ఝడుపు కథ – ఒకటో భాగం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

అవధానులు సాయం సంధ్య ముగించుకుని ,ఇష్టం లేకున్నా ఆదుర్దా నిండిన మనసుతో రామాలయానికి వెళ్ళారు.

వర్ధనమ్మ కూడా దేవుడి దీపం వెలిగించి తనకొచ్చిన దేవుడి పాట పాడుకుంటూ హాల్లోకి వచ్చింది. “హమ్మయ్య! ఆ పాకిస్తాన్ తో యుద్ధము కాదుగానీ , ఇన్నాళ్ళూ నానా తిప్పలూ పడ్డాము. కంటినిండా నిద్దురకూడా లేదాయె. ఎప్పుడు సైరన్ వినిపిస్తుందో, ఎక్కడ బాంబులు పడతాయో తెలీక గిజగిజలాడేవాళ్ళం. యుద్ధం ముగిసింది. ఆ పాడు వూరు వదలి వచ్చేశాం. ఇక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు!”

బయట వరండాలో పిచ్చుకలు అప్పుడే ఇంట్లో ఎవరో చేరారని పసిగట్టాయి. గ్రిల్లు పైన కూర్చుని , కుతూహలంగా చూస్తున్నాయి

“బాగుంది ఇంట్లో నాకు ఈ పిచ్చుకలతో కాలక్షేపం ఉంటుందీ..” అనుకుంది వర్ధనమ్మ.

క్రిందటి దినమే పాలు పొంగించి, పూజ చేసి సామానులు తెచ్చుకున్నారు. ఇవ్వాళే ఈ ఇంట్లో మొదటి రోజు. ఇంకా పనిమనిషి కుదరలేదు. పాలవాణ్ణి మాత్రం కరణం గారు పంపించారు. బయటికి చూసింది. సూర్యుడు దాదాపు అస్తమిస్తున్నాడు.

“ఆయన వచ్చేదాకా ఉండనా, లేక లైట్లు నేనే వెలిగించనా?” సందేహంలో పడింది. “చూద్దాం, ఓ అయిదు నిమిషాలు.” అనుకుని ఊరికే ఉంది. రేడియో ఉందికానీ ఇంకా యాంటెన్నా కట్టలేదు. స్టేషనులు సరిగ్గా వస్తాయో రావో!

అంతలో అవధానులు రానే వచ్చారు “లైట్లు వేయకపోయావా?” అంటూ.

“ఇదిగో వేద్దామనే అనుకుంటున్నా…” అంటూ లోపలి లైట్లన్నీ వేసింది. బయటి లైట్లన్నీ అవధానులు వేశారు. హాల్లో ఇద్దరూ కూర్చుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. “ఇంకా ఏమీ వినపడదే? ఆడగొంతా లేక మగ గొంతా? చిన్నవాళ్ళ గొంతా లేక పెద్దవాళ్లదా?” ఎన్నెన్నో సందేహాలు. ఉన్నట్టుండి ఏదో స్వరం.

ఎవరో మూలుగుతున్నారు. మెల్లగా అది రోదనలోకి దిగింది. ఎవరో ఆడపిల్ల. గొంతును బట్టి చెప్పడం కష్టం కానీ ఓ పద్దెనిమిది, ఇరవై యేళ్ళ పిల్ల కాబోలు హృదయ విదారకంగా ఏడుస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇద్దరికీ ఒక్కసారి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. “నీకూ వినిపిస్తోందా?” అన్న ప్రశ్నార్థకం ఇద్దరి ముఖాల్లోనూ ఉంది.

వర్ధనమ్మ ఒక క్షణం భయపడినా వెంటనే ధైర్యం తెచ్చుకుని నడుముకు కొంగు బిగించి బయటికి వచ్చింది. అవధానులు కూడా వెంట వచ్చారు. ఇంటి చుట్టూ తిరిగి చూశారు. ఆ యిల్లు ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. సుమారు అరకిలోమీటరు వ్యాసార్ధంలో ఇంకే ఇల్లూ లేదు. ఈ ఇంటికి చుట్టూ కాంపౌండు, కొన్ని చెట్లూ ఉన్నాయి. ఎక్కడినుండో నీటి పైపులు వేశారు గానీ అందులో ఇంకా నీరు రావు. పెరట్లో చేదభావే గతి.

ఆ యేడుపు ఎక్కడినుండీ వస్తోందో అంతుపట్టడం లేదు కానీ గట్టిగా వినిపిస్తోంది.

అవధానులు “చూద్దాం!” అని బయటి లైట్లు ఆర్పేశారు. ఏడుపు ఆగిపోయింది. చిన్నగా మూలుగు మాత్రం వినిపిస్తోంది.

“అయితే దీక్షితులు నిజమే చెప్పారు…నేను ఇలాంటివాటికి భయపడను. నమ్మను కూడా! దీని సంగతేమిటో తేల్చుకుంటా!” అని మనసు దృఢం చేసుకుంటున్నారు. వర్ధనమ్మ అవధానుల వలె ధైర్యస్తురాలు కాదు. కానీ , ఆయన ఉన్నారన్న ధైర్యం మాత్రం ఉంది. 

సామానులన్నీ ఇంకా విప్పనే లేదు. వంటింటి సామానులు మాత్రం వేరుగా పెట్టారు. అందిన దినుసులు తీసి, కిరోసిన్ స్టౌ మీద వంట అయిందనిపించింది. చారు, కూర, ఆవకాయ, పెరుగులతో ఆనాటి భోజనం ముగిసింది. ఆ సంగతి మాత్రం ఇద్దరి మధ్యా రాలేదు.

 *****

Products from Amazon.in

మర్నాడు పొద్దున్నే మళ్ళీ అవధానులవారు కాలకృత్యాలు, అనుష్ఠానాలు అయ్యాక ఫలహారం చేసి రామాలయం వెళ్ళిపోయారు. అక్కడ పూజ ఒక్కటే కాదు, రానున్న సీతారామ కల్యాణమునకు ఏర్పాట్లు ఈయనే చూస్తున్నాడు. ఈ ఊరికి వచ్చి రెండురోజులే అయినా అవధానులు గతంలో ఇక్కడికి వారం వారం వస్తూనే ఉన్నారు.

సామానులు సర్దడానికి పూజారి భార్య రామలక్ష్మి వస్తానంది. రాత్రి అవధానులు యాంటెన్నా కట్టారు. రాత్రే నాటకం విన్నారు కూడా. వంట చేసి రామలక్ష్మి కోసం ఎదురు చూస్తోంది వర్ధనమ్మ. కిటికీలలోనుండీ చూస్తే బయట అన్నివైపులా ఓ కిలోమీటరు వరకూ అంతా కనపడుతుంది. రామలక్ష్మి ఇంకా రాలేదు. “సరే! అర్జెంటేముంది? వచ్చినపుడు రానీ!” తానూ ఫలహారం ముగించి రేడియో పెట్టుకుందామనుకుని “ఇప్పుడేమి వస్తుంది ? మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం విందాములే!: అనుకుంది.

ఇద్దరూ మాట్లాడుకోలేదుగానీ ఇద్దరి మనసుల్లోనూ రాత్రి విన్న ఏడుపు గింగురుమంటోంది. ఇదేమీ అనుకోకుండా వచ్చి నెత్తిన పడ్డదేమీ కాదు. ఎంతోమంది చెప్పారు ఈ ఇంటి గురించి అది నిర్లిప్తతో, ఆందోళనో తెలీని మనస్థితి. ఏమైనా సంఘటన జరగనీ అప్పుడు చూద్దామ్ అన్న భావన కావచ్చు.

గేటు చప్పుడైంది.

“ఇప్పుడే కదా అన్నివైపులా చూశాను ఎవరూ రాలేదే! అంతలో ఎవరొచ్చారు? నాకు కనపడకుండా? ఎవరొచ్చినా ఓ పది నిమిషాల ముందే నాకు బయట కనపడాలే?” అనుకుంటూ బయటికొచ్చింది. ఎవరో పదేళ్ళ పాప. చినిగిపోయిన లంగా , జాకెట్టూ వేసుకుంది. కొద్దిగా మాసి ఉన్నాయి. చింపిరి జుట్టు. చేతిలో పాల గిన్నె.

“ఎవరమ్మా నువ్వు? “

“మా అమ్మ పంపిందమ్మ గోరూ! సాయంత్రం పాలు తేవడము వీలుకాదట అందుకే ఇప్పుడే ఇచ్చి రమ్మంది.” ఆ పాప మాట్లాడుతుంటే అసలు నోట్లో దంతాలున్నాయా లేవా అన్నట్టు బోసిగా కనిపించింది.

“లక్షమ్మ కూతురివా , నువ్వు?”

ఆ పాప తలాడించింది.

“మరి సాయంత్రం పాలతో పాటు జున్ను ఇస్తానంది?”

ఆ పాప తల వంచుకున్నది. ఎర్రబడ్డ కళ్ళతో చివుక్కున తలెత్తి చూసింది. మళ్ళీ అంతలోనే నవ్వి “జున్ను రేపు తెచ్చిస్తా” అంది.

పాలు పోయించుకుని గేటు వేసి లోపలికొచ్చింది వర్ధనమ్మ. టైం ఒంటి గంట అవుతోంది. ఇందాకే రేడియో వింటుండగా కరెంటు పోయింది. “ఈ రామలక్ష్మి ఎప్పుడొస్తుందో?”అనుకుంటూ వంటింట్లోనే చాపవేసుకుని కాసేపు నడుం వాల్చింది. మళ్ళీ గేటు ’ కిర్రు ’ మన్న చప్పుడు. రామలక్ష్మి కావచ్చు అనుకుని లేచింది.. వచ్చి చూస్తే ఎవరూ లేరు. వేసిన గేటు వేసినట్టే ఉంది. అటూఇటూ చూసింది ఏ అలికిడీ లేదు. గాలికి గేటు ఊగిందేమో అనుకుని లోపలికి వచ్చింది. కిటికీలోంచీ బయటికి చూస్తూంది. బయట ఎర్రటి ఎండ. చుట్టూరా ఎక్కడ చూసినా పచ్చి గడ్డి. ఆ గడ్డిపై అక్కడక్కడా నీలము , పసుపు వర్ణాల్లో గడ్డిపూలు ఎండకు మెరుస్తున్నాయి. దూరంగా అక్కడొకటీ ఇక్కడొకటీ చింత చెట్లు , వేపచెట్లు. చీమ చిటుక్కు మంటే వినిపించేంత నిశ్శబ్దము. చెట్ల ఆకులు కూడా కదలడము లేదు. అలాగే చూస్తూంది. ఎక్కడనుండీ వచ్చాయో రెండు మేకలు అక్కడక్కడా గడ్డి పరకలు కొరుకుతూ వెళ్తున్నాయి. అంతలో వర్ధనమ్మ దృష్టి దూరంగా ఏదో కదులుతుండడము గమనించింది.

దూరం ఎక్కువవడం వల్ల అస్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏదో కదులుతోంది. ఆమె అలాగే చూస్తూంది. ఆ కదులుతున్నదేదో దగ్గరవుతోందనిపించింది. అలాగే చూస్తోంది. ఆ కదలుతున్నవి….తెల్లటి బట్టలు. గాలికి ఎగురుతున్నాయి. అది ఇంకాస్త దగ్గరికి వచ్చింది. ఎవరో, తెల్లటి బట్టలు కట్టుకున్న మనుషులు. ఇటే వస్తున్నారు. ఇంకొంచం బాగా కనిపిస్తోందిప్పుడు. దృశ్యం అర్థమవుతోంది. నలుగురు మనుషులు దేన్నో మోసుకుని వస్తున్నారు. నలుగురూ తెల్లటి బట్టలే కట్టుకున్నారు. ఆ బట్టలు గాలికి ఎగురుతున్నాయి.. వర్ధనమ్మ ఆశ్చర్య పడింది. ఊరి బయట చెట్ల ఆకులు కదలడము లేదు కానీ అక్కడ అంత గాలి ఏమిటో.

ఈసారి పరీక్షగా చూసి, గతుక్కుమంది వర్ధనమ్మ. వాళ్ళు మోసుకొస్తున్నది ఏదో శవాన్ని. శవం పైన పూల వలె రంగు కనపడుతోంది. ఇటువైపు ఎందుకొస్తున్నారు? శ్మశానం ఉన్నది ఊరికి దక్షిణాన కదా? అర్థంకాక చూస్తోంది. వారు వస్తున్న చోట ఇప్పుడు దారి రెండుగా చీలుతుంది. ఒకటి తమ ఇంటికి, ఇంకోటి ఊరి బయట ఇంకో పల్లెకి వెళతాయి. బహుశః ఆ పల్లెకు వెళుతున్నారేమో! వారు తమ ఇంటి దారిలోకి వచ్చారు. ఆ దారి నేరుగా తమ ఇంటికే ! గుండెలు దడదడ మనగా గబగబా వంటింట్లో కాగుతున్న పాలను దింపేసి, చీర సరి చేసుకుని బయటికి వచ్చింది. గేటు బయట ఒక జట్కా వచ్చి నిలచింది.

ఈ జట్కా ఎప్పుడొచ్చింది? ఆ శవమేదీ? తల తిప్పి అంతటా చూస్తోంది వర్ధనమ్మ. జట్కా తప్ప ఇంకేదీ రాలేదు. ఆశ్చర్యపోతూ జట్కాలోకి చూసింది. బండివాడి వెనక ఒక పిలక బ్రాహ్మడు కూర్చున్నాడు. కిందకు దిగాడు. తాంబూలం నములుతూ ఉన్నట్టుంది. చంకలో దర్భలూ, పంచాంగమూ ఉన్నాయి. అలాగే నమస్కారము చేసి, గార పట్టిన పళ్ళు కనిపించేలా నవ్వుతూ “నమస్కారమమ్మా! అవధానుల వారిల్లు ఇదే కదా? ” అన్నాడు.

తల ఊపింది వర్ధనమ్మ.

“ఏమీ లేదమ్మా! తమ అబ్బాయి, నేను కలకత్తాలో ఇరుగు పొరుగులం. మీకు ఉత్తరం రాశాడట! మీకు అందిందో లేదో? కొత్త అడ్రస్సు కదా అందుకని నేను ఎటూ ఇటే వస్తున్నాను కాబట్టి ఈ మాట చెప్పి రమ్మనాడు. మీ అబ్బాయి రేపు అంటే శనివారం ఇక్కడికి వస్తున్నాడు.”

వర్ధనమ్మకి సంతోషం వేసింది. “అబ్బాయి వస్తున్నాడా? బాగున్నాడా? రండి లోపలికి. ఆయనొచ్చే వేళయింది.”

“లేదమ్మా! క్షమించండి! అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ రేపో మర్నాడో వస్తాను. ఈ ముక్క చెబుదామనే వచ్చాను.” అని వెనక్కు తిరిగి జట్కా ఎక్కుతున్నాడు. “అదేమిటి?” అంటూ ఏదో అనబోయిన వర్ధనమ్మ ఏ ఆచ్ఛాదనా లేని ఆ బ్రాహ్మడి వీపు చూసి అదిరి పడింది. ఆ బ్రాహ్మడు , యజ్ఞోపవీతాన్ని సవ్యంగా కాక, శ్రాద్ధాలు చేసేటప్పుడు వేసుకునేలా అపసవ్యంగా వేసుకున్నాడు! కళ్ళు పెద్దవి కాగా అలాగే చూస్తూంది. ఆ జట్కా వేగంగా వెనక్కు తిరిగి వెళ్లిపోయింది.

(ఇంకా ఉంది)


You may also like...

Leave a Reply