సినిమా పిచ్చోళ్ళ కోసం ఓ పిచ్చ సూపరు సినిమా

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

సినిమా ఇలా తియ్యాలి, అలా తియ్యాలి . ఈ సీను అలా తీసుండాల్సింది. నేనైతే ఇలా తీస్తాను.


మనందరం అనే మాటలూ , వినే మాటలే ఇవి. కానీ అసలు సినిమా “తీయడం” అంటే ఏమిటి? కాన్సెప్టు నుండి తెర మీది చిత్రం వరకూ సాగే ప్రస్థానంలో ఒక అతి ముఖ్య ఘట్టం : షూటింగ్.


కథ వ్రాసుకోవడం , సంభాషణలూ , స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడం ,బడ్జెట్ చూసుకుని, నటీనటులు, లొకేషన్ల ఎంపిక అన్నీ అయ్యాక మొదలవుతుంది ఈ ప్రక్రియ. సినిమా మీది ప్రేమ కలిగిన ప్రతివాడూ చూడాలి అనుకునేది ఈ షూటింగే. అసలు సినిమా ఎలా తీస్తారు అనే ప్రశ్నతో మొదలయ్యి , ఓహో తెర్ మీద మనకు కనిపించే సన్నివేశం జరగడానికి ఇంతమంది రకరకాలుగా కష్టపడతారా అని తెలుసుకున్నాకే సినిమా మీద ప్రేమతో పాటు గౌరవం కలుగుతుంది.  షూటింగును ప్రేమించిని వారు సినిమా దర్శకులు కాలేరు.


చిన్నప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ ఇంటర్వ్యూలు చదిచితే ఆయన మాట ఒకటే పదేపదే ఎదురుపడేది ” సినిమా అంతా అయిపోయింది ఇక షూటింగే మిగిలింది ” అనడం. ఎందుకో ఆ వాక్యాలు చాలా ప్రభావితం చేసాయి. నేను దర్శకుడిని అయితే ఖచ్చితంగా అంత పకడ్బందీగా తీయగలిగినప్పుడే సినిమా తీయాలి అనిపించేంది.

కానీ…. 
కానీ…
కానీ…..

డ్రమాటిక్‍గా చెబుదామని అన్ని “కానీ”లు చెప్పా…అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కష్టం ఏమిటో. చిన్న షార్టు ఫిలిమ్స్ తీసేటప్పుడే , అదీ నాన్ కమర్షియల్‍ ప్రాజెక్టులు , అదీ నాలాగే సినిమామీది ప్రేమతో వచ్చిన తోటి ఫిలిం స్టూడెంట్లతో తీస్తున్నప్పుడే వంద సమస్యలు . నాకే కాదు, అందరి పరిస్థితులూ అంటే. అతి చిన్న చిన్న విషయాల్లో చిన్నపాటి మతిమరుపు / అలక్ష్యం / నిర్లక్ష్యం ఖరీదు చాలా పెద్దదే.  ముగ్గరు మనుష్యులు కలిస్తే ఎవరి మాట నెగ్గాలి అనే పంతం పుడుతుంది. బ్లాగుల్లో అయినా ఒక వ్యక్తి ఒకటి రైటు అంటే ఇంకోడు కాదు అంటాడు. ఇక ఒకే విషయాన్ని ప్రేమించే వాళ్ళు పదిమంది చేరి ఆ ప్రేమకోసమే తపించే ప్రయత్నంలో పక్కవాడి ప్రేమకంటే నా ప్రేమ ఎక్కువనే భావంలో అనేక తగాదాలు.

ఒక చిన్న ఉదాహరణ :

స్క్రిప్టులో ఇలా ఉంది తీసుకుందాం : రాముడు చేతిలో వంగిన ధనుస్సు  పెళపెళమంటూ విరగగానే ,చేమంతిపూలవర్షం కురిసింది. సభలోని రాజులందరూ హర్షధ్వానాలు చేసారు. సీత ముఖం సంతోషంతో , సిగ్గుతో వెలిగిపోయింది. దశరధుడి ఒళ్ళు పులకించింది.

ఇక్కడ ఏ డైలాగూ లేదు. ఇంత సులభంగా కనిపించే ఈ సన్నివేశం తెరకెక్కించాలి అనుకుంటే, ఇక్కడ ప్రధాన పాత్రధారులు కేవలం ముగ్గరే. తక్కినవారంతా “ఎక్స్‌ట్రాలు ” సెట్టింగును ఆర్టు డైరెక్టరు చూసుకున్నాడు. మనం ఈ సన్నివేశాన్ని కేవలం మూడే షాట్లుగా విభజించుకున్నాం. మొదటి రెండు వాక్యాలూ లాంగ్ షాటు, టాప్ ఏంగిల్. రెండవ వాక్యమూ, మూడవదీ టైట్ క్లోజప్పులు.  నాకు తెలిసి ఈ సన్నివేశాన్ని ఇంతకంటే సులభంగా తీయలేము. (అస్సలు ఎఫెక్టు లేకుండా ఉండాలంటే దశరధుడినీ , సీతనూ కూడా ఎక్స్‌ట్రాల్లో కలిపేసి ఒకే షాటు లాగించెయ్యిచ్చు…కానీ అప్పుడు స్క్రిప్టు అన్యాయం అయిపోతుంది )

ఇక్కడ షూటింగులో ఉంటాయి కష్టాలు. దశరధుడికి కిరీటం సరిగా సరిపోదు. దాన్ని ఎంత సరిచేసినా కుదరదు. సరే అప్పుడు రాజీ పడి , రాముడి కిరీటం అతనికి మారుస్తాం. ప్రాక్టీసులో ధనుసు ఎలా విరగాలో పదిసార్లు చేస్తే, తీరా షాటులో అది విరగదు. అందుకని రీ టేకులు వెళ్తుంటే , రాముడి పాత్రధారికి చంకల్లో చెమట పోసీ పోసీ చిరాకు వచ్చి “ఎన్నిసార్లు విరచాలి” అంటాడు. అతడిని బుజ్జగించి షాటుకు సిద్ధపడితే, విల్లు విరుగుతుంది, చేమంతులు పడ్తాయి, ఎక్స్‌ట్రాలు చప్పట్లు ఆలస్యంగా కొడతారు. మళ్ళీ రీ టేకు . ఈ సారి పువ్వుల్లో ఒకటి రాముడి ముక్కుకు తగిలి అతను షాటులో గాఠ్ఠిగా తుమ్మేస్తాడు. ఇంకో టేకు, అంతా సవ్యంగా జరిగినా దర్శకుడికి ఎందుకో ఏదో టైమింగు మిస్ అయినట్లు అనిపిస్తుంది. రాముడు విల్లు విరిచినప్పుడు ముఖంలో విసుగు కనిపిస్తున్నట్లు, చప్పట్లు కొట్టే ఎక్స్‌ట్రాల ముఖాల్లో ఆకలి గోచరిస్తుంది. సో లంచ్ బ్రేక్.

భోజనం బ్రేకు అరగంట అనుకున్నది , గంట అవుతుంది. ఈ లోగా సినిమాటోగ్రాఫర్‍కు విరోచనాలు. తట్టుకుని నిలబడతాడు. టేకుకు వెళితే , అంతా సవ్యంగా జరుగుతున్న సందర్భంలో కెమెరాలో ఫిలిం ఫుటేజ్ సగంలో అయిపోతుంది. క్యాన్ మార్చాలి కాబట్టి , షాటు కట్. ఈసారి టేకులో , విల్లు లాగిన కుదుపుకు రాముడు తూలిపడతాడు. అసహ్యంగా ఉంది రీటేక్. కుమ్మరించడానికి పువ్వులు అయిపోయాయి అని అసిస్టెంటు బిక్కముఖం వేస్తాడు. అర్జెంటుగా వెళ్ళి పట్టుకురమ్మని పంపుతారు. ఈలోగా సమయం వృధా ఎందుకని క్లోజప్ షాటులకు దిగితే , ఇంతసేపూ ఖాళీగా ఉన్న సమయంలో సీత పాత్రధారి ఫోన్‍లో తన ప్రియుడితో మెసేజ్ ఛాటింగ్ చేసింది, వాళ్ళా మధ్య గొడవ అయింది.

ఇప్పుడు సిగ్గు , సంతోషం వెలిబుచ్చడం ఆమెకు చేతనవ్వట్లేదు. నాలుగు టేకులు తిన్నాక అనుకున్న అభినయం రాకపోవడంతో విసిగి, మూడ్‍లోకి రావడానికి ఒక అరగంట టైం అడిగింది. ఆ అమ్మాయి మంచి నటే. ఇలాంటి స్థితిలో ఒక్కతే మేకప్ రూంలో దూరి అద్దం ముందు ప్రాక్టీసు చేసుకుని తర్వాత అద్భుతంగా చేస్తుంది. సరే అని ఆ అమ్మాయికి ఆవకాశం ఇచ్చి దశరధుడి క్లోజ‍ప్‍కు వెళితే , ముందు అనుకున్న కిరీటం కాక వేరేది పెట్టడంతో ఆ కిరీటం క్లోజప్ ఫ్రేమింగులో ఇమడడం లేదు. లెన్సు మారిస్తే మిడ్ క్లోజప్ అవుతోంది. సరే విసిగిన దర్శకుడు రాజీ పడి అలాగే షాటు లాగించేస్తాడు. పువ్వులకోసం వెళ్ళిన అసిస్టెంటు ఫోన్ చేస్తాడు , తెలుగుదేశం పార్టీ నేత ఏదో ఊరేగింపు కనుక చామంతులు అన్నీ మార్కెట్‍లో అయిపోయాయి, ఏ పువ్వులు తేవాలి అని ? దర్శకుడికి ఉక్రోషం నీరసం వస్తాయి.

సెట్‍లో మిగతా రంగుల మధ్య చామంతులు అయితేనే బావుంటాయని కదా అవి ఎన్నుకుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి ? మల్లెలు వేద్దాం అంటాడు. సినిమాటోగ్రాఫర్ ఒప్పుకోడు. లైట్ల వెలుగు తెల్లటి మల్లెలు అసలు కంటికి తెలియవు , మల్లెల ఎక్స్‌పోజర్ సరిపోయేట్లు లైటింగ్ మార్చాలి అంటే ఇంకో అరగంట సేపు చాలా మార్పులు చెయ్యాలి అంటాడు. కాల్షీట్ల టైం ఎక్కువలేదు కాబట్టి అలా ఒద్దు అనుకుంటే , ఏ గులాబీలతోనో కనకాంబరాలతోనే లాగించొచ్చు అంటాడు. ఆ రంగు రావడం దర్శకుడికి ఇష్టం లేదు. అప్పుడు హీరో సలహా ఇస్తాడు. హీరోయిన్ సలహా ఇస్తుంది. అసిస్టెంట్లు సలహాలు ఇస్తారు . దశరధుడూ సలహా ఇస్తాడు. వీళ్ళందరి సలహా నేను వినడం ఏంటని, ఇంతకుముంద్ నేలరాల్చిన పూలనే మళ్ళీ పోయమంటాడు దర్శకుడు, కనీసం అలా అయినా రాజీ పడకుండా షాటు తీయొచ్చు అని. దుమ్ములో పడిన పూలా అని హీరోకు కోపం వస్తుంది. అతడిని బుజ్జగించి , చివరకు కొన్ని మల్లెలు , కొన్ని గులాబీలూ, కొన్ని రాలిన చేమంతులూ అన్నీ కలిపి పోసేందుకు ఒప్పందం కుదురుతుంది. ఇప్పుడు కాల్షీటుకు ఇరవై నిముషాలే టైం ఉంది. మూడు షాట్లు కుదరవు. అన్నీ కలిపి ఒకే షాటుగా చెయ్యడమే మార్గం.

దర్శకుడికే కాదు , అందరికీ బాధ అనిపిస్తుంది. అప్పుడు , అంతసేఫు నోరెత్తకుండా కూర్చున్న , కెమెరా అసిస్టెంటో లైట్ బోయో ధైర్యం చెబుతాడు ” మీరు చెయ్యండి సారూ , మూడు షాట్లూ తీసేద్దాం కావాలంటే కాల్షీటుకంటే ఒక పది నిముషాలు లేటైనా ఫర్లేదులే ” అని. అంతసేపూ ఎంత చాదస్తంతో , అహంతో , నిర్లక్ష్యంతో వ్యవహరించిన వారికయినా ఆ క్షణంలో సినిమా మీది తమ ప్రేమ పెల్లుబుకుతుంది. యుద్ధంలా పని జరుగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు రాకపోవచ్చు , కానీ ఏదో లా అనుకున్న షాట్లు మాత్రం వస్తాయి. ఇదంతా కలిపితేనే GENERATION LOSS.  రచయిత వ్రాసినదానికీ , దర్శకుడు ఊహించుకున్నదానికీ మధ్య ఇన్ని శక్తులు చేరి ” నేను అనుకున్నట్లుగా ఈ సినిమా లేదే” అనేట్లు తయారవుతుంది. ఒక్కోసారి generation gain కూడా జరగొచ్చు, (నటీనటులు అత్యంత ఉత్తములైనప్పుడు) కానీ అది చాలా అరుదు.


సినిమా తీసే ప్రతివాడూ అనుభవించే ఘట్టం ఇది. ముఖ్యంగా independent film making లోనూ , ప్రేమతో సినిమా తీసే సందర్భంలో. ఆ షూటింగ్ సమయం అంతా నరకంలా ఉంటే, అయిపోయాక తలుచుకుంటే అదొక తియ్యటి అనుభవమే.


అలాంటి తియ్యటి అనుభవాన్ని కలిగించే ఒక సినిమా ఈ మధ్య తెల్లవారు ఘామున సోనీ పిక్స్ ఛానెల్‍లో చూసాను. ఎన్నోసార్లు ఎంతో మంది చెప్పినా ఎందుకో ఈ సినిమా చూడటం జరగలేదు. కానీ అనుకోకుండా చూసినప్పుడు, మనసంతా అటువంటి ఙ్ఞాపకాలతో నిండిపోయింది.


సినిమా తీయాలి అనుకునే ప్రతివాడూ , సినిమా పట్ల ప్రేమ చావని వారూ, తొలి షూటింగు అనుభవాలను గుర్తు చేసుకోవాలి అనుకునేవారూ తప్పక చూడాల్సిన..కాదు కాదు “అనుభవించాల్సిన” చిత్రం ఇది. పేరు: LIVING IN OBLIVION


ఆ సినిమాను నేను మళ్ళీ ప్రత్యేకంగా సమీక్షించను, ఎందుకంటే ఇంతసేపూ పైన చెప్పినదంతా ఆ సిన్మాకు నా ట్రైలర్ లాంటిదే. నటీనటుల ప్రతిమ, సినిమా తీసిన విధానం , బడ్జెట్ ఇవన్నీ నేను చెప్పడం కాదు సినిమా చూసాక మీకే తెలుస్తాయి. ఇది సినిమా కాదు , ఒక అనుభవం .  ఒక శాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను. ఎన్నో అవాంతరల తర్వాత చివరకు షాటు జరుగుతుంటే , ఎవరో చేతి వాచీ అలారం శబ్దం కారణంగా ఆ షాటు ఆగిపోతే ఆ దర్శకుడికి కలిగే ..వర్ణణాతీతమైన ఆ అనుభవం ..ఇదిగో…


ఈ సినిమాను నేను టీవీలో చూసాను కాబట్టి , చాలా బూతు మాటలు కట్ చేసారు.కానీ ఆ సందర్భాల్లో ఆ వ్యక్తులు ఆ మాటలు అనడమే ఉచితం అనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కూడా వి/అనకపోతే ఇక బూతుమాట ఉనికికే అర్థం లేదు. కాబట్టి తప్పకుండా డౌన్‍లోడ్ చేసాక సౌండు బాగా పెంచుకుని, సినీ ప్రేమికులైన స్నేహితులెవరైనా ఉంటే కలిసి పార్టీ చేసుకుంటూ చూసుకోండి. లేదూ..ఒక్కరే చూసి మీలో మీరే మురిసిపోండి. సినిమాను ప్రేమించని / గౌరవించని వ్యక్తులెవరైనా ( స్నేహితులైనా/ స్పౌజ్ అయినా ) పక్కన ఉండనివ్వకండి. వాళ్ళకు ఇది అర్థం కాదు , నచ్చదు. డీవీడీ దొరకనీ/ డౌన్‍లోడ్ చేసుకోలేని వాళ్ళు ముక్కలుముక్కలుగానే మొత్తంగా యూ ట్యూబ్‍లోనూ చూడొచ్చు , ఒక పార్టు చూస్తే రెండవ పార్టు లింకు కనిపిస్తుంది.

ఫైనల్‍గా ఒక ఘలక్ : పైన చెప్పిన షూటింగు ఉదాహరణలో , చివరకు అంతా గడిచాక, ఫుటేజ్ అంతా ఎడిటింగ్‍కు వెళ్ళాక అర్థమైంది , ఒక పే…ద్ద తప్పు జరిగిపోయిందని. అది ఏమిటై ఉంటుందో ఊహించండి , సినిమా తీయడంలో ఎంత టెన్షనో తెలిసొస్తుంది.

You may also like...

Leave a Reply