అధ్యాయం 22 – పల్నాటి వీరభారతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

క్రితం కథ: మేడపి వీరులంతా కారెంపూడి రణక్షేత్రంలో విడిధి చేస్తారు. మరోసారి సంధి ప్రయత్నం చేద్దామన్న బ్రహ్మన్న మాటను శిరసావహిస్తారు మలిదేవుడు మరియు ఇతర మాచెర్ల వీరులు. మలిదేవుని పనుపున భట్టు గురజాల చేరుతాడు.

 

ప్రస్తుత కథ:

 

భట్టు నలగాముని కొలువు కూటానికి చేరేసరికి గద్దె మీద కూర్చుని, రాజసం వెలయిస్తున్నాడు నలగాముడు. కొలువు తీర్చి, అపూర్వ నాట్య ప్రదర్శనా వీక్షణలో లయించిపోయివున్నాడు.

తన ఏకైక ముద్దుల కూతురు మరణించినా, అల్లుడు అస్తమించినా – నలగాముడు ఈ సుఖభోగ ప్రలోభి ఐనాడంటే ఆశ్చర్యకరమైన విషయమే!

మమతా మాత్సర్యాలకు తల ఒగ్గనివాళ్ళు అరుదు. మొదటిదాని పవిత్రతకన్నా రెండవదాని తుచ్ఛత కోసమే నలగాముడు లోబడినాడు.

ముఖద్వార పాలకుడొకడు లోపలికి వచ్చి – “ప్రభువులకు వందనములు – వార్త తెచ్చినాను” అన్నాడు.

“ఏమిటది?”

సభలో కలకలం బయలుదేరింది. అందరికీ ఒకే జిజ్ఞాస. ప్రముఖ ముఖద్వార పాలుకుడు తెచ్చిన వార్త ఏమయివుంటుందో?

ద్వారపాలకుడు వందనపూరితంగా, సవినయంగా తలను మరొకసారి క్రిందకు వంచి – “మాచెర్ల నుంచి మలిదేవ మహారాజులు భట్టుగారిని దూతగా పంపారు”

“తక్షణమే లోపలికి ప్రవేశపెట్టు!”

నృత్యం అర్ధాంతరంగా ఆగిపోయింది. నట్టువకత్తెలు లోపలికి నిష్క్రమించారు.

గుర్రం దిగి భట్టు సభాస్థలికి వచ్చాడు.

 

“గురజాల ప్రభువులు, అఖండ శౌర్యధనులు, వీర విక్రమ పరాక్రమ తేజోవిరాజితులూ ఐన నలగామ మహారాజులకు జయము. దిగ్విజయము. ప్రభూ – నా పేరు భట్టు. మాచెర్ల నుంచి మలిదేవుల వారి రాయబారిగా వచ్చాను. తెచ్చిన వార్త వినిపించమంటారా?”

నలగాముడు నాగమ్మ ముఖం వంక చూసి “అవశ్యం” అన్నాడు.

“జరిగిందేదో జరిగిపోయింది. అలరాజును మీరు విషప్రయోగంతో దూత అనే రాచ మర్యాదలను, రణరంగ సూత్రాలనూ పాటించకుండా చంపించారు. ఇది మేడపిలో వున్న వీరుల్లో కోపాగ్నిని రగుల్కొల్పింది.

వీరులైనవారు, పరాక్రమ సాహసోపేతులు ఐన మలిదేవాదులు కారెంపూడిలో విడిది చేసియున్నారు.

యుద్ధం వల్ల ఇరుపక్షాల్లోనూ అసంఖ్యాక జన నష్టం జరుగుతుంది. కనుక ఏదో విధంగా తమ రాజ్యభాగం తమకు గౌరవ మర్యాదలతో ఇవ్వమన్నారు. అంతేకాదు, అలరాజు మరణానికి కారణమైన నరసింగరాజ ప్రబువులను తమకు ఒప్పజెప్పమన్నారు. లేదా వారినే సంధికి మా కారెంపూడికి పంపమన్నారు.

తమ్ముల రాజ్యం వారికెటూ తిరిగి ఒప్పజెప్పటం మీ కనీస ధర్మం! అంతే కాదు రాచ మర్యాద కూడా.

పల్నాడు ఈనాడు పాడిపంటలతో సుభిక్షంగా వుంది. ప్రజలు సుఖంగా వున్నారు. ప్రజాశ్రేయస్సే తమ లక్ష్యం అనుకునే ప్రభువులు యుద్ధం విషయంలో విముఖులు. ఆనక మీ ఇష్టం” అని ముగించాడు భట్టు.

నలగాముడు గద్దె పై నుండి తల ఎత్తి చూసి – “ఇప్పుడు కారెంపూడిలో విడిది చేసున్నారా?”

“ఔను” అన్నాడు భట్టు.

“అన్నీ నిర్ణయించుకునే వచ్చారా?”

“మీ భావమేమిటో నా కర్థం కాలేదు”

“భట్టూ! దూతగా నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించావు. మేము చెప్పబోయే మాటలను కూడా విని మీ ప్రభువులైన మలిదేవాదులకు వింపించు. అలరాజును మేము చంపించామన్న అపప్రథను మా నెత్తిన నెట్టి, నానా దుర్భాషలాడుతున్నారు వారు. మీ ప్రభువుల దూతను చంపేంత భీరువులు, అప్రయోజకులు కారు గురజాల ప్రభువులు. లేని నిందలు మాకు చుట్టబెట్టి, తన పరువు ప్రఖ్యాతులను పెంచుకుంటున్నాడు ఆ బ్రహ్మన్న.

రాజ్యంగానీ, రాజకీయంగానీ ఏమీ అర్థం కాని మలిదేవుడు, బ్రహ్మన్న చేతిలో చిక్కిన చిలకై, నేర్పిన మాటల్నే పలుకుతున్నాడు. నీవు దూతవు గనక సరిపోయింది. లేకపోతే తలతెగి నేల రాలేది.

మలిదేవుడు ఉపసంహరించుకోవల్సిన ఈ రెండు వాక్యాలను జాగ్రత్తగా విను –

మొదటిది: అలరాజును మేము చంపలేదు. విషయప్రయోగం గిట్టనివారు ఎవరైనా చేసి వుండవచ్చు. నిజంగా విషప్రయోగం ద్వారానే చచ్చిపోయాడనేది మాచెర్ల వాళ్ళు చెప్పినంత మాత్రాన గురజాల వాళ్ళు నమ్మాలనే సిద్ధాంతం ఎక్కడుంది? అకస్మాత్తుగా మరణించిన అలరాజును తన రాజకీయ ప్రయోజనార్థం మేమే మోసంతో చంపామనే అపవాదును బ్రహ్మన్న పుట్టించింది కావచ్చుగా? అసలు వారే ఈ కుతంత్రం చేసి వుండవచ్చు కదా!

ఇక రెండవది: అలరాజు మరణానికి, నరసింగరాజును ఒప్పగించడానికి ఏమిటి సంబంధం? గురజాల వీరులు గాజులు తొడుక్కోలేదు. వీరకంకణాలు తొడుక్కొని వున్నారు. ఈ మాట మా మాటగా మీ ప్రభువులకు చెప్పు.

చివరి మాట, కారెంపూడిలో విడిది చేసున్న మీ ప్రభువులతో ఇక రాయబారాలు అక్కర్లేదని, యుద్ధంలో బలాబలాలు తేల్చుకోవాలని, కారేంపూడి రణక్షేత్రమే తీర్పునిస్తుందని చెప్పు. ఇక వెళ్ళవచ్చు” అన్నాడు నలగాముడు.

భట్టు సభను ఓసారి కలయజూసి, అక్కడ నెలకొన్న మౌనాన్నే అంగీకారంగా భావించి, నలగామరాజుకు నమస్కరించి సభనుంచి నిష్క్రమించాడు.

 

సశేషం…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *