గుడిగంట మీద సీతాకోకచిలుక..

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

జపనీ కవితా ప్రక్రియ హైకూ గురించి ఒక పరిచియ వ్యాసం 

కళ్ళు మూసుకుని ఒక దృశ్యాన్ని ఊహించండి. అది సంధ్యా సమయం. సుఖ దుఃఖాలకూ, రాత్రీ పగళ్ళకూ అందని దివ్య సంధ్య. మీరు కొండ మీద పాత దేవాలయంలో ఏకాంతంగా ఉన్నారు. నిద్రపోతున్న పసి పాప చుట్టూ వెలిగిపోతున్న ప్రశాంతతలా చుట్టూ వాతావరణం. అలముకున్న ఆ మహా నిశ్శబ్దాన్ని మీ మనసులోనూ నింపాలని మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. ఆ క్షణంలో అకస్మాత్తుగా ఆలయం గంట మ్రోగింది.

ఒక్క క్షణం మ్రోగి ఆగిపోయిన ఆ గంట విశ్వంతో పాటు మీ మనసులోకీ నిశ్శబ్దాన్ని మోసుకొస్తుంది. ఆ ఒక్క క్షణం మీరు వెలుగు చూస్తారు. ఆ క్షణం అలాగే నిలిచిపోతుంది. మీరే ఆ క్షణం. ఆ క్షణమే మీరు.

ఆ క్షణానికి అమృతత్వాన్ని ప్రసాదించిన ఆ ఘంటా నాదమే హైకూ.

“ఆలోచన ఎప్పుడూ గతం నుండే ఉద్భవిస్తుంది .స్వేచ్ఛను తీసుకు రావడం దానికి సాధ్యం కాదు. స్వేచ్ఛ ఉండేది సజీవంగా ఉన్న ఈ వర్తమానంలోనే” అని జిడ్డు కృష్ణ మూర్తి చెప్పినా, “ఈ క్షణాన్ని చూడు, జీవానికే జీవం

పొదిగే ఈ క్షణాన్ని చూడు” అని కాళిదాసు కీర్తించినా , జెన్ బౌద్ధమైనా, హిందూ తత్వ శాస్త్రమైనా చెప్పే ముఖ్యమైన మాట “ఈ క్షణమే సత్యం, మీరే ఈ క్షణం”.

ఒక జెన్ విద్యార్ధి తన గురువు గురించి గొప్పలు చెప్తున్నాట్ట. “మా గురువు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. నీటి మీద నడవగలడు, గాలిలో తేలగలడు” అంటూ. అంతా విని పక్క విద్యార్ధి చెప్పాట్ట. మా గురువు కూడా అద్భుతాలు చెయ్యగలడు. అవేమిటంటే, “కాఫీ తాగినప్పుడు కాఫీ తాగుతాడు. టీ తాగినప్పుడు టీ తాగుతాడు” అని. జ్ఞాపకాల్లోనూ, కలల్లోనూ మానేసి ఈ క్షణంలో జీవించడం అన్నిటికంటే కష్టమైన పనిగా తోస్తుంది. కవినీ, పాఠకుడినీ అటువంటి జీవితం వైపు నడిపించలేని, కనీసం అటువంటి ప్రయత్నమైనా చెయ్యని మూడు లైన్ల చమత్కారపూరిత కవితని హైకూ అనడం ఒక ఉదాత్తమైన సాహితీ ప్రక్రియని ఖచ్చితంగా అగౌరపరచడమే.

హైకూలో 17 వర్ణాలుండాలి. 5-7-5 వర్ణాలు పాటించాలి. పదచిత్రాలు ఉండాలి. ఇవన్నీ హైకూకి necessary conditions తప్పితే sufficient conditions కాదు. (గణిత పరిభాష లో చెప్పాలంటే). వీటన్నిటికీ అతీతమైన హైకూ తత్వం ఘంటా నాదం కథలో ఇమిడి ఉంది.)

హైకూ రూపానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మనం పదానికీ, పదచిత్రానికీ తేడా తెలుసుకోవాలి. ఎందుకంటే పదచిత్రం హైకూకి ప్రాణం కాబట్టి. మౌలికంగా శబ్ద కవిత్వం, నిశ్శబ్ద కవిత్వం

విడిపోయేది పదాల, పదచిత్రాల వాడకాల విషయంలోనే.

శబ్ద కవిత్వం — నిశ్శబ్ద కవిత్వం :

ధైర్యం, కోపం, బాధ, ప్రేమ, అలజడి ఇవన్నీ మనిషి అనుభూతుల్నీ, ఉద్వేగాలనీ ఆవిష్కరించడానికి ఏర్పరుచుకున్న పదాలు. ఇవే అనుభూతుల్ని ప్రకృతిలో నిత్యం చూసే వస్తువుల్ని ఉపయోగించి చెప్పొచ్చు. ప్రకృతిలో నిత్యం చూసే వస్తువులే పదచిత్రాలు. ఏదో భావాన్నీ, అనుభూతినీ తమలో ఇముడ్చుకున్న వస్తువులన్నమాట.ఉదాహరణకి ధైర్యం అనే భావాన్ని “జోరుగా వర్షం పడుతుంటే గొడుగున్నవాడి ధైర్యం” అని చెప్పొచ్చు. ఇది ఒక దశ. అలా కాకుండా ఇదే విషయాన్ని


జోరుగా వర్షం పడుతోంది

నా చేతిలో గొడుగుంది.


అన్నామనుకోండి. అక్కడ మనలో కలుగుతున్న భావన ఏంటనేది మనం వివరంగా చెప్పడం లేదు. ఒక దృశ్యాన్ని చూసినప్పుడు మనలో కలిగే ఆ భావన ఏంటనేది ఒక్కో సారి మనకే తెలియకపోవచ్చు. తెలిసినా దాన్ని వ్యక్తం చెయ్యడానికి భాషలో పదాలు దొరక్కపోవచ్చు. చేతిలో గొడుగుంటే కలిగే భావనని మనం ధైర్యం అనొచ్చు. మరొకరు నిబ్బరం అనొచ్చు. కాబట్టి పదాలకున్న శక్తి పరిమితం. కవిత్వం అపరిమితం. అలాగే “నేను అలజడిలో ఉన్నాను” అనడానికీ, “నేను పులి తరుముతున్న లేడిపిల్ల కంట్లో ఉన్నాను” అనడానికీ తేడా గమనించండి.

కేవలం పదాలని ఉపయోగించి , సంగీతం సహకారం తీసుకుని మన అనుభూతిని పాఠకుడిలో పలికించేది శబ్ద కవిత్వం. పదచిత్రాల్ని ఉపయోగించి చిత్రలేఖనం సహాయంతో అనుభూతిని పలికించేది “నిశ్శబ్ద కవిత్వం”. తెలుగులో శబ్ద కవిత్వానికి శ్రీ శ్రీ, నిశ్శబ్ద కవిత్వానికి ఇస్మాయిల్ తిరుగులేని ప్రతినిధులుగా నిలబడతారు. తిలక్ , అజంతా, బైరాగి రెండిటి మధ్యా ఊగిసలాడుతున్నట్టు కనబడతారు. ఐతే ప్రతీ కవితనీ ఇది నిశ్శబ్ద కవిత, ఇది శబ్ద కవిత అని విభజించలేం. ఐతే భావాల భారాన్ని మోయలేక పదాలు చతికిలపడ్డ చోట , పదచిత్రాలు ఆ భావాల్ని అలవోక మోయగలగడం నేను అనుభవంలో తెలుసుకున్న విషయం. కవిత్వంలో తెలియని లోతులు పరచగల శక్తి Multi dimensions కూడా ఈ పదచిత్రాలకే సాధ్యమౌతుంది. ఉదాహరణకి ఇక్బాల్ చంద్ రాసిన శలభం అనే ఒక కవితా ఖండిక తీసుకుందాం


నీ వెలుగు చుట్టూ

రెక్కలు రాల్చుకుంటూ

జన్మ జన్మాలు

ఎన్నెన్ని కొత్త అవతారాలు!

నీ కాంతి కానక మళ్ళీ విసర్జనాలు-

మనిద్దరి మధ్య సంబంధం అతి పవిత్రం

అందుకే నిన్నందుకోలేకపోతాను ప్రతి సారి


ఒక శలభం తన దీపంతో అన్న మాటలు. ఆ శలభం కవి ఐతే , ఆ దీపం కవిత్వం కావచ్చు. ఆ శలభం ప్రియుడైతే ఆ దీపం అతని ప్రియురాలు కావచ్చు. శలభం మనిషి ఐతే దీపం జ్ఞానం కావచ్చు. ఇలా పాఠకుడి

పరిణతిని బట్టీ ఒకే కవిత ఎన్ని కోణాల్లో వికసిస్తోందో చూడండి. ఇది కేవలం పదచిత్రాల ద్వారానే సాధ్యమైందని వేరే చెప్పక్కరలేదు. అందుకే కాబోలు ఏకంగా Let there be no words in your poem అన్నాడు ఒక imagist. ఈ పదచిత్రమే హైకూకి ప్రాణం.

హైకూ సారం :

హైకూ సారం “లోపల వెలుపల, వెలుపల లోపలగా నుండు” అనే చిత్రమైన తత్వంలో ఉంది. హైకూ కవి కళ్ళముందు అనంత వైవిధ్యంతో ఆవిష్కృతమయ్యే ప్రకృతిలో ప్రతి కదలికను తన హృదయంలో దర్శించి, హృదయ సంచలనాన్ని ప్రకృతిలో వీక్షించి ఒకానొక జాగృదావస్థలో సకలేంద్రియాలతో తాను పొందిన అనుభవాన్ని అరమరికలు , తన వ్యాఖ్యానాలు లేకుండా అందిస్తాడు. రూపం విషయానికి వస్తే మూడు పాదాలు. 5-7-5 మొత్తం కలిపి 17 వర్ణాలు. మనిషి ఒక్క సారి ఊపిరి తీసుకుని వదలడానికి పట్టే సమయం , 17 వర్ణాలు ఉచ్చరించడానికి సరిపోతుందని భావించడమే ఇందుకు కారణం.

హైకూ పితామహుడైన బషో కూడా ఈ నియమాన్ని ఉల్లంఘించాట్ట. జపనీ నుడికారానికి సరిపోయే ఈ రూపం ఇతర భాషల్లో ఇమడదు. కొన్ని మార్పులు తప్పనిసరి. శబ్దం నుండి నిశ్శబ్దానికి చేసే ప్రయాణంలో ఆఖరి మజిలీ హైకూ కాబట్టి, హైకూలోని వాక్యాలు, పదాలు నిశ్శబ్దానికి దగ్గరగా తీసుకెళ్ళేవిగా ఉండాలి. సాధ్యమైనత క్లుప్తంగా ఉండాలి. హైకూని కవి తన స్థాయికి తీసుకువచ్చే ప్రయత్నం చేయకుండా, తాను హైకూ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ రాయాలి. హైకూ ఉదాత్తతనీ, హైకూ ద్వారా తాను అందుకోవలసిన మౌనాన్ని దృష్టిలో పెట్టుకుని రాయాలి.

కొన్ని నియమాలు:

1. హైకూ తత్వం అంతా ఇప్పుడు. ఇక్కడ.అంతే. వర్తమానంతోనే దీనికి ప్రమేయం. కాబట్టి సుదీర్ఘ కాలం జరిగిన సంఘటనలు, ఎప్పటివో విషయాలు హైకూలో ఉండకూడదు.

2. మన కవిత్వంలో ప్రసిద్ధమైన మానవీకరణలు, ఉపమ, రూపక ఇత్యాది అలంకారాలు ఇలాంటివేవీ లేకుండా చూసిన దృశ్యాన్ని చూసినట్టు అత్యంత సరళంగా అందించి పాఠకుడిలో ఒక విధమైన అనునాదం కలిగించడంలో హైకూ గొప్పదనం దాగి ఉంది.

3. హైకూ, పదచిత్రం: ప్రతి హైకూ ఒక చిన్న చిత్రం. ఒకటి లేదా రెండు పదచిత్రాలు వాడి గీసిన చిత్రం.

ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు

* ఈ పదచిత్రాలు ప్రత్యక్షానుభవం నుండి వచ్చినవి. జీవితంలోని కొన్ని ఉజ్వలమైన క్షణాల్లో కవి తన లోపలి కెమెరాతో బంధించిన దృశ్యాలు. వీటిలో కొన్ని అబ్బురపరిచేవీ, కొన్ని ఆనందపరిచేవీ, కొన్ని ఒక్క క్షణం

ఆశ్చర్య పరిచి అంతలోనే విషాదాన్ని నింపేవీ, కొన్ని దృశ్యాలు వాటిని చూసినప్పుడు కలిగే భావం ఇదీ అని భాషలో వ్యక్తం చెయ్యలేనివీ ఇలా ఏవైనా కావచ్చు. అలాంటి ఉజ్వలమైన క్షణాల్ని “హైకూ క్షణాలు” అని కూడా

అంటారు.

* ఈ పదచిత్రాలతో నిర్మించిన దృశ్యం పాఠకుల్లో కూడా అదే అనుభూతిని కలిగించగలగాలి. ఇది నిజంగా కష్టమైన పని.

హైకూ కళ అంతా పై రెండిటి మధ్యా ఉన్న పదునైన కత్తిపై నాట్యమే. చూసిన దృశ్యాన్ని చూసినట్టు రాస్తే అది అత్యంత సాధారణ దృశ్యం కావడం వల్ల పాఠకుడిలో ఎలాంటి అనుభూతీ కలగకపోవచ్చు.

ఉదాహరణకి ఇలా రాసామనుకోండి..


పోలీసు జీపు

పక్కనే కారు

రెండూ రోడ్డు మీద


ఇందులో ఏం అనుభూతి ఉంది? ఇది లోలకానికి ఒక కొస. రెండో కొస అమూర్తమైన కల్పన వాడి చూసిన దృశ్యానికి అలంకారాలు, మసాలాలు దట్టించి చెప్పి పాఠకుడిని ఆకర్షించవచ్చు. కానీ అది ప్రత్యక్షానుభవానికీ, తద్వారా హైకూ తత్వానికే దూరమైపోతుంది.

4. కవి వ్యాఖ్యానం: వీలైనంత వరకు హైకూలో కవి చూసిన దృశ్యానికి తన వ్యాఖ్యానాలు, అమూర్త భావాలు చేర్చకూడదు. చూసిన దృశ్యాన్ని చూసినట్టు వ్యక్తపరిస్తే పాఠకుడి స్థాయిని బట్టి వాడు అనుభూతి చెందుతాడు. కొన్ని సామాన్య పద్ధతులు: ఇప్పుడు హైకూల్లో సామాన్యంగా ఉపయోగించే కొన్ని టెక్నిక్స్ తెలుసుకుందాం.

1 .వైరుధ్యాల మధ్య ఏకత్వాన్ని దర్శించడం. ఉదాహరణకి హైకూ కవిత్రయంలో ఒకడైన బుసన్ రాసిన కింది హైకూ తీసుకుందాం


గుడిగంట మీద

సీతాకోక చిలుక

నిదిరిస్తూ..


ఈ హైకూ చాలారోజుల దాకా నాకు అర్ధం కాలేదు. ఇందులో ఏముంది అనిపించేది. అకస్మాత్తుగా ఒక రోజు ఇందులోని సౌందర్యం దర్శించి విస్మయపడ్డాను. గుడిగంట శబ్దానికి ప్రతీక. నిదురిస్తున్న సీతాకోక నిశ్శబ్దానికి ప్రతీక. లోతుగా చూస్తే ఈ హైకూలో ప్రపంచాన్ని బంధించి వేస్తున్న ఒక లయ వినిపిస్తుంది. గుడిగంట, సీతాకోక ఒక perfect harmony లో ఉన్నాయి. ఈ హైకూని దర్శించిన క్షణంలో బుసన్ ఆ నిదురిస్తున్న సీతాకోక అస్తిత్వంతో మమేకమై ఉంటాడు.

2. కొన్ని హైకూల్లో మొదటి రెండు పాదాల్లో సాధారణ పదచిత్రాలుండి, మూడవ పాదం మొదటి రెండు పదచిత్రాల మీదా ఒక వెలుగును ప్రసరింపజేసి పాఠకుడిలో అనునాదాన్నీ తద్వారా గొప్ప ఆనందాన్నీ కలిగిస్తాయి. ఉదాహరణకి ఇస్మాయిల్ గారి కింది హైకూ


కొండ మీద కర్రి మబ్బూ

దండెం మీద కాకీ

రెక్కలు తెగ దులుపుకుంటున్నాయి.


కొన్ని హైకూల్లో ఇలాంటి టెక్నిక్స్ ఏమీ లేకపోయినా చదవగానే మనకి అవ్యక్తానుభూతిని మిగులుస్తాయి. బషో రాసిన కింది హైకూ లో ఏముందో తెలీదు గానీ నాకిష్టమైన హైకూల్లో ఇదొకటి..


రా, పోదాం

కప్పబడిపోయేదాకా

మంచును చూద్దాం.


3. పూర్తి కాని వంతెన: హైకూ నిజానికి ఏక వాక్య కవిత అయినప్పటికీ ఒకే గొలుసు వాక్యంలో రాయరు. పదచిత్రాల మధ్య సంబంధాలు తెగ్గొట్టి రెండు భాగాలుగా రాస్తారు.అంటే వంతెనని పూర్తి కాకుండా వదిలేస్తారు. పాఠకుడి మనసులో ఆ వంతెన పూర్తవగానే ఒక విధమైన ఆనందం కలుగుతుంది. వాక్యంలో విభాగాలను , పాఠకుడిలో కలిగించాల్సిన అనుభూతి సాంద్రతని దృష్టిలో ఉంచుకుని చెయ్యాల్సి ఉంటుంది.

ఉదాహరణకు బషో రాసిన ఈ హైకూ


కొంగ కాళ్ళు

కురచగా మారాయి.

కురిసే వర్షం.


గమనించండి వర్షం కురుస్తోంది కాబట్టి కొంగ కాళ్ళు కురచగా మారాయి అని చెప్పలేదు కవి.

4. సంస్కృతిని ప్రతిబింబించే పదచిత్రాలు : “సంధ్య వేళ సాధువు గంగా నదిలో స్నానం చేస్తున్నాడు” అన్నామనుకోండి. దానివల్ల మన మనసులో ఒక విధమైన ప్రశాంతత, పవిత్ర భావం కలుగుతాయి. సంస్కృతిని ప్రతిబింబించే పదచిత్రాలు ఉపయోగించి ఇలాంటి భావాలని అలవోకగా పలికించొచ్చు. అందుకే గొప్ప హైకూల్లో ఆలయం, గంటలు, కోనేరు, పండగలు అడుగడుగునా కనిపిస్తాయి. జపనీ హైకూల్లో ఐతే బుద్ధుడి ప్రసక్తి చాలా హైకూల్లో కనిపిస్తుంది.ఇస్మాయిల్ గారి కింది హైకూ చూడండి..


మా ఇంటికి

పేరంటానికొచ్చింది కప్ప పిల్ల.

వానలొచ్చిన సంబరం.


5.చూపించండి. చెప్పొద్దు : హైకూల్లో సాధ్యమైనంతవరకు దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడం వల్లే పాఠకుడిలో భావం పలుకుతుంది. ఉదాహరణకి ఇస్మాయిల్ గారి కింది హైకూ చూడండి..


విడవలేక విడవలేక

విడవలేక వానబొట్టు

చూరుని విడిచింది.


ఒక చిత్రాన్ని గీయడానికి ఇంతకు మించి మంచి ఉదాహరణ దొరకదు. అత్యంత ప్రయాసపడి చూరుని విడిచింది వానబొట్టు అనలేదు కవి. ఇది నిశితంగా గమనించదగ్గ విషయం. పై హైకూలో గమనించాల్సిన మరొక విషయం

పాఠకుడిలో రేకెత్తించే భావం. చూరుని విడిచింది నిజంగా వానబొట్టేనా? జీవమా? ఇంకేదోనా? గొప్ప హైకూలో కవికే తెలియని లోతులుంటాయి. పాఠకుడి స్థాయిని బట్టి అవి అవగతమౌతాయి.

6. చివరిగా హైకూలు రాయాలంటే జెన్ బౌద్ధం, టావోయిజం మొదలైన తత్వ శాస్త్రాలు చదవక్కరలేదుగానీ వాటి గురించి కొంత తెలుసుకుంటే మంచిది. ఇక్కడ రెండు విషయాలు.

ప్రత్యక్షానుభవం: జీవితంలో చాలా విషయాలు పుస్తకాల నుంచో, గురువుల నుంచో నేర్చుకోలేం. కేవలం అనుక్షణం మనల్ని తాకే అనుభవాల ద్వారానే అది సాధ్యం. జీవితాన్ని నిండుగా అనుభవించమన్నారు అందుకే. Pain is the breaking of the shell that encloses our understanding అన్నాడు ఖలీల్ జీబ్రాన్ . కాబట్టి ప్రతి కవీ పదాలు, రూపం, చరిత్ర ఇవి చదవడంతో పాటు జీవితాన్ని స్పృశించాలి. ఒక విధమైన కవితా దృక్పథం పెంపొందించుకోవాలి. హైకూ, కవిత్వం మొదలైన కళల విషయంలో కూడా చాలా విషయాలు అనుభవం ద్వారానే తెలుస్తాయి. హైకూలు చదవడం రాయడం ప్రారంభించే దాక చిన్న చిన్న విషయాల్లో ఇంత సౌందర్యం దాగి ఉందని నాకు తెలీదు.

భిన్నత్వంలో ఏకత్వం : కవిత్వమైనా ఇతర ఏ కళ పరమార్ధమైనా సకల చరాచర సృష్టిలో నిన్నూ, నీలో సమస్త విశ్వాన్నీ దర్శిచడమే అనిపిస్తుంది. ఆ ప్రయత్నానికి హైకూ పరాకాష్ఠ. హైకూ అంటే కవిత్వం రాయడం కాదు. ప్రకృతి అనాదిగా రాసిన కవిత్వాన్ని చదవడం. సూటిగా చెప్పాలంటే హైకూ ఒక జీవన విధానం.

నలుగురు సాధువులు ఒక పదిహేను రోజుల పాటు మౌనవ్రతం పాటించాలని నిర్ణయించుకున్నారుట. మొదటిరోజు రాత్రి కురిసిన మంచుకి దీపం కాసేపు టప టపా కొట్టుకుని ఆరిపోయిందట. వెంటనే మొదటి సాధువు “అయ్యో దీపం ఆరిపోయిందే” అన్నాట్ట. దానికి రెండో సాధువు “మనం మాట్లాడకూడదు కదా” అన్నాట్ట. మూడో సాధువు కోపంగా” మీరిద్దరూ ఎందుకు మౌనాన్ని భనంగం చేసారు” అని అరిచాట్ట. నాలుగవ సాధువు నవ్వి “నేనొక్కణ్ణే మౌనంగా ఉన్నాను” అన్నాట్ట. హైకూ రాయడం అనేది మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మౌనంగా ఉండడమంత కష్టం. అందుకే మన అజంతా ఒక పద్యం కోసం జీవితం అన్నట్టు, జపనీయులు ఒక హైకూ కోసం జీవితం” అంటారు.

(హైకూ పితామహుడు బషోకి… )


ఉపకరించిన వ్యాసాలు & పుస్తకాలు :


1. చంద్రుణ్ణి చూపించే వేలు — ఇస్మాయిల్

2. హైకూ కవిత్వం — తమ్మినేని యదుకుల భూషణ్

3. మౌనానికి ముందుమాట — బి.వి.వి.ప్రసాద్

4. కవిత్వంలో నిశ్శబ్దం — ఇస్మాయిల్

5. The Definition of haiku — Alexey Andreyev

6. Haiku and Sneryu — Kathy Lippard cobb

7. Haiku rules that have come and gone — Jane Reichhold

8. కప్పల నిశ్శబ్దం — ఇస్మాయిల్

You may also like...

Leave a Reply