అస్తిత్వ వేదన కవులు – 2

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

మూలం:శ్రీ ఇక్బాల్ చంద్ పరిశోధనా గ్రంథం “ఆధునిక తెలుగు సాహిత్యంలో జీవన వేదన”

అస్తిత్వ వేదన కవులు – శ్రీరంగం నారాయణ బాబు

శ్రీరంగం నారాయణ బాబు 17/05/1906న విజయనగరంలో పుట్టాడు. తండ్రి పేరు శ్రీరంగం సుందర నారాయణ. వీరు వకీలుగా చేసి చాలా ధనం సంపాదించారు. నారాయణ బాబు మంచి ఆర్థిక స్థితిగల ఇంట్లో పుట్టాడు. అయితే తర్వాత కాలంలో జీవితాంతం ఆర్థిక దుస్థితితో గడిపాడు. “నారాయణ బాబుకు యుక్తవయస్సులోనే పెళ్ళైంది. అయితే భార్య పిచ్చిది. (బంధువులంతా ఆమెను వెర్రి చిట్టి అని పిల్చేవారు). సంసారసౌఖ్యం ఆది నుండీ కరువైన నారాయణ బాబుకి ఇల్లూ వాకిలీ కూడా అక్కరలేకపోయింది” (ఆరుద్ర – సమగ్రాంధ్ర సాహిత్యం)

నారాయణ బాబు ప్రాథమిక విద్యను విజయనగరం లో ముగించాడు. కళూరి నరసింగరావు తో కలిసి మొదట్లో జంట కవిత్వం చెప్పాడు. ప్రాథమిక విద్య తర్వాత పశువైద్యం నేర్చుకోవడానికి మద్రాసు వెళ్ళాడు. అయితే అది సగంలోనే ఆగింది. నారాయణ బాబుకు సాహిత్యంతో పాటు సంగీతంలోనూ ప్రవేశం ఉంది. గాయకుడు కూడా. కురుగంటి సీతారమయ్య మాటల్లో చెప్పాలంటే “శ్రీశ్రీకి లేని ఉపన్యాస ధోరణి ఇతని కుండడము విశేషము. గేయాలను శ్రావ్యంగా పాడి సభ్యులను ముగ్ధులను చేయడంలోనూ ప్రజ్ఞ గడించిన వాడే నారాయణ బాబు గారు. పాఠకులలో అద్భుతాశ్చర్యాలను, భయోత్పాతాన్నీ కల్గించే శక్తి ఈతని కలానికి ఎంతైనా ఉంది. కవితా ధోరణులను గూర్చి వాదించగల తార్కికుడు కూడా.” (కురుగంటి సీతారామయ్య – నవ్యాంధ్ర సాహిత్య వీధులు)

విజయనగరంలో సంగీత కళాశాల స్థాపిస్తున్నారని తెలిసి ద్వారం వెంకటస్వామి నాయుడు దానిలో చేరాలని వచ్చారు. అయితే ఆయనను విద్యార్థిగా కాకుండా ఉపాధ్యాయునిగా చేర్చుకున్నారు. “నాయుడుగారు విజయనగరం వచ్చినది మొదలు నారాయణ బాబు తనకు తోచినప్పుడల్లా వారి సంగీత సన్నిధానవర్తి అయాడు. ఎన్నో సంగీత రహస్యాలు తెలుసుకొన్నాడు.” (ఆరుద్ర – సమగ్రాంధ్ర సాహిత్యం).

నారాయణ బాబు గాయకుడే కాదు, నటుడు కూడా. “భక్త కబీరు” చిత్రంలో “భోగమల్లు” పాత్రను వేశాడు. అతనికి చిత్రకళలో కూడా ప్రవేశం వుంది. “సాల్విడర్ డాలి” చిత్రాలను గంటల కొద్దీ చూస్తూ గడిపేవాడు. “నారాయణ బాబు భావ కవిత్వం విడిచిపెట్టినా భావకవి వేషాన్ని మాత్రం కడదాకా వదల్లేదు. గిరిజాల జుత్తు నిండుగా ఉండేది. షుర్వా, షేర్వాణీ ఎప్పుడూ ధరించేవాడు. వేషం ఆర్భాటంగా ఉన్నా అతడు కాల్చేది బీడీనే. ఈ విషయంలో ప్రోలిటెరియేట్”(Ibid)

“నారాయణ బాబు జీవితం భూషణల కన్నా దూషణలకే ఎక్కువగా గురయ్యింది. సన్మానాల కన్నా అవమానాలనే స్వీకరించింది. సుఖాల కన్నా కష్టాలనే ఎక్కువగా ఎదుర్కొంది. ఆయన ఒక కంట కిరీటధారి. ఆయన జీవితం ముళ్ళ సోపానం. జీవితాన్వేషణలో ఈ సుఖాలూ, దుఖాలూ, ఐంద్రిక ఇచ్ఛలూ, కాఠిన్యాలూ, పేదరికాలూ, వ్యక్తిగతంగా హృదయగతంగా ఆయన్నేమీ చేయలేకపొయాయి. గమ్యం తెలియని ప్రయాణంలో జీవితం ఎటు విసిరితే అటుపోతూ నడిసముద్రంలో చిక్కుకొన్న నావికునిలా ఆటుపోట్లను చిరునవ్వుతో ఎదుర్కొంటూ పయనించాడు. లేమి నిరంతరం వెంటాడుతున్నా మొక్కవోని గుండె ధైర్యంతో ముందుకే అడుగేశాడు. ఆయన ఎక్కడా నిలకడగా వున్నట్లు కనిపించదు. ఈ నిలకడలేని తనం ఆరోగ్యాన్ని కూడా పాడుచేసింది. అప్పుడప్పుడు మిత్రుల సహాయాన్ని నిర్మొహమాటంగా తీసుకొన్నా చివరకు లేమి ఆయన జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకొంది. శివలెంక శంభూప్రసాద్, చాగంటి సోమయాజులు గార్లు అనేకసార్లు ఆర్థికంగా ఆదుకున్నారు. 02.10.1961 ఉదయం 7:30 ని. మద్రాసు రాయపేట ఆసుపత్రిలో దుర్భర దారిద్ర్యంలో మరణించాడు నారాయణ బాబు” (జూపల్లి ప్రేం చంద్ – మౌనశంఖం)

నారాయణ బాబూ పై పలువురి అభిప్రాయాలు:

కృష్ణశాస్త్రి: “కవిత్వం అంటే ఏమిటో తెలిసినవాళ్ళు నారాయణబాబు కవితలను ఆస్వాదించగలరు.”

శ్రీశ్రీ: శ్రీశ్రీ జీవిత కాలంలో ఎప్పుడైనా నారాయణ బాబు గురించి ప్రస్తావించినా అది అతనిపై వ్యతిరేకతతో చేసినదే. ఉదా: 1969 నవంబరులో “సృజన” పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూ:

ప్రశ్న:- కొందరు వచన కవితను మొట్టమొదట రాసింది శ్రీరంగం నారాయణ బాబు అంటారు. దీని గురించి మీ అభిప్రాయమేమిటి?

శ్రీశ్రీ: శ్రీరంగం నారాయణ బాబు was simply an imitator. ఇంకా he was essentially an anarchist. Probably an opportunist also.

ఆరుద్ర: “నారాయణ బాబు ఛందస్సుల సర్ప పరిష్వంగం విడిచిపెట్టాడు కాబట్టి ధ్వని కవితను వచనంలో ప్రారంభించి ప్రయత్నించగలిగాడు. యుగధర్మాన్ని బట్టి వచన కవితలను చేపట్టినా, కవి ధర్మాన్ని బట్టి వాటినే పాటలాగా గానం చేసేవాడు. పాడలేక పోయినా పఠిస్తే కూడా రసానుభూతిని కలిగించేదే నిలచే కవిత్వం. నారాయణ బాబు కవితలు కొన్ని రసానంద వర్ధనాలై నిలుస్తాయి. వాటికి వెలకట్టడం విమర్శకుల పని”

సోమసుందర్ : “నారాయణ బాబు కవిత్వం రిల్కే కవిత్వం వంటిది”

డా. సి. నారాయణ రెడ్డి: “వాస్తవికతను, అధివాస్తవికతను, రెంటిని సమన్వయ పరచుకొన్న అతినవ్యుడు నారాయణ బాబు. ఇంగ్లీషు కవిత్వము లోని “ఇమేజిజము” ప్రభావము కంఠదఘ్నంగాగల తెలుగు కవి ఇతడొక్కడే”

శేషేంద్ర: “ఆవేదన వున్న అసలైన కవి”

జూపల్లి ప్రేంచంద్: “నారాయణ బాబు కవిత్వానికి జీవితం మినహా మరో వస్తువు లేదు…ఆయన కవిత్వంలో మృత్యువు రక్షణా మందిరంగా దర్శనమిస్తుంది. ప్రాచీనమైన మానవ జీవితానికి మృత్యువూ ప్రాచీనమైందే. అనివార్యంగా మృత్యువు మానవుణ్ణి తన చల్లని ఒడిలోకి తీసుకొంటుంది.”

నారాయణ బాబు కవిత్వం:

నారాయణ బాబు కవిత్వంపై గుడిహాళం రఘునాథం, జూపల్లి ప్రేం చంద్ లు పరిశోధన చేసారు. వీరికంటె ముందే కొంతమంది నారాయణ బాబుని వ్యాఖ్యానించారు, విశ్లేషించారు. సి.నా.రె, వేల్చేరు వంటి సాహిత్య చరిత్రకారులు నారాయణబాబును పరిచయం చేసారు. సోమసుందర్ “రుధిరజ్యోతిర్ధర్శనం” ఆముక్తమాల్యదకు వేదంవారి వ్యాఖ్యానం లాంటిది. పాఠకుల్ని దూరంగా వుంచుతుంది. (ఇబిడ్ – మమేకం పేరుతో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డిగారి ముందుమాట)

నారాయణ బాబు “రుధిరజ్యోతి” సంపుటి “సామిధేని” కవితతో మొదలవుతుంది. “సామిధేని” అంటే యాగ ప్రారంభానికి ముందు వినిపించే ప్రణవనాదం. చివరి కవిత “మౌనశంఖం”. ఈ మౌనశంఖం పూరించినదే అయితే చెవులకు వినిపించేది కాదు. అంతర్ముఖ శంఖం అది.

నారాయణ బాబు కవిత్వం ప్రత్యక్షరూపం కాదు. ప్రతీకాత్మకమైనది. శేషేంద్ర శర్మ మాటల్లో చెప్పాలంటే “శ్రీరంగం నారాయణ బాబు కవిత్వం వంటిది బహుశా తెలుగులో ఎవరూ రాయలేదు. మొట్టమొదట ఫ్రెంచ్ సాహిత్య ప్రభావం తెలుగు మీదికి రావడం నారాయణ బాబు గారి ద్వారానే. ప్రతీకలతో కవిత్వం రాసిన మొదటి కెవీ, చివరి కవీ తెలుగు సాహిత్యంలో ఆయనే”. నారాయణ బాబు కవిత్వంలో అసహనం, అన్వేషణ, విఫలం, నిష్ఫల కామం, విధ్వంసం, నిర్గమ్యసంచారం, మృత్యువులను చూడొచ్చు.

వెనుతిరిగే చూచాను
వెంటాడే మృత్యువులా
వెరపు గొలిపే
నా ఛాయ!

నారాయణ బాబుకు తన ఉనికికి తన నీడే శత్రువులా కంపించింది. ఇటువంటి అంతర్ముఖై అయిన కవికి లోకంపై “అసహనం” అనిపించడంలో వింతేమీ లేదు.

నీ సజీవ అంభారమునకే
చెవులు మూసుకొని
నా నిర్జీవపు గీతాలను
వినేందుకు
సభ చేసిన లోకం

కాలిన ప్రేయసి
దేహం
కమురు కంపు
ఈ లోకం

కవికి లోకం అందంగా కనిపించలేదు. నారాయణ బాబుకు ఈ లోకం కాలిన ప్రేయసి దేహంలో నుండి వచ్చే కమురు కంపుగా తోచింది.

ఇప్పుడు
కిటికీలో
గోడివతల
గోడవతల
ఒకటే చీకటి
జీవ రహస్యం!!

ఇతనికి చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. జీవితంలో వ్యామోహాలు గాని భ్రాంతులు గానీ ఏమీ లేదు. జీవితంలో వెలుగు లేదు. దానికై అన్వేషిస్తున్నాడు కవి.

చీకటిలో
దీర్ఘమైన చావు
చచ్చి బ్రతుకు
మృత్యువులో
వెలుగున్నది

నారాయణ బాబుకు బతుకులో వెలుగు కనిపించలేదు. వెలుగు ఎక్కడున్నదో అన్వేషించాడు. చివరికి అతనికి మృత్యువులో కంపించింది.

కాల భుజంగం
కళ్ళెంలాగి
ఛలో ఛలో యని
సాగిపోయెదను

అంటూ వెలుగును అన్వేషిస్తూ తన ప్రయాణాన్ని, మృత్యువును కోరుకుంటాడు.

నారాయణ బాబు కవిత్వం – రూపం

నారాయణ బాబు అభివ్యక్తి పరోక్షమార్గం. పదచిత్రాల ద్వారా తన భావాన్ని వ్యక్తపరుస్తాడు. నారాయణ బాబు శిల్పం గురించి రోణంకి అప్పలస్వామి గారి మాటల్లో చెప్పాలంటే “కొన్ని నిగూఢ రహస్యాలు అతని కవితలో తొంగిచూస్తాయి. శిల్పం రహస్యంగా వుండిపోతుంది. ఇంద్రియాలు గ్రహించిన అనుభూతులను ఆయా ఇంద్రియాలతో గాక వానిని భిన్న భిన్న ఇంద్రియ సంపాదితములుగా పేర్కొనడం ఒక శిల్ప రహస్యం” (సోమసుందర్ – రుధిరజ్యోతిర్దర్శనము)

నారాయణ బాబు కవిత్వానికి పదచిత్రాలు, పరోక్ష పద్ధతే కాకుండా మరో ముఖ్య లక్షణం “సంక్షిప్తత” (Breavity).

“నారాయణ బాబు కవితోక్తి విధానం – పది పుటలలో వ్యాఖ్యానించవలసిన భావాన్ని పది మాటలలో క్లుప్తంగా చెప్పి విరమించడం. పాల్కురికి సోమనాథుడుద్ఘాటించిన “అల్పాక్షరాల అనల్పాక్షరములను” సంఘటింప చేయడంగా దీనిని మనం అర్థం చేసుకోవచ్చు” (Ibid)

నీలగిరిలో పురుడు పోసుకొని
దాహం దాహం అంటూ మరణించిన
చూలాలి వక్షస్థలంలో గడ్డకట్టిన
చనుబాల జిడ్డును
తాగి చనిపోయిన ఒక పుండాకోరుని
డాక్టరు శవపరీక్ష చేసినప్పుడు
అతని కడుపులో అరగకుండా
పైకి ఒలికిన సారా చుక్కను
చూలాలై మృతశిశువుని కని
గుండెల్లో పాలే
పాము కాటులా బాధపడితే
ఒక ఇల్లాలు
ఒక చీకటి రాత్రిలో వీధి కాలువలో
కురిపించిన పాల వానను” (రుధిరజ్యోతి)

నారాయణ బాబు కవితలో ఆర్భాటాలు వుండవు. “గజ గమనంతో సాగి చదువరి మనసులోని రహస్య వేదనలను స్మృతికెలయిస్తుంది” (సోమసుందర్ – రుధిరజ్యోతిర్దర్శనం)

You may also like...

Leave a Reply