నృసింహకవి విరచిత కృష్ణ శతకం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

1. శ్రీ రుక్మిణీశ కేశవ

నారద సంగీతలోల నగధర శౌరి

ద్వారకానిలయ జనార్ధన

కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణా

 

2. నీవే తల్లివి తండ్రివి

నీవే నా తోడునీడ నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము

నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా

 

3. నారాయణ పరమేశ్వర

ధారాధర నీలదేహ దానవ వైరి

క్షీరాబ్దిశయన యదుకుల

వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా

 

4. హరియను రెండుఅక్షరములు

హరియించును పాతకముల నంబుజనాభా

హరి నీ నామ మహత్వము

హరిహరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా

 

5. క్రూరాత్ము డజామీళుడు

నారాయణ యనుచు నాత్మనందనుబిలువ

నేరీతి నేలుకొంటివి

యేరీ నీసాటి వేల్పులందును కృష్ణా

 

6. చిలుక నొకరమణి ముద్దులు

చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరన్

బిలిచిన మోక్షము నిచ్చితి

వలరగ మిముదలచు జనుల కరుదా కృష్ణా

 

7. అకౄరవరద మాధవ

చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా

శక్రాది దివిజ సన్నుత

శుక్రార్చిత నన్నుకరుణ జూడుము కృష్ణా

 

8. నందుని ముద్దుల పట్టివి

మంధరగిరిధరుని హరిని మాధవ విష్ణున్

సుందరరూపుని మునిగణ

వందితు నిను దలతు భక్తవత్సల కృష్ణా

 

9. ఓ కారుణ్య పయోనిధి

నా కాధారంబగుచు నయముగ బ్రోవన్

నాకేల ఇతర చింతలు

నాకాధిప వినుత లోకనాయక కృష్ణా

 

10. వేదంబులు గననేరని

ఆదిపరబ్రహ్మమూర్తి వనఘ మురారి

నాదిక్కు జూచి కావుము

నీదిక్కే నమ్మినాడ నిజముగ కృష్ణా

 

11. పదునాలుగు భువనంబులు

కుదురుగ నీ కుక్షి నిల్పుకొను నేర్పరివై

విదితంబుగ నా దేవకి

యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా

 

12. అష్టమి రోహిణి ప్రొద్దున

నష్టమ గర్భమున బుట్టి నా దేవకికిన్

దుష్టుని గంసు వధింపవె

సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా

 

13. అల్ల జగన్నాధుకు వ్రే

పల్లియ క్రీడార్ధమయ్యె పరమాత్మునకున్

గొల్లసతి యా యశోదయు

దల్లియునై చన్నుగుడిపె దనరగ కృష్ణా

 

14. అందెలు గజ్జెలు మ్రోయగ

జిందులు ద్రొక్కుచును వేడ్క చేలువారంగా

నందుని సతి యా గోపిక

ముందర నాడుదువు మిగుల మురియుచు గృష్ణా

 

15. హరిచందనంబు మేనున

గరమొప్పెడు హస్తములను గంకణరవముల్

ఉరమున రత్నము మెరయగ

బరగింతివొ నీవు బాలప్రాయము కృష్ణా

 

16. పాణితలంబున వెన్నయు

వేణీమూలంబునందు వెలయగ బింఛం

బాణీముత్యము ముక్కున

నాణెముగా దాల్చు లోకనాధుడ కృష్ణా

 

17. మడుగుకు జని కాళీయుని

పడగలపై భరతశాస్త్ర పద్దతి వెలయన్

గడు వేడుకతో నాడెడు

నడుగులు నా మదిని దలతు నచ్యుత కృష్ణా

 

18. బృందావనమున బ్రహ్మా

నందార్బకమూర్తి వేణు నాదము నీ వా

మందార మూలమున గో

విందా పూరింతువౌర వేడుక గృష్ణా

 

19. వారిజ నేత్రలు యమునా

వారిని జలకంబులాడ వచ్చిన నీ వా

చీరలు మ్రుచ్చిలి యిచ్చితి

నేరుపుగా యదియు నీకు నీతియె కృష్ణా

 

20. దేవేంద్రు డలుకతోడను

వానిరిగా రాళ్ళవాన వడి గురియింపన్

గోవర్దనగిరి యెత్తితి

గోవుల గోపకుల గాచు కొరకై కృష్ణా

 

21. అండజవాహన విను బ్ర

హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా

కొండల నెత్తితి వందురు

కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణా

 

22. అంసాలంబితకుండల

కంసాతక నీవు ద్వారకాపురిలోనన్

సంసారి రీతినుండి ప్ర

శంసార్హుడవైతి వహహ జగతిని గృష్ణా

 

23. పదియారువేల నూర్వురు

సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్

విదితంబుగ బహురూపుల

వదలక దమియింతువౌర వసుధను గృష్ణా

 

24. అంగన పనుపున ధోవతి

కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా

సంగతి విని దయనొసగితి

రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా

 

25. హా వసుదేవకుమారక

కావుము నా మాన మనుచు కామిని వేడన్

ఆవనజాక్షికి నిచ్చితి

శ్రీవర యక్షయ మటంచు జీరలు కృష్ణా

26. శుభ్రమగు పాంచజన్యము

అభ్రంకషమగుచు మ్రోవ నాహావభూమిన్

విభ్రమలగు దనుజుసుతా

గర్భంబుల పగులజేయు ఘనుడవు కృష్ణా

 

27. జయమును విజయునికీయ్యవె

హయముల ములుకోల మోపి యదలించి మహా

రయమున రొప్పవె తేరును

భయమున రిపుసేన వెరిగి పారగ గృష్ణా

 

28. దుర్జనులగు నృపసంఘము

నిర్జింపగ దలచి నీవు నిఖిలాధారా

దుర్జనులను వధియింపను

నర్జును రధచోదకుండవైతివి కృష్ణా

 

29. శక్రసుతు గాచుకొరకై

చక్రము చేబట్టి భీష్ము జంపగ చను నీ

విక్రమ మేమని పొగడుదు

నక్రాగ్రహ సర్వలోకనాయక కృష్ణా

 

30. దివిజేంద్రసుతుని జంపియు

రవిసుతు రక్షించినావు రఘురాముడవై

దివిజేంద్రసుతుని గాచియు

రవిసుతు బరిమార్చితౌర రణమున గృష్ణా

 

31 దుర్భర బాణము రాగా

గర్భములోనుండి యభవకావుమటన్నన్

నిర్బరకృప రక్షించితి

వర్బకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా

 

32. గిరులందు మేరువౌదువు

సురలందున నిందుడౌదు చుక్కలలోనన్

బరమాత్మ చంద్రుడౌదువు

నరులందున నృపతివౌదు నయముగ గృష్ణా

 

33. చుక్కల నెన్నగ వచ్చును

గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్

జోక్కపు నీ గుణజాలము

నక్కజమగు లెక్కపెట్ట నజునకు గృష్ణా

 

34. కుక్షిని నఖిలజగంబుల

నిక్షేపముజేసి ప్రళయ నీరధి నడుమన్

రక్షక వటపత్రముపై

దక్షత బవళించునట్టి ధన్యుడ కృష్ణా

 

35. విశ్వోత్పత్తికి బ్రహ్మవు

విశ్వము రక్షింప దలచి విష్ణుడ వనగా

విశ్వము జెరుపను హరుడవు

విశ్వాత్మక నీవె యగుచు వెలయుదు కృష్ణా

 

36. అగణితవైభవ కేశవ

నగధర వనమాలి యాది నారాయణ యో

భగవంతుడ శ్రీమంతుడ

జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా

 

37. మగమీనమవై జలనిధిని

బగతుని సోమకుని జంపి పద్మభవునకున్

నిగమముల దెచ్చి యిచ్చితి

సుగుణాకర మమ్ము గరుణ జూడుము కృష్ణా

 

38. అందరు సురలును దనుజులు

పొందుగ క్షీరాబ్ది దరువ బౌలుపున నీ వా

నందంబుగ గూర్మమవై

మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా

 

39. ఆదివరాహమవయి నీ

వా దనుజు హిరణ్యనేత్రు హతుజేసి తగన్

మోదమున సురలు పొగడగ

మేదిని వడి గొడుగునెత్తి మెరసితి గృష్ణా

 

40. కెరలి యరచేత గంబము

నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్

ఉరమును జీరి వధించితి

నరహరి రూపావతార నగధర కృష్ణా

 

41. వడుగవునై మూడడుగుల

నడిగితివౌ భళిర భళిర యఖిలజగంబుల్

తొడిగితివి నీదు మేనున

గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణా

 

42. ఇరువదొకమారు నృపతుల

శిరములు ఖండించితౌర చేగొడ్డంటన్

ధర గశ్యపునకు నిచ్చియు

బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా

 

43. దశకంఠుని బరిమార్చియు

గుశలముతో సీతదెచ్చికొనియు నయోధ్యన్

విశదముగ గీర్తినేలిన

దశరధరామావతార ధన్యుడ కృష్ణా

 

44. ఘనులగు ధేనుకముష్టిక

దనుజుల జెండాడితౌర భుజశక్తిన్

అనఘాత్మ రేవతిపతి

యనగా బలరామమూర్తి వైతివి కృష్ణా

 

45. త్రిపురాసుర భార్యల నతి

నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్

కపటపురాజువు భళిరే

కృపగల బౌద్దావతార ఘనుడవు కృష్ణా

 

46. వలపుగల జేతి నెక్కియు

నిలపై ధర్మంబు నిలుప హీనుల ద్రుంపన్

కలియుగము తుదను వేడుక

కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా

 

47. వనజాక్ష భక్తవత్సల

ఘనులగు త్రైమూర్తులందు గరుణానిధివై

కన నీ సద్గుణజాలము

సనకాది మునీంద్రులెన్న జాలరు కృష్ణా

 

48. అపరాధ సహస్రంబుల

నపరిమితములైన యఘము లనిశము నేనున్

గమటాత్ముడనై చేసితి

జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా

 

49. నరపశువ మూఢచిత్తుడ

దురితారంభుడను మిగుల దోషగుడను నీ

గురుతెరుగ నెంతవాడను

హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా

 

50. పరనారీ ముఖపద్మము

గురుతుగ గుచకుంభములను గొప్పును నడుమున్

అరయంగనె మోహింతురు

నెరతిని నిను భక్తిగొల్వ నేరరు కృష్ణా

Leave a Reply