అన్నలదారిలో అన్నాహజారే… తెలకపల్లిగారు మీరేమంటారు?

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు “హజారే దీక్ష, హజార్ సవాళ్లు” అనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఈ వ్యాసం చదివిన పాఠకులకు తోస్తుంది.

పురిటిలోనే సంధి కొట్టించేటట్లుగా కొనసాగిన జన లోక్ పాల్ బిల్లు ప్రతిపాదనలు ఎన్ని దశాబ్దాలుగా మనలని మభ్యపెడుతున్నాయో మనకు తెలుసు. ఆ ప్రతిపాదనలకు రూపురేఖలు కలిగిస్తున్న రాజకీయ నాయకుల అవినీతి నేపధ్యమూ తెలుసు. మరి ఇంతకాలం, లోక్ సత్తా, కమ్యూనిస్టులతో సహా ఏ రాజకీయ పార్టీ ఈ అంశంపై ఉద్యమాన్ని ఎందుకని తీసుకురాలేకపోయాయి?

ఎందుకంటే, ఈ పార్టీలన్నీ ఆ తానులోని గుడ్డలే. ఒక సాధారణ సంఘటనగా మొదలైన ఉద్యమానికి ఊహాతీతంగా లభించిన జనస్పందన పాలక, ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి కలిగించిందనేది వాస్తవం. అవకాశవాద రాజకీయాల్లో దిట్టలైన ఈ నేతలు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది కానీ, అవినీతిపై వారికి ఉన్న విముఖత కానేకాదు.

తెలకపల్లి గారు ఓ విచిత్రమైన వాదన చేస్తూ ఇలా అన్నారు “వ్యవస్థీకృతమైన అవినీతి మూలాలు చూడకుండా కాయకల్ప చికిత్సలపై కదన శంఖాలు ఎంతగా పూరించడం వేళ్లు వదిలి కొమ్మను విరచిన చందంగానే మిగిలిపోతుంది.”

అపరిచితుడు, భారతీయుడు సినిమాల స్థాయిని దాటలేని ఆలోచనే ఆయన విమర్శ కూడా. ఆయా సినిమాలలో లాగా, అన్నా హజారే అవినీతికి పాల్పడ్డవారిని అంతమొందించమన్నారా? లేదే! అవినితీకి పాల్పడే నాయకులే, అవినీతిని నిరోధించే లోక్ పాల్ బిల్లుకు మెరుగులు దిద్దటమేమిటని ప్రశ్నించారు. జన సామాన్యానికి కూడా ఆ బృందంలో స్థానం కలిగించాలని గాంధేయ మార్గంలో నిరశన దీక్ష చేసారు. అన్నా హజారే ప్రశ్నించింది కూడా సో కాల్డ్ “ప్రాతినిధ్య ప్రజాస్వామ్య సూత్రాలనే”. అన్నా హజారే అడుగుతున్నది కూడా అవినీతిని అంతమొందించే పటిష్టమైన వ్యవస్థనే. మూలాలు నరికే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమౌతున్నది?

ఉద్యమాలు, పోరాటాలు కమ్యూనిస్టుల జన్మహక్కుగా మాత్రమే భావించే వారికి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన అన్నా హజారే ఉద్యమం తొందరగా జీర్ణం కాదు. అందులో భాగంగానే అన్నా హజారే మొదలెట్టిన “వాటర్ షెడ్ వ్యవస్థ” కూడా అవినీతి ఆరోపణలకు అతీతం కాదని ప్రకటించి ఆత్మ తృప్తికి లోనౌతూ, తమ ఆత్మన్యూనతను ప్రదర్శిస్తుంటారు. అదే బిగువన, కమ్యూనిస్టు వృద్ధుడు జ్యోతిబసు మీది అవినీతి ఆరోపణలు కూడా నిరూపించబడలేదని ఆత్మస్తుతికి దిగుతారు.

అయ్యా, రెండు పెళ్ళిళ్ళు చేసుకొని, కొడుకులని విదేశాలలో చదివించి, రెండు దశాబ్దాలపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, సమాజ సేవ కోసం కుటుంబాన్ని కాదనుకొని, వివాహం కూడా చేసుకోని, అధికారం కోసం ప్రాకులాడని వ్యక్తికి పోలిక ఎలా కుదురుతుంది?

 

తెలకపల్లిగారి వాదన రాజకీయాల్లో అవినితీ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ మీదుగా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రాజకీయాల్లో అఘాయిత్యాల మీదకి దారిమళ్ళుతుంది. గుజరాత్ లో జరిగిన మారణహోమానికి కారణమైన నరేంద్ర మోడిని ప్రశంసించటమేమిటి? నృపేన్ చక్రవర్తులు, బుద్ధదేవ్ దాస్ లు కనిపించరా అని ఆక్రోశిస్తుంది.

 

అయ్యా, గుజరాత్ మారణ హోమానికి కారణమైన నరేంద్ర మోడీని ప్రశంసించటమే నేరమైతే, ఇందిరాగాంధి మరణానంతరం సిక్కులపై ఊచకోతకు దిగిన కాంగ్రెస్ కు గత లోక్ సభలో మద్దతు ఇవ్వటం కమ్యూనిస్టులు చేసిన నేరమని మీకు అనిపించదా?

 

తెలకపల్లిగారికి ఓ ప్రశ్న “అన్నా హజారే కనుక, అన్నల దారిలో అడవిబాట పట్టి పోరాటం మొదలేసి ఉంటే ఇలానే విమర్శించి ఉండేవాళ్ళా?”

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *