అధ్యాయం 24 – పల్నాటి వీరభారతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

క్రితం భాగంలో: “బొంగరాల పోటీ”లో బాలచంద్రుడు వదిలిన బొంగరం తాకి ఓ వైశ్య కన్నె గాయపడుతుంది. “నీ తండ్రులు, బంధువులు యుద్ధం చేస్తుంటే నువ్విక్కడ బొంగరాలాడుతూ,  స్త్రీలను హింసిస్తున్నావా?” అని అవేశంగా అడుగుతుంది ఆ యువతి. మార్పు చెందిన మనసుతో ఇంటికి వచ్చినబాలచంద్రుడు తల్లి ఐతాంబతో యుద్ధానికి పోతానని చెబుతాడు. అతణ్ణి యుద్ధవిముఖుణ్ణి చెయ్యడానికి ఆఖరు ఎత్తుగా మాంచాల వద్దకు పంపుతుంది ఐతాంబ.

ప్రస్తుత కథ:

తన తోటి వయస్కులైన, వీరులైన తమ్ములను వెంటబెట్టుకుని యుద్ధరంగానికి బయల్దేరుదామనుకున్న బాలుడు సాని సబ్బాయి మీదున్న వ్యామోహాన్ని వదులుకోలేక, దానితో ఓ మాట చెబుదామని బయల్దేరాడు.

భార్యలు, భర్తలతో సుఖ జీవనయాత్రను చేస్తారు. సానులు ప్రియులతో సుఖజీవన తాత్కాలిక ప్రసంగాలు చేస్తారు.

వగలతో, కులుకులతో, టక్కులతో, నిక్కులతో విటుణ్ణి పల్టీలు కొట్టిస్తారు. ఈ కొత్త సుఖం అలవాటైనవారు తమ బ్రతుకులను సాని పాదాల దగ్గర పణంగా పెడతారు.

మాంచాల వంక తొలినాడైనా ఒక్కసారి కన్నెత్తి చూసినట్లైతే తను ఏ సబ్బాయినైతే మహాసౌందర్యవతని భావిస్తూ వచ్చాడో ఆవిడ మాంచాల అందం ముందు తీసుకట్టని తప్పకుండా తెలుసుకునేవాడు. కానీ అట్లా జరగలేదు.

సాని సబ్బాయి ఇంటికి వెళ్ళేసరికి తొలిజాము గడిచిపోయింది. కప్పెర కప్పెర చీకటి కప్పుకొనివున్నది. ప్రజలు తమ తమ ఇళ్ళల్లో వెచ్చగా నిద్రపోతున్నారు.

సాని సబ్బాయి బాలచంద్రుడి గొంతు వినగానే, దాసీలను పిల్చి – “చూడవే, ఈ గొంతును నేను ఎప్పుడైనా గుర్తించగలను. తలుపు కొట్టే విటుడు బాలచంద్రుడు. నాకు ఒంట్లో బాగుండలేదని చెప్పు.” అన్నది.

“బాగానే వుంటిరిగా!” అంది ఆ దాసీ.

“అక్కడే వుంది కిటుకు. ఇట్టాంటి మాటలతోనే ప్రియుల్ని విటురాళ్ళు బోల్తా కొట్టించాలి. చెప్పినట్లు చెయ్యి.” అంది సబ్బాయి.

ఉన్న దీపాన్ని చిన్నాది చేసిన దాసీ తలుపు తెరిచి – “రండి ప్రభూ! శ్యామాంగికి ఒంట్లో నలతగా వుంది” అంది.

“అయ్యో! విచారకరమైన వార్త చెప్పావు. కారెంపూడి రణక్షేత్రానికి యుద్ధానికై వెళుతున్నాను. ధనాన్నిచ్చి వెళ్దామని వచ్చాను. ఏం చేస్తాం. దాని ఖర్మ!” అన్నాడు బాలచంద్రుడు.

ఈ మాట దాసీది వినగానే అప్పటికే అలంకరించుకొనివున్న సబ్బాయి మంచం మీదినుంచి దిగి క్రిందకు దిగి వచ్చింది.

“వెళ్తున్నారా స్వామీ?” అన్నది.

బాలచంద్రుడు దీక్షగా దాని ముఖంలోకి చూసి – “ఒంట్లో బావుండలేదని విన్నాను!”

“కొంచెం నలత”

“పాపం…”

ఈ మాటలు కొంచెం హేళనగా ధ్వనించిన సాని సబ్బాయి “ప్రభువులు, ఏమి పల్కినా చెల్లుబాటౌతుంది. వెల కట్టబడిన వారకంతలు నిజం చెప్పినా నమ్మరు. మీరు వచ్చారుగా. అంతేచాలు. కారెంపూడి రణక్షేత్రానికి వెళ్ళబోయే ముందు తమ పాదాల కొక్కసారి ప్రణామం చెయ్యనివ్వండి.”

సోదరుల వంక చూసి – బాలచంద్రుడిట్లా అన్నాడు – “ఆడది పిల్చినప్పుడు వెళ్ళకపోవటం పురుషలక్షణం కాదు. కనుక వెళ్ళొస్తాను”.

ప్రతి సానికీ ప్రతి చరిత్రలోనూ తల్లి వుంటుంది. వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికివుంటారు కామాల్ను. సాని సబ్బాయికి వృద్ధురాలైన తల్లి వున్నది. సందర్యం వెలిసినా ధనాశ చావలేదు. బాలచంద్రుణ్ణి చూసి, నెత్తిన మెటికలు విరుచుకుని “ప్రభువులు యుద్ధరంగానికి వెళ్తూ కూడా మా గృహం పావనం చేసారు” అన్నది.

“ఇంతకూ ఏమిటి సంగతి?” అన్నాడు బాలచంద్రుడు.

“వేశ్యలు ధనం సంపాదించుకోవడానికే ఈ ప్రపంచంలో పుట్టారు. వయస్సులో వున్న వారకాంత కొద్దో గొప్పో సంపాదించుకోవాలి. లేకపోతే, ఆ తర్వాత దాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తరే తండ్రి! యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు, కొద్దో గొప్పో ధనాన్ని మాకు పారవేయండి” అన్నది.

“అట్లాగే” అన్నాడు బాలచంద్రుడు. ముసలిది సంతోషంతో పొగిడింది – “ఆడిన మాట తప్పని వంశం నాయనా మీది”.

ఐతే, సాని సబ్బాయిని చూడగానే యుద్ధం సంగతి మర్చిపోయాడు బాలచంద్రుడు. అదే

అతనిలోని బలహీనత.

 

మేడపి స్తబ్దుగా వున్నది. ఆకాశం మధ్య చంద్రుడు క్షీణకాంతితో విశ్రమించాడు.

అంగాంగాలు కనిపించేలా, ఉల్లిపొర చీరను కట్టింది సబ్బాయి. దాని రొమ్ము, ఎగరేసిన పల్నాటి ప్రభువుల విజయకేతనంలా వున్నది.

దాని ప్రేమను పరీక్షించాలనుకున్న బాలచంద్రుడు “యుద్ధానికి వెళుతున్నాను!” అన్నాడు.

“విన్నాను ప్రభూ!”

“నాతో మాట్లాడాల్సిందేమన్నా వుందా?”

“లేదు. ఒకవేళ వున్నా నేను భార్యను కాను కదా; వెలకట్టిన ఆలిని, వెలయాలిని”

బాలచంద్రుడు కోపం తెచ్చుకొని “ఈ లక్షణం మీ జాతిలోనే వుంది” అన్నాడు.

బాలుడు కోపం తెచ్చుకున్నాడని గ్రహించిన సబ్బాయి “ప్రభూ! అలకతో ఈ రాత్రిని ఎందుకు వృధాచేస్తారు. మనోవాక్కాయ కర్మలా, మిమ్మల్నే నేను ప్రాణప్రదంగా పూజిస్తున్నాను. నన్ను మీరు నమ్మకపోతే చేయగల్గిందేమున్నది? మీరు నన్ను నమ్మకపోతే ఈ వలిపాలెందుకు? ఈ మురిపాలెందుకు?” అన్నది. అని కన్నీరు కూడా పెట్టుకొన్నది.

దాని కపటపు కన్నీరు చూడగానే, నీరైన బాలచంద్రుడు దాన్ని బుజ్జగించి, దగ్గరకు లాక్కొని, తమితో ముద్దెట్టి “నిన్ను పరీక్షించాలని అట్లా అన్నానులే” అని అన్నాడు.

సబ్బాయి కన్నీటి చిరునవ్వు నవ్వి “మీకు నా మీద ఎంత ప్రేమో నాకు తెలియదా?” అన్నది.

“కబుర్లతో కాలం వృధాగా గడుస్తున్నది” అని బాలుదంటే, కంటి కొసల్తొ నవ్వి, క్రింది పెదవిని పైపంట సుతారంగా నొక్కి “ఏం చెయ్యమంటారు?” అని కవ్వించింది సబ్బాయి.

దాని శరీరం నుంచి కస్తూరి కలిపిన సుగంధపు వాసన వస్తోంది. వక్షంపైని రవ్వల హారం ఛళుక్కున్న కదిలింది. దాని శరీరపు కదలికలు బాలచంద్రుణ్ణి ఆకర్షిస్తున్నాయి.

బాలచంద్రుడి తలను తన వక్షస్థలంపై గట్టిగా అదుముకుని “ఈ క్షణం శాశ్వతమైతే ఎంత బాగుణ్ణు” అన్నది.

“నిజమే…” అన్నాడతను.

సబ్బాయి గదిలో సుఖాలను అనుభవిస్తున్న బాలచంద్రుడికి గడప దగ్గర తన కోసం వేచివున్న తమ్ముళ్ళ విషయం గుర్తుకురావడం రాలేదు.

“ప్రభూ!”

“ఏమిటి?”

“మీరు నన్ను మర్చిపోయారనుకున్నాను. ఐదు రోజుల్నుంచీ మీరు రాక కంటికి కునుకులేక నేను పొందిన దుర్భర బాధ తమరికి ఏమని విన్నమించుకోను? ఈ శరీరం మీ కోసం. ఈ బ్రతుకులోని వెలుగు మీరు. ఇంతకన్నా ఏం చెప్పను?” అన్నది.

వీరులు తుచ్ఛ కాముకులు కాకూడదని ఎక్కడున్నది?

బాలుడు సబ్బాయిని ఇంకా గాఢంగా హత్తుకున్నాడు.

“నేను వెళ్ళబోయే ముందే ఏం కావాలో అడుగు!” అన్నాడు.

“నా బ్రతుకు మీకే అంకితమయింది. ఈ శరీరం బాలచంద్రుడుది. ఇంకొకర్ని అంటదీ తనువు. నేను వెలకాంతనైనా ‘కులకాంత’గా బ్రతకాలనుకుంటున్నాను. మీరు నాకు మీ ఇష్టమొచ్చినంత ఇవ్వండి. ముసలిది బ్రతుకుతుంది. తాళి కట్టిన మీ ఇల్లాలితో బాటు నాకు ఈ చరిత్రలో కొంత పేరును నిలిచిపోనివ్వండి. ఇదే నా ఆఖరు కోరిక! మీరు ఎక్కడ వుంటే అక్కడే నా బ్రతుకు” దాని మాటలు నమ్మి – అపార ధనరాసులను కుమ్మరించి, దాన్ని వెంట బెట్టుకుని బయల్దేరబోయాడు.

వాకిట్లోకి వచ్చిన బాలచంద్రుణ్ణి వీరుడైన బ్రాహ్మణ అనపోతు అడ్డగించి “ఈ తుచ్ఛ స్త్రీ కోసం మాన మర్యాదలను మంటగల్పుకున్నావు. పాము పెంపు, వగలాడి వలపు ప్రమాదకరమైనది. ప్రేమతో అమ్మ ఇచ్చిన ధనాన్ని ఈ రంకులాడికి ధారపోశావు. క్షణికమైన కామం కోసం బాలచంద్రుడు స్త్రీ ప్రలోభి అనే పేరు స్థిరం చేసుకొన్నావు. వీరుడైనవాడు కత్తి పదునుతో కాలం గడపాలి కానీ వేశ్యల ఇంట చిక్కిపోకూడదు. యాచకులు నీ కోసం ఎదురుచూస్తున్నారు. వారికేమిస్తావు? వీరులు వీరగీతాలు పాడుతున్నారు. ఎప్పుడు కదులుతావు?’ అని అవేశంగా అడిగాడు.

బాలచంద్రుడు క్షణం బాధపడి, సబ్బాయిని అక్కడే వదలి బయల్దేరాడు. మెడలోనున్న విలువైన చంద్రహారాన్ని అమ్మి, యాచకులకు దానధర్మాలు చేసాడు. వీరగీతాలు పాడుకొంటూ తమ్ములతో బయల్దేరాడు.

**********

తల్లికిచ్చిన మాట ప్రకారం అత్తవారింటికి వచ్చాడు బాలచంద్రుడు.

బాలచంద్రుడు ఇక్కడికి రాకముందే ఐతాంబ కోడలు మాంచాలను చూడ్డానికి వచ్చింది. వియ్యపురాలు రేఖాంబ ఎదురొచ్చి “వదినగారు క్షేమమా? అని స్వాగతించింది.

అత్తగారు వచ్చిన మాటవిన్న మాంచాల పన్నీటి పాద్యం తెచ్చి పాదాలు కడిగి నమస్కరించింది. కుశల ప్రశ్నలు వేసింది.

కాసేపు యోగక్షేమాలయ్యాక ఆమె మాంచాల వైపుకు తిరిగి “ఎల్లుంది ప్రొద్దున మీ ఆయన కారెంపూడి రణక్షేత్రానికి వెళుతున్నాడు. వెళ్ళయ్బోయే ముందు ఇక్కడి కొస్తాడు.” అన్నది.

“తోవ తెలియదేమో!” అన్నది మాంచాల.

ఐతాంబ కళ్ళలో నవ్వులు పూయించి – “చిన్నతనంలో తెలియక దారి తప్పిన నీ భర్తను యుద్ధానికే పంపుతావో, నీ కొంగున ముడే వేసుకుంటావో నీ ఇష్టం” అన్నది.

మాంచాల స్థిరమైన స్వరంతో “అదికాదు అత్తా! తొలిరాత్రైనా నేను చూడలేదే! మా పెళ్ళైన తర్వాత ఒక్కసారైనా నన్ను తల్చుకున్నారా? నేను భార్యనన్న విషయం ఆయనకు గుర్తుందా? నా పేరైనా తెలుసా? సానికొంపలో గడిపిన నా భర్తను ఏడేళ్ళ తర్వాత ఎట్లా గుర్తు పట్టను” అని “గండు”వారి గారాల పడచు మాంచాల పలికితే –

ఐతాంబ మనసులో సంతోషించి – “కారెంపూడికి వెళ్ళకుండా బాలుణ్ణి నిలపగల సామర్థ్యం నీకొక్కదానికే వుంది. ఆనక నీ ఇష్టం” అంది.

పెళ్ళైన చాలా కాలానికి అల్లుడు తమ ఇంటికి వస్తున్నాడని రేఖాంబ బ్రాహ్మణ పుణ్యస్త్రీలతో ఎదురుపడింది. బాలచంద్రుడు అత్తగారింట స్నేహితులతో బాటుగా అడుగుపెట్టాడు. రంగవల్లులతో, రంగరంగ వైభోగంగా అలంకరించబడిన ఆ ఇంట శృంగార లక్ష్మి తాండవిస్తున్నట్లు అనిపించింది బాలుడికి.

సోదరులతో ఉచితాసనాలను అలంకరించిన బాలచంద్రుడు తన భార్యను చూడాలని లోలోనే తపించిపోతున్నాడు.

పరిమళ గంధాల పన్నీరు జలకమాడి, చీనిచీనాంబరాలను ధరించి, వెలగల విలువైన నగలు పెట్టుకుని, సముద్ర మథనంలో ఉద్భవించిన మహాలక్ష్మిలాగా వున్న మాంచాల, తల్లి పాదాలకు నమస్కరించి – “అమ్మా! చిన్నతనంలో నా భర్తను చూడలేదు. పెద్దయ్యాక ఆయనొక్కసారైనా నా దగ్గిరకు రాలేదు. ఇప్పుడేమో ఎన్మిది మంది వచ్చారని విన్నాను. వారిలో నా భర్తను ఎలా గుర్తుపట్టేది?” అని అడిగింది.

ముగ్ధత, ఉత్సాహం, అయోమయం కలగలసిన కూతురి ముఖాన్ని చూసి, స్వరాన్ని విని మురిసిపోయింది రేఖాంబ. భుజంపై చేయివేసి, చుబుకాన్ని పుణికిపుచ్చి – “భార్య రాగానే నిలబడని వాడే భర్త. నువ్వు వెళ్ళగానే ఎవరు నిలబడలేదో వారికే నమస్కరించు. అతనే నీ బాలచంద్రుడు” అని చెప్పింది.

ఏడువారాల నగలు పెట్టి, తన పనితనంతో బ్రహ్మ సృష్టించాడా అన్నంత అందంగా, సిగ్గుల మొగ్గై వస్తున్న భార్యను చూసి మతిపోయిన బాలచంద్రుడు – “ఇంతకాలం ఎంత తప్పు చేశాను?” అని లోలోనే గతుక్కుమన్నాడు.

తను మందిరంలోకి వచ్చాక, అక్కడున్న ఎనిమిది మందిలో ఆరుగురే లేచి నిలబడ్డం గమనించింది మాంచాల. కూర్చునేవున్న ఆ ఇద్దరూ యుద్ధరంగానికి వెళుతున్న వీరుల వస్త్రధారణలో ఒకే రకంగా ఉన్నారు. ఆ ఇరువురిలో తన భర్త ఎవరని పాలుపోలేదు మాంచాలకు. ధైర్యం చేసి, అడుగులు ముందుకేసి ఓ వీరుని పాదాలను అంటబోయింది.

అతను చప్పున నిలబడి – “తల్లీ! క్షమించు. నేను అనపోతను. మిగిలిన తమ్ముళ్ళతో బాటూ నేను నిలబడాల్సింది. కానీ బ్రాహ్మణున్ని గనుక కూర్చుండిపోయాను. ఇదిగో, ఇతడే నీ భర్త, బాలచంద్రుడు. ఇతనికి నమస్కరించు.” అని అన్నాడు.

మాంచాల దించిన తల ఎత్తకుండా – “నా పూజల్లోని లోపమో, లేక చిన్నతనంలోనే పెళ్ళవటం మూలానో నా భర్తను త్వరగా గుర్తించలేకపోయాను. కానీ, బ్రాహ్మణుల్ని పూజిస్తే, భగవంతుణ్ణి పూజించినట్టేనని పెద్దలు చెప్పగా విన్నాను. మీకు నమస్కరించి, నా పూజల్లోని లోటు సరిదిద్దుకున్నాను. భర్త ఇంటికి రావడం కన్నా కులసతికి పండుగ ఉండదు. ఇలాంటి శుభసందర్భంలో మీవంటి ఉత్తమ బ్రాహ్మణులకు మొదట నమస్కరించడం తప్పుకాదనుకొంటాను.” అని అన్నది.

మాంచాల ముగ్ధ భక్తికి చలించిన అనపోతు మనసారా దీవించాడు.

తొలిసారిగా కలుసుకున్న భార్య భర్తలను ఒంటరిగా వదిలిపెట్టి మిగిలినవాళ్ళంతా బైటకు నడిచారు. వెళుతూ వెళుతూ, వదినగారిని మనసులో ఉంచుకుని యుద్ధాన్ని మరవొద్దని హెచ్చరించాడు అనపోతు. “బాలచంద్రా! మనకు ఏడు ఘడియల కాలమే ఉంది. అటుపై కారెంపూడికి బయలుదేరాలి” అని అన్నాడు అనపోతు.

బాలచంద్రుడు నవ్వి – “చెన్నకేశవుని మీద ఆన. మీరు నిశ్చింతగా ఉండండి. రేపు ఉదయం, సూర్యోదయానికి ముందే మనం కారెంపూడికి వెళ్దాం” అన్నాడు.

సశేషం…

You may also like...

Leave a Reply