అసలైన దీపావళి

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

నిప్పు, నీరు, గాలి  వంటి ప్రాకృతిక శక్తులను చూచి భయపడిన ఆదిమానవుడు వాటిల్ని కొలవడం మొదలుపెట్టాడన్న వాదన ఒకటి నేటి కాలంలో ప్రబలంగా వినిపిస్తుంది. ఇతర దేశాలు, జాతులలో ఈ విషయము నిజమై ఉండవచ్చు గాక ఆర్ష విజ్ఞానానికి పుట్టినిల్లైన భారతదేశములో అనవసర భయాలకు, మూఢనమ్మకాలకు తావులేని విధంగా ఆయా శక్తుల్ని అర్థం చేసుకోవలైన తీరును ఋషి, మునులు నొక్కి వక్కాణించారు.

పురాణాలు, భగవంతుణ్ణి వర్ణిస్తూ “దీపవిద్యుత్తారకాగ్నిచంద్రసూర్యశ్చదీప్తిమాన్” అని అంటాయి. అంటే దీపము, మెరుపు, నక్షత్రము, అగ్ని, చంద్రడు, సూర్యుడు మొదలైన తేజోమయ వస్తువుల్లో ఉండే తేజస్సు ఆ భగవంతుడేనని అర్థము.

“ప్రద్యుమ్న” అన్న పేరుతో కంటికి “దృష్టిశక్తి”ని ప్రసాదిస్తున్న భగవంతుణ్ణి కన్నులారా చూడలేని లోపాన్ని నివారించుకోవడానికి చేసేదే దీపారాధన మరియు ఆరతి. “దీపం జ్యోతి పరబ్రహ్మ” అనడంలోని అంతరార్థమిదే!

“దివు” అన్న సంస్కృతపదానికి “ద్యుతి, కాంతి” అనే అర్థాలున్నాయి. ఇటువంటి కాంతితో కూడినవాడు కావున “దేవ” అన్న పేరుతో వేదోపనిషత్తులు భగవంతుణ్ణి కీర్తిస్తున్నాయి. అలాంటి కాంతికే కాంతియైన దేవదేవుణ్ణి భౌతికరూపంలో చూడడమే దీపోత్సవం. అదే దీపావళి.

చీకటిలాంటి అజ్ఞానంలో మునిగిన మానవ హృదయంలో జ్ణానమనే వెలుగు నిండి, ఆ వెలుగులో సుఖం కలగడమే ఆరతి (ఆ=చక్కగా, రతి=సుఖించడం)ని ఇవ్వడంలోని అంతరార్థం.

 

“స్నేహం దీపో యధా ధృత్వా సర్వలోకోపకారకః
తథా భవాన్మమ జ్ఞానం హృది ధారయ సంతతమ్”

చేతిలో ధరించబడ్డ దీపం లోకంలోని సమస్త ప్రజలకు స్నేహాన్ని పెంపొందించే విధంగానే నా హృదయంలో జ్ఞానం ఎల్లప్పుడూ నిలచివుండుగాక – అని ప్రార్థిస్తూ దీపాలను వెలిగించాలి.

పై ప్రార్థన ఎంత ఉదాత్తమో పాఠకులు ఈపాటికే గ్రహించివుంటారు. ఇందులోని వాస్తవికత, నిజాయితీలను చవిచూసిన మనిషి యొక్క కళ్ళు చెమర్చుతాయి. ఇటువంటి ప్రార్థనతో దీపం వెలిగించిన ప్రతిరోజూ దీపావళియే. అసూయరహితులై, సర్వజనక్షేమచింతకులై దీపాలను వెలిగించే మానవుల హృదయంలోని అజ్ణానమనే నరకుడిని వేదాభిమానినియైన “సత్యభామ” పేరుగల లక్ష్మీదేవి తప్పక సంహరిస్తుంది. అంటే మనసులో సత్యము నిత్యమై భాసమానమౌతుంది. అలా జ్ణానదీపమ్ వెలుగుతున్న ప్రతి గృహమూ వైకుంఠమే. సర్వలోకపాలకుడైన శ్రీహరి అక్కడే నివాసముంటాడు. 

తాత్కాలిక సుఖాన్ని కోరే పిల్లలు టపాకాయలను కాల్చి ఆనందించుగాక, వారికి జ్ఞానోపదేశముతో బాటు దిశానిర్దేశము చేయవలసిన పెద్దలు మాత్రం పైన చెప్పిన పురాణ పద్ధతిలో, మంచి ఉద్దేశంతో దీపావళిని ఆచరించాలి. అప్పుడే వ్యక్తికి, సంఘానికి, దేశానికి శ్రేయస్సు ప్రాప్తిస్తుంది. దుఃఖాలు నశిస్తాయి. మనం ప్రతి నిత్యం ప్రాకులాడే “సుఖం” లభిస్తుంది.


చివరగా కొన్ని మాటలు.

తేజోరాశులైన సూర్య, చంద్రులు నారాయణుని కుడి-ఎడమ కన్నులుగా వెలుగుతుంటారు. అవే శక్తులు మానవుని కంటిలో ఉండి వానికి “చూచుట” అన్న శక్తిని కలిగిస్తున్నవని వేదాలు చెబుతున్నాయి. అందుకే పిల్లల్ని “కంటివెలుగు” అని అభిమానపూర్వకంగా పిలుచుకుంటారు.


కంటి గురించి చెప్పిన వేదవివరణకు తెలుగు అనువాదం ఇలా ఉంటుందిః

“కంటిలోని నల్లగుడ్డులో ఆవుదూడను కట్టివేసే స్థంబం లాంటి రూపంలో (నిలువుగా) ప్రద్యుమ్న అనబడే విష్ణు రూపం ఉంది. (ప్ర=గొప్పదైన;ద్యుమ్న=వెలుగు). నల్లగుడ్డు రంధ్రాన్ని సంకోచ, వ్యాకోచాలకు గురిచేసే మాంసతంత్రువులు లక్ష్మీరూపం. ఆ తంత్రువుల చూట్టూ ఉండే అక్షిపటలంలో భావిబ్రహ్మయైన వాయుదేవుడు మిగిలిన దేవతలతో కూడి, ఈ బాహ్యప్రపంచాన్ని తాను చూచుచూ, మనిషి చేత చూడబటునట్టుగా చేస్తాడు.”

పైదాంట్లో విజ్ఞానము కలదో, అజ్ఞానపూర్వకమైన గుడ్డినమ్మకము కలదో పాఠకులు నిర్ణయించుకోగలరు. ఆర్ష విజ్ఞానాన్ని హ్రస్వదృష్టితో చూస్తూ పూచికపుల్లలా తీసిపారవేసేవారే మూఢనమ్మకాలతో అల్లాడుతున్నవారని వేరుగా చెప్పాలా?

గీతలో “జ్ఞాన విజ్ఞాన సహితం ప్రవక్ష్యామ్యనసూయవే!” అని అంటాడు కృష్ణుడు. “ఓ అర్జునా! నీవు పరుల ఉన్నతిని చూసి అసూయపడనివాడివి గనుక నీకు జ్ఞానముతో బాటు విజ్ఞానాన్ని కూడా ఉపదేశిస్తాను” అన్నాడు గీతాచార్యుడు. అంటే విజ్ఞానము(science) జ్ణానములోని అంతర్భాగమేనని, దాన్ని తెలుసుకోవాలంటే అభ్యర్థి అసూయాపరుడు కాకూడదని స్పష్టమౌతోంది. కావున అసహనశీలురై, నాస్తికమత ప్రచోదితులై “అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష” అని వెక్కిరించే మానవులకు నిజమైన జ్ఞానము ఎలా కలుగుతుంది? 

 

||తమసోమజ్యోతిర్గమయ||
||శాంతిః శాంతిః శాంతిః||

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *