అక్కిరాజు ఉమాకాంతం-అభిప్రాయాలు

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
Like-o-Meter
[Total: 1 Average: 3]

ముందుమాట:

అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు (1889-1942), ఆంధ్రదేశం గన్నటువంటి సునిశిత సాహిత్య విమర్శకుల్లో ఒకరు. అగాధమైన సంస్కృత పాండిత్యం , నిశిత పరిశీలనా శక్తి, ఎదురులేని తర్కం , అన్నింటినీ మించి తెలుగుAkkiraju Umakantam కవిత్వం పట్ల ఉన్న ప్రేమ అక్కిరాజు ఉమాకాన్తమ్ గారికి పెట్టని ఆభరణాలు. భావకవిత్వపు ప్రభంజనంలో మునిగి తేలుతున్న ఆంధ్ర దేశపు కవులను తట్టిలేపే నిమిత్తం “నేటి కాలపు కవిత్వం” అనే విమర్శనా గ్రంధాన్ని వ్రాసారు అక్కిరాజు గారు. ఆ పుస్తకపు విశేషాల్లోకి వెళ్ళే ముంద పూర్వభావిగా, కవిత్వం పట్ల భారతీయ దృక్పథాన్ని తెలుసుకోవడం వుచితం.

ఇతర దేశాలు, జాతులు, సంస్కృతులు కళ్ళు తెరవక ముందరే జాగృత శక్తిగా నిలచివున్న భారత వర్షంలో ఆధ్యాత్మికానికి ఉన్న స్థానం సాహిత్యానికి కూడా ఉంది. అంచేత ఆధ్యాత్మ రంగంలో మహర్షులు సాధించిన ప్రగతికి సమానంగా సాహిత్య రంగంలో కూడా పురోగతిని సాధించారు కవులు. ఐతే కావ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కవిత్వ లక్షణాలను నిర్దేశించిన పండితులు కూడా కవులతో పాటు లోకప్రసిద్ధులైనారు. వారిలో 9 వ శతాబ్దానికి చెందిన ఆనందవర్ధనుడు, 10 వ శతాబ్దానికి చెందిన మమ్మటుడు అత్యధిక ఆదరణను పొందినవారు. ఆనందవర్ధనుడు వ్రాసిన “ధ్వన్యాలోకమ్”, మమ్మటుడు వ్రాసిన “కావ్యప్రకాశమ్” గ్రంథాలు ఆసేతుహిమాచలపర్యన్తం కవిజనామోదాన్ని పొందాయి. అందుకు నిదర్శనం నేటికీ వాటిని ఉదహరిస్తున్న కవి, పండితులు ఉండడమే.

అక్కిరాజు ఉమాకాన్తమ్ గారు కూడా తమ “నేటి కాలపు కవిత్వం”లో వీరిద్దరినీ అనేక సందర్భాల్లో ఉదహరించారు.

1. “కావ్యస్యాత్మా ధ్వనిరితి” (ధ్వన్యాలోకమ్, ప్రథమోద్ద్యోతం – మొదటి పద్యం)

అర్థం: కావ్యానికి (కవిత్వానికి) “ధ్వని” ఆత్మ వంటిది

2. “యత్కావ్యమ్ లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ” (కావ్యప్రకాశమ్, ప్రథమోల్లసమ్)

అర్థం: కావ్యమనగా లోకంలో కనిపించే మామూలు విషయాలలో లేని చమత్కారాన్ని కలిగించే వర్ణనలు చేయగలిగిన కవి యొక్క పని (కర్మ).

“ధ్వని” అంటే ఏమిటో తెలుసుకొందాం:

 • “ఈ శబ్దానికి ఇది అర్థం” అని చేసికొన్న ఒక నిర్ణయాన్ని (సంకేతాన్ని) పట్టి ఒక శబ్దం ఒక అర్థాన్ని బోధిస్తుంది.
 • అలా బోధించే శబ్దం “వాచకం”. బోధించబడే అర్థం “వాచ్యం”.
 • శబ్దంలో ఉన్న ఆ అర్థాన్ని బోధించడం అనే పనికి “అబిధ” అని పేరు.
 • ఒకొక్కప్పుడు ఒక పదం తన వాచ్యార్థంతో పాటు, మరొక అర్థాన్ని బోధిస్తుంది. అంతేకాదు ఒక్కోసారి ఆ వాచ్యార్థాన్నిపూర్తిగా విడిచిపెట్టి మరొక అర్థాన్నిబోధిస్తుంది.
 • వాచ్యాతీతమైన ఈ కొత్త అర్థానికే “వ్యంగ్యం ” అని పేరు. (శ్రీ పుల్లెల రామచంద్రుడు గారి కావ్యప్రకాశిక ప్రస్తావన నుండి)

దీన్నే “ధ్వని” అని ఇదే కావ్యానికి ఆత్మ అని ఆనందవర్ధనుడు పేర్కొన్నది.

ఏతావాతా తేలేది ఏమిటంటే కవికి “ప్రతిభ”, కావ్యానికి “ధ్వని” తప్పనిసరిగా కావాలి. ఐతే అక్షరమ్ముక్కలు వచ్చినంత మాత్రాన ప్రతిభ సిద్ధించదు. అక్షరాల్ని ఓ క్రమంలో పేర్చిసినంత మాత్రాన అది “కావ్య”మై “ధ్వనించదు.పూర్వజన్మ పుణ్యాలను నమ్మిన నమ్మకపోయినా “కవిత్వ ప్రతిభ” విషయంలో మాత్రం అలాంటి “సంస్కార విశేషం” ఒప్పితీరాలి. అందుకే మమ్మటుడు “శక్తి:కవిత్వబీజ రూప: సంస్కారవిశేష:” అని తేల్చిచెప్పాడు. అగ్నిపురాణం కూడా:

నరత్వం దుర్లభే లోకే విద్యా తత్ర చ దుర్లభా:

కవిత్వమ్ దుర్లభమ్ తత్ర శక్తిస్తత్ర చ సుదుర్లభ:

మానవ జన్మ దొరకడమే కష్టం. అది లభించినా విద్య దొరకడం కష్టం. విద్య వచ్చినా కవిత్వం పట్టుపడడం కష్టం. కవిత్వం రాస్తున్నా దానికి కావలసిన “శక్తి” లభించడం చాలానే కష్టం (ఇక్కడ “శక్తి” అంటే “ప్రతిభ” అనే అర్థం)

 

అందువల్లనే విద్య, అక్షర నిర్మాణ సామర్థ్యం కాదు కవితకు మెరుగు దిద్దేది. రోజువారీ పదాలనుపయోగించినా వాటికి కొత్త అర్థాలను తెచ్చిపెట్టనిదే అది కవిత్వం కాలేదు.

అక్కిరాజు ఉమాకాన్తమ్ గారు కూడా ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తూ

“అమేయమై, అమితమై శ్రోత యొక్క పరిణితి ననుసరించి సంకోచ వికాసాలను పొందుతూ దృశ్యాదృశ్య దశయందు లీలామాత్ర గోచరమై సౌందర్యపిపాసువుల చిత్తవృత్తికి విశాలావకాశాసాన్ని ప్రసాదించే కావ్య రచనను సాహిత్యవేత్త లారాధించారు. దీన్నే ధ్వని యని కావ్యవేత్తలు చెప్పుతున్నారు. (నేటికాలపు కవిత్వమ్ – పులుముడుఘటనాధికరణం)

అసలు విషయం:

ఇహ అసలు విషయంలోకి వద్దాం.

అక్కిరాజు ఉమాకాన్తమ్ గారు తమ విమర్శతో అభిమానులకంటే వ్యతిరేకుల్నే పెంచుకొన్నారు. అందుచేత వారి ప్రతిభ మసిబారిపోలేదు. ఆయన విమర్శల్ని పక్కనబెట్టి తెలుగు కవులు మసిపూసుకొని మారేడుకాయలయ్యారు. ఇంత తీక్షణంగా యెందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కిరాజు గారు చేసిన విమర్శకు ఇంతవరకు ఎవ్వరూ సరైన ప్రతివిమర్శను చెయ్యలేదు. సరికదా ఆయననో కవిజన వ్యతిరేకి అన్న అపఖ్యాతిని మాత్రం చక్కగా ప్రచారం చేసారు, చేస్తున్నారు.

అక్కిరాజు గారు ఆనాటి కవిత్వాన్ని విమర్శించినా ఈనాటికీ ఆ విమర్శ హేతుబద్ధంగా, నిత్యసత్యంగా నిలచే వుంది. అంచేత ఇప్పటి కొత్త కవులు తప్పనిసరిగా అక్కిరాజు గారి విమర్శను చదవాల్సిన అవసరం యెంతైనా వుంది. అక్కిరాజుగారి వ్యక్తిగత విషయాలకంటే ఆయన మండనజేసిన విషయం గొప్పది గనుక వాటినే ఇక్కడ రాస్తున్నాను.

పాఠకులకు వో మనవి, “నేటికాలపు కవిత్వం” అన్నది అక్కిరాజు ఉమాకాన్తమ్ గారి గ్రంధం పేరు. ఈ గ్రంధాన్ని 1926 లో ప్రచురించారు. ఇక్కడ నేటికాలపు కవిత్వం అంటే గ్రంధం పేరనే భావించాలి. అంతేకాదు నేటికాలపు కవిత్వం అంటే 1926 కు ముందు వచ్చిన కవిత్వమని కూడా గ్రహించాలి.

అక్కిరాజు గారు తమ విమర్శలో అనేకమైన సిద్ధాంతాలు చేసారు. అందులో ప్రధాన సిద్ధాంతాలు ఇవి:

 

 1. విస్తరం , వికారాలు, అనుచితపు పేర్లు, ఊగుడుమాటలు, నిదర్శన పరంపరలు, అయోమయత్వం, పులుముడు, శబ్దవాచ్యత,దృష్టిసంకోచం అనేవాటితో ప్రాయికంగా ఈ కాలపు కవిత్వం దుష్టం.
 2. కావ్యత్వసిద్ధి పొందిన కావ్యాలు విరళం. ఉత్తమ, మధ్యమాలూ విరళం.
 3. వీట్లో తరచూ భాషావ్యతిక్రమం కనబడుతున్నది.
 4. అనౌచిత్యం రసభంగానికి ముఖ్య హేతువు (అని ఆనందవర్ధనుడు).
 5. ఇది ఈ కాలపు కృతుల్లో తరచుగా కనబడుతున్నది.
 6. నేటికాలపు కృతుల్లో వ్యుత్పత్తి,వికసితమైన ప్రతిభ అరుదు.
 7. ఇంగ్లీషు పాఠశాలల్లో భారతీయ సంస్కారం నష్టప్రాయం.
 8. ఛందోవ్యతిక్రమం వల్ల, భాషావ్యతిక్రమం వల్ల, తెలుగు పద్యం కలుషితం.
 9. భాషావ్యతిక్రమం, అసౌష్టవం, ఛాందసాలు నేటి కాలపు కృతులను వికృతం చేస్తున్నవి.
 10. చౌర్యం బహుళం (భావ చౌర్యం, గ్రంధ చౌర్యం అని అర్థం)

 

ఈ సిద్ధాంతాలు నేటికీ స్థిరంగా నిలబడే వుండడం గమనించ దగ్గ విషయం.

ఇవి గాక అప్పటికాలంలో బలంగా వున్న “భావకవిత్వమ్”పై ఆయన తన సిద్ధాంతాలను అధ్యాయాల రూపంలో వివరించారు. “భావకవిత్వమ్” అన్న ఒక్క బరిలో ఆ సిద్ధాంతాలను బిగదీసిచూడ్డంకంటే మొత్తం కవిత్వ తత్వానికి అన్వయించి చూడ్డం ఉత్తమం. దీనివల్ల అక్కిరాజుగారికంటే కొత్త కవులకే లాభమెక్కువ.

 

1. నూతనత్వాధికరణం

 

కవిత్వంలో నూతనత్వాన్ని వివరిస్తూ అక్కిరాజు ఇలా అంటారు:

“నూతనత్వం కవిత్వధర్మం”. నూతనత్వం అభిలషణీయం . నూతనత్వమే కవిత్వాన్ని ఉపాదేయకోటిలోకి చేరుస్తున్నది. ఇదిలేని కవిత “పాడిందే పాడరా” అన్న హేయకోటిలోకి చేరుతుంది. అందుకే శబ్దాలు, అర్థాలూ వెనుకటి కవులు వాడినవే ఐనా శక్తిమంతుడైన కవి వాటినే స్వీకరించి నూతనత్వాన్ని ప్రకటిస్తాడు.”

ఆనాటి కవిత్వంలో లోపించిన వైనాన్ని అక్కిరాజుగారు ఆ తరువాతి పుటల్లో నిరూపించారు. అల్లానే సమకాలీన కవిత్వంలో నూతనత్వమున్నదా లేదా అన్నదాన్ని పరిశీలించితే అది మబ్బు చాటు సూర్యుడిలా అక్కడక్కడా తళుక్కుమంటూందే గానీ లోకాన్నంతా ఆవరించే ప్రకాశంలా లేదు.

2. విస్తరణాధికరణం

అక్కిరాజు ఉమాకాంతం: “చెప్పవలసినదాని కంటే హెచ్చుగా కవిగాని, పాత్రలు గానీ చెప్పడం విస్తరదోషం. దీనివల్ల విసుగు, రసభంగం కలుగుతున్నవి. వకీళ్ళు, విద్వాంసులు తమ సిద్ధాంతాలను స్థాపించడానికి హెచ్చుగా మాట్లాడినా తగినట్టువుంటుంది గాని రసాస్వాద ప్రధానమైన కావ్య, నాటకాల్లో ఆ పని హేయం. ఇట్టి దోషం వెంకటి వాటిల్లో ఉన్నా అది దోషమేగాని గుణం కాదు.”

కవిత్వంలో క్లుప్తత అన్నది యే జపానుకో, చైనాకో మాత్రమే పరిమితమైన అభిప్రాయం గాదు. అనాదినుంచీ మన ప్రాచీనులు పాటించిన సూత్రమే. ఎప్పుడైతే వాడుక భాష కవిత్వంలోకి ప్రవేశించిందో అందులోకి దైవత్వంతో బాటు పిశాచావేశం గూడా ప్రవేశమైపోయింది. ఇందుకు ఎవరు బాధ్యులు?

3. వికారాధికరణం

“దయా, సత్య, విజ్ఞాన, ప్రభృతి గుణాల చేత తేజస్వి అయిన మనిషికి వేషాదులు అప్రధానమై ప్రధానంగా తేజస్సు గోచరిస్తుంటుంది. అది లేనప్పుడు వేషం సవరించడం, జుట్టు దిద్దడం, ఇట్లాటివి ప్రధానమౌతవి. “వపుష్య లలితే స్త్త్రీణాం హారో భారాయతే పరం ” అని ఆగ్నేయ పురాణం అన్నట్లు కవిత్వంలో వికారాలు పరిణమించడం వికృతం. (అక్కిరాజు ఉమాకాంతం)

4. ఊగుడుమాటల అధికరణం

“కవి నొక విధమగు నుద్రేకమూగింపవలెను. ఒక యావేశ మావహింపవలెను. వలవల నేడ్చును. పకపక నవ్వును. పిచ్చి కేకలిడును. పాడును. నృత్యము చేయును” (యేకాంతసేవ పీఠిక – దే.కృష్ణశాస్త్రి)

 

“ఇట్లా వూగవలెనని ఇది ఎమోషనని, అవేశపడవలెనని, పిచ్చి కేకలు వేస్తాడని ఊహలు ఈకాలపు కృతికర్తల్లో వ్యాపించివున్నవి. కాని కవులు వూగరు. పిచ్చి కేకలు వేయరు. భావం ఆవరించినపుడు దానికి మొదట కవి వశుడౌతాడు. సర్వభావాలకు మొదట తాను వశుడై సర్వ భావాలను పిమ్మట తన వశం చేసుకొని భావోద్వేగానికి తాను మొదట వశుడై పిమ్మట భావోద్వేగాన్ని తన వశం చేసుకొని సర్గానికి ఉన్ముఖుడయ్యే జగన్నిర్మాతవలె అమోఘవివేకంతో కావ్యసృష్టికి ప్రవృత్తుడవుతున్నాడు కవి.” (అక్కిరాజు ఉమాకాంతం)

అలా ఊగాలన్న తాపత్రయంలో వుపయోగం లేని పదాలను వాడి కవిత్వాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అక్కిరాజు గారి ఆవేదన. ఆనాటి కవిత్వానికి అన్వయించినా, కాకపోయినా సమకాలీన కవిత్వంలో వొస్తున్న అరుపులకు, కేకలకు, శుష్క పదాలకు ఈ సిద్ధాంతం చెంపపెట్టే.

5. నిదర్శనాధికరణం

“విస్తరదోషంలో నిదర్శన ఇమిడివున్నా దీన్ని ప్రత్యేకించి తెలపవలసినంత హెచ్చుగా ఈ కాలపు కృతుల్లో వ్యాపించివున్నది. భావం హృదయంగమంగా స్ఫుట పడ్డ తర్వాత దాన్ని ఇంకా చెప్పడం విసుగును రోతను పుటిస్తుంది. ఒక వస్తువును వెడల్పుగా పరచి సాగగొట్టిన కొద్దీ దానికి బలం తగ్గి పలచబడిపోతుంది. భావాన్ని వ్యక్తదశకు తెచ్చి వదిలితే అఖండబలంతో హృదయాన్ని అధిష్ఠిస్తుంది. లేదా కొట్టి కొట్టి వదిలితే పలచబడి నీరసిస్తుంది. అందుకే నిదర్శన పరంపర దోషమని, హేయమని చెప్పుతున్నాను. హేయం గనుకనే కాళిదాసాదులు ఉత్తమ మార్గమవలంబించి భావవ్యక్తి చేస్తూ కావ్యసౌందర్యాన్ని మనకు ప్రసాదించారు. నిదర్శన పరంపరలు ప్రజలకు వుడుకెత్తించే సభల్లో అవసరమైతే కావచ్చునుగాని పరిణితబుద్ధులకు ఉద్దిష్టమైన కావ్యాల్లో విసుగూ రోతా పుట్టిస్తవి. ” – (అక్కిరాజు ఉమాకాంతం)

నిజమే ! ఆనాటి కవిత్వాన్ని చదివితేనే అక్కిరాజు గారికి ఈ అభిప్రాయం పుట్టుకొచ్చిందీ అంటే సమకాలీన కవిత్వాన్ని చదివితే ఏమని వుందురో గదా !

6. అయోమయత్వాధికరణం

“బుద్ధి అపరిణితమై ఉదితభావపరంపరలో స్పష్టతలేనప్పుడు వెలువడే మాటలు అయోమయంగా వుండడం సహజం . చెప్పదలచుకొన్నది చెప్పడానికి బలంలేని భీరుత్వమూ చెప్పవలసినదేమీ లేనప్పుడు వ్రాయవలెననే కోరికా అయోమయపు మాటలనే వెడలిస్తవి. ఉన్నది మామూలు అభిప్రాయమై ఓసి ఇంతేనా అంటారని దాన్ని యేమేమో మాటలతో చెప్పి అయోమయంతో ఆత్మ వంచన చేసుకొంటారు కొందరు. ” – – (అక్కిరాజు ఉమాకాంతం)

* * * * *

పైన చెప్పుకొన్న అక్కిరాజుగారి అభిప్రాయాల్ని మరికొంచెం విస్తరించదల్చాను.

ఈశావాస్యోపనిషత్తులో ఆత్మగురించిన వివరణలో వో చోట “కవి” గురించిన వివరణ వుంది.

కవిర్మనీషీ పరిభూ:

స్వయంభూ: యాథాతథ్యత:

అర్థాన్ వ్యదధాత్

శాశ్వతీభ్య: సమాభ్య:

ఆ ఆత్మాకవి – సర్వవ్యాపి, క్రాంతదర్శి, రుషి ఐవుంటాడు. అంతేకాదు అతను విశ్వప్రేమి, ఆత్మనిష్టావంతుడు, యధార్థాన్ని మాత్రమే మాట్లాడేవాడు, కాలదృష్టి కలిగి శాశ్వతుడై వుంటాడు.

పై ఉపనిషత్తు వాక్యాల్లోని ఆధ్యాత్మికార్థాలు యేవైనా మనకందుబాటులో వున్నంత వరకూ “కవి” లక్షణాల్ని చక్కగా చెప్తున్నాయి.శాశ్వతుడై, క్రాంతదర్శియై వుండాలి కవి.అప్పుడే ఆ రచనలు శాశ్వతంగా వుంటాయి. గానీ ఇప్పుడు వేలకొద్దీ “కవులు” రాస్తున్న లక్షలకొద్దీ రచనల్లో కాలం ధాటికి కాళ్ళు తేలనివెన్ని? పేలపిండి కవిత్వం యేవరినుద్ధరించడానికి?

హేతుబద్ధమైన బుద్ధికి, హేతురాహిత్యమైన మనసుకీ మధ్య సమన్వయం సాధించడమే కవిత్వం. ప్రతిదానికీ తర్కాన్ని వెతికే బుద్ధి, ప్రతి స్పందనకీ ప్రతిస్పందించే మనసులోకి యేకీకరించడమే కవిత్వం. ఇల్లా పుట్టిన కవిత్వాన్నే మమ్మటుడు “తదదోషౌ, శబ్దార్థౌ, సగుణావనలం కృతి పున: కాపి” అన్నాడు. ఇట్లాంటి కవిత్వాన్నే “వాక్యం రసాత్మకం కావ్యం” అన్నాడు సాహిత్యదర్పణకారుడు.

ఇన్ స్టంట్ ఇడ్లీ దోసా తిన్న దోషానికి ఇన్ స్టంట్ కవులైపోతున్న ఈ కాలంలో కవిత్వ రూప విశిష్టాల్ని చదివి, మననం జేసుకొని మనసు కేంద్రీకరించగలిగే తీరికేది? రుషిత్వం రానిదే కవిత్వం రాదని మహామహులు మొత్తుకొంటుంటే చప్పట్ల కోసమే యెగబడే వారు కూడా కవిత్వానికి దిగేస్తున్నారు.

ధ్వన్యాలోకకారుడైన ఆనందవర్ధనుడు ఈ విషయం గురించి ఇల్లా అన్నాడు “ధ్వనేస్వత్వం గిరామ్ అగోచరవన్ సహృదయ హృదయ సంవేద్యం యేవం సమాఖ్యాతవంత:” – కావ్యానికి ఆత్మవంటిదైన ధ్వని తత్వం మాటాల్లో వర్ణించలేనిది.ఇది సహృదయవంతులైన వ్యక్తుల అనుభవంలోనిది.

న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంత:కరణే గృహ్యతే” – ధ్వని తత్వం స్వయంగా తమతమ అంత:కరణంతోనే గ్రహించ సాధ్యం.

అంటే మొత్తంగా ఆనందవర్ధనుడు చెప్పేదేంటంటే కావ్యానికి ఆత్మవంటిదైన “ధ్వని” గురించి తెల్సుకోవడానికి కవి అన్నవాడికి శుద్ధమైన అంత:కరణ, సహృదయత అవసరమని. కవిత్వాన్ని రాసేస్తున్నామహో అని హోరెత్తేస్తున్న కవికులాలంకారుల్లో యెందరు ఈ ఆత్మజ్ఞానాన్ని సాధించారు? యెందరికి స్వచ్ఛమైన, అమలినమైన అంత:కరణముంది? యెంతమంది తమకుతాము ఇల్లాంటి ప్రశ్నలేసుకొన్నారు?

యావత్కావ్యం లోకోత్తర వర్ణనానిపుణం“గా వుండాలని, ఇదే “కవి కర్మ“అని మమ్మటుడు చెప్పాడు. “లోకోత్తరాణాం చేతాంసి, కో హి విజ్ఞాతు మర్హసి?” అని భవభూతి నిలవేస్తాడు. సమాధానమిచ్చే దినుసు వున్నవాళ్ళు కృతకృత్యంగా ఇస్తారు. లేనివాళ్ళు మందీమార్బల భట భట్రాజు సమేతంగా పలాయనం చిత్తగిస్తారు.

ముగింపు:

“కవనీయం కావ్యమ్. తస్య భావశ్చ కావ్యత్వం. సహృదయహృదయాహ్లాది శబ్దార్థమయత్వమేవ కావ్యలక్షణమ్.”

కవిత్వాన్ని రాసే ముందర ఆ పదార్ధమేమిటో తెలుసుకోవడం మంచిది. అదే సహృదయత్వం. అది లేకండా రాసేవన్నీ యిసుకపైని అక్షరాలే!

You may also like...

Leave a Reply