ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే…

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

Manmohan Singhఒకప్పుడు, తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, రైల్వే మంత్రిగా తన పదవికి రాజీనామా చేసి లాల్ బహాదూర్ శాస్త్రి ఓ సత్సంప్రదాయానికి నాంది పలికారు. ఆ తర్వాత అలా నైతికబాధ్యత వహించిన మంత్రులు చాలా తక్కువ. అసలు లేరనే చెప్పుకోవచ్చు. తమ మంత్రిత్వశాఖల్లో బయల్పడిన అవినీతికి అధికారులను బాధ్యులుగా చేసి, తమ పదవులు కాపాడుకున్నవారే ఎక్కువ. కేసులు పెట్టినా, వాటిని నానబెట్టేలా అధికారాన్ని ఉపయోగిస్తూ మంత్రులుగా కొనసాగిన వారసత్వం ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి తెర తీస్తున్నది.

ఛీఫ్ విజిలెన్స్ కమిషనరుగా పి.జె.థామస్ నియామకాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆ నిర్ణయానికి తనదే బాధ్యతగా మన ప్రధాని ప్రకటించారు! ఒక అవినీతి అధికారిని అందలం ఎక్కించినందుకు బాధ్యత వహించిన మన ప్రధానిని అభినందించాలా? లేక, ఆచరణలో నైతిక బాధ్యత వహించనందుకు అభిశంసించాలా? ప్రభుత్వంలోని ఒక అధికారి అవినీతికి పాల్పడి, ఆనక దానికి బాధ్యత వహిస్తే క్షమించి వదిలేస్తుందా ప్రభుత్వం? మరి, మన ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదా?

ఇక 2 జి స్పెక్ట్రం కుంభకోణం విషయానికి వస్తే, సంకీర్ణ ప్రభుత్వం నడపటంలో కొన్ని విషయాలలో రాజీ పడక తప్పని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయంగా ఆయన ఈ కుంభకోణాన్ని ప్రస్తావించారు! ఈ ప్రధానికి దేశ శ్రేయస్సు ముఖ్యమా? తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటం ముఖ్యమా? ఇప్పటి వరకూ, మిస్టర్ క్లీన్ గా భావిస్తున్న పెద్దమనిషి దేశ శ్రేయస్సును పణంగా పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు మన దౌర్భాగ్యం.

అసలు ఈ ప్రధాని మిస్టర్ క్లీన్ గా ఎలా పరిగణించబడుతున్నారో కూడా అర్ధం కాని విషయం. నిన్న మొన్నటిదాకా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా భావించిన “హర్షద్ మెహతా” ఉదంతం ఈ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో జరిగిందే. ఆ తర్వాత, సత్యం, మొన్నటి కామన్ వెల్త్ క్రీడలల్లో జరిగిన వేల కోట్ల అవినీతి, నిన్నటి లక్షల కోట్లలో జరిగిన స్పెక్ట్రం కుంభకోణం.. ఇవన్నీ ఈ పెద్దమనిషి ప్రధానిగా ఉన్న సమయంలో జరిగినవే… జరుగుతున్నవే.

వేటికీ స్పందించని ఈ ప్రధాని, ఈరోజు సింపుల్ గా బాధ్యత వహిస్తున్నానని ప్రకటించటంలో ఔచిత్యం ఏమిటి? బాధ్యత వహించే పెద్దమనిషి ఇంకా ఆ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? జరిగిన అవినీతి మీద విచారణ జరిపించి, వేరెవరినో బాధ్యులు చేసి, చేతులు దులుపుకోవటమేనా సత్ప్రవర్తన? ఒక ప్రధానిగా సరైన సమయంలో స్పందించని వ్యక్తి కేవలం బాధ్యత వహిస్తున్నట్లుగా చెప్పుకోవటంతో సరిపోతుందా?

వెన్నెముక లేని ఇటువంటి ప్రధానుల వల్ల దేశం మరింత దిగజారిపోయే ప్రమాదమే ఉంటుంది. నామమాత్రపు ప్రధానిగా ఉన్న ఈ ధృతరాష్ట్రుడు, ఆయన పనిచేస్తున్న పార్టీకి ఉపయోగమేమో కానీ, దేశానికి శ్రేయస్కరం కాదు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *