అధ్యాయం 29 – పల్నాటి వీరభారతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

క్రితం భాగంలో: బాలచంద్రుడు సంధికి ఒప్పుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు బ్రహ్మన్నాదులు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. అన్న బాలచంద్రుడు తనను యుద్ధానికి రావొద్దన్నాడన్న వ్యథతో ఆత్మహత్య చేసుకుంటాడు అనపోతు. మాచెర్ల వీరులకు ఆహారపదార్థాలను తీసుకువచ్చే “మాడచి” నుంచి ఆ వార్త విన్న బాలచంద్రుడు ఆవేశం పూని మాచెర్ల వీరులను పేరుపేరునా పిలుస్తాడు. వీరాలాపాలతో వాళ్ళలో కసిని పెంచుతాడు. దాంతో సంధికి వచ్చిన నలగాముని రాయబారులు “యుద్ధం తప్పద”న్న వార్తను మోసుకెళతారు. నలగాముడు తన సేనల్నిసమాయత్త పరుస్తాడు.

ప్రస్తుత కథ:

ఇరుపక్షాల సేనలూ సమాయత్తమైనవి. జరగబోయే దానికి విచారించి ప్రయోజనం లేదని తెల్సుకున్న నలగాముడు, తన సేనలను సమాయత్తం చేసుకున్నాడు.

వీరులైన ఆరుగురు తమ్ములనూ పేరుపేరునా పిలిచాడు బాలచంద్రుడు.

 “కదలరా కదలరా, కమ్మర్ల పట్టి
  కత్తుల్తొ కుత్తుకలు తరగాలి నువ్వు
  కంసాలి చందుడా – కరుణ మాటే వలదు
  కదనరంగమ్ములో కాలుడివికమ్ము
  కుమ్మర్ల తమ్ముడా, కూరిమి సఖుడా
  అడ్డు వచ్చినవారి గుండెల్ని చీల్చు
  మంగలి మల్లుడా, మగవారి మగడా
  మధ్యందిన మార్తాండుడివి కమ్ము
  చాకలి చందుడా చేవగల్గినవాడా
  చేత కుంతమ్ము ధరియించి రమ్ము
  వెలమల దోర్నీడా, వేయి వీరుల సమమా
  వీరరక్తము త్రాగి – విహరించు తండ్రీ
  వీరులారా రండి, విజయమ్ము మనది
  శూరులారా రండి, శుభమౌను మనకు”

బాలచంద్రుడి పలుకులు విన్నాక అన్న ఆజ్ఞను శిరసా వహించి తమ్ములు యుద్ధరంగంలోనికి దూకారు.

ఐతే అతన్ని యుద్ధ విముఖుణ్ణి చేయటానికి పెద్దలైనవారంతా ప్రయత్నించారు కానీ, బాలుడు అందరి మాటనూ పెడ చెవినబెట్టి –

“పేరమ్మ తుది కోర్కె తీర్చాలి. నరసింగుని తలను కొట్టాలి! నేను బ్రహ్మనాయుడి కొడుకును ఐతే – ఐతాంబ నోముల ఫలాన్నే ఐతే, చెన్నకేశవుని వరప్రసాదిని ఐతే, ఆడినమాట తప్పని, శీలంవారి బాలుణ్ణే ఐతే – ఈ మాటను నెరవేర్చి నా చెల్లెలు పేరమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యను. ఆమె ఆఖరు కోరిక తీర్చి, పైలోకంలో వున్న ఆమె ఆత్మశాంతి చేకూరుస్తాను.” అన్నాడు.

ఆటుపోటులున్న సముద్ర రాకిడిని భరించలేనట్లు, బాలచంద్రుడి పౌరుషాన్ని చూడగానే ఇక యుద్ధం అనివార్యమని నిశ్చయమైపోయింది.

 

 

 

కొమ్మరాజు బాలచంద్రుణ్ణి సమీపించి – “నాయనా! బాలచంద్రా – నీవు మహావీరుడివి. నిన్ను మించిన మహావీరుడు పల్నాటినాట ప్రభవించడు. నిన్ను కన్నతల్లి అదృష్టవంతురాలు! వరహాల బిడ్డను కన్నది. ఐనా నీవు చిన్నవాడివి! యుద్ధరంగంలోని కిటుకులూ, కీలకాలూ నీకు తెలియవు.

నా మాట విను! చిన్నవాణ్ణి చేసి, నిన్ను ఒక్కుమ్మడిగా – ఒక్కణ్ణే చేసి, సంహరించాలని శత్రువులు ప్రయత్నిస్తారు. రణరంగలక్ష్మి రత్కస్నానం చేస్తానంటుంది. తండ్రిలాంటి వాణ్ణి నేను చెప్పింది విను. మహావీరులైన వాళ్ళకే ఒక్కోసారి వళ్ళు జలదరించే సంఘటనలు జరుగుతాయి.” అన్నాడు.

ఆ మాటలకు ఫక్కున నవ్వి బాలచంద్రుడు – “కొమ్మరాజా! నీ హితవులు విననందుకు నన్ను నిందించు! రణలక్ష్మి నన్ను ఆవహించివుంది. నాలోని పగ మంటలా మండుతున్న అలనాటి అభిమన్యుడి వలె గురజాల వీరుల గుండెల్లో నిద్రపోతాను.మొక్కవోని ఇంద్రుని వజ్రాయుధంలా, అలరాజు ఇచ్చిన కత్తి నా దగ్గర వున్నది!కారడవిని చిన్న నిప్పు రవ్వ మండించటం లేదా? నేను అంతే! నిప్పురవ్వనై రాజి,రాజి రగిలిరగిలి, జాజ్వల్య ప్రకాశమానమైన మంటనై, గురజాల సైన్యమనే కారడివిని మండిస్తాను. పిరికివాళ్ళ జోలికిపోను. కేవలం వీరులతోనే యుద్ధం చేస్తాను. ముందు నరసింగరాజు తలదరిగి, చరిత్రలో చిరకాలం నిల్చిపోతాను. వీరులు బ్రతికి సుఖాల్ని అనుభవిస్తారు. చచ్చి స్వర్గాన్ని పొందుతారు.” అన్నాడు.

బ్రహ్మన్న తన వీరుల్ని చూసి – “లాభం లేదు. చేయి జారింది. బాలుణ్ణి ఆపలేం. యుద్ధం వచ్చి గొంతు మీద కూర్చున్నది. కత్తి పదును మీద మెరుస్తున్నది. వీరులారా వినండి – యుద్ధం జరుగబోతున్నది. బాలుడు నాందీగీతం పాడాడు. భరతవాక్యం ఎవరు, ఎట్లా పలుకుతారో తెలియదు. ఇది దివ్యపుణ్యభూమి! పావన నదీనదాలతో పునీతమైన పుణ్యస్థలి! వీరులు జన్మించిన వీరభూమి! వీరమాతలు ప్రభవించిన నేల ఈ నేల! యుద్ధరంగం నుంచి తిరిగివచ్చిన భర్తలకు రక్తపారాణి దిద్దిన వీరవనితల గన్న దేశం ఇది! మన మీద వైరంతో నాగమ్మ మనలను అష్టకష్టాల పాలు జేసింది.

కొన్ని రణరంగ సూత్రాలున్నాయి. చేత ఆయుధం లేనివాణ్ణి చంపకండి.పారిపోయేవాణ్ణి క్షమించండి. పుట్ట ఎక్కినవాణ్ణి కొట్టకండి. శరణు అన్నవాణ్ణి కాపాడండి. వృద్ధులను గౌరవించండి. స్త్రీలను చంపకండి.

వీరులారా…బయల్దేరండి…మాచెర్ల ప్రభువులకు విజయం చేకూర్చండి.” అన్నాడు.

వీరులు యుద్ధసన్నద్ధులై కదలసాగారు.

బ్రహ్మన్న బాలచంద్రుడి భుజం మీద చేయివేసి – “నాయనా! కాలం నీ మీద మహత్తరమైన భారాన్ని మోపింది. దాన్ని నీ అవక్ర పరాక్రమంతో నిర్వర్తించు. యుద్ధంలో వెనకా ముందులు జాగ్రత్తగా చూసుకో. చాటు దెబ్బలు వేసే చవటలుంటారు. శత్రువుకు వెన్నివ్వకు! అది క్షాత్రం కాదు. రణరంగంలోని కేకలకు చెయ్యి కంపించరాదు. మాచెర్ల చెన్నకేశవుడు నీకు రక్ష! ఈ పుడమితల్లి నిన్ను సదా కాపాడుగాక!”

బాలచంద్రుడి తండ్రి పాదాలను తాకి “తండ్రీ! మీ పేరు నిలుపుతాను.” అని యుద్ధరంగం వైపు కదిలాడు.

 

You may also like...

Leave a Reply