మనసొక మధు కలశం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

అతనొక రచయిత. ఆమె అతని అభిమాని.

ఆమెకు అతనంటే అభిమానం, ఇష్టం. ఆమెలో వెన్నెలని, వెన్నెలలో ఆమెని చూడగలిగిన భావుకత అతనిది.

ఆమె ప్రేమిస్తోందని అతనికి తెలుసు. అతను ప్రేమిస్తున్నాడని ఆమెకి తెలుసు. ఇద్దరికి తెలిసిన నిజాన్ని ఎవరు ముందు చెబుతారా అని ఇద్దరి మనసులు పోటీ వేసుకున్నాయి. సరసాల ఈ సరదా పోటీలో విజేతలెవ్వరో..?

**********

“హలో శరత్ నువ్వేనా.. ఏంటి గురు నీ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా..? అంత బిజీ అయిపోయావా..?”

“అవును మరి ప్రస్తుతం మూడు పత్రికల్లో సీరియల్స్ వ్రాస్తున్నాను. ఒకటి ప్రొడక్షన్‌లో వుంది.”

“చాలు బాబు..చరిత్ర తొవ్వకు. ఈ రోజు మన మీటింగ్ పాయంట్‌కిరా. నీతో మాట్లాడాలి.!”

“ఏంటి విషయం.. హలో.. ఏయ్ మాధవీ..” అప్పటికే ఆమె పెట్టేసింది.

అతను నవ్వుకుంటూ ఫోన్ కింద పెట్టేశాడు. అతనికి తెలుసు మాధవి మాటంటే మాటే. అసలా మాటల్లో ఏం మహత్యం వుందో అభిమాని ఒక స్నేహితురాలైంది..అతని ప్రాణమైంది. “సాయంత్రం వెళ్ళక తప్పదు” – అనుకున్నాడు మనసులో.

 

శరత్ ఎదురుగా పాఠకుల నించి వచ్చిన వుత్తరాలు ఒక ముప్పై దాకా వున్నాయి. యధాలాపంగా ఒక్కొక్కటే తీసి చింపి చదవటం మొదలెట్టాడు. అన్నింటిలో దాదాపు ఒకే విషయం – “మీరు కలం పేరుతోనే ఎందుకు వ్రాస్తారు? మీ అసలు పేరు తెలుసుకోవాలని వుంది. మీ పేరు చెప్పండి.” అంటూ. చివరగా తీసిన కవరు చదవగానే ముందు అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు – అర్థంకాగానే నవ్వుకున్నాడు. అతనిలో చిలిపితనం చిందులు తొక్కింది. మెరుపులా మెరిసిన ఆలోచన మాధవి మీద ప్రయోగించాలనుకుంటూ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు.

**********

“బోలో యార్.. ఏంటి సంగతులు..?” మాధవి అడిగింది ఆ సాయంత్రం.

“నథింగ్”

“నథింగా? అది చెప్పుకోడానికా ఇక్కడికొచ్చింది?” ఉడుకుగా అడిగింది.

“నేనా రమ్మన్నాను?” ఎదురు ప్రశ్న వేశాడు శరత్.

“ఓకే ఒకే.. ఇప్పుడు ఏం కావాలో చెప్పు”

“ఎనీథింగ్.. తియ్య తియ్యగా” అతని కళ్ళలో చిలిపిదనం

“వాట్” అరిచింది మాధవి.

“అదే ఏదైనా ఐస్‌క్రీం”

“ఈడియట్ సరిగా చెప్పొచ్చుకదా”

“ఏయ్ ప్రఖ్యాత రచయితని తిట్టేస్తున్నావు..” అన్నాడు వేలు చూపిస్తూ.

“ఓకే సార్ క్షమించండి.. ” బుంగమూతి పెట్టింది మాధవి.

కొద్దిసేపు ఎవరూ మాట్లాడుకోలేదు. బేరర్ ఆర్డర్ తీసుకోని, బటర్‌స్కాచ్ ఐస్‌క్రీం తెచ్చి బల్ల మీద సర్దాడు.

“అవును నెక్స్ట్ నావల్ ఏం వ్రాస్తున్నావు?” మాధవి అడిగింది మాట్లాడటానికి ఏ విషయం దొరక్క.

“ఒక వెరైటీ నోవల్ ప్లాన్ చేస్తున్నాను..”

“అయితే అందులో హీరోయిన్‌కి నా పేరు పెట్టాలి..”

“నో..నో.. హీరోయిన్ పేరు ఎప్పుడో డిసైడ్ చేశాశాను – అనంత లక్ష్మి”

“హు అనంత లక్ష్మా? హీరో పేరేంటి సుబ్బారావా?” అడిగింది టీజింగ్‌గా.

“కొంచెం అలాంటిదే – సుబ్బరామయ్య” అన్నాడతను.

“ఏయ్.. నీకేమైనా పిచ్చా? మొన్నటిదాకా సుమధార, కౌస్తుభ్ అంటూ మోడ్రన్ పేర్లు పెట్టి ఇప్పుడు ఉన్నట్టుండి ఇలంటి పాత చింతకాయ పేర్లు పెడితే..”

 

“ఏం పెట్టకూడదా? అసలు నాలాంటి రచయితల వల్లే సుబ్బారావు, అప్పారావు లాంటి పేర్లు మాయమైపోతున్నాయి.. అచ్చమైన తెలుగు పేర్లు కదూ అవి. ఇదొక రకమైతే కొంతమంది వెరైటీగా వుంటే అర్థంలేని పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ఆఖరికి మగపిల్లల పేర్లు ఆడవాళ్ళకి, ఆడపిల్లల పేర్లు మొగ పిల్లలకి పెట్టేస్తున్నారు. మొన్నా మధ్య మా ఫ్రెండ్‌కి కూతురు పుడితే పేరే దొరకనట్టు విదూషక అని పెట్టాడు. అర్థం తెలుసా అంటే తెలియదన్నాడు..”

 

కిల కిల నవ్వింది మాధవి.

“నాట్ జోక్ మధు.. దీనికి కొద్దో గొప్పో నాలాంటి రచయతలకి కూడా బాధ్యత వుందనిపించింది. చిత్ర విచిత్రమైన పేర్లు కనిపెట్టి సుబ్బమ్మలు, వెంకట్రావులు మాయం చేస్తున్నారు. అందుకే ఇక నుంచి నా కథల్లో హీరో హీరోయిన్లకి సాధారణమైన పేర్లే పెడతాను.”

“మంచిది. వీలైతే నీకు పుట్టే పిల్లలకి కూడా పుల్లారావని,తిరుపతమ్మ అని పెట్టుకో.. సరేనా.. ఇంక ఆపు. నీ నవలల గురించి మొదలుపెడితే ఇంక ఆపవు కదా..”

“ఏయ్ మధు.. నా నవలలని మాత్రం ఏమనకు.. అవి చదివే కదా నువ్వు నన్ను లైక్ చేసింది..!”

“అలా అని నేనెప్పుడైనా చెప్పానా? నేను లైక్ చేసేది నీ రచనలని నిన్ను కాదు..”

“అంతేనా?” దెబ్బతిన్నట్టు చూసాడు శరత్.

“అవును.. అంతకన్నా ఇంకేముంటుంది?”
“అవును.. ఇంకేముంటుందిలే..” అని ఏదో గుర్తుకు వచ్చినవాడిలా – “నీకు చెప్పడం మర్చిపోయాను.. ఒక అభిమాని నుంచి ఒక వుత్తరం వచ్చింది. వెరీ పెక్యూలియర్..” అన్నాడు టాపిక్ మారుస్తూ.

“నాకేం నీ ఫాన్స్ మీద ఇంట్రస్ట్ లేదు.”

“ఓకే.. లవ్ లెటర్ కదా చూపిద్దామనుకున్నాను”

“ఏయ్.. లవ్ లెటరా? ఏది ఇటివ్వు. ఇదేనా” అంటూనే పాకెట్‌లోనించి కవర్ తీసుకుంది మాధవి.

శరత్‌కి అందకుండా ఒడుపుగా తప్పించి, తీసి చదవడం మొదలుపెట్టింది మాధవి.

“ఏమని సంబోధించాలో అర్థం కావటంలేదు. పేరు పెట్టి పిలిచేందుకు మనసు వొప్పుకోవటంలేదు. మరింకేమైనా అనేందుకు చనువులేదు..! మీ రచనలు చదివాను. ఊహు.. మీ రచనల్లోనే బతికాను. మీరు వ్రాసే అక్షరం అక్షరం ఒక అద్భుతం. ప్రతి పదం మాటున దాగిన భావుకత గుండెల్లో చేరి రాగరంజితం చేస్తుంది. అడుగడుగునా చిలిపితనం తొంగిచూసే మీ రచనలు చదువుతుంటే నన్ను నేనే మర్చిపోతుంటాను. మిమ్మల్ని కలవాలని, శరశ్చంద్రిక రూపమైన మీ దరహాసాన్ని చూడాలని, ఆ అధరాలపై తీయటి మధురాక్షరాలు వ్రాయాలని నాకనిపిస్తోంది.

దీన్ని మీరు ప్రేమ అనుకున్నా నేను మాత్రం అనుబంధమనుకుంటున్నాను. లేకపోతే ఎక్కడో వున్న నేను మీకు ఇలా వుత్తరం వ్రాయటం ఏమిటి? మీ రూపం నాకు తెలియదు. నా రూపం (ఫొటో) మీకు పంపుతున్నాను. మీ అక్షరాల మాటున దాగిన మీ భావాలు నేను చదువుకున్నాను. నా ఈ ఉత్తరంలో నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.–ఇట్లు–మీ కోసం పరితపించే–మీ భవాని”

” హు భవాని… చూశావా శరత్.. నీ నవలల్లోంచే నాలుగు డైలాగులు ఏరేసి లెటర్ రాసేసింది. పైగా అనుబంధమంట.. అ-ను-భం-ధం” అంది మాధవి ఉక్రోషంగా.

“అనుభంధం అనకూడదు.. అనుబంధం..” సరిచేశాడు శరత్.

“స్టాపిట్.. శరత్.. అంతా రబ్బిష్.. ఎవరో అనాకారి పిల్ల చేసుంటుంది..”

“లేదు మాధవి! బాగానే వుంది!” అంటూ మాధవి రియాక్షన్ గమనించి ” ఫోటో పంపించింది కదా” చెప్పాడు శరత్.

“ఎంతందంగా వుందేం?” వెటకారంగా అడిగిందింది మాధవి. శరత్‌కి కావాల్సిందదే. అందుకే తడుముకోకుండా అన్నాడు –

“నీ కన్నా కొంచెం ఎక్కువే” అని.

“నీకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు..” అంది మాధవి హడావిడిగా ఐస్‌క్రీం పూర్తిచేస్తూ.

“లేదు మధు.. ఈ వుత్తరంలో ఆ అమ్మాయి మనసు కనిపిస్తోంది. నిజంగానే ఎంతో ప్రేమిస్తున్నట్టు!”

“నీకు కొంచెం ఓవర్ అనిపించట్లేదా?” అంటూ లేచి నిలబడి బిల్ వైపు చూపిస్తూ “డబ్బులిచ్చెయ్. థాంక్స్ ఫర్ ది పార్టి” అంటూ వెళ్ళిపోయింది మాధవి. శరత్ నవ్వుకున్నాడు.

**********

“మాధవి నీతో నేనొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని ఇక్కడికి పిలిచాను.” అన్నాడు శరత్. అప్పటికే పై సంఘటన జరిగి రెండు వారాలైంది.

“చెప్పు” ముభావంగా అంది మాధవి.

“భవాని.. అదే నీకు తెలుసుగా.. మొన్న లెటర్..”

“తెలుసు” తుంచేస్తూ అంది మధు.

“ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానేమో అని అనిపిస్తోంది మధు. అదే విషయం లెటర్ వ్రాద్దామనుకుంటున్నాను.”

“వాట్! నిజంగానే! ఐ మీన్ ఇంత తక్కువ టైంలో?”

“అవును మధు. నాకు ఆశ్చర్యంగానే వుంది. నాకు నీ సలహా కావాలి..అందుకే..” అంటూ చెప్పబోయాడు శరత్.

“నేనెందుకు ఇవ్వాలి..?” కోపంగా అడిగింది మాధవి.

“అందుకంటే.. ఆ అమ్మాయి వ్రాస్తున్న ప్రతి వుత్తరం నీకు చూపిస్తున్నాను కాబట్టి. నేను పంపే లెటర్స్ నీకు చూపించాను.” చెప్పాడు.

“అదే..అసలు నాకెందుకు చూపించావు” అప్పటికే చాలా కోపంగా వుందామెకు.

“ఎందుకంటే..నువ్వు నాకు మంచి ఫ్రెండ్‌వి. అందుకే..”

“ఫ్రెండ్.. జస్ట్ ఫ్రెండ్.. అంతేనా? ఇంకేం లేదా?”

“అంతే ఇంకేముంటుంది?” అన్నాడు శరత్ మామూలుగా.

“ఓహో నా డైలాగ్ నాకే చెప్తున్నావన్నమాట! నిన్నగాక మొన్న పరిచయమైందే నీకు ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి ప్రేమిస్తున్నాంటే ఇట్టే అర్థమైపోయింది. నా మనసు ఎప్పటికి అర్థమైయ్యేట్టు? నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం ఎప్పటి తెలుసుకుంటావు?” మధు కళ్ళలోనించి కన్నీళ్ళు రాలడానికి సిద్ధంగా వున్నాయి. మరీ తెగేదాకా లాగిన విషయం అర్థమై శరత్ ఏదో అనబోయాడు.

“నాకు నీ వివరణ, సంజాయిషీ అవసరంలేదు.. ఇంక నించి నన్ను డిస్టర్బ్ చెయ్యద్దు ప్లీజ్” చెప్పింది మాధవి. ఇక కన్నీళ్ళని ఆపటం ఆమె వల్లకాలేదు.

శరత్ దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి అన్నాడు –

“ఈ మాత్రానికే ఇలా ఏడ్చేస్తే ఎట్లా.. ఎప్పుడూ నువ్వు నన్ను ఏడిపిస్తావు కదా అని.. సారి… వెరీ సారి..”

“అంటే..?” అదిగింది మాధవి అనుమానంగా.

“అంటే ఏమి లేదు.. నువ్వనుకున్నట్టు ఆ భవాని మిస్ భవాని కాదు..మిస్టర్ భవాని..”

“ఏంటి.. మిస్టరా?”

“అవును భవానీ ప్రసాద్.. ఫోటో చూస్తే తెలిసేది..”

“వాట్ డూ యు మీన్??”

“నువ్వనుకునేదేమి కాదు..సరదాగా నిన్ను టీజ్ చెయ్యడానికి చెప్పాను..”
“మరి మగవాడైతే నీకు లెటర్ ఎందుకు వ్రాసినట్టు??”

“ఎందుకంటే నా రచనలు చదివేవారికి నేను ఆడో మొగో తెలియదు కాబట్టి. కలం పేరు రాజహంస కదా అంటే అమ్మాయి అనుకున్నారు చాలామంది. అలాగని నాకు లెటర్స్ వస్తూనే వుంటాయి.. కాకపోతే ఈ లెటర్ చూడగానే..”

“నన్ను ఏడిపిద్దామనిపించింది..”

“అవును..” నవ్వాడు శరత్.
“యు ఆర్ ఎన్ ఈడియట్. నీకు ఇందుకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే..” నవ్వింది మధు.

“చెప్పు ఏం కావాలో”
“ఎనీథింగ్ తియ్య తియ్యగా..”

“యూ మీన్ ఐస్ క్రీం..” అడిగాడు శరత్.

“నో.. సంథింగ్ ఎల్స్” కన్ను కొట్టింది మాధవి.

 
**********

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *