ఇపుడేది కర్తవ్యం… మనుటయా, మరణించుటయా?

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

కొన్ని నెలలలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనలుగా భావించబడ్డ అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, ఢిల్లీ ప్రజలు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టే! పొరపాట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా, కిందపడ్డా మీసాలకు దుమ్ము అంటలేదనే కాంగ్రెస్ మార్కు దివాలాకోరు ప్రగల్భాలు ఆశ్చర్యాన్ని కలిగించవు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారపు పూనకాలతో చిందులేయటం ఆ పార్టీకి ఆది నుంచీ అలవాటే!

 

గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ప్రజలకు అందించిన సుపరిపాలన ఏమీ లేదు. 2004లో, తాను ప్రధాని కాలేకపోయినా, మన్‌మోహన్‌సింగ్‌లాంటి ఓ ఆర్ధికవేత్తను, ఓ మేధావిని ఆ పదవిలో కూర్చోబెట్టిన సోనియాగాంధి త్వరలోనే, ఆ పదవిని, ఆ మేధావినీ ఓ తోలుబొమ్మగా ఆడించటం మొదలేసింది. పార్టీ ప్రయోజనాలకు దేశ ప్రయోజనాలు తాకట్టుపెడుతూ సాగిన పరిపాలన 2009 తర్వాత కూడా కొనసాగటం ప్రజల దురదృష్టం! ఆ దురదృష్టానికి మూల కారణం, నిర్మాణాత్మకంగా వ్యవహరించలేని ప్రతిపక్షాలే అనటంలో అతిశయోక్తి లేదు. రెండోసారి దఖలుపడ్డ అధికారానికి కాంగ్రెస్ కళ్ళు నెత్తికెక్కాయనేది కూడా పచ్చి నిజం.

 

కోర్టును కూడా ధిక్కరించే విధంగా, జైలు శిక్ష పడిన నేరస్తులకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వాలని ఆఘమేఘాల మీద ఆర్డినెన్సు కూడా సిద్ధం చేసిందంటే, కాంగ్రెస్ లోని అధికార అహంకారం ఏ స్థాయిలో బుసలు కొడుతున్నదో గమనించవచ్చు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమో, రాష్ట్రపతి ఔచిత్యమో, మొత్తానికి యువరాజుగారు అంతకన్నా హడావుడిగా ఈ ఆర్డినెన్సును బుట్టదాఖలు చేయాలని ఆవేశపడ్డా అప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయిందని కాంగ్రెసీయులకు తప్ప అందరికీ తెలిసిందే! చిత్తం పేదల మీద, భక్తి ఓట్ల మీద అన్నట్లు ఫుడ్ సెక్యూరిటీ బిల్లు లాంటివి తెచ్చినా, అవి చిత్తశుద్ధిలేని శివపూజలే తప్పించి, ప్రజాసంక్షేమం కోసం ఆలోచించినవి కాదు.

 

అటు తెలంగాణా విషయం నుంచి ఇటు నిర్భయ కేసు వరకు ఏ విషయం చూసినా పారదర్శకత లేకుండా, సునిశిత సమీక్షలు లేకుండా, సమగ్ర విశ్లేషణ లేకుండా, సున్నితత్వం చూపకుండా పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనేవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ఈనాడు మట్టికరిస్తే యావద్భారతదేశం నరకాసురుడు చచ్చినంతగా పండగ చేసుకుంటున్నదంటే దానికి కారణాలు ఇంకా విశ్లేషించుకోవాలా? నానమ్మగాంధీ విగ్రహం మీదనో, అయ్య గాంధీ విగ్రహం మీదనో కాకి రెట్ట వేస్తే, చొక్కాలు విప్పి తుడిచి, క్షీరాభిషేకాలు చేసె బడుద్ధాయిలు ఈరోజు అమ్మగాంధీ ప్రభుత్వం మీద అవిశ్వాసతీర్మానం పెట్టారంటే లోపం ఎవరిది?

 

2జి, సి.డబ్ల్యు.జి., ఓట్లకు నోట్లు, ఆదర్శ్, హెలికాప్టర్, బొగ్గు…. చెప్పుకుంటూ పోతే నెలకో కొత్త కుంభకోణంతో యు.పి.ఎ. పాలనలో దేశం దోచేయబడింది. ఓ మంచి ఆర్ధికవేత్త, మహామేధావి ప్రధాని అయ్యాడని ఆనందించాలా, ఆయన పాలనలో రోజుకో కొత్తరూపంతో తలెత్తుతున్న అవినీతిని అణచటంలో విఫలమయ్యాడని బాధపడాలా? అమాయకుడనుకున్న ప్రధాని పరిధిలోనే వేలకోట్ల బొగ్గు కుంభకోణం జరిగితే ఆయన్ని నిజంగానే అమాయకుడనుకోవాలా, అసమర్ధుడనుకోవాలా? ఏ రకంగా చూసినా, కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వంలోనూ, అటు కాంగ్రెస్ పార్టీలోనూ నాయకత్వ లోపం బట్టబయలౌతున్నది.

 

చేయి ఆల్రెడీ కాలిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఆకులు కట్టి ప్రయోజనం లేదు. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం పార్టీ పూర్తిగా తగలబెట్టకుండా ఉంచాలనుకుంటే తక్షణం చేపట్టాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. పూర్వకాలంలో రాజుల దగ్గర, యువరాజుల పక్కన కేతిగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ల పనల్లా, ఆ రాజుకు, యువరాజుకు వంతపాడటమే. కాంగ్రెస్‌లో అటువంటి అణాకానీకి కూడా పనికిరాని వందిమాగధులు చాలా మంది ఉన్నారు. ముందుగా పార్టీలో ఉన్న అటువంటి నోటితీత కేతిగాళ్ళందరినీ పార్టీ నుంచి తన్ని తరిమేయాలి. ముఖ్యంగా దిగ్విజయ్‌లు, కపిల్ సిబల్సు, మనీష్ తివారీలు, మణిశంకర్ అయ్యర్‌లాంటివాళ్ళని.  వీళ్ళవల్ల పార్టీకి పైసా ఉపయోగం లేకపోగా, అమ్మగాంధీని, పిల్లగాంధీని తప్పుదోవ పట్టిస్తున్నారనేది పసివాడికి కూడా అర్ధమౌతుంది. “పేదరికం ఓ మానసికస్థితి” అనే స్థాయికి రాహుల్‌ను తీర్చిదిద్దిన ఘనత ఈలాంటి కేతిగాళ్ళకే దక్కుతుంది. విదేశాల్లో చదువుకొచ్చిన యువరాజుకు ఆ మాత్రం వివేచన లేదా అంటే లేదనే తెలుస్తున్నది కదా! ఉంటే, పైన చెప్పిన కేతిగాళ్ళని ఒక్కరోజు భరించటం కూడా కష్టమే అని తెలుసుకునేవాడే కదా!

 

100 ఏళ్ళు పైబడిన పార్టీలో మంచినాయకులు, మేధావులు లేరా? ఎందుకు ఉండరు, ఉంటారు. మరి ఉంటే, ఈ విషయాలు అమ్మగాంధీకి ఎందుకు తెలియబరచరనేది మరో ప్రశ్న. పొగడ్తలకి అలవాటైన ప్రాణం పొరపాట్లు చేసావని చెబితే కరుస్తుంది. అమ్మగాంధీ కూడా కళ్ళు తెరవాలి. తెరవటమే కాకుండా పార్టీలోని మేధావులని గుర్తించాలి. మేధావులంటే, నెలకి ఇంత అని మూటలు పంపే ముఖ్యమంత్రులు కాదని గ్రహించాలి. ఆ మేధావులకు పార్టీ పగ్గాలు అప్పగించాలి. అమ్మగాంధికి ఆ ఆలోచనే రాకపోతే, పార్టీలోని మేధావులు పూనుకొని పార్టీ పగ్గాలు దొరకపుచ్చుకోవాలి. అన్నిటికీ మించి ఏమాత్రమైన బాధ్యత ఉన్నదనుకుంటే, సిగ్గు, నిజాయితీ లాంటి లక్షణాలు మిణుకుమిణుకుమంటూ అయినా ఉన్నాయనుకుంటే, తక్షణమే పార్లమెంటును రద్దుచేసి ప్రజా తీర్పును కోరుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి కనీసం యు.పి., బీహార్, తమిళ్‌నాడు, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాలలో మాదిరిగా పుట్టుగతులు లేని పరిస్థితులు దాపురించవు.

You may also like...

Leave a Reply