లక్ష్య నిర్ధారణ

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
భారతంలోని కథ ఒకటి ఇలా ఉంది.

వయోవృద్ధుడైపోయిన ఒక గురువు తన ఉత్తరాధికారిగా ఎవరిని నియమించాలా అని చాలా ఆలోచించాడు. తన వద్దే చదువుకొంటున్న శిష్యుల్లో ఎవ్వరికీ ఉత్తరాధికారాన్ని సమర్ధవంతంగా నిర్వహించే గుణం లేదని తెలుసుకొని ఖిన్నుడౌతాడు. కానీ స్థైర్యం కోలుపోక ఉపాయం ఆలోచిస్తాడు. తన గురుకులం ముందుగా పోతున్న కాలిబాట పక్కనే ఒక ప్రకటన రాయించి పెడతాడు. “ఈ గురుకులానికి ఉత్తరాధికారి కాదలచుకొన్నవారు ఎదురుగా ఉన్న కొండరాయిని ఒకరాత్రిలోగా ముక్కలు చేయాలి” అని ఆ ప్రకటన.

అది చదివిన చాలామంది ఈ ముసలి గురువుకు మతి చెడిందని అపహాస్యం చేస్తారు. రోజులు గడుస్తున్నా ఎవరూ ముందుకు రారు. కానీ ఒకరోజు ఒక వ్యక్తి ఆ దారిలో వస్తూ, ప్రకటనను చదివి, మౌనంగా వెనక్కి తిరిగివెళ్తాడు. కొద్దిసేపు తరువాత ఒక ఉలి, సుత్తి తీసుకువచ్చి బండరాయిని ముక్కలు చేసే పనిలో పడతాడు. గురుకులవాసులందరికీ ఆ వ్యక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. పదిమంది చేరి పదిరోజులు పనిచేస్తేనేగాని పగులకొట్టలేని ఆ కొండరాయిని ఈ ఒక్కడు ఒక్కరాత్రిలో ఎలా పగలకొడతాడనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంటుంది.

రాత్రంతా ఉలిని సుత్తి మోదుతున్న శబ్దమే ఆ గురుకులం అంతా ఆవరించుకొంది. తెలతెలవారగానే గురుకుల వాసులంతా మళ్ళీ ఆ రహదారిపై గుమిగూడతారు. ఆ వ్యక్తి ఇంకా బండరాయిని పగులకొడుతూనే ఉన్నాడు. కనీసం ఒక శాతం కూడా పగలకొట్టలేదు. ఇంతలొ అక్కడకు వచ్చిన గురువు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, పనిని ఆపించి, తనతో పాటు ఆశ్రమంలోకి తీసుకువస్తాడు. ఈ వ్యక్తే తన ఉత్తరాధికారియని ప్రకటిస్తాడు.

 
ఆ నిర్ణయాన్ని విన్న శిష్యులందరూ ఆశ్చర్యపోతారు. వారి మనసుల్లోని అనుమానాన్ని అర్థం చేసుకొన్న గురువు చిన్నగా నవ్వి “మీలో లేనిది, ఈతనిలో ఉన్నది లక్ష్య నిర్ధారణే. ఒక మనిషి ఒక రాత్రిలో పగలకొట్టలేని బండరాయిని పగలకొట్టమని అడిగితే ఎవరైనా సరే నవ్వుతారు. కానీ ఇతడు నా ప్రకటలోని ఆంతర్యాన్ని గ్రహించి అసాధ్యమైన పనికి పూనుకొన్నాడు. ఎందుకంటే నా లక్ష్యం ఏమిటో ఇతనికి అవగతమైంది. నా లక్ష్యమే ఇతని లక్ష్యం అవడం చేత అడ్డంకుల గూర్చి ఆలోచించకుండా కార్యోన్ముఖుడైనాడు. అందువలన మన లక్ష్యం ఏమిటో మనం స్పష్టంగా నిర్ధారించుకోగలిగిననాడే మనం మరొకరికి బోధించగలం” అని అంటాడు ఆ గురువు.

నిజమే కదూ! మనం చాలా పనుల్ని సక్రమంగా పూర్తి చేయలేకపోవడానికి ఉండే ముఖ్య కారణాల్లో ఒకటి లక్ష్య సిద్ధి లేకపోవడమే. ఆరంభశూరత్వం వల్ల లక్ష్యాన్ని చేరుకోలేము.

ఎక్కుపెట్టబడిన బాణానికి లక్ష్యము ఉండి తీరాలి. లేకుంటే వ్యర్ధమే. నడుస్తున్న దారి కూడా ఒక గమ్యాన్ని చేర్చగలగాలి. చేర్చలేని దారి ఎడారి మాత్రమే.

అయితే ఎందుకు లక్ష్యాన్ని నిశ్చయించుకోలేకపోతాము? అని ఆలోచిస్తే నాకు కొన్ని పాయంట్లు తోస్తున్నాయి. అవేమిటంటే..

1. అన్నీ ఇన్ స్టంట్ మయమైన ఈరోజుల్లో గురి చేరడం కూడ వెంటనే జరిగిపోవాలని అత్యాశ పడడం.

2. సరైన అవగాహన లేకుండానే పనులకు పూనుకోవడం.
3. కావల్సిన సమాచారాన్ని సకాలంలో సేకరించుకోకపోవడం
4. అనుభవజ్ఞులను సంప్రదించకపోవడం
 
తోచిన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం కంటే మనకు సరిపోయే లక్ష్యాలను నిర్ణయించుకోవడం ఉత్తమం. కొన్నికొన్నిసార్లు ఇది కూడ కష్టమైనదిగానే అనిపిస్తుంది.

లక్ష్యాన్ని నిశ్చయించుకొని, చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టిన తరువాత ఎన్నో ఆవాంతరాలు, ఏకాగ్రతను కోల్పోయే సందర్భాలూ ఎదురౌతాయి. వాటిల్ని ఎదుర్కోవడానికి కావలసిన ఒకేఒక ఆయుధం ఆత్మ విశ్వాసం. అది నిండుగా ఉన్నప్పుడు మనల్ని మనం సరైన మార్గంలోనే ఉంచుకోగలం. చీమను చూడండి! తను వెళ్ళి వచ్చే దారిలో ఏ అడ్డంకి వచ్చినా తొట్రుపడకుండ, నింపాదిగా మళ్ళీ అదే దారిలోకి వచ్చి చేరుతుంది. అయితే మొట్టమొదటిసారిగా ఆ దారిని ఏర్పరుచుకోవడానికి అది ఎంత శ్రమ పడిఉండాలో కదా!

చీమ ఒకసారికి ఒక చక్కెర పలుకును తీసుకువస్తుంది. అలాగే పెద్ద లక్ష్యాన్ని సాధించడానికి పూనుకొన్నప్పుడు, ఆ లక్ష్యాన్ని చిన్ని చిన్ని అంశలుగా విడదీసినప్పుడే సులభంగా సాధించగలము. కానీ పాపము చీమ ఒక్కొక్క పలుకునే తీసుకొస్తే దానికి ఆయాసము కాదా అని సహాయం చేద్దామని ఎవరైనా దాని నెత్తిన చక్కెర మూటను పెడితే ఏమౌతుంది? అలాగే మన శక్తి, సామర్ధ్యాలకు మించిన లక్ష్యాలు కూడ బరువుగా మారి మనమే కృంగిపోగలం.

లక్ష్యము మరచి, దుఃఖితుడైన అర్జునుడికి కృష్ణుడు,

 
హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం
తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః
 
వీరునికి రెండే లక్ష్యాలు…మరణిస్తే వీరస్వర్గం, జయిస్తే రాజ్యాధికారం అని అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. రోజురోజుకీ పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్న మనకు కూడ రెండే లక్ష్యాలు. ఒకటి మనల్ని మనం లక్ష్య సిద్ధులుగా దిద్దుకోవడం. రెండు తోటివారికి తోడుపడడం.
 
 

You may also like...

Leave a Reply