మనవూరి పాండవులు

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
పాండవుల గురించి అందరికీ తెలుసు. వాళ్ళు అప్పుడెప్పుడో అనగనగనగా కాలం నాటి వాళ్ళు. వాళ్ళ పై బోలెడు చిత్రాలు వచ్చాయి. వాటిల్లోని పద్యాలు ఇప్పటికీ ఘనంగానే మోగుతుంటాయి.

అందర్లా చేస్తే మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏటుంటదని అనుకొన్నారో ఏమో, బాపు-రమణ జోడి పాత కథకు కొత్త రంగులు జోడించి “మనవూరి పాండవులు” తయారు చేసారు.

సూక్షంగానే కాక స్థూలంగా కూడా విప్లవ భావాల్ని ప్రతిఫలించే ఈ చిత్రంలో ఆ మార్కు సగటు చిత్రాల్లోలా అరుపులు, కేకలు, గొడవలు లేకుండా తీయడం జరిగింది. ప్రేక్షకుల్ని ఒప్పించడమూ జరిగింది. ఇదో ఆశ్చర్యం.

పాత్రలు:

పేరుకు తగ్గట్టే ఈ చిత్రంలోని పాత్రలు మహాభారతం నుండే పునర్జన్మించాయి.

రాంభూపాల్ (దుర్యోధనుడు – రావుగోపాలరావు) చుట్టుపక్కల ఉన్న 12 పల్లెల్ని ఏలే మహరాజు లాంటి దొరగారు. కన్నప్ప (శకుని – అల్లు రామలింగయ్య) అతనికి మంత్రి. సుబ్బడు అంగరక్షకుడు.

అదే వూళ్ళో ఉండే మంచివాళ్ళు ధర్మయ్య (కాంతారావు), పూజారి (రమణమూర్తి). వీళ్ళల్లో ధర్మయ్య దొరగారికి దాసోహం అనే రకం. పూజారే కాస్త తిప్పికొట్టి మాట్లాడేతనం ఉన్నవాడు.

పై పెద్దలు కాక ఆ వూళ్ళో మంచివాళ్ళైన ఐదుమంది కుర్రవాళ్ళు ఉన్నారు. వారు (1) రాముడు (ధర్మయ్య కొడుకు – మురళీమోహన్), (2) పార్థు (దొరగారి మేనల్లుడు – చిరంజీవి), (3) భీముడు (జీతం, బత్తెం లేని దొరగారి పాలేరు – ప్రసాద్ బాబు) (4) & (5) వూళ్ళోని అంటరానోళ్ళు (భానుచందర్, విజయ భాస్కర్)

పాండవులున్న తర్వాత పిల్లంగోవి మాయలోడు కూడా ఉండాలి కదా అని సందేహపడకూడదు. ఉన్నాడు. అతడే కృష్ణుడు – దొరగారి స్వంత తమ్ముడు (కృష్ణంరాజు). ఉన్న తేడా అల్లా పిల్లంగోవికి బదులు సారాబుడ్డీ ఊదుతాడు ఆ వూరి కృష్ణుడు.

పార్థుడి తల్లి శాంతమ్మ కుంతి పాత్రతో పోల్చవచ్చు.

టూకీగా కథ:


అదో పల్లెటూరి. పెత్తందారీ పాలనలో నలిగిపోతుంటుంది. దొరవారు వస్తేగానీ అమ్మోరి జాతర జరగని పరిస్థితి. దొరవారు
కన్నేస్తే అమ్మాయిల శీలం కొల్లబోయే స్థితి. అంటరాని వాళ్ళ అమ్మాయి సుందరి. అమ్మోరి సాక్షిగా పెళ్ళి చేసుకొంటానని చెప్పి మోసం చేసి, గర్భవతిగా వదిలేస్తాడు దొర. పిచ్చిదైపోతుంది ఆ సుందరి.

ఈ అన్యాయాల పై మొదటసారిగా తిరగబడతాడు పార్థు. అటుపై రాముడు వచ్చి జత చేరతాడు. 20 ఏళ్ళు వుప్పు తిని బదికిన భీముడు కూడా తిరగబడతాడు. వీళ్లతో బాటే తిరుగుబాటు అంటారు అంటరాని అన్నదమ్ములు. అందర్నీ దొమ్మీ కేసులో ఇరికించి జైలు పంపుతాడు దొర.

ఈలోపు దొర కొడుకు (సారథి) ఒక అమ్మాయి (ఊర్వశి – హలం) కలిసి ప్రజల డబ్బు దోచే పథకాన్ని అమలు చేసి నగ, నట్ర ఉన్న పెట్టె తో పారిపోతుంటే దొర తమ్ముడు కృష్ణుడు ఆ పెట్టెను తప్పించేస్తాడు. అటుపై జైలు నుంచి విడుదలైన పాండవులకు ఉపదేశం చేసి శతృవర్గాన్ని ఇబ్బందులకు గురిచేస్తాడు. కడుపు మండిన దొర పాండవుల్ని వూరి నుండి వెలేయడమే కాక వాళ్ళుంటున్న గుడిసెను తగలబెట్టిస్తాడు.

కృష్ణుడి దయ వల్ల బ్రతికి బైటపడ్డ పాండవులు కొన్ని సినిమీయ ట్రిక్కుల్ని చేసి దొరను, వాడి తొత్తుల్ని భయపెడతారు. దొర చేసిన, చేస్తున్న, చేయబోతున్న అన్యాయాల్ని కృష్ణుడే దగ్గరుండి ధర్మయ్య లాంటి మంచివాళ్ళకు చూపిస్తాడు. దాంతో కళ్ళు, నోళ్ళు, గుండెలు మేలుకొన్న వూరు దుష్టుల్ని తరిమి కొడుతుంది.

దొర సంతానం తన కడుపులో ఉన్నందుకు కొడవలితో కడుపు కోసుకోబోయిన పిచ్చి సుందరిని “వదినమ్మా” అని పిలిచి ఆదరిస్తాడు కృష్ణుడు. కడుపున ప్రహ్లాదుడు పుడతాడని ధైర్యం చెప్పి ఊరడిస్తాడు.


కొత్తదనమేమిటి ?

బోలెడంత ఉంది.

బాపూ, రమణలకు ఇతిహాసాలను ఇప్పటి కాలానికి అన్వయించి రాయడమన్నది గొప్ప ఆసక్తి. “ముత్యాల ముగ్గు” చిత్రం రామాయణానికి అనుకరణే కదా ! అదే మార్గంలోనే భారతాన్ని కలియుగానికి అన్వయించడం ఈ చిత్రంలోని కొత్తదనం.

కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రవచించినా నారాయణమూర్తిలా అరిచి గోల చేయకుండా చిన్ని చిన్ని మాటల్తోనే ఆ సిద్ధాంతాల్ని బలంగా చెప్పించే విధం కూడా కొత్తదే.

బాలూ మహేంద్ర కెమరా పనితనం కూడా ఫ్రేమ్ ఫ్రేమ్ కూ కొత్తగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా “పిచ్చి గాలీ నువ్వు అరవకే, వెర్రి నేల గోడు పెట్టకే” అన్న పాటలోని ప్రతి ఫ్రేమూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో సందేహం లేదు.

ముళ్లపూడి మాటల సారధ్యంను చూస్తే పింగళి నాగేంద్రరావుకు సరైన వారసుడు ఈయనే అని అనిపిస్తుంది. “వూరే వీరు, వీరే వూరు”, “అయ్యగారు సాక్షాత్తు పంచాయితీ స్వరూపులు”, “ఏదీ నీ వీర బుర్రలోని ఆలోచన చెప్పు” వంటివి మచ్చుకు కొన్నే. అన్నీ వినాలంటే చిత్రం చూడాల్సిందే.

మామా మహదేవన్ సంగీతం గురించి చెప్పాలంటే “ఎవరూ కట్టకపోతే మాటలు పాటలెలా ఔతాయ్” అని అనాల్సిందే. ఈ చిత్రంలోని పాటలన్నీ మాటల్లానే ఉంటాయి. ఉదాహరణకు

          “ఒరే పిచ్చి సన్నాసి
          ఒరే పిరికి సన్నాసి
          ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి
          ఉన్న వూరు, కన్నతల్లి
          మరువకురా ఒరే ఒరే”

          “కండవున్న మంచోళ్ళు
          కాలిపోతే పోనీ
          గాలిలో తమ్ముళ్ళు
          కలిసిపోతే పోనీ
          కన్నీరుతో ఏరు పారకే
          నీ హోరుతో మమ్మల్ని లేపకే”

ఈ మాటల్ని గుండెను తడిపే రాగ వృష్టిలా మార్చిన మామ సరిగమల పనితనం నిజంగానే కొత్తది.

కృష్ణుడి పాటలన్నీ ఉపదేశాల్లాంటివి. ఆ మాటల్ని మామ రాగాలుగా మారిస్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చక్కటి రసౌచిత్యం తో పాడడం మరో ఎత్తు.

          “శకుని మామ వీడు
          శకున పక్షిగాడు
          మోసెయ్యి మోసెయ్యి తుమ్మెద
          కనెక్షను తీసెయ్యి తీసెయ్యి తుమ్మెదా”

అంటూ అల్లు రామలింగయ్యలా,

          “సిత్రాలు సూడరో శివుడో శివుడా
          సిందేసి ఆడరో నరుడో నరుడా
          …………
          ఇదే సిత్రమంటే”

అని ముమ్మూర్తులా కృష్ణంరాజులా పాడి, పలకడం బాలూ గాత్రంలోని వైవిధ్యతకు, కొత్తదనానికి నిదర్శనం.


చిరంజీవిముందు ముందు మెగాస్టార్ గా రూపాంతరం చెందబోయే చిరంజీవి ఈ చిత్రంలో దాదాపు సహాయ నటుడి పాత్రనే పోషించాడు. ఇది చిరంజీవి రెండవ చిత్రం.

రావు గోపాలరావు ముత్యాలముగ్గు కాంట్రాక్టర్ ఛాయనుండి ఇంకా బైటపడకపోయినా పెత్తందారీ పాత్రను అలవోకగా పోషించాడు. “ఇదో కన్నప్పా ! ఆట్టే మునగ సెట్టు ఎక్కించమాక. పైనుండి పడ్డానంటే నీ మీదే పడతాను. పచ్చడి ఐపోగలవు” లాంటి సాధారణ డైలాగ్ ను కూడా తనదైన స్వరంలో, బాణీలో చెపి రంజింప చేయడం రావు గోపాలరావు నటనలోని కీలకం.

ఎప్పటిలానే గోతికాడ గుంటనక్క పాత్రలో అల్లూ రామలింగయ్య నటన “అబ్బో! వీర కనెక్షనే కనెక్షను”.

“అగ్రజా! ఇది అరవైతొమ్మిదో తప్పు” అంటూ తన శైలికి భిన్నమైన సంభాషణా శైలితో కృష్ణంరాజు చాలా బాగా ఆకట్టుకొంటాడు.

కాంతారావు, రమణమూర్తి, మురళీమోహన్, భాను చందర్ మొదలైన వారి నటన సందర్భానుసారంగానూ, పాత్రోచితంగానూ ఉంటాయి.


ఇలా చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ పూర్తి స్థాయి పరిణితిని సాధించిన “మనవూరి పాండవులు” ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది.

చూడని వారెవరైనా ఉంటే

          కనెక్షను వేసేయి వేసెయి తుమ్మెద
          వెంటనె చూసేయి చూసెయి తుమ్మెదా ఆ ఆ ఆ
          మపదపమారిస తుమ్మెద

అని మాత్రమే చెప్పదల్చుకొన్నాను.


You may also like...

Leave a Reply