అధ్యాయం 18 – పల్నాటి వీరభారతం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]


క్రితం భాగంలో: అలరాజును సంధి కోసం పంపడానికి తల్లిద్రండ్రులైన కొమ్మరాజు, రేఖాంబ మొదట ఇష్టపడలేదు. దుష్టులైన నలగాముడు, నాగమ్మల వల్ల అతనికి ప్రమాదం పొంచివుందని వారి అనుమానం. కానీ పెద్దవాడైన బ్రహ్మన్న దోసిలొగ్గి అర్థించేసరికి కాదనలేకపోయారు.

ప్రస్తుత కథ:

కొలువుకూటంలో కూర్చున్న నలగాముని దగ్గరకు అలరాజు పంపిన వార్తాహరుడొకడు వచ్చి- “అలరాజుగారు రాయబారానికి వచ్చి రెంటాలలో వున్నారు. మీరు రమ్మని సెలవిస్తే వెళ్ళి వినిపిస్తాను” అన్నాడు.

“అవశ్యం” అన్నాడు నలగాముడు.

“ఆజ్ఞ” అని వెళ్ళిపోయాడు వార్తాహరుడు.

భ్రుకుటి ముడిచి “అలరాజు వచ్చిన కార్యమేమిటో?” అన్నది నాగమ్మ.

“తను రాజ్యభాగం అడగటానికి వచ్చాడు కాబోలు ధర్మమే కదా?” అన్నాడు నలగాముడు.

“అది వీల్లేదు” అన్నది నాగమ్మ.

“అదేమిటి నాగమాంబా…”


“అది అంతే ప్రభూ! కోడి పందెంలో మనం రాజ్యాన్ని జయించాం. దాని మీద అన్ని హక్కులూ మనవి. అట్లా రాజ్యం ఇవ్వంటానికి వీల్లేదని నా మనవి.”

“కానీ ధర్మం అంటూ ఒకటిన్నది గదా?”

“ధర్మం…ధర్మం! ఆ ధర్మం బ్రహ్మన్నకూ ఉండాలికదా? ఆనాడు కోడిపందెంలో మనం ఓడిపోతే, వనవాసం సంగతేమోగానీ, మనలను నిలువ నీడ లేకుండా, నామరూపాలు లేకుండా నాశనం చేసేవాడే. ధర్మం మనవైపున, దైవం మన పనుపున ఉండి జయించాము గానీ లేకపోతే మన బ్రతుకు అధ్వాన్నమై పోయి ఉండేది.”

నరసింగరాజు జోక్యం కలిగించుకుని – “నాగమాంబ చెప్పినది సరైనదే అని నా అభిప్రాయం” అన్నాడు.

నలగాముడు ఆలోచనలో పడ్డాడు.

కోడేరు గుట్టల్లో జరిగిన కోడిపందెం ఇంకా గుర్తున్నది నాగమాంబకు. “ఆనాడు అలరాజు తన మీద కత్తి విసిరాడు. నాగుబాము కాటు అందుకోవల్సిందే. అతన్ని నాశనం చెయ్యకపోతే తన కంటికి నిద్రరాదు. బ్రతుకుకు సుఖం లేదు.” అనుకున్నది నాగమ్మ.

ఆ పూటకు కొలువు చాలించాడు నలగాముడు.


మరుసటిరోజు రాయబారానికి వచ్చాడు అలరాజు.

ఏకాంతమందిరంలో నరసింగరాజును ఒంటరిగా కలుసుకున్నది నాగమ్మ.

“నరసింగరాజా!”

“మహామంత్రిణీ!”

“అట్లా కూర్చోండి. నేను చెప్పబోయేదేమిటో ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆపైన మీ ఇష్టం”

“చెప్పండి”

“నలగామరాజు ఎవరు?”

“మా అన్న”

“ఎట్లాంటి అన్న?”

“దాయాది అన్న.”

“దాయాదులు సోదరుల చావు కోరుతారనే విషయం మీకు తెలియంది కాదు!”

“……..”

“పోతే! ఇప్పుడు రాయబారినికి వచ్చిందెవరు?”

“అలరాజు”

“అనగా!”

“మా అన్న అల్లుడు”

“అంటే?”

“మా పేరిందేవి భర్త” – నరసింగరాజు గొంతులో చిరాకు, కనుబొమల ముడిలో అసహనం కనిపించాయి నాగమ్మకు.

నాగమ్మ ఒక్క నవ్వు నవ్వి “మూర్ఖులే కోపం తెచ్చుకుంటారు. అవునా?” అంది.

నరసింగరాజు స్థబ్దుడైనాడు.

నాగమ్మ నరసింగరాజు ముఖంలోకి తీక్షణంగా చూస్తే, అది ఆతని గుండెల్లో దిగబడినట్లైంది.

“నరసింగరాజా! రేపు రాయబారానికి వస్తున్నవాడు అలరాజు. అరివీర భయంకరులైన పల్నాటి వీరుల్లో ఒక్కడు. అదీగాక, అతగాడు మీ అన్నకు అల్లుడవడం చేత ఈ రాజ్యానికి ఉత్తరాధికారి కూడా!”

నరసింగరాజు చప్పున తలెత్తి నాగమ్మను చూసాడు.

నాగమ్మ భృకుటి విరిచి, కుటిలమైన నవ్వు నవ్వి – “ఈ విషయాలు మున్ముందు మాట్లాడుకుందాం. అలరాజు రాయబారానికని ఇంకొన్ని క్షణాల్లో రానున్నాడు. అక్కడ రాయబారాన్ని నేను చెడగొట్టదల్చుకున్నాను. మీరు చేయవలసింది ఏమనగా…అక్కడ నన్ను సమర్థించడమే”

“అనగా?”

“గంధర్వులు తీర్చవలసిన కార్యాన్ని నేను తీరుస్తాను” అని నర్మగర్భంగా అంది.

***********

ఆ తర్వాత ఇద్దరూ కలిసి సభా భవనానికి వచ్చారు.

ఈలోపునే అలరాజు సభాప్రాంగణా ముఖద్వారం నుంచి, లోపలికి విచ్చేసాడు. విచ్చేసి, దూత గనుక ప్రభువుకూ, ఉచిత స్థానాలనలంకరించిన పెద్దలకూ వినమ్రుడై నమస్కరించాడు.

“అంతా క్షేమమా?” అన్నాడు నలగాముడు.

“ఆ…సేమమే” అన్నాడు అలరాజు.

“ఇంతకూ తమ రాకకు కారణం?” అంది నాగమ్మ.

“వింపిస్తాను మహామంత్రిణీ” అని అలరాజంటే “చిత్తం!” అని ఎద్దేవగా అన్నది నాగమాంబ.

“పల్నాటి ప్రముఖులకు, పండితులకు, ప్రజలకు, అందరకూ మరోసారి నా నమస్కారాలు. ప్రభూ, వినిపించమన్నారా?” అన్నాడు అలరాజు.

“అవశ్యం” అన్నాడు నలగాముడు.

“మహారాజా! కోడిపందెంలో రాజ్యాన్ని వదులుకున్న మలిదేవాదులు, ఉభయుల అంగీకారప్రకారం ఏడేళ్ళు అరణ్యవాసం చేసారు. మరో ఆర్నెల్లు ఆపైన గడిచాయి. అనుకున్న మాట ప్రకారం తమ రాజ్యం తమకు ఇవ్వమని నన్ను రాయబారిగా పంపారు. ఈ రాయబారాన్ని మన్నించి, వారి రాజ్యం వారికివ్వండి. ప్రభువులు ఉచితానుచిత నిర్ణయం చేయగలరని భావిస్తున్నాను.”

“ప్రభువులకు ఉచితానుచితాల గురించి రాయబారులు బోధించాల్సిన పనిలేదు” అన్నది నాగమ్మ.

“చిత్తం. కానీ నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను.” అన్నాడు అలరాజు.

“రాజ్యం ఇవ్వకపోతే!” అన్నాడు నలగాముడు.

“యుద్ధమే…” అన్నాడు అలరాజు.

“అంతా మీరే నిర్ణయించుకున్నాక, ఇప్పుడీ రాయబారమెందుకు?” అన్నాడు నలగాముడు.

“ప్రతి పనికీ, ప్రతి ధర్మానికీ, ప్రతి సంఘానికీ, ప్రతి రాచరికానీ కొన్ని కట్టుబాట్లుంటాయి. రాయబారమనేది ప్రాచీనంగా వస్తున్న ఒక రాచరికపు కట్టుబాటు. దాన్ని మీరు మన్నించినా, మన్నించకపోయినా మేము మా బాధ్యతగా వచ్చాము.”

ఈ జవాబుకు నలగాముడు మండిపడి – “అల్లుడా!” అన్నాడు.

“నేను అలరాజును. ప్రస్తుతానికి దూతను. అల్లుడా అని పిలవకండి” అన్నాడు అలరాజు.

నలగాముడు దెబ్బతిన్న పులిలా హుంకరించి – “అలరాజా – మలిదేవాదులు కోడిపందెంలో ఒడ్డి వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నిజానికి మాచెర్ల మాది. ఏడేళ్ళ తర్వాత వచ్చి మా రాజ్యాన్ని భాగాలు చెయ్యమనే అధికారం మలిదేవాదులకు లేదు” అన్నాడు.

అలరాజు క్షణంసేపు సభవైపు కలయజూసి – “నలగామరాజా! ఇదేనా మీ తుదినిర్ణయం?” అన్నాడు.

“ఔను” అన్నాడు నలగాముడు.

“మరొక్కసారి ఆలోచించండి” అన్నాడు అలరాజు.

రెట్టించిన అలరాజు స్వరం విని మహోదగ్రుడైన నలగాముడు – “అలరాజా! నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావు. అంతేకానీ ఇన్నిసార్లు మమ్మల్ని హెచ్చరించాల్సిన పనిలేదు. పల్నాటి ప్రభువులమైన మా దగ్గర అసంఖ్యాక సేనాబలగం వున్నది. ఏనుగులతో, గుర్రాలతో, పదాతి దళాలతో మేము ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా వున్నాం. మీసముంటే, రోసముంటే, ఈ యాచనెందుకు? ఈ శుష్కమైన హెచ్చరికలెందుకు? రాయబారాలెందుకు? యుద్ధమే మీ లక్ష్యమైనప్పుడు మన మనతనాన్ని కారెంపూడిలో, కదనరంగంలో తేల్చుకుందాం”

కోపంతో రెచ్చిన కళ్ళలో నిప్పులు కురిపిస్తూ – “ఏం చూసుకుని, ఎవర్ని చూసుకుని మిడిసిపడుతున్నారో ఆ రానున్న యుద్ధంలో, కాలం ఇవ్వనున్న తీర్పులో, కారెంపూడి రణక్షేత్రాన నేల కూలుతున్న సమయాన అలరాజు రాయబారం విలువేమిటో మీకు జ్ఞప్తికి రాక మానదు. యుద్ధం మీద మీకు అంత అలవికాని మమకారమే వుంటే, దూతగా తగదన్నా అలరాజుగా కాదనను. బ్రహ్మనాయుడి అపూర్వ పర్యవేక్షణలో మాచెర్ల ప్రభువులు సమాయత్త పర్చిన సేనలు వీరభూమిలో విజౄంభించి రక్తపుటేరులు పారించే వేళ – మీ మీ పరాక్రమాలు ఏ పాటివో మేమూ చూడకపోము.” అని గర్జించాడు అలరాజు.

 
సభలో కూర్చున్న వీరుల్లో ఒకడు లేచి – “మలిదేవాదుల రాజ్యం వారికివ్వటమే ధర్మం ప్రభూ!” అని అంటే నాగమ్మ వెంటనే అందుకుని – “రాజ్యం పోగొట్టుకున్న మలిదేవులకు రాజ్యాన్ని తిరిగిపోందే అధికారం లేదు. ఈ రాయబారాలతో ఏమీ ప్రయోజనం లేదు” అన్నది.

“ప్రజాభీష్టాన్నైనా మన్నించండి ప్రభూ” అని అలరాజు అంటే “యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని గురించి మీరు ప్రభువులకు ఉపదేశం చెయ్యాల్సిన పనిలేదు” అని ఎదురాడింది నాగమ్మ.

“చిత్తం!” అని తిరస్కార స్వరంతో నాగమ్మను అపహాస్యం చేసాడు అలరాజు.

తన వ్యంగ్యాన్ని తన మీదకే తిరిగి సంధించిన అలరాజుని చూసి “మూర్ఖులు రాయబారులుగా రా తగదు” అని నాగమ్మ అంటే నిలువెల్లా కోపంతో మండిపోయిన అలరాజు సర్రున కత్తి దుసి, క్షణం తాళి “దూతగా వచ్చాను గనుక బ్రతికిపోయా”వని అంటూ ఎత్తిన కత్తిని దించడం వీరలక్షణం కాదు గనుక పక్కనున్న చెక్క స్థంభాన్ని ఒక్కవ్రేటున కొడితే అది రెండు ముక్కలయింది.

భయంతో నాగమ్మ వళ్ళు ఝల్లుమంది.

అలరాజు ఆఖరి హితవుగా ఇలా అన్నాడు – “మహారాజా! దూతగా వచ్చిన నేను ఆ చివరి మాటల్ని చెబుతున్నాను. బ్రహ్మనాయుడంటే నీవేమిటో అనుకుంటున్నావు. తేరిచూడరాని శౌర్యధనుడాయన. కుంతలం పట్టుకుని రణభూమిలో నిలబడితే ఆ ఫాలాక్షుడే వచ్చినట్లుంటుంది. న్యాయానికి కట్టుబడి జరిగినంత కాలమూ మీ మోసాల్ని క్షమిస్తూ వచ్చాడు. గుర్తుందా! మా ఆలమందల్ని నువ్వు, నీ పరివారమూ వెనుకవ్రేటుగా పొడిపించినప్పుడు, బ్రహ్మన్న ఒక్కడే దండేత్తి వస్తే,

బ్రాహ్మణుల వెనుక దాక్కొన్నావు. హు! ప్రాణభయంతో పారిపోయేవాళ్ళను, ఎదురు నిలబడి ఎదుర్కోలేని పిరికిపందలనూ తాకని మా బ్రహ్మన్న దయతో బ్రతికి పోయి ఈ సింహాసనం పై ఇంకా కూర్చుని వున్నావు.

ఇక మా వీరుల్ని పరిచయం చేస్తాను…వినండి…

కన్నమనాయుడు కత్తిపట్టుకుంటే, ఈ సభలో కూర్చున్న, మీసమున్న మొనగాడెవ్వడూ నిలవలేడు.

వీరకన్నమదాసు అగ్గితో సమానం. కొమ్మరాజు అపర ద్రోణాచార్యుడు. చిన్నవాడైనా, మా బాలచంద్రుడు ఏడుగుర్ని ఒకరి మీద ఒకర్నివేసి కట్టగట్టి నరికితే క్రింద నేల కూడా తెగుతుంది.

ఇక నా గురించి…వద్దు….ఆత్మస్తుతి మంచిది కాదు. ఎదురునిల్చినప్పుడే అదే తెలిసి వస్తుంది” అన్నాడు.

ఈ మాటలతో అహం దెబ్బతిన్న నరసింహరాజు “అలరాజా!” అని భీకరంగా అరిచాడు “ఆపు. మీకు మూతిన మీసాలుంటే మాకు ముంజేతిన వున్నాయి. శౌర్యవంతులు, వీరులూ యుద్ధం చేసి చస్తారు. నీలా వ్యర్థప్రలాపాలతో పొద్దు పుచ్చరు. మాల కన్నమ లాంటి కడజాతి వాళ్ళను సరి వీరులుగా చెప్పుకుంటున్నావే, నీలో క్షాత్ర రక్తం చచ్చిందా? వినటానికే సిగ్గుగా వుంది. కడజాతివళ్ళను కట్టగలిపి, చాపకూడు పెట్టిన బ్రహ్మన్న పౌరుషమేమిటో ఇక్కడ అందరికన్నా నాకే ఎక్కువ తెలుసు. రాజ్యం వీరభోజ్యం. ధర్మాన్ని గురించి చర్చలనవసరం. వీరత్వముంటే యుద్ధంలో మమ్మల్ని జయించి రాజ్యాన్ని పొందండి. గురజాల ప్రభువులు మహా వీరులు. ఎదురొడ్డడమే గానీ వెన్ను చూపడం లేదు” అన్నాడు.


పరిస్థితి చేయిదాటున్నదని గమనించిన నలగాముడు వేడిని చల్లార్చడానికి గానూ సభను చాలించాడు. సభామందిరం బైట “ఇంటికి రా అల్లుడూ” అని అలరాజును కోరితే, సున్నితంగా తిరస్కరించి “విడిదికే నా పయనం” అని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు అలరాజు.

You may also like...

Leave a Reply