అధ్యాయం 28 – పల్నాటి వీరభారతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

క్రితం భాగంలో: యుద్ధరంగానికి వచ్చిన బాలచంద్రుడు, వీర కన్నమ తొడను తొక్కి, లంఘించి, మలిదేవుడి సమక్షంలోకి వచ్చి వ్రాలి, సంధికి ఒప్పుకున్న పెద్దలను ధిక్కరిస్తాడు. బాలుడి వీర వచనాల్ని విన్న మాచెర్ల వీరుల్లో పగ రగులుకుంటుంది. సంధి కాదు, యుద్ధమే కావాలని నినదిస్తారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన బ్రహ్మన్న, బాలచంద్రుడితో ప్రత్యేకంగా మాట్లాడాలని మరో గుడారంలోకి పిలుచుకెళతాడు.

ప్రస్తుత కథ:

బ్రహ్మనాయుణ్ణి అనుసరించి వాళ్ళంతా ఒక గుడారంలోకి వెళ్ళారు. అందరినీ కూర్చోమని చెప్పి బ్రహ్మనాయుడు బాలచంద్రుడి ముఖంలోకి చూసి – “నాయనా! బాలచంద్రా! యుద్ధం సంగతి అట్లా వుంచు. మేడపిలో అంతా బావున్నారా?”

“ఆ”

“మీ అమ్మ ఐతాంబ క్షేమమా?”

“ఊ”

“నీ భార్య మాంచాలను చూసి వచ్చావా?”

“ఆ”

“ఆ గుణవతి క్షేమమేనా?”

“ఊ”

బాలచంద్రుడి కోపం సగం తగ్గింది. మేడపిలో విషయాలు చాలా అడిగి అడిగి అతన్ని ప్రశాంతవంతుణ్ణి చేసాడు బ్రహ్మన్న.

అప్పుడే కొమ్మరాజు బాలచంద్రుడి వైపు చూసి – “నాయనా! మరణించిన అలరాజు మరల తిరిగిరాడు కదా! అందుకే ఆ రాయబారానికి ముందు నిన్ను నేను దత్తత తీసుకున్నాను. మా వంశానికి మిగిలిన వాడివి నువ్వొక్కడవే నాయనా!” అన్నాడు.

బ్రహ్మన, కొమ్మన చెప్పిన మాటలు విని, ప్రశాంతచిత్తుడైన బాలచంద్రుడు “పెద్దలయిన వాళ్ళు, ధర్మసూత్రం తెలిసిన రాజనీతిజ్ఞులు చెప్పారు గనుక ఒప్పుకుంతున్నాను. సంధి నాకు, నా సహోదరులకు సమ్మతమే. కానీ ఇది మా ఆఖరి హెచ్చరిక! ఇక మీద, నాగమ్మ నయవంచన చేసినా, అసందర్భ ప్రలాపాలు పల్కినా క్షమించము!” అన్నాడు.

ఇరుపక్షాలకు సంధి కుదిరిందని తెల్సిన అటువారు, ఇటువారు చాలా సంతోషపడ్డారు.

సంధి కుదిరిందన్న వార్త అంచెలంచెలుగా పల్నాడంతా పాకిపోయింది.

 

బాలచంద్రుడి ఆజ్ఞ ప్రకారం అనపోతు మాంచాల ఇంటికి వచ్చేసరికి ప్రొద్దు వాటారబోతున్నది.

“వదినా! మా అన్న బాలచంద్రుడు పంపగా వచ్చాను. అన్న విశ్రమించిన పట్టుతల్పం తలగడ క్రింద చంద్రహారము, ముద్దుటుంగురమూ మర్చినాడత. నన్ను పట్టుకురమ్మన్నాడు” అన్నాడు.

మాంచాల అనపోతు వంక చూసి – “మరిదీ! మీ అన్న ఇక్కడ ఏమీ మరవలేదు నాయనా!” అంది.

అనపోతు విచార వదనంతో “వదినా! మీకు ప్రణామం. వెళ్ళొస్తాను” అన్నాడు.

“ప్రొద్దుపోయింది మరిదీ!” అన్నది మాంచాల.

“అన్నగారి ఆజ్ఞ దాటటానికి వీల్లేదు. వెంటనే వెళ్ళాలి” అని గుర్రమెక్కి మేడపి వైపు బయల్దేరాడు.

సాని సబ్బాయి ఇంటికి వెళ్ళేసరికి మధ్యరాత్రయింది. వెళ్ళి తలుపు కొడితే సబ్బాయి “ఎవరు?” అంది.

“నేను, అనపోతును”

వాకిలి తీసి, “ఇంత రాత్రప్పుడు వచ్చారేమిటి?” అంది.

“నీతో పనుండి”

“లోని వచ్చి కూర్చోండి”

“కూర్చునే సమయం లేదు. మా అన్న బాలచంద్రుడు నీ పడక గదిలో చంద్రహారమూ, ముద్దుటుంగరమూ మర్చిపోయి వచ్చినాడంట. నన్ను పంపాడు. వేగిరం వాటిని ఇవ్వు. నేను వెళ్ళాలి” అన్నాడు.

సబ్బాయి ఫక్కున నవ్వితే, కుపితుడైన అనపోతు “ఏమిటా నవ్వు?” అన్నాడు.

సబ్బాయి నవ్వాపి “బ్రాహ్మణుడవైన నిన్ను యుద్ధానికి రాకుండా చెయ్యడానికి ఎత్తిన ఎత్తుగానీ, మీ అన్న ఇక్కడ ఏమీ వదిలిపోలేదు. నీవు యుద్ధరంగంలోకి రావొద్దంటే బాధపడతావని నీ ముఖాన చెప్పలేక ఇటువంటి పన్నాగం పన్నాడు బాలచంద్రుడు” అన్నది.

అనపోతు ఆలోచనలో పడి “వెళ్ళొస్తా” అని చెప్పి గుర్రమెక్కి, ఆఘమేఘాల మీద కారెంపూడి వైపుకు బయల్దేరాడు. రాత్రితో బాటు అనపోతు ప్రయాణమూ గడుస్తున్నది. క్లిష్టతరమైన మార్గంలో మసక వెన్నెల్లో ప్రయాణం చేయవలసి వచ్చింది.

త్రిపురాంతకం పొలిమేరల్లో వుండగా, బాలభానుడి రంగులు తూర్పున మేఘాల అంచుల మీద ఎర్రరంగు పూస్తున్నాయి. ఉదయం లేత వెలుగులు పర్చుకుంటున్నది. ఎదురొచ్చిన కాపు సమూహాన్ని ఆపి “ఇటు గుర్రాల మీద వెళుతూ, వీరులెవ్వరైనా కనిపించారా?” అని అడిగాడు అనపోతు.

“లేదు” అన్నారు వాళ్ళు.

గుర్రం అలసి, నోట నురగలు కక్కుతున్నది. నిన్న ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో సరిగ్గా అక్కడే ఆగాడు అనపోతు. నిద్రలేమితో మందుతున్న కళ్ళను తుడుచుకున్నారు. గుర్రం సెలయేటిలో నీరు త్రాగి, పసరికను తింటున్నది.

తిన్నె మీద కూర్చున్న అనపోతుకు కొమ్మకు వ్రేలాడుతున్న రావి ఆకు కనిపించింది. దాన్ని లేచి నిలబడి అందుకున్నాడు. తనను ఉద్దేశించి వ్రాసిన పత్రమది. దాన్ని చూడగానే అనపోతు గుండెలో అలవికాని జ్వాల రేగింది. బ్రాహ్మణుడిగా పుట్టడం వల్ల, కారెంపూడి రణ్క్షేత్రం తనని నిరాకరించిందని వీరుడైన అనపోతు చాలా ఖేదపడి – “అన్నా! బాలచంద్రా! నన్ను ఎంత మోసం చేసావు? అనపోతు పరాక్రమం అతనిలోనే అంతమైపోవాలా?” అని విలపించాడు.

చేయగల్గింది లేదు. మంచో, చెడో, బాలచంద్రుడే నిర్ణయించాడు.

వీరుడైన అనపోతుకు, యుద్ధరంగంలోకి వెళ్ళలేని తన మీద తనకే అసహ్యం వేసింది. ఒక్కమాటలో జీవితం మీద విరక్తి పుట్టింది. వీరులను రణరంగంలోనికి రాగూడదనే ఆంక్ష కులానుసారంగా వర్తిస్తుంటే వీరత్వం సంగతేమిటి? అనే ప్రశ్న వచ్చింది.

బాల్యం నుంచి సమవయస్కులై ఒకరి ప్రాణం మరొకరుగా పెరిగిన బాలచంద్రుడి నుంచి విడివడిన అనపోతు హృదయం పగిలి ముక్కలయింది.

ఐతే అనపోతు హృదయంలో చాలా కాలం నుంచి ఒక కోరిక వున్నది. నలగాముని శత్రు సైన్యంతో వీరవిహారం చెయ్యాలని, పగవారి గుండెలకు చీల్చాలనీ – కాని బాలచంద్రుడి ఆజ్ఞ ప్రకారం – నిన్నటి ఆశలన్నీ ఇవాళ సమూలంగా నాశనమైపోయాయి.

అతను అలవిమాలిన ఇటువంటి దు:ఖములో వుండగానే – కారెంపూడి వీరులను తినుబండారాలు తీసుకెళ్తున్న “మాడచి” అనే ఆడది పల్లకి ఎక్కి వెళ్తూ కనిపించింది. రావి చెట్టు నీడన దిగాలుగా కూర్చున్న అనపోతును చూసి – “నాయనా! ఇక్కడ వంటరిగా ఏం చేస్తున్నావు?” అని ప్రశ్నించింది.

అనపోతు వున్న విషయాన్నంతా విపులీకరించి “కురుస్ఖేత్ర యుద్ధంలో వీర విహారం చేసిన పాండవ, కౌరవ గురువరేణ్యుడు ద్రోణుడు బ్రాహ్మణుడు కాదా! బ్రహ్మాస్త్ర ప్రయోగము తెలిసిన అశ్వద్ధామ బ్రాహ్మణుడు కాదా? రాజవంసాలను ఇరవై వొక్కసార్లు సంహరించాడు, క్షత్రియ రక్తంలో జలకమాడిన పరశురాముడు మా జాతివాడు కాదా? అటువంటప్పుడు వీరుడెవడైనా ఒకటే! యుద్ధంలో వీరత్వం ముఖ్యంగానీ, నా బ్రాహ్మణత్వం ముఖ్యం కాదు గదా! అటువంటప్పుడు ప్రాణంలో ప్రాణంగా పెరిగిన బాలచంద్రుడు ఇంత నిర్దయగా నన్ను ఇట్లా చేయతగునా?

నేను ఎన్నడూ, ఎవర్నీ, ఏమీ కోరి ఎరుగను. ఈ ఒక్క సహాయం చేసిపెట్టు. నన్ను వదిలి యుద్ధరంగానికి వెళ్ళిన మా అన్న బాలచంద్రుడికి నా నమస్కారాలు చెప్పు. తోటి సోదర వీరులను పేరుపేరునా అడిగానని చెప్పు! యుద్ధంలో వీరత్వం చూపించలేని ఈ తుచ్ఛ శరీరం మీద నాకు విరక్తి కలిగిందనీ, వీరత్వంతోనే మరణించి, ఆ లోకంలో కలుసుకుంటానని చెప్పు!” అన్నాడు.

పల్లకీ బోయీవాళ్ళు అనపోతు వంక చూస్తున్నారు. గడ్డి మేస్తున్న గుర్రం అటునుంచి ఇటుకు తిరిగింది.

అనపోతు మొలలోంచి సర్రున కత్తు దూసి, అమిత వేగంతో తలను నరుక్కున్నాడు.

రక్తం మచ్చలు మచ్చలుగా చింది పచ్చగడ్డిలో ఎర్రటి పూత పూసింది. గుర్రం హృదయ విదారకంగా సకిలించింది.

ఈ ఘోర, భయానక దృశ్యాన్ని చూసిన మాడచి గుండెలవిసేలా “తండ్రీ! చెన్నకేశవా!” అని అరచింది.

పల్లకీ మోసే బోయీల గుండె లవిసి, కళ్ళు చెమర్చాయి.

మానవ జీవితంతో కలిసి అడుగులేసే కాలానిదో విచిత్రమైన పాత్ర! ఎవరిని తనతో ఎప్పుడు వెంట తీసుకు వెళ్తుందో చెప్పలేం.

పుత్ర మరణాన్ని తెలుసుకున్న అనపోతు తల్లిదంద్రులు గుండెలు బాదుకుంటూ అలవిగాని శోకంతో విలవిల్లాడిపోయారు.

అనపోతు శరీరాన్ని శాస్త్రోక్తంగా అగ్నిదేవుడికి సమర్పించారు.

వీరుడైన అనపోతు చరిత్ర ఇలా అంతమై, పల్నాటి వీరగాధలో మరపురాని మహత్తరమైన కీర్తిని పొందింది.

ఆంధ్రమాత ఎంత గొప్పది? తరతరాలు చెప్పుకునే వీరులను, వీరవనితలను కన్నది. చరిత్రలో నిల్చే ఈ వీరగాధలే తెలుగుతల్లి కంఠాభరణాలయినాయి.

మాడచి దు:ఖాన్ని అదుపులో పెట్టుకొని కారెంపూడికి బయల్దేరింది.

యుద్ధ క్షేత్రంలోకి వచ్చాక తను తెచ్చిన తినుబండారాలను అక్కడవుంచి, బాలచంద్రుడి దగ్గరకొచ్చి “బాలచంద్రా! అనపోతు నుంచి నీకొక కానుక తెచ్చాను నాయనా!” అంది.

బాలచంద్రుడు చిరునవ్వుతో “ఏమిటది మాడచీ?” అన్నాడు.

“ఇదే నాయనా” అని రక్తంతో తడిసిన అనపోతు జంధ్యాన్నీ, అతను తల నరక్కున్న కత్తిని ఇచ్చింది. అసలు వృత్తాంతాన్ని వివరించి చెప్పింది.

బాలచంద్రుడు అలవిమాలిన బాధతో విలవిల్లాడిపోయాడు. తన బహి:ప్రాణమైన అనపోతును తనే బలిపెట్టుకున్నాడా? లేక త్రిపురాంతక దేవుడు – అనపోతు రక్తాన్ని కోరుకున్నాడా?

మాడచి తెచ్చిన మధుర పదార్థాలను తినటానికి వీరులు, వీరనాయకులు బంతులు తీర్చుకుని, ఆకుల ముందు కూర్చున్నారు.

అనపోతు మరణంతో వీరావేశం ఆవహించిన బాలచంద్రుడు ప్రళయకాల రుద్రుడివలె విలయ తాండవ వికటాట్టహాసం చేసి “వీరులారా లేవండి! సంధి వద్దు! ప్రాణం మీద భయం వున్న వారు వుండండి. నేను, నా తమ్ములతో కారెంపూడి రణక్షేత్రంలో యుద్ధం చేస్తాను. శత్రుసేనలను కత్తి కొక కండగా బలియిస్తాను. పేరమ్మ కోర్కె తీరుస్తాను. నరసింగుని తల బల్లాని గుచ్చి, పాప పరిసమాప్తి కావిస్తాను.” అన్నాడు.

అప్పటి వరకూ నిశ్శబ్దంగా వున్న బాలచంద్రుడికి ఆవహించిన ఈ శివమేమిటో, పల్నాటి వీరు లెవరికీ అర్థం కాలేదు.

మాడచి చెప్పే దాకా ఏం జరిగిందో ఎవరికీ తెలియరాలేదు.

బాలచంద్రుడి పలుకులు విన్న తర్వాత ఎవరికీ అన్నం ముట్ట బుద్ధికాలేదు. తినబోయిన తిండిని “గంగధార” మడుగులో విసిరి, వీరులు చేతులు కడుక్కున్నారు.

ఇది ఇట్లా జరుగవచ్చుననే భయం మహామంత్రి బ్రహ్మన్నకు మొదటి నుంచీ వున్నది. అలనాడు జ్యోతిష్కులు చెప్పిందే ఇప్పుడు జరుగుతున్నది. దైవఘటన ఎట్లా వుంటే అట్లా జరుగుతుంది. మానవ జీవితం నిమిత్తమాత్రమైంది.

యుద్ధం వచ్చింది.

ఇక బాలచంద్రుణ్ణి ఆపగలవరులేరు.

వీరుల వీరత్వాన్ని ఎవరూ ఆపలేరు. అది సంధ్యాకాంతివలే ప్రకాశవంతమైనది.

సంధికొచ్చిన రాయబారులు ఈ విషయాన్ని నాగమాంబకు, నలగామరాజుకూ చేరవేసారు.

జరగబోయేదానికి ఇక విచారించి ప్రయోజనం లేదని అర్థం చేసుకొన్న నలగాముడు, తన సేనల్ని సమాయత్తం చేసుకున్నాడు.

* * * * * * * * * *

సశేషం

 

You may also like...

Leave a Reply