మరాఠా సామ్రాజ్య నిర్మాత బాజీరావ్ పేష్వా – భాగం 1

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 16
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  26
  Shares
Like-o-Meter
[Total: 2 Average: 5]

 


This article was originally published in esamskriti.com 

Link to original article: Bajirao Peshwa – The Empire Builder


peshwa bajirao

18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యం దేశం నాలుగు చెరగులా వ్యాపించింది. కొన్ని ప్రాంతాలకు పరిమితమైన మరాఠా పాలనను దేశవ్యాప్తం చేయడంలోను, మరాఠా సామ్రాజ్య నిర్మాణంలోను బాజీరావు పేష్వా పాత్ర ప్రముఖమయింది. అందువల్లనే 18వ శతాబ్దంను మరాఠా శతాబ్దం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

 

అది ఏప్రిల్ 28, 1740.

ఆనాటి సూర్యాస్తమయానికి బాజీరావ్ పేష్వా తుది శ్వాస వదిలాడు.

అంతకు ముందు రోజు సైనిక శిబిరమంతా మహామృత్యుంజయ స్తోత్రంలో ప్రతిధ్వనించింది. మరాఠా సామ్రాజ్య ’పండిత్ ప్రధాన్’ అయిన బాజీరావును మృత్యువు కబళించకుండా ఉండడానికై చేసిన ప్రయత్నాల్లో ఇదొకటి. సరిగ్గా 278  సంవత్సరాల వెనుక ఇదే రోజున జ్వరంతో కూడిన చిన్నపాటి నలతతో ఒక మహా సేనాని కన్నుమూసాడు.

మరాఠా సామ్రాజ్యాన్ని 41 ఏళ్ళ పాటు పాలించిన ఛత్రపతి సాహు యువకుడైన బాజీరావును, అతని తండ్రి మరణించిన పదిహేనవ రోజునే, అత్యున్నత మంత్రి పదవిని అందించాడు. తన సలహాదారులు వద్దని వారించినా వినని సాహూ నూనూగు మీసాల యువ బాజీరావును ఎన్నుకున్నాడు.

మొగలాయి నిర్బంధం నుండి బయట పడిన సాహూకు  బాజీరావు తండ్రి బాలాజీ విశ్వనాథ్ తన జీవితాంతం అండగా నిలబడివున్నాడు. విధేయతతో మెలిగాడు. 1715 నాటికి సాహూ మరాఠాల రాజుగా స్థిరపడ్డాడు. అతని బాటు బాలాజీ విశ్వనాథ్ కూడా అంచెలంచెలుగా ఎదిగాడు. చివరకు పేష్వా (ప్రధానమంత్రి)గా నియమింపబడ్డాడు. బాలాజీ విశ్వనాథ్ ఎదుగుదలను చూసి సహించలేని కొందరు మరాఠా నాయకులు దక్కను ప్రాంతాన్ని పాలిస్తున్న అప్పటి మొగలాయ్ రాజప్రతినిధి వైపుకు వెళ్ళిపోయారు. మరొకవైపు సాహూ తన పిన్ని తారాబాయి నుండి ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. ఇన్ని అడ్డంకుల మధ్య బాలాజీ విశ్వనాథ్ సహాయంతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కనుకనే బాలాజీని తన ప్రధానిగా నియమించాడు సాహూ.

బాలాజీ పెద్ద కొడుకు బాజీరావు తన పదకొండవ ఏట నుండే అతు యుద్ధరంగంలోను, ఇటు రాయబార కార్యాల్లోనూ తండ్రికి తోడుగా పనిచేసాడు. అవి పిల్లలను అతి చిన్న వయసులోనే అనేక విద్యల్లో తర్ఫీదు నిచ్చే రోజులు. ఆ కాలానికి తగ్గట్టుగా బాజీరావు అతి చిన్న వయసులోనే శాస్త్రాలను చదువుకున్నాడు. యుద్ధవిద్యల్ని నేర్చుకున్నాడు. రాజకీయ వ్యవహారాలను అర్థం చేసుకున్నాడు. తన తొలిరోజుల్లోనే మాళ్వా నుండి శ్రీరంగపట్టణం వరకు జరిగిన అనేక చెదురు మదురు యుద్ధాల్లో బాజీరావు నేరుగా పాల్గొన్నాడు. తమ రాజు పట్ల గల అభిమానాన్ని, విశ్వాసాన్ని ఆవిధంగా చాటుకున్నాడు ఈ అనుభవాల కారణంగా పేష్వాగా ఎన్నికైన తర్వాత సుమారు నాలుగు సంవత్సరాల పాటు నిజామ్ ఉల్ ముల్క్ కు పక్కలో బల్లెంలా మారి, మరాఠా ప్రాంతాల్ని మొగలాయ్ ఆక్రమణ నుండి కాపాడాడు. ఆవిధంగా సతారా సామ్రాజ్యాన్ని (సాహూ ఏలుబడిలోనిది) అదేవిధంగా కొల్హాపూర్ రాజ్యాన్ని (సాహూ సోదరుడు సంభాజీ పాలించినది) అన్యాక్రాంతం కాకుండా రక్షించాడు.

Buy ‘Era of Bajirao’ on Amazon
1726లో సంభాజీని తన వద్దకు రప్పించుకున్న నిజామ్ ఉల్ ముల్క్ అతణ్ణి మరాఠా సామ్రాజ్యాధినేతగా చేస్తానని మాటనిచ్చాడు. సాహూని ఎలాగైనా సరే తొలగించి తీరుతానని నమ్మబలికాడు. అన్న మాట ప్రకారం పెద్ద సైన్యంతో పూణె మరియు సతారా పట్టణాల్ని చుట్టుముట్టాడు. సాహూ వెంటనే బాజీరావును పిలిపించాడు. ఆ సమయంలో బాజీరావు వద్ద ఫిరంగులు లేవు. కాల్బలం (infantry) కూడా తగినంతగా లేదు. ఉన్న సైన్యంతో మొగలాయిల భారీ సైన్యాన్ని ఎదుర్కోవడం కష్టమైన పని. ఛత్రపతి సాహూను తన తమ్ముడు చీమాజీ అప్పా రక్షణలో ఉంచాడు. రాజును, అతని పరివారాన్ని పటిష్టమైన పురందర్ కోటకు తరలించాడు చీమాజీ అప్పా.

బాజీరావు తన విశ్వాసపాత్రులైన మహావీరులు మల్హర్జీ హోల్కర్, రణోజీ సింధియా, పిలాజీ జాధవ్, దవల్జీ సోమవంశీలను తీసుకుని సైన్యసమేతంగా నిజామ్ ఉల్ ముల్క్ కు చెందిన ప్రాంతాల్లో కల్లోలం సృష్టించాడు. నిజామ్ రాజధాని ఐన ఔరంగాబాద్ తో ప్రారంభించి జల్నా మొదలైన పట్టణాల్ని చుట్టుముట్టి చివరకు  విదర్భ ప్రాంతం వరకూ అల్లకల్లోలం చేసాడు. ఆ పై మొగలాయిలకు ప్రాణప్రదం, ప్రతిష్టాత్మక పట్టణం అయిన బుర్హాన్‍పూర్ వైపుకు తిరిగాడు. బాజీరావును ఆపడానికని నిజామ్ పూణెకు వచ్చాడు. ఆలోపు బాజీరావ్ గుజరాత్ వైపుకు వెళ్ళాడు. అక్కడవున్న మొఘల్ సుబేదార్ ను నిజామ్ కు ఎదురుగా పంపించాడు. ఆ సుబేదార్ నిజామ్ తో “బాజీరావు నీ పై వేరే చోట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడ”ని చెప్పించాడు. దాంతో నిజామ్ మళ్ళీ పూణేకు తిరిగి వచ్చేసాడు. ఆపై కొద్ది వారాలలో బాజీరావ్ మళ్ళీ నిజామ్ రాజధాని ఔరంగాబాద్ పై దాడి చేసాడు. తన రాజధానిని కాపాడుకోవడానికై నిజామ్ అన్నింటినీ వదులుకొని పరుగెత్తాడు.

నిజామ్ తప్పక వస్తాడని ఊహించిన బాజీరావు దారికి అడ్డంగా ఉన్నా “బంజారా”లనబడే వ్యాపారుల్ని తరిమేసాడు. ఈ బంజారులు సైన్యంతో పాటూ ప్రయాణిస్తూ వాళ్ళకు సరుకుల్ని అమ్ముతుంటారు. తన దారిని సుగమం చేసుకున్న బాజీరావ్ మొఘల్ సైన్యాన్ని ఇరుకున పెట్టే ప్రణాళికల్ని అమలు చేయసాగాడు. బాజీరావ్ ను ఎదుర్కోవడానికి భారీ ఫిరంగులతో బయల్దేరాడు నిజామ్. చివరకు అవే అతని మెడకు గుదిబండలుగా మారాయి. ఆ బరువైన ఫిరంగుల్ని లాక్కొంటూ చేస్తున్న ప్రయాణం  చాలా కష్టంగాను, నత్తనడకగానూ మారింది. ఇదే అదనుగా మెరుపు వేగంతో కదిలే మరాఠా అశ్వికదళం నెమ్మదిగా కదుల్తున్న నిజామ్ సైన్యాన్ని నాలుగు వైపుల నుండి ముట్టడించింది. ఆవిధంగా మొఘల్ సైన్యం నిర్బంధానికి గురయింది. తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి కూడా కరవయింది. అంత పెద్ద సైన్యానికి నీళ్ళు, తిండి పెట్టలేక నిజామ్ అవస్థల పాలయ్యాడు. చివరకు మరాఠాలతో సంధి కుదుర్చుకోవల్సింది వచ్చింది. ఇదంతా “పల్‍ఖేడ్” అన్న గ్రామం వద్ద జరిగింది. ఇలా ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా నిజామ్ పై గొప్ప విజయాన్ని సాధించాడు బాజీరావు. ఈ ఓటమి ఫలితంగా సంభాజీని దూరం పెట్టాడు నిజామ్. అంతేకాదు, తన ఏలుబడిలోని ప్రాంతాలలో పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని కూడా మరాఠాలకు కట్టబెట్టాడు.

ఆకాలం నాటి ప్రసిద్ధ మొగలాయి సర్దార్ అయిన నిజామ్ పై యువ బాజీరావ్ సాధించిన గెలుపు దేశమంతా సంచలనాన్ని సృష్టించింది.

1727లో బాజీరావు తమ్ముడు చీమాజీ అప్పా మాళ్వా పై దాడి చేసాడు. ఈ మాళ్వా ప్రాంతం ఉత్తర-దక్షిణ ప్రాంతాలకు మధ్య వంతెన లాంటిది. అంఝేరా అన్న ప్రాంతం దగ్గర ఆరు గంటల పాటు జరిగిన భీకర యుద్ధంలో మొఘలాయ్ సుబేదార్ అయిన గిరిధర్ బహదూర్, అతని తమ్ముడు దయా బహదూర్‍లు చనిపోయారు. ఇది చీమాజీ అప్పా నాయకత్వం వహించిన మొట్టమొదటి దండయాత్ర. బాజీరావు ఎప్పటికప్పుడు ఈ విషయాలను తెలుసుకొన్నాడు. చీమాజీ విజయ వార్త రాగానే తాను కూడా గర్హా మండల్ అన్న ప్రాంతం ద్వారా మాళ్వా చేరుకున్నాడు. ఆ తర్వాత బుందేల్ ఖండ్ వైపుకు కదిలాడు. అప్పటి బుందేల్ ఖండ్ పాలకుడయిన ఛత్రసాల్ మరో మొఘల్ సర్దార్ అయిన మొహమ్మద్ బంగాష్ తో పోరాడుతున్నాడు. బంగాష్ బుందేల్ ఖండ్ ను తన చక్రవ్యూహంలో బంధించివుంచాడు. అందుకని చత్రసాల్ పేష్వా బాజీరావ్ సహాయాన్ని కోరాడు. ఏమాత్రం పరిచయం లేని బుందేల ప్రాంతాల గుండా ప్రయాణించిన బాజీరావ్ తన మెరుపు కదలికల్తో బంగాష్ ను నిర్ఘాంతపరిచాడు. అంతేకాదు, అతన్ని జైట్పూర్ అడవుల్లోకి తరిమేసాడు. ఆ అడవుల్లో బంగాష్ ను తన వ్యూహంలో మూడు నెలల పాటు నిర్భంధించాడు బాజీరావ్. చివరకు బంగాష్ దిగివచ్చాడు. పేష్వాతో సంధి కుదుర్చుకుని “ఇంకెప్పుడూ బుందేల్ ఖండ్ వైపు కన్నెత్తైనా చూడ”నని మాట ఇచ్చాడు. తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా బుందేల్ ఖండ్ రాజ్యంలోని ఒకవంతు భాగాన్ని పేష్వాకు కానుకగా ఇచ్చాడు ఛత్రసాల్. పన్నా ప్రాంతంలోని వజ్రాల గనుల్ని కూడా వ్రాసిచ్చాడు. వీటితో బాటు ఒక ముస్లిమ్ మహిళ ద్వారా తనకు పుట్టిన “మస్తని” అన్న అమ్మాయిని కూడా బాజీరావుకు ఇచ్చాడు ఛత్రసాల్.

(ఇంకా ఉంది…)

 

Buy this book on Amazon

Uday S. Kulkarni

Uday S. Kulkarni

Surgeon, Author - 'Solstice at Panipat', 'Bakhar of Panipat' and 'The Era of Bajirao'. History. AFMC. IndianNavy. Twitter: @MulaMutha

You may also like...

1 Response

 1. March 1, 2019

  […] మొదటి భాగం కు కొనసాగింపు… […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *