జీవనది

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

 

(చిత్రం – జానీ పాషా గారు)

నాగరాజు, మల్లీశ్వరి భార్యాభర్తలు. వారికి జయ, విజయలు కవల పిల్లలు. పిల్లలిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కలానే ఉండేసరికి తల్లిదండ్రులు వారికి అదే భావాలు కలిగిన కవల సోదరులైన ఆదికేశవరావు, ఆదినారాయణలకిచ్చి వివాహం జరిపించారు. అది మొదలు వారి రెండు కుటుంబాలు ఒకే ఇంటిలో జీవించసాగారు. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లులా ఉండేది వారి కుటుంబం.

జయమ్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానం కాగా విజయమ్మకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు కలిగారు. వారిలానే వారి పిల్లలు కూడా ఆచారవ్యవహారాలను పాటించడం, కలసిమెలసి జీవించడం ఎందరికో మింగుడు పడేది కాదు.

పిల్లలంతా బాగా చదువుకున్నారు. ఒకరి వెంట ఒకరు అందరికి వివాహమై అమెరికాలో స్థిరపడిపోయారు అందరూ. తల్లిదండ్రులను తమతో రమ్మని వారంతా బ్రతిమాలినా సున్నితంగా తిరస్కరించేవారు.

అమెరికాలో కూడా వారంతా కలసిమెలసి ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడంతో వారి గూర్చి తల్లిదండ్రులకు ఏమాత్రం బాధ ఉండేది కాదు. కొడుకులకు, కూతుళ్ళకు మొత్తం మీద పధ్నాలుగు మంది సంతానం.వారి ఆలనాపాలనా కూడా అమెరికాలోనే జరిగిపోయింది. అయినప్పటికీ పిల్లలు అమ్మమ్మా, నానమ్మా అంటూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు.

ఆ రోజు జయమ్మ, విజయమ్మగారింట్లో సందడి సందడిగా ఉంది. కారణం జయమ్మగారి పెద్ద మనవడి పెళ్ళి. అందరూ అమెరికా వెళ్ళిపోయాక, ఒకేసారి అందరూ ఇండియా రావడం అరుదైపోయింది. ఏదేమైనా అందరికి సెలవు కుదిరే విధంగా చూసుకుని ఈ పెళ్ళికి అందరూ హాజరవ్వాలని చేసిన ప్రయత్నం సఫలమవ్వడం ఓ గొప్ప విశేషం.

జయమ్మగారి పెద్ద మనవడు అమెరికాలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. అతనికి ఆ అమ్మాయితో నిశ్చితార్ధం అమెరికాలోనే ఆర్భాటం లేకుండా జరిపించేసారు. కాలానుగుణమైన మార్పులను స్వాగతించారే కానీ వారి తల్లిదండ్రులు ఏనాడు వారి నిరాశను వ్యక్తం చేయలేదు. అందుకే ఆ తల్లిదండ్రులంటే ఆపిల్లలకు అంత ప్రేమ. ఏదేమైనా వివాహం మాత్రం ఇండియాలోనే తల్లిదండ్రుల చేతులమీదగా జరిపించాలనుకోవడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకే అంత హడావుడి.

పెళ్ళి పది రోజులు ఉందనగా ఆడపిల్లలు అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు వచ్చేశారు. అంతే జయ, విజయమ్మలు పురమాయించిన పనులన్నీ అక్షరాలా సత్సాంప్రదాయంగా, కన్నులపండుగగా జరిగిపోతున్నాయి. ఇల్లంతా రంగవల్లులతో, గడపలు పసుపుకుంకుమలతో, గుమ్మాలు మామిడితోరణాలతో, ఇంటి స్తంభాలు అరటిచెట్లతో, ఇంటిముందు తాటాకు పందిళ్ళతో, ఇల్లంతా పూలమాలలతో సహజ సుందరంగాను, సువాసనలతోను నిండిపోతే తల్లిదండ్రుల మనసు సంతోషంతో నిండిపోయింది.

Products from Amazon.in

“పిల్లలింకా రాలేదేమర్రా?వాళ్ళు కొత్తబట్టలు కొనుక్కోవాలిగదా” అంటే “అమ్మా! వాళ్ళకు కావలసినవి వాళ్ళు కొనుక్కుంటారులే!” అని కొడుకులుకూతుళ్ళు అనేసరికి జయ, విజయమ్మలు సరే అని ఊరుకున్నారు.

కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు మాత్రం సూర్యనమస్కారాల నుండి సంధ్యావందనం వరకు ప్రతి విషయంలోనూ ఆచారాలను పాటించడం చూసేవారికి అందరికీ వాళ్ళసలు రెండు దశాబ్ధాలపాటు అమెరికాలో ఉండి వచ్చినవారేనా అన్నంత దిగ్భ్రమ కలిగిస్తోంటే, జయ-విజయమ్మలకు మాత్రం వారి పెంపకం పట్ల వారికి అంతకంతకు విశ్వాసం రెట్టింపయ్యింది.

రెండురోజుల్లో పెళ్ళి ఉందనగా మొత్తం మనవళ్ళు, మనవరాళ్ళు ఒక్కసారిగా “అమ్మమ్మా, నానమ్మా” అంటూ వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టేసరికి పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. వారి సరదా కబుర్లతో ఇల్లంతా సందడితో నిండిపోయింది. అంతే, జయమ్మగారు పిల్లలందరిని కూర్చోపెట్టి దిష్ఠి తీస్తుంటే పిల్లలంతా ముసిముసిగా నవ్వుకున్నారు. అర్ధరాత్రి వరకు కబుర్లాడుకుని అందరూ పడుకున్నారు.

జయమ్మ ఆదికేశవరావుతోను, విజయమ్మ ఆదినారాయణతోనూ తమ మనవరాళ్ళ వేషధారణ గూర్చి వేదనగా చెప్పుకున్నారు కానీ, పిల్లల సంస్కారానికి సంతోష పడిపోయి వారి ఇష్టాలను పెద్ద మనసుతో సరిపెట్టుకున్నారు.

తెల్లవారింది.

పెళ్ళికొడుకును చేసే తంతు ప్రారంభమైంది. ఆధునిక బ్యాండు కాక సన్నాయిమేళం వాళ్ళు వచ్చేసరికి జయవిజయమ్మలు ఆనందంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వచ్చే వారికి సాంప్రదాయాలతో స్వాగతం పలికారు. పిల్లలు వారి భావాల్లో సాంప్రదాయాల్ని, దుస్తుల్లో ఒకింత ఆధునికతను నింపుకున్నారు. ఆడపిల్లలు ధరించింది కంచిపట్టు వస్త్రాలే అయినప్పటికీ అత్యాధునికతకు అద్దం పట్టాయి. ఇల్లంతా మంగళవాద్యాలతో మారుమ్రోగిపోతోంది. భోజనాల్లో చక్కెరపొంగలి, ముద్దపప్పు, నెయ్యి, పులిహోర, ఆవకాయ వంటి పదార్ధాలతో కొసరికొసరి వడ్డిస్తూ ఆప్యాయంగా పలుకరిస్తూ భోజనాల తంతు ముగించారు సంతృప్తిగా.

ముహూర్తం సమీపించింది. జయ, విజయమ్మ దంపతులు హడావుడి పడుతుంటే, కొడుకులుకోడళ్ళు , కూతుళ్ళూ అల్లుళ్ళు “ఇదిగో వచ్చేస్తాం”, “ముందు మీరు పదండం”టూ పెద్దవాళ్ళను, ముత్తైదులను మండపానికి పంపించివేసారు.

మండపంలోని అలంకరణలను ఆసక్తిగా చూస్తూ, “ఏమైనా మీ అక్కచెల్లెళ్ళు పిల్లలను చాలా సాంప్రదాయంగా పెంచారు. ఆచారాలు పాటించడంలో మీ తర్వాతే ఎవరైనా!” అని అందరూ అంటుంటే మనసు ఆనందంతో పొంగిపోతోంది. “ఆ ఏమైనా మీ మనవళ్ళకు, మనవరాళ్ళకు మాత్రం సాంప్రదాయం అంతగా తెలిసినట్లులేదు, ఎంతైనా అమెరికాలో పుట్టి పెరిగారు కదా!” అనేసరికి మనసు ఒకింత చివుక్కుమన్నా, అక్కచెల్లెళ్ళు చిరునవ్వే సమాధానం అన్నట్లు చూసి నవ్వారు చిన్నగా.

ఇంతలో కారులొచ్చి లైనులో ఆగాయి. అందరి కళ్ళు ఆ వైపు తిరిగాయి. డోర్లు తీసుకుని దిగినవారిని చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. కొడుకులు అల్లుళ్ళు పట్టు పంచెలు, కండువాలతో హూందాగా దిగారు. కూతుళ్ళుకోడళ్ళు సాంప్రదాయకట్టుతో పట్టుచీరల్లో, తల్లో పూలతో, చేతులనిండుగా మలారం గాజులతోను, పాపిట సింధూరంతోను, కుంకుమబొట్టుతోను ఆ భర్తలకు తగ్గ భార్యలుగా వారిననుసరించారు. వెనుకనున్న కారుల్లో నుండి మనుమరాళ్ళు పట్టులంగా ఓణీల్లోను, జడకుప్పుల జడనిండా పువ్వులతోను, చేతులనిండా గాజులతోను, సర్వాభరణాలను అలంకరించుకుని అందాలబొమ్మల్లా దిగుతుంటే రెండు కళ్ళు చాలవేమో అనిపించింది. మండపంలోని వాళ్ళంతా రెప్పవేయడం మరచిపోయి కళ్ళప్పగించి చూస్తున్నారు. మనవళ్ళను మనవరాళ్ళను చూసి జయవిజయమ్మలకు మాటలు రాలేదు.

వారికిప్పుడు అర్ధమయింది ముందుగా తమని ఎందుకు పంపించారో! అంతే, వారి మనసులో ఆనందంతోపాటు ముఖంలో రవ్వంత గర్వం తొణికిసలాడింది. పెళ్ళికి వచ్చిన వాళ్ళకు కన్నులపండుగ అయింది. ప్రధానం నుండి అప్పగింతల వరకు అనుకున్నదానికంటే వివాహం ఘనంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది.

పెళ్ళికి వచ్చిన వారందరి కళ్ళల్లో, నోట్లో, మనసుల్లో సాంప్రదాయం ఆసాంతం నిండిపోయింది. అమెరికాలో పుట్టి పెరిగినపిల్లలు సాంప్రదాయానికి ప్రాణం పోస్తుంటే ఆ ఊరిలో పుట్టి పెరిగిన పిల్లలు అనవసరమైన ఆధునికతను ప్రదర్శించినందుకు వారు కించిత్తు సిగ్గుపడ్డారు.

సాంప్రదాయం చిక్కిపోతున్న రోజుల్లో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు కంటి నిండా, ఫిలిం నిండా సాంప్రదాయం బాగా చిక్కింది. కెమేరాలో బంధించి అందమైన “సాంప్రదాయం”తో కళకళలాడిపోతున్న ఒక కుటుంబం ఫోటోను జయవిజయమ్మల చేతిలో ఉంచారు. వారి కళ్ళు ఆనందంతో వర్షించాయి. ఆ ఆనందబాష్పాలే అక్షింతలై పిల్లలందరిని దీవించాయి. ఆ ఫోటోని పట్టుకుని ఒక జీవిత కాలానికి సరిపడినంత సంతోషాన్నిచ్చిన తమ బిడ్డలను చూసి మురిసిపోయారు.

తమ బిడ్డలు కూడా తమలానే వారి బిడ్డలను పెంచడంలో కృతకృత్యులైనందుకు జన్మతరించిపోయినంత సంతోషంతో ఆ ఫోటోను చూస్తుండిపోయారు చమర్చిన కళ్ళతో.

సాంప్రదాయం అనేది జీవనదిలాంటిది. అది ఒక తరం నుండి మరొక తరానికి ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహం సార్థకమైనా, నిరర్థకమైనా అందులో మన బాధ్యత కూడా ఉంటుంది. ఈ విషయంలో జయవిజయమ్మల పెంపకం సార్ధకమయింది. అందుకే వారికి ఈ సంతోషం దక్కింది.

******


You may also like...

Leave a Reply