మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

లక్ష కోట్లపైగా జరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలోని ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు దశాబ్దాలపాటు ఈ కేసుని లాక్కుని పీక్కునే అవకాశం కూడా తన ఆత్మహత్యతో కలిగించాడు. అదసలు ఆత్మహత్యో, హత్యో తేలేసరికే ఓ దశాబ్దం పట్టవచ్చు. అప్పటికి మిగిలిన నిందితులు బతికే ఉంటారో లేదో చెప్పటం కూడా కష్టమే.

 

మునుపు స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణంలోని ప్రధాన నిందితుడు హర్షద్ మెహతా జైల్లోనే చచ్చే దాకా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏమిటో మనకు తెలీను కూడా తెలీదు. స్టాంపు పేపర్ల కుంభకోణంలోని నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ, సత్యం రాజు కేసుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దశాబ్దాల తరబడి జైల్లోనే మురిగిపోయి చావకుండా, ముందుగానే చచ్చినందుకు స్పెక్ట్రం సాదిక్ ని అదృష్టవంతుడనాలేమో!

 

విచిత్రం ఏమిటంటే, వీళ్ళని పావులుగా ఆడించిన రాజకీయ నాయకులు మాత్రం కనుచూపు మేరల్లో కనబడరు. ఇక మిగతా కుంభకోణాల విషయానికి వస్తే, సురేష్ కల్మాడి, అశోక్ చవాన్ లాంటి రాజకీయ వ్యక్తుల మీద ఈగ కూడా వాలదు. పొరపాటున లాలు ప్రసాద్ యాదవ్ లాంటి వారిపై ఈగలు వాలినా, దులపరించుకుని బయటకు తేలిగ్గానే వచ్చేస్తారు.

ఒక సామాన్యుడైనా, కోట్ల కొద్ది డబ్బు సంపాదించినవాడైనా సరే, రాజకీయ నాయకుడు కానంతవరకు, ఈ దేశంలో మనలేడు అన్నదానికి ఇవి ఉదాహరణలు. బహుశా అందుకేనేమో అంబానీలు, మాల్యాలు కోట్ల డబ్బు వెదజల్లి మరీ, అధికార పార్టీల ప్రాపకానికి పడిగాపులు కాస్తు ఉంటారు.

2జి స్పెక్ట్రం కి వద్దాం. ఇంత తీవ్రాతితీవ్రమైన కుంభకోణాన్ని రాజకీయ లాభం కోసం మన పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయో చూస్తే మతి పోతుంది. ఈ కుంభకోణం నేపధ్యంలోనే, దాదాపు గత ఏడేళ్ళుగా కేంద్రంలో సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డి.ఎం.కె., మరోసారి మద్దతు ఉపసంహరించుకుంటామనే బెదిరింపులకు దిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు గురించి మొదలైన ఆవేశకావేషాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే బెదిరింపులకు కారణమయ్యిందట! వ్రతం చెడినా ఫలితం దక్కిందనుకోటానికి కూడా ఆస్కారం లేకుండా కాంగ్రెస్ ఒత్తిళ్ళకు తప్పనిసరిగా తలొగ్గి అడిగిన సీట్లు ధారపోసింది డి.ఎం.కె.

 

2జి స్పెక్ట్రం కుంభకోణం, దరిమిలా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న సి.బి.ఐ. దర్యాప్తు నేపథ్యంలో కేవలం కొన్ని అసెంబ్లీ సీట్ల సర్దుబాటు కుదరని కారణంగా డి.ఎం.కె. ఈ బెదిరింపులకు పాల్పడిందంటే నమ్మేదెవరు? గతంలో ముఖ్యమైన మంత్రిత్వశాఖల కోసం ఇవే పాచికలు విసిరి కేంద్రాన్ని లొంగదీసుకున్న డి.ఎం.కె. ఈరోజు విఫలమవ్వటానికి కారణం బహిరంగ రహస్యమే.

అమ్మ అడుక్కోకుండానే, మద్దతు ఇస్తా తీసుకొమ్మని అడుక్కున్న ములాయం వలన, మా గంతకు తగ్గ బొంత డి.ఎం.కె. కాకపోతే, అన్నా డి.ఎం.కె. అని కాంగ్రెస్ ప్రచారం చేసిన ఊహాగానాల వలన, మొత్తానికి కరుణానిధి అమ్మకు దాసోహం అనేయక తప్పలేదు.

అవకాశం దొరికిందే తడవుగా వేల, లక్షల కోట్ల కుంభకోణాలకి పాల్పడే డి.ఎం.కె.లాంటి పార్టీలకు, సంకీర్ణ ప్రభుత్వంలోని ఈ భాగస్వామ్య పక్షాల అవినీతిని చూడనట్టు నటించి, ఈరోజు ఎన్నికల సర్దుబాట్లకుగాను, వారి అవినీతిని అడ్డంపెట్టుకొని పెద్దన్న పాత్ర పోషిస్తు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్ కు ప్రజలు ఎప్పటికైనా బుద్ధి చెబుతారా? ప్రజల బుద్ధి కూడా గడ్డి తిని, ఈ పార్టీలనే మళ్ళీ గెలిపిస్తే, ఈసారి ఇదే అవినీతిని అడ్డం పెట్టుకొని తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కావాలని కాంగ్రెస్ పేచీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో!

దేశ క్షేమం, ప్రజా సంక్షేమం ప్రధానం కాకుండా, తమతమ అవినీతిని కాపాడుకునే అధికారమే పరమావధిగా కొనసాగుతున్న ఈ రాజకీయాలు మరెన్ని ప్రజాస్వామ్య అగాధాలను మనకు చూపించనున్నాయో!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *