అధ్యాయం 30 – పల్నాటి వీరభారతం (చివరి భాగం)

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

క్రితం భాగంలో: బాలచంద్రుడు తన తమ్ముళ్ళతో కలిసి, కాలరుద్రుడిలా రణరంగంలో చెలరేగుతాడు. అసహాయశురుడై విజౄంభిస్తాడు. అతను, అతని తమ్ముళ్ళ ధాటికి తట్టుకోలేక నలగాముని సైనికులు పలాయనం చిత్తగిస్తారు. ఒక్కణ్ణి చేసి బాలుణ్ణి మట్టుబెట్టాలని తలచిన నరసింగరాజు తన సైనికుల్లో ధైర్యాన్ని నింపి యుద్ధానికి వస్తాడు. కానీ అతని ఎత్తుగడ ఫలించక నలగాముని శిబిరంలో దాక్కుంటాడు. నరసింగుని వంటి వాడి శిరస్సును ఖండించి తీసుకొస్తాడు బాలచంద్రుడు. అది నరసింగుని తల కాదని బ్రహ్మన్న చెప్పడంతో మళ్ళీ యుద్ధభూమికి వస్తాడు.

Click here to download eBook of Palnati Veerabharatam

ప్రస్తుత భాగం:

బాలచంద్రుడు కాసెగట్టి, గోచిపెట్టి “సామంత రాగోల” అనే భయంకరమైన ఆయుధాన్ని చేత ధరించి యుద్ధరంగంలోకి చిచ్చరపిడుగులా మళ్ళీ దూకాడు.

ఐతే బాలచంద్రుని వదిలి అతని తమ్ములు ఎన్నడు ఉండలేదు. బాలచంద్రుడి వెంటే వున్నారన్నది నిర్వివాదాంశం. అవక్రపరాక్రమంతో రెండవ బాలచంద్రుడిలా విజృంభించినవాడు వెలమల దోర్నీడు. బాలుడు ‘సామంత రాగోల’మనే ఆయుధాన్ని పట్టుకుంటే, అతని తమ్ముళ్ళు గదలు ధరించారు. మదమెక్కిన సింహాల్లా శత్రువుల మీదకు దూకారు. దెబ్బతిన్న బెబ్బులుల్లా వీరవిహారం చేసారు.

రణక్షేత్రంనుంచి నరసింగుడు తప్పుకుంటే బాలుడు పెద్దగొంతుతో ఇట్లా పిలిచాడు – “పిరికిపంద నరసింగుడెక్కడ్రా? వీరుడైతే – వీరరక్తం వుంటే నా ఎదుట రమ్మనండి. చేవచచ్చిన చవట! ప్రాణభయంతో పారిపోయాడు.”

బాలచంద్రుడి ఆడిన మాటల్ని చారుల ద్వారా తెలుగుకున్న నరసింగుడు పౌరుషం తెచ్చుకుని చాలామంది సైనికుల్ని వెంటబెట్టుకుని యుద్ధరంగానికి వచ్చాడు.

నరసింగును చూచిన బాలుడు – “మా అలరాజును చాటుగా చంపిన చవటా! రా! బాహాబాహీ పోరాడుదాం!” అన్నాడు.

నరసింగును కాపాడటానికి వచ్చిన కేరళ రాజు, కుమ్మరి పట్టి చేతుల్లో చచ్చాడు. కర్నాటరాజు కంఠాన్ని దోర్నీడు నరికాడు. మాళవరాజును మంగలి మల్లుడు వేటుకు కూల్చాడు.

అదే క్షణాన బాలచంద్రుడు, నరసింగరాజు ఎక్కిన భద్రగజ కుంభస్థలం మీదకు ఎగిరి దూకాడు. దూకి, సామంతరాగోలతో ఒక్క పోటు పొడిచాడు. నరసింగునికి భుజం భగ్గుమన్నట్టైంది. చూసుకుంటే – రక్తం చిమ్ముతోంది. కత్తివేటు వేసాడు నరసింగు. తప్పుకున్నాడు బాలుడు. రెండు గడియల సేపు జరిగిన ఈ భయంకర యుద్ధాన్ని అటు-ఇటు వీరులు తమ తమ పోరాటాల్ని ఆపి మరీ చూసారు. బాలుడు రానురాను పెచ్చు పెరిగిపోతుంటే, నరసింగు నిర్వీర్యమైపోతున్నాడు.

బాలచంద్రుడు సామంతరాగోలతో నరసింగుడి పొట్టన పొడిస్తే, పేగులు ఆయుధాన్ని చుట్టుకుని బైటకువచ్చాయి. గుండెల్లో గుచ్చితే, గుండె రెండుగా చీలి, వీపు వెనక్కు వచ్చింది. ఆ తర్వాత వేటుకు తల నరికితే, ఏనుగు మీదే ప్రాణం విడిచాడు నరసింగరాజు. అతని చరిత్ర అట్లా అంతమైపొయింది.

**********

 

మలిదేవుడి సమక్షంలో బ్రహ్మనాయుడు కూర్చుని వుండగా, తెగనరికిన నరసింగరాజు తలను తీసుకెళ్ళి చూపించాడు బాలచంద్రుడు.

అనుగురాజు మరణం తర్వాత నరసింగరాజును తన గుండెల మీద వేసుకొని పెంచాడు బ్రహ్మన్న. ఆఖరుకి తన పుత్రుడి చేతిలో నరసింగుడు మరణించడం భగవంతుని లీలగా భావించాడు బ్రహ్మన్న. ‘బలీయమైన విధి నిన్ను ‘విధిగా’ ఈ విధంగా బలి తీసుకున్నదా నాయనా’ అని ఆక్రోశించాడు. ‘నీ అన్నదమ్ములు, అసంఖ్యాక బలగం మధ్యలో నీ చావు ఇట్లా వ్రాసిపెట్టబడివుందా?” అని అన్నాడు.

అంతట బాలచంద్రుడు చిరునవ్వు నవ్వితే, కుపితుడైన బ్రహ్మన్న – “బాలచంద్రా! గొప్ప వీరుణ్ణనుకుంటున్నావా? సిగ్గులేకపోతే సరి! నీ మూలాన ఈ యుద్ధం వచ్చి దాపురించింది. పిలవని పేరంటంగా వచ్చి ఈ పవిత్రభూమిని రక్తమయం చేసావు. దొంగచాటుగా వేటువేసి నరసింగుని చంపావు. దుర్మార్గుడా!” అన్నాడు.

బాలచంద్రుడు మండిపడి “పేరిందేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను! అలరాజు ఆత్మకు శాంతి చేకూర్చాను. అసలు ఈ యుద్ధానికి కారణం నువ్వు! నువ్వే మలిదేవుని పెళ్ళి పిలుపుకు వెళ్ళి మెత్తని ప్రభువు ఆజ్ఞ జవదాటడనే గర్వంతో కోడిపందానికి ఒప్పుకొని ప్రభువుల్ని అరణ్యాల పాలుజేసావు. భట్టును రాయబారానికి పంపక అలరాజును పంపి నాగమ్మ కుతంత్రానికి బలిపెట్టావు. యుద్ధరంగానికి కదలి వచ్చి, ఇప్పుడు ధర్మాలు ఉపదేశించావు! పనులన్నీ నీవు చేసి నా మీద నిందలు మోపటం తగదు! నరసింగుని వీరోచితంగా యుద్ధం చేసి చంపాను. నేను ముమ్మాటికీ వీరుణ్ణే!” అన్నాడు.

“ఛీ! పిరికిపందా! ఒక్క శత్రువు చంపి, తలపట్టుకుని వచ్చి, నీ వీరత్వాన్ని ప్రచారం చేసుకుంటున్నావే! యుద్ధం ఇంకా జరుగుతూనేవుంటే పేరు కోసం ఆశపడి శత్రువుకు వెన్నిచ్చి వస్తావా?” అన్నాడు బ్రహ్మన్న.

బ్రహ్మన్న పలికిన హీనమైన మాటలకు కించపడి బాలచంద్రుడు మళ్ళీ యుద్ధరంగానికి పరుగెత్తాడు.

అప్పటికే చాలా ఘోరాలు జరిగిపోయాయి.

వీరులైన సోదరులలో ఒక్కరూ జీవించిలేరు. కారెంపూడి రణక్షేత్రంలో రణచండి కాళ్ళకు తమ రక్తంతో పారాణిని అద్ది వెళ్ళిపోయారు. కలకాలం చెప్పుకోగల వీరగాధలుగా మిగిలిపోయారు.

తనను నమ్ముకుని వచ్చిన, తనలో తాముగా పెరిగిన ఆరుగురు సోదరులు మరణించాక, బాలచంద్రుడి ఉద్రేకానికి అంతులేకుండా పోయింది. చేత దొరికిన ఆయుధంతో అడ్డువచ్చిన ప్రతివాణ్ణి నరికాడు.

వీర అభిమన్యుణ్ణి తలచుకొని యుద్ధం చేసాడు. ఒకడు దొంగచాటుగా బల్లెంతో బాలుడి కడుపులో పొడిచాడు. బాలుడు బాధను ఓర్చుకుని, దాహంతో గంగధార మడుగుకు వచ్చి, నీరు త్రాగి, బైటకొచ్చిన ప్రేవుల్ని లోపలి దోసి, అవి కదలకుండా నడుముచుట్టూ ఉత్తరీయాన్ని బిగియగట్టి మళ్ళీ యుద్ధరంగంలోకి ఉరికాడు.

సాయం సూర్యుడు పడమట కొండ చాటున దాగి, బాలుణ్ణి ఒంటరిని జేసి దొంగ దెబ్బలతో కొడుతున్న వైరి వీరుల్ని చూసి, తలవంచుకున్నాడు.

ఆంధ్ర వీరభారతి కన్న అపురూప వీరుడు, బాలచంద్రుడు, భగవంతునిలో కలిసిపోయాడు.

సూర్యుడు అస్తమించిన తర్వాత, లోకం చీకటిని కప్పుకుంది. కన్ను తెరచినా కనిపించని గాఢాంధకారం! బాలచంద్రుడి మరణవార్త విన్న పెదమలిదేవుడు పసిపిల్లవానిలా కంటికి కడివెడుగా ఏడ్చాడు.

బ్రహ్మన్న కడుపులో మంట మండుతున్నది.

(బాలచంద్రుడి వీరమరణం తర్వాత ఒక “దీర్ఘ నిశ్వాసం” విడుస్తూ కవి చక్రవర్తి జాషువా గారు, తమ ఖండ కావ్య సంపుటిలో ఇలా వ్రాసారు..

“నాయకురాలి మాయ కదనంబున, మా పలనాటి పౌరుష

 శ్రీ యడుగంటె? గడ్డి మొలిచెం బులిచారల గద్దె మీద; గెం
 జాయ మొగాన గ్రమ్మ జలజ ప్రమదామణి నాగులేటిపై
 వాయుచున్న దిప్పటికి బాలుని శౌర్య కథా ప్రబంధముల్ “

పల్నాటి చరిత్ర జరిగిన ఇన్నేళ్ళకు సమీక్ష చేస్తే కనిపిస్తున్న నగ్నసత్యమిదే.)

భర్త మరణవార్త మేడపిలో విన్న వీరపత్ని మాంచాల పురుషవేషం ధరించి, జాతి గుర్రాన్నెక్కి, ఆఘమేఘాల మీద యుద్ధభూమికి వచ్చి, రణరంగంలో ప్రళయకాళికలా విజృంభించి, బరిసెపోటుకు నేలకూలి భర్త ప్రక్కకు దొరలుకుంటూ వచ్చి మరణించింది.

మాంచాలవంటి వీరపత్నుల రక్తంతో తడిసి పునీతమైన ఈ పుణ్య తెలుగుభూమిలో పుట్టినందుకు గర్వించని తెలుగువాడెవ్వడు? గౌరవంతో తల వాల్చి తల యూచని వాడెవ్వడు?

వీరత్వం నివాళిపట్టిన తెలుగు ఆడపడచుల కథలను విని కరుగని తెలుగు గుండె కలదా?

మాంచాల మరణమొక కథగా ఆచంద్రతారార్కం అట్లా నిలిచిపోతుంది.

(ఐతే – అనపోతు బ్రతికివుంటే బాలచంద్రుడు మరణించేవాడు కాదేమో? అనే ప్రశ్న వస్తుంది. కానీ అట్లా జరుగలేదు కదా!)

**********

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *