తాయి. ఒకటి ఆనందమైతే, మరొకటి రాక్షసం. ఒకటి శుభకృతు అయితే మరొకటి పరాభవ. ఒకటి సౌమ్యమైతే ఇంకొకటి వికృతి.

తను పుట్టిన సంవత్సరమును మరలా పొందడానికి మనిషి 59 సంవత్సరములు వేచి చూడాలి. ఇదొక చక్రము. ఈమధ్యలో మనిషి జీవనము ఆయనములు, మాసములు, వారములు, దినములుగా కొలవబడుతుంది. వీటి సూక్ష్మ విభాగాలను తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలుగా విభాజితమౌతాయి. వీటినే పంచాంగమంటారు.

మనిషి ఆరు రెప్పపాట్ల సమయముకు విఘడియ అని పేరు. అట్టి 60 విఘడియలు ఒక ఘడియ. ఏడున్నర ఘడియలు ఒక జాము. ఎనిమిది జాములు ఒక పగలు, ఒక రాత్రి. ఒక పగలు, ఒక రాత్రి కూర్చిన “తిథి” అవుతుంది. అట్టి తిథులు పదిహేను చేరితే ఒక పక్షము. రెండు పక్షములు ఒక మాసము. రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక ఆయనము. రెండు ఆయనములు ఒక సంవత్సరము. ఇదీ కాల విభాగము.

ప్రతి కాల విభాగములోను భగవంతుడు వ్యాప్తి చెంది ఉంటాడు. అందుకే అతడు “కాలాంతర్గత, కాల నియామక, కాలాతీత, త్రికాలజ్ఞ, కాల ప్రవర్తక, కాల నివర్తక, కాలోత్పాదక, కాల మూర్తి”యని కొలిచి “దాసోహ”మనడమే ప్రతి పండుగ యొక్క ఉద్దేశ్యం. దీనిని నిరూపించడానికి ఉగాది పండుగ ఉత్తమమైన నిదర్శనం.

ఆంగ్ల సంవత్సరారంభాన్ని నేటితరపు యువతీ యువకులు అత్యంత ఆసక్తితో జరుపుకుంటారు. కానీ మీరు గమనించి చూస్తే ఆ సమయానికి ప్రకృతిలో వికృతినే కాంచగలం. విపరీతమైన చలి, జీవితాన్ని చాలించ చూసే తరువులు మొదలుగా. కానీ మన కొత్త సంవత్సరాదిని చూడండి. రాలిన ఆకుల స్థలాలలో కొత్త చివుర్లు తొడుగుతాయి. వణికించే చలి తొలగి, వెచ్చనైన సూర్యకిరణాలు షికార్లు చేస్తాయి. ఫలసాయం చేతికంది వస్తుంది. నేలంతా పచ్చగా, వెచ్చగా, స్వచ్ఛంగా పలుకరిస్తుంది. బయటి ఆహ్లాదకరమైన మార్పులు మనలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఇదే “కాల మహిమ”.

అందువలన, కొత్తబట్టలు, పిండివంటలతో బాటు భాగవత ధర్మాలైన శాంతి, సహనము, వినయము మొదలైనవాటిని పెద్దలనుండి నేర్చుకొనే రోజులుగా పండుగలను జరుపుకోవాలి.

కురు భూత దయాన్నిత్యం
చరధర్మ మహర్నిశం
జానీహి నిత్యం ఆత్మానాం
అవేధ్యన్న్యద్ధి నశ్వరం
స్మర కృష్ణం, భజ హరిం
నమ విష్ణుం, శ్రయాచ్యుతం.
జయ కామం, జయ క్రోధం
జహి మోహం, భవాలయం

 

You may also like...

Leave a Reply