ఒక ఆదివారం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
Like-o-Meter
[Total: 1 Average: 3]

 

టక్కున మెలకువయింది రాఘవ్ కు.

గడియారం చూసి “అదేమిటీ ఇంత తెల్లవారు జామున మెలకువ?” అని గొణుక్కున్నాడు. టైం ఏడున్నర. కానీ ఆరోజు ఆదివారం కాబట్టి రాఘవ్ కు పది గంటలకు మాత్రమే తెల్లవారుతుంది . గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ చెవులు రిక్కించుకున్నాయి. స్నానాల గదిలోనుండి గలగల శబ్దం . ఆగి ఆగి వస్తోంది…..ఆది తాళం లో.

చప్పున నిద్ర ఎగిరిపోయింది. వెల్లకిలా పడుకుని, చేతుల్ని తల కింద పెట్టి, కాలు మీద కాలేసుకుని స్నాన సంగీతం వినసాగాడు. చేతి గాజులు, కాలి అందెలు, చెంబుడు నీళ్ళు. “అనుభవించే మనసుండాలి గానీ కళాత్మకం కానిదేదీ లేదు ఈ ప్రపంచం లో”. పొద్దున్నే ఇంత అద్భుతమైన ఊహ వచ్చినందుకు తనను తాను అభినందించుకున్నాడు రాఘవ్ . 

ఓ పది నిముషాలు అలా గడిచాక సంగీతం పడగ్గదిలోకి వచ్చినట్టు పసిగట్టాడు. ఈసారి రూపక తాళం పలుకుతున్నట్టు కూడా గ్రహించాడు. లయబద్ధంగా కాలు ఆడిస్తూ తలను తిప్పసాగాడు.

“ఆదివారం పెందరాళే సంగీత సం భ్రమలేలనో?”. పాట మాటలు నేర్చినట్టు అనిపించింది రాఘవ్ కు.

చటక్కున బోర్లాపడి “నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా ” అని నాటకీయంగా అడిగాడు.

“ఐ లైక్ అబద్ధాలు…..” వెంటనే అన్నది సంగీతం .

“ఓ మూర్ఖుడు మొద్దు నిద్రపోతూఉంటే ఓ చెంబుడు సంగీతం కుదిపి లేపింది…” అన్నాడు రాఘవ్ .ఫక్కున నవ్వింది సంగీతం .

“చెంబుడు సంగీతమా….గంపెడు సంతానం లా”. ఆగకుండా నవ్వుతోంది సంగీతం .

“వనిత లత కవిత….మనలేవు లేక జత” పాడసాగాడు రాఘవ్ . “ఆ మొదటి ఇద్దరూ ఎవరూ…” అని చిరుకోపం నటించింది సంగీతం . “వనిత అంటే కవిత….లత అంటే కవిత….కవిత అంటే …… నీవే” అన్నాడు మళ్ళీ నాటకీయంగా.

గలగలా నవ్వింది సంగీతం ….అదే.. కవిత నామధేయమున్న వనిత.

“పగటి నాటకాలు చాలుగానీ దంత ధావనం , ముఖ మజ్జనం కావించి రండు……తీర్థ కొలువు స్యాయిస్తాను” అంది కవిత.

నుదుటి పై చేయి వేసుకున్నాడు రాఘవ్ . “షొకాలె షొకాలే ఇట కీ దాదా” అంది కవిత. “భగవాన్ …. ఏమిటీ భాష !” అని ఆకాశం వైపు చేతులు చాచాడు.

చాచిన చేతుల్లో పడ్డ టవల్ ను భుజాన వేసుకుని నడుస్తుండగా “మత్తు వదలని సున్నా మార్కుడు మళ్ళీ బాత్రూం చేరాడు….” అని అనేసి వంట గదిలోకి పారిపోయింది కవిత. పెదాల నిండుగా నవ్వు పులుముకుని, గుండెల నిండుగా గాలి పీల్చుకుని స్నానాల గదిలోకి దూరాడు.

Products from Amazon.in

అలా వేడి నీళ్ళు పడగానే ఆవులింతలు అవేవో గీతాలుగా మారిపోయాయి రాఘవ్ కు. గొంతెత్తి ఓ ఘంటసాల పాట అందుకున్నాడో లేదో వంటింటి లోని మిక్సర్ భోరుమని శృతి కలిపింది. అందమైన ఘంటసాల పాట అలా అనామకంగా వంటింటి చప్పుళ్ళలో లుప్తమైపోవడం అస్సలు సహించలేదు రాఘవ్ . గొంతును మరింతగా పెంచాడు. దాని కోసమే చూస్తున్నట్టుగా మిక్సర్ వేగం పెంచి రాగం పెంచింది. మళ్ళీ గీతము, లుప్తము, అసహనము ఒకదాన్నొకటి తరుముకున్నాయి. విసిగిపోయి పాట ఆపేసాడు రాఘవ్. మిక్సీ కూడా మౌనం వహించింది. ఒక నిముషం పాటు భయంకర నిశ్శబ్దం రాజ్యమేలింది అని మనసులో రాసుకున్నాడు రాఘవ్. మరే చప్పుళ్ళూ వినబడకపోవడం తో మళ్ళీ గొంతు సవరించి, శృతి ఎత్తాడు. ఈసారి “చుయ్యి” మంటూ తిరగమాత తాళం వేసింది. ఆ తాళం అలా గాల్లో తేలుతూ, తక్కుతూ, తారుతూ వచ్చి, స్నానాల గదిలోకి దూరి, అందమైన రాఘవ్ ముక్కుచే ఆకర్షింపబడింది. “ఆయువు గల్గాచ్ఛి ఘడియల్, హాచ్ఛి పెంచిన తీవెతల్లి జాతీయతాచ్ఛి దీర్తుము”. ఇక తట్టుకోలేకపోయాడు రాఘవ్ .

తుమ్ముల వల్ల పుట్టిన దురదకంటే కరుణశ్రీ పద్యం , ఘంటసాల గాత్రం తిరగమాత దెబ్బకు తిరగబడిపోవడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయాడు. “కవితా…” అన్న కేక శంకరాభరణం శాస్త్రి “శారదా…”కు రీమిక్స్ లా ఇల్లంతా ధ్వనించింది.

“ఏమైంది?” అంటూ వంటింటిలోనుంచి తిరుగు కేక వేసింది కవిత. మాటేన కలహం జాస్తి అని గ్రహించి గబగబా నీళ్ళు పోసుకోవడం మొదలెట్టాడు రాఘవ్ .

*****

“ఇడ్డెన్లు, కొబ్బరి చప్పడి రెడీ !” అని తుళ్ళిపడుతూ పలికింది కవిత.

“కొబ్బరి చప్పడా? అదేం పదార్థం ?” ప్రశ్నించాడు రాఘవ్ .

“పచ్చడిని చిన్నప్పుడు చప్పడి అనేవాణ్ణని ఒహరు చెప్పగా విన్నాను”.

“అంటే వాడే వీడా?”.

“అవును….మంచివాడు మామకు తగ్గ అల్లుడు” అంది కవిత.

గలగలా నవ్వాడు రాఘవ్ . తెరచిన నోట్లోకి చప్పున దూరింది…… కొబ్బరి చెట్నీ సమేత ఇడ్డెను.

లొట్టలు వేయడం అనే అసంకల్పిత ప్రతీకార చర్య సాక్షిగా ఇడ్లీల శిక్షణ కం భక్షణ అలా సంతోషంగా జరిగిపోయింది.

*****

సమయం తొమ్మిది.

ఏం చేయాలో తోచడం లేదు రాఘవ్ కు. మామూలుగా ఐతే ఏ పదింటికో లేచి నీల్గి నీల్గి పన్నెండుకు స్నానం చేసి ఒంటిగంటకు ఏకంగా భోజనం చేసి మూడు దాకా టీవీ చూసి ఆ పై ముసుగు తన్నేసి ఐదింటికి లేచి కాఫీ తాగి, భార్యా సమేతంగా బైట తిరిగి, తొమ్మిదింటికి భోజనం చేసి పదికల్లా పడకెక్కిపోయేవాడు. కానీ ఈరోజు ఆ చెంబుడు సంగీతం మూలంగా పెందరాళే లేవడం , తొమ్మిదికల్లా ఇలా జ్ఞానముద్రలో కూర్చోవడం ఓ పట్టాన అరగడం లేదు.

భర్త ఇంత పెందరాళే లేచిన శుభ సందర్భాన్ని ఘనంగా జరుపుకోవాలన్న ఆశతో పక్కింటి పిన్ని గారి వద్ద “జాంగ్రీ చేయుట ఎలా?” అన్న కార్యక్రమంలో మునిగిపోయింది కవిత. ఏదో ఒకటి చేయాలని తహతహలాడుతూ ఉండగా టీపాయ్ మీద నిద్రాభంగిమలో మునిగున్న డైరీ కనబడింది. ఉత్సాహంగా ముందుకు వంగి తీసాడు.

మొదటి కొన్ని పేజీల్లో తెలుగు వంటకాల చిట్టా ఇంగ్లీషులో రాసుంది. చకచకా పేజీలు తిప్పి ఖాళీ పుట దగ్గర ఆగాడు. పెన్ను నోటిలో పెట్టి విశ్వనాథ్ సినిమా కోసం పాట రాయబోతున్న సిరివెన్నెల్లా కళ్ళు మూసుకున్నాడు. చటాలున ఏదో మెరుపు మెరిసింది. కళ్ళు తెరిచి డైరీలో ఇలా రాసాడు:

నేనొక ప్రేమ పిపాసిని

రాసిన దాన్ని రెండు సార్లు చదువుకుని తను ఒక్క లైను మాత్రమే రాసినట్టు గుర్తించాడు. మరో సారి సిరివెన్నెల పోజులోకి వెళ్ళి వచ్చి ఇలా రాసాడు

నీవొక ఆశ్రమ వాసివి

రెండు లైన్లను కలిపి చదివేసరికి మరో రెండు వాక్యాలు వెంట వెంటనే తన్నుకొచ్చేసాయి:

నా దాహం తీరనిది 
నీ హృదయం కరగనిది

తను ఇంత వేగంగానూ, ఇంత భావుకంగానూ ఎలా రాయగలిగానా అని ఆశ్చర్యపోతున్న తరుణం లో జ్ఞాపకశక్తి అనే ఓ సైతాన్ నిద్రలేచింది. ఈ మాటలు ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా అనిపించింది.

కొద్దిసేపటి తీవ్ర అంతరంగ శోధన తరువాత ఇదొక సినిమా పాట అని తేల్చుకుని నిరాశ పడ్డాడు. పట్టు వదలని విక్రమార్కుడుని తల్చుకోబోయే సరికి పొద్దున భార్య అన్న “సున్నా మార్కుడు” గుర్తుకొచ్చి లోపల్లోపలే ఉడుక్కున్నాడు. కలలు తప్ప కళలు తెలియవని కవిత ఎద్దేవా చేయడం కూడా గుర్తుకొచ్చి ఉక్రోషపడ్డాడు. ఈరోజు ఏమైనా చేసి కవిత రాసి భార్య ముఖాన కొడితే ? ఛా ముఖం పై కొట్టడం వద్దు. పాదాలకు సమర్పిస్తే ఎంచక్కగా ఉంటుందని తీర్మానించుకున్నాడు. కానీ ప్రస్తుత సమస్య ఎక్కడ ఎలా సమర్పించాలన్నది కాదు…..ఎలా రాయాలన్నది.

“కిం కర్తవ్యము ? సుబ్రహ్మణ్యాన్ని బిచ్చమడగడమే !”.

“అవును అదే తక్షణ కర్తవ్యము” అన్నది మాయబజారు మనసు.

*****

“వురేయ్ ! కవితరా……. ” అన్నడు రాఘవ. గొంతులో చెప్పలేనంత ఆదుర్దా.

“పెరట్లో ఉందేమో చూడరా” అన్నాడు అంతే ఆదుర్దాగా సుబ్రహ్మణ్యం .

“పెరట్లో దొరికితే నీకెందుకు ఫోన్ చేస్తాను. బాబ్బాబు నీకు పుణ్యముంటుంది కవితను తొందరగా వదలరా !?”

“ఒరేయ్ అప్రాచ్యుడా…కవిత నా దగ్గరెందుకుంటుందిరా?”

కరెంట్ లేమితో వెలగని జీరో క్యాండిల్ బల్బు, రాఘవ్ బుర్ర ఒక్కసారిగా కాంతి నింపుకోవడం ఏ మాత్రం కాకతాళీయం కాదు.

“ఛీ వెధవా….నేనడిగేది నా భార్యను కాదురా….నీవు రాసే కవితను”

అవతలనుండి ఎలాంటి జవాబు రాకపోయేసరికి లైను తెగిపోయిందేమొనని హలో మంటూ అరవసాగాడు రాఘవ్ .

“కాకి…..” అన్నాడు అవతలి సుబ్బు.

“నువ్వు నోరుమూసుకున్నది కాక నాది కాకిగోలంటావా ?” అని కోపంగా కూకలేసాడు రాఘవ్ .

“వురేయ్ బ్రెదరూ..కాస్త తగ్గరా….నేను చెబుతున్నది కవిత” అన్నాడు సుబ్బు.

“ఓహ్ అదా…మరి కాకి అన్నావేంటి ?”

ఆమాయకమైన అబ్బాయిని జాలిగా చూస్తున్న జ్ఞాన వృద్ధునిలా ఫోను నిండుగా నవ్వాడు సుబ్బు. “నోరు మూసుకుని, చెవులు విప్పుకొని, చేతులకు పనిచెప్పు” అన్నాడు కవితాత్మకంగా.

“చెప్పు చెప్పు” అన్నాడు రాఘవ్ చిందర వందరగా ఉన్న చెప్పుల స్టాండు కేసి చూస్తూ.

“కాకి లేవక ముందె 
కళ్ళు తెరిచేదానా 
కోకిలల్లే కూక లేయుదానా”

అది తిట్టో పొగడ్తో అర్థం కాకున్నా చకచకా రాసుకుపోసాగాడు రాఘవ్ .

“రూకలడగకనె 
రోకలెత్తుదానా 
పండగొచ్చిన వేళ 
పిండి రుబ్బుదాన”

సుబ్బూ ఆశువుకు అబ్బుర పడ్డాడు రాఘవ్ . “ఇంకా ఉందా….” అని అడిగిన తరువాత అర్థమయింది తను ఎంత అసందర్భ ప్రశ్న వేసాడని. కానీ సుబ్బూ అదేమీ పట్టించుకోకుండా చెప్పుకు పోతున్నాడు.

“చేదు కాఫీలోకి 
చేర్చు చక్కెరలాగ 
నాదు జీవికలోన 
చేరి పోవే

మొత్తం రాసుకున్నావా ?”

సుబ్బూ మాటల్లోని చివరి ప్రశ్నార్థకం తను ఇంతకు మునుపు అడిగిన ప్రశ్నకు సమాధానం అని రాఘవ్ సూక్ష్మ బుద్ధి గ్రహించింది. “అబ్బా ఎలా చెబుతావురా ఇలాంటి ఆశు కవితలు.” అని మెచ్చుకోలుగా అన్నాడు రాఘవ్ . “హు హు హు” అని నవ్వాడు సుబ్బు. “థాంక్స్ రా….రేపు సాయంత్రం మేఘ సందేశ్ లో కలుద్దాం ” అన్నాడు రాఘవ్ . అది లంచమా లేక సన్మానమా అని సుబ్బూ తర్కించుకుంటూ ఉండగానే ఫోన్ కట్టైపోయింది.

*****

“చేదు కాఫీలోకి 
చేర్చు చక్కెరలాగ 
నాదు జీవికలోన 
చేరి పోవే “

అని చివరి వాక్యాలు రాఘవ్ అభినయపూర్వకంగా చదవగానే కవిత పడిపడి నవ్వసాగింది. ఉక్రోషం ఉబికి వస్తుండగా తమాయించుకుని శాంతంగా అడిగాడు రాఘవ్ “ఎందుకలా నవ్వుతున్నావ్ ?”.

“ఈ కవిత మీ స్వంతం కాదు…నాకు తెలుసు…” అంది నోటికి చేయడ్డం పెట్టుకునే.

“రుజువేంటి?” కోపంగా అడిగాడు రాఘవ్ . ఓడిపోతున్నానని అతనికి తెలిసిపోతోంది.

“మొన్న….మొన్న….”చెప్పడానికి ఆయాస పడుతోంది కవిత. “మొన్న కామాక్షి….అదే సుబ్బూ గారి భార్య ఇలాంటి కవితనే నా ముందు చదివింది వాళ్ళాయన అంకితమిచ్చారని”. కవిత కళ్ళలో ఆనందాశ్రువులు, రాఘవ్ కళ్ళలో దు:ఖాశ్రువులు వాటి వాటి పాత్రలను బహు చక్కగా పోషించాయనడం లో ఎలాంటి సందేహం లేదు.

*****

భోజనం చేస్తున్నంతసేపు ఏవేవో చెబుతూనే ఉంది కవిత.

రాఘవ్ మనసు తింటున్న జాంగ్రీ మీదా అతని కళ్ళు ఊగుతున్న కవిత జుంకీ మీద కేంద్రీకరించబడి ఉన్నాయి.

“జాంగ్రీ…జుంకీ….కవిత….నవ్వు. “యురేకా” అని అరవబోయి “జుంకీ” అని అరిచాడు రాఘవ్.

నిశ్శబ్దంగా తింటూ మౌనంగా చూస్తున్న తన భర్త ఇలా హఠాత్తుగా “జుంకీ” అని అరవడం, కేసరి రంగుతో ఎర్రబడిన పళ్ళను బైటకు ప్రదర్శించడం చూసి కొద్దిగా బెదిరింది.

“హా హా హా … జుంకీ కవిత…..కవితా” అన్నాడు రాఘవ్.

జాంగ్రీ పళ్ళ ప్రదర్శన వైశాల్యం పెరగడం తో కవిత నిజంగానే భయపడింది. మొదట జాగ్రీని, పిదప పిన్ని గారిని, అటుపై తన తయారీనీ మార్చి మార్చి సందేహించ సాగింది. రాఘవ్ జాంగ్రీని చేతిలో పట్టుకుని, ముందుకు వంగి

“జుంకి లేని చెవులు 
పాకమెట్టని జాంగ్రీలు 
కవిత లేని బ్రతుకు 
అట్లే కాదా”

అన్నాడు తమకంగా. ఈసారి జాంగ్రీ రంగు పండ్ల ప్రదర్శన కవిత వంతయింది. కవిత మౌనం చూసి మహోత్సాహం కలిగింది రాఘవ్ కు. ఇంకాస్తా ముందుకు జరిగి

“కొరికి తింటే జాంగ్రి 
కొసరి వేస్తే కవిత 
కవిత లాంటిది జాంగ్రి 
జాంగ్రి కవిత”

అని చెప్పి కళ్ళను అల్లార్చ సాగాడు. పెదాల పై జాంగ్రీ పాకం , కళ్ళలో నీళ్ళు తో ఫెళ్ళుమని నవ్వి ముందుకు వంగి భర్త బుగ్గ పై ముద్దు పెట్టింది కవిత. రాఘవ్ కళ్ళు మూస్తూ తెరుస్తూ అదే పనిగా నవ్వ సాగాడు.

*****

ఆ ఆదివారం మధ్యాహ్నం ఆ ఇంట్లో అదే పనిగా నవ్వేస్తున్న ఆ ఇద్దరినీ అలానే నవ్వనివ్వండి. అల్లరి తో  తుళ్ళి పడే మరో జంట కథకై మనం కంచి కి వెళదాం ! రైట్ రైట్ !!

*****

 


Raghothama Rao C

Raghothama Rao C

Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.

You may also like...

Leave a Reply