అబ్దుల్ కలామ్ – దళిత, మైనార్టీ, సెక్యులర్ వాదుల డొల్లతనం!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares
Like-o-Meter
[Total: 1 Average: 5]

ముందుమాట:

మనం తరచూ వింటున్న, చదువుతున్న, చర్చిస్తున్న దళితవాదం, మైనార్టీవాదం, సెక్యులర్ భావాలు పుటం పట్టిన మేలిమి బంగారు కడ్డీలేమీ కావని ఇతర వాదాలకు ఉన్నట్టుగానే వీటికీ కాస్తంత డొల్లతనం ఉందని చదువరుల దృష్టికి తీసుకురావడం మాత్రమే ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.

వీటితో బాటు [QUOTE]“I’ve two very simple and direct questions: why such intolerance?when do we learn to respect difference, either view point or color? I would prefer this debate towards that big question of intolerance and hate politics”[/UNQUOTE] అన్న అఫ్సర్ గారి కామెంట్ (posted in Hanumantha Reddy Kodidela’s FB timeline on 03/08/2015) అనుసరించి, ఒక విషయాన్ని ఊది ఊది ఉప్పెనలా మారుస్తున్న తరుణంలో కొన్ని మౌలిక ప్రశ్నల్ని లేవనెత్తి జరుగుతున్న చర్చను మళ్ళీ గాడిలోకి పెట్టే దిశగా మాత్రమే ఈ వ్యాసం ఉద్దేశించబడింది.

గమనిక:

ఉదహరించక తప్పని సందర్భాలలో మాత్రమే కొందరు వ్యక్తుల పేర్లను, కొన్ని జాల పత్రకల పేర్లను పేర్కొనడం జరిగింది. ఇలా పేర్కొనడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదు. ఇది ఆయా వ్యక్తులు, పత్రికలపై బురద జల్లే ప్రయత్నమూ కాదు.

చర్చా విషయం:

అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక ’సారంగ’ లో ఒక రచయిత “కలాం – హారతిలో ధూపం ఎక్కువ” అన్న ప్రధాన శీర్షికతో “కలాం ప్రజల మనిషి కాదు” అన్న URL శీర్షికతో ఓ వ్యాసం వ్రాయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన, జరుగుతున్న సంఘటనల పరంపరలను చూసి, వ్రాస్తున్న స్పందన ఈ వ్యాసం.

కలాం గారు మరణించిన మరుసటి రోజునే (28/07/2015) “కలాం ప్రజల మనిషి కాదు” అన్న పేరుతో వచ్చిన ఆ వ్యాసంపై వందల సంఖ్యలో వ్యాఖ్యలు వచ్చి అందులో అనుకూలవాదులు, ప్రతికూలవాదులు, తటస్థవాదులన్న మూడు వర్గాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మొదటగా వచ్చిన అభ్యంతరం ఏమిటంటే – ఓ వ్యక్తి చనిపోయిన రోజున, ఆ వ్యక్తిని తిడుతూ వ్రాయడం పద్ధతి కాదు!” అని. అయితే ఏ వ్యక్తినైనా, వారు చనిపోయిన రోజు కూడా నిరభ్యంతరంగా విమర్శించవచ్చునని రచయిత అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. మరి ఈ లెక్కన దళితుల ఆరాధ్యమూర్తి అయిన అంబేద్కర్ గారిని వారి సంస్మరణ దినం నాడు ఎవరైనా విమర్శిస్తే వారు మౌనం వహిస్తారా లేక ఖండిస్తారా?

Products from Amazon.in

కలామ్ గారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వ్రాసిన వారిలో ఒక వ్యాఖ్యాత అభిప్రాయం మేరకు కలాం గారు పాలు పంచుకున్న క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు దండగమారి పనులు. ఆ క్షిపణుల్ని తయారుచేయడానికి ఖర్చు చేసిన డబ్బులతో ఏవేవో అద్భుతాలు చేయవచ్చునని ఆ వ్యాఖ్యలో సారాంశం. ఈ వాదనలో అనేక ఇబ్బందులున్నాయి.

దేశ రక్షణ, దేశ ఆర్థిక వ్యవస్థ – ఈ రెండూ వేరు వేరుగాను, కలిసికట్టుగానూ ఉంటాయి. ఆర్థికంను వెన్నెముక అని భావిస్తే, రక్షణ శ్వాసక్రియ అని భావిస్తే విషయం కాస్త బోధపడతుంది. ఆవిధంగా క్షిపణులు తదితర ఆయుధాలు లేక పోతే సైన్యం ఉండదు. సైన్యం లేకపోతే దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది. పోనీ ఆయుధాలు లేని సైన్యాన్ని ఏర్పాటు చేద్దామా అంటే అది కుదరని పని. కనుక ఒక దేశం, అందునా భారతదేశం వంటి పెద్దది, బ్రతికి బట్టకట్టాలంటే సైన్యం ఉండాలి, ఆ సైన్యం చేతిలో ఆయుధాలు ఉండాలి.

ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు అనుయాయుల ఆధ్యాత్మిక రాజధాని అయిన వాటికన్ సిటీ కూడా తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. స్వంత సైన్యం లేని చిన్న చిన్న దేశాలు తమ పక్కనే ఉన్న పెద్ద దేశాలతోనో లేక ఒకప్పుడు తమను పాలించిన దేశాలతోనో సైనిక ఒప్పందాలు చేసుకొన్నాయి. కానీ ఆ వ్యాఖ్యాత అభిప్రాయం ప్రకారం భారతదేశానికి కావల్సింది ఆర్థిక పురోగతి మాత్రమే. అంటే, దేశం ఆర్థికంగా బాగా పురోగమించిన తర్వాత [సైన్యం లేని కారణంగా] ఏదో ఒక పరాయి దేశపు చేతుల్లో పడి బానిసగా బ్రతకాల్సి వచ్చినా సరే సైన్యమూ ఉండకూడదు, క్షిపణులూ ఉండకూడదని ఆ వ్యాఖ్యాత గారి అనుకోలు. అంటే, కర్మగాలి ఇస్లామిక్ స్టేట్ వారు సైన్యం లేని మనదేశానికి వచ్చి, తుపాకీని గురిపెట్టి ఏది చెబితే అది చేయడానికి సదరు వ్యాఖ్యాత సిద్ధమే. తమ జీతం, ఆర్థిక వనరులు ఉంటే చాలునన్న మాట!

ఈ హాస్యోక్తులు, ఛలోక్తులు ఎలా ఉన్నా గమనించాల్సిన అసలు విషయం ఒకటుంది. అదేమిటంటే – “వ్యాసాల్ని ప్రచురించే ముందు ఎడిటర్స్ ఏం చేయాలి?”

ఈ విషయానికి సంబంధించి రెండేళ్ళ క్రితం వాకిలి.కామ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వ్యక్తుల వివరాల కంటే విషయం ప్రధానమైనది కనుక ఆ విషయ ప్రస్తావనను సంక్షిప్తంగా చేస్తాను.

అది నిర్భయ ఉదంతం జరిగిన తొలినాళ్ళు. ఆ ఉదంతం పై ఎందరో కవిత్వాలు, వ్యాసాలు వ్రాస్తున్న కాలం. ఒక కవి “వీర్య రక్తమాంసాలు”, “శిశ్నాన్ని చేత బట్టుకుని”, “అనియంత్రిత స్ఖలనం” వంటి పదాలతో బాటు “పురుష సూక్తం వర్ధిల్లిన/ (శాంతి) కాముక అర్బనిండియా” అన్న వాక్యాన్ని వ్రాయడం జరిగింది.

ఆ కవితపై స్పందిస్తూ అఫ్సర్ గారు – “[…]ఈ కవితని అచ్చేసే అవకాశం వాకిలికి ఇచ్చినందుకు షుక్రియా. మీధైర్య/ఆత్మగౌరవ సాహంకార కవిత ఈ కాలానికి చాలా అవసరం. మీరు తక్కువగా రాయడం సామాజిక సాహిత్య నేరం! ఇక మీ ఇష్టం!” అని వ్రాయడం జరిగింది.

మీధైర్య/ఆత్మగౌరవ సాహంకార కవిత”అన్న అఫ్సర్ గారి మాటలను చదివి “ఇదేమిటిది? ఈ దేశం ’కాముక’ అర్బన్ ఇండియాగా మారడానికి పురుష సూక్తం ఎలా కారణమయింది? పురుష సూక్తం చదివే, వినే మగాళ్ళందరూ ’మృగాళ్ళే’నా? ఆ సూక్తాన్ని చదివి/విన్న మగాళ్ళు మానభంగాలు చేసిన దాఖలాలు ఉన్నాయా?” వంటి ప్రశ్నలు పుట్టి నేను రంగంలోకి దిగాను.

“పురుష సూక్తం వల్లనే భారతీయ సమాజం ముక్కలు చెక్కలైపోయిందని” ఆ కవి ప్రస్తావించడంతో అసలు చర్చ మొదలయింది. తమ ప్రస్తావనను ’నిరూపించ’మని నేను కవిని అడగడం, అందుకు ఆ కవి మనుస్మృతి, వాజసనేయ స్మృతి వంటి వాటి తెలుగు అనువాదాల్ని ఎక్కడినుండో తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది. కవి పేర్కొన్న శ్లోకాల సంఖ్యలకు, నా దగ్గరున్న ఆ పుస్తకాల్లోని శ్లోకాల సంఖ్యలకు పొంతన లేకపోవడంతో ఆ కవిని మళ్ళీ ప్రశ్నించడం జరిగింది.

ఇలా సాగిన చర్చలో చివరకు పురుష సూక్తం వల్ల మానభంగాలు జరుగుతాయన్న దారుణాన్ని గానీ, సమాజం భ్రష్టు పట్టిపోయిందన్న విషయాన్ని గానీ ఆ కవి నిరూపించలేక పోవడం జరిగింది. అప్పుడు వారు అఫ్సర్ గారిని ప్రస్తావిస్తూ “[…]మీరు [అనగా ఈ వ్యాసకర్త]….అనవసరంగా కవిని ఆడిపోసుకున్నందుకు మీతో [అనగా ఈ వ్యాసకర్తతో]క్షమాపణలు చెప్పించమని అఫ్సర్గారిని కోరుతున్నాను[…].” అని డిమాండ్ చేయడం జరిగింది.

ఇందుకుసమాధానంగా నేను “[…]మీరు నాకు క్షమాపణలు చెప్పమని నేను ఎక్కడా డిమాండ్ చెయ్యలేదు. అభ్యంతరకరమైన మాటల్నితొలగించాలని మాత్రమే కోరాను. మీరు చెయ్యకపోతే విచక్షణాధికారాల్నివాడండని వాకిలి సంపాదక వర్గాన్ని కోరాను.ఇప్పుడు మీరు నాచేత క్షమాపణల్నిచెప్పించడానికి అఫ్సర్ వెనుక దాక్కుంటున్నారు. వారినీ రమ్మనండి. ఇవే ప్రశ్నలు వారికీ వేస్తాను.అందరూ కలిసి శాంతియుతంగా,సామరస్యంగా చర్చిద్దాం. అసలు విషయం తెలుసుకుందాం. అఫ్సర్ గారు – వేదిక మీదకు మీకు స్వాగతం. చర్చ మీతో మరింత రంగు సంతరించుకుంటుంది.” అని అన్నాను.

అఫ్సర్ గారు ఏవో కొన్ని కారణాంతరాల వల్ల ఆనాడు ఆ చర్చలో పాల్గొనలేదు. వ్యక్తిగతంగా నాకో ఈమైల్ పంపారు. అఫ్సర్ గారి అనుపస్థితి, దీర్ఘ మౌనం నేపథ్యంలోను, కామెంట్లను నిలిపివేస్తున్నట్టుగా సంపాదకులు ప్రకటించడం వల్లా ఆ చర్చ అసంపూర్ణంగానే ఆగిపోయింది.

ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయమేమిటంటే – రచయిత తనదైన ఆవేశంలో కొన్ని ప్రకటనల్ని చేసివుండవచ్చు. కానీ ఆ ప్రకటనలు సున్నితమైన విషయాలకు సంబంధించి చేసివుంటే అటువంటి వాటిని నిశితంగా పరీక్షించాల్సిన బాధ్యత సంపాదక బృందానిదే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదని నా విశ్వాసం.

పై ఉదహరించిన కవితలో పురుష సూక్త ప్రస్తావన వచ్చింది గనుక ఆ సూక్తానికి, దాన్ని కవి అనుసంధానిస్తున్న విషయానికి గల స్థూల, సూక్ష్మ సంబంధాలను సంపాదకులు గుర్తించివుంటే బావుండేది. కానీ అది జరగలేదు.

పురుష సూక్తానికి లేని మకిలిని అంటగట్టడం ఆ కవికి ఉన్న జన్మసిద్ధ హక్కుగా సంపాదకులు భావించారనడంలో సందేహం లేదు. ఈ హక్కుల గురించి తీర్మానించమని అఫ్సర్ గారిని పిలిస్తే వారు మౌనం వహించడం జరిగింది. మరి పురుష సూక్తాన్ని సమర్థించడం ద్వారా రఘోత్తమ రావుకు హక్కు ఉండకూడదని కవి వాదించడం, అలా వాదించినందుకు క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేయడం, ఆ కవికి కితాబునిచ్చి ప్రోత్సహించిన వారు వత్తాసు పలకడమో లేక మౌనం వహించడమో ఎంతవరకు అభినందనీయం?

ఇంతకూ ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పడం వెనుక కారణం ఒకటి ఉంది. ఆనాడు ఏవో కారణాల వల్ల ఆ నిర్భయ కవి పురుష సూక్తంపై వేసిన అకారణ నింద పై పెదవి విప్పని అఫ్సర్ గారు ఈనాడు కలామ్ గారిపై వచ్చిన వ్యాసాన్ని సమర్థించడానికై సమయాన్ని వెచ్చిస్తూ, ఆ వ్యాస రచయితను వెనకేసుకు వస్తున్నారు. ఎందుకు?

@@@@@

రెండు ఘటనలు – పోలికలు:

పైన పేర్కొన్న రెండు ఘటనలకు ఈ క్రింది పోలికలున్నాయి:

 1. ఆ ఇద్దరు రచయితలు దళితవాద కవులు, మేధావులవడం.
 2. వారిద్దరూ పై ఉదహరించిన తమ తమ రచనల్లో సనాతన ధర్మాన్ని, పద్ధతుల్ని, ఆచారాల్ని, గురువుల్నీ విమర్శ పేరుతో హేళన చేయడం.
 3. సహేతుకమైన, ఆధారసహితమైన చర్చకు సిద్ధపడిన వారిపై ఏవేవో ముద్రలు వేయడం, సాంఘిక నేరస్తులుగా పరిగణించడం.
 4. అఫ్సర్ గారు మౌనంతోనో, మాటలతోనో, ప్రచురణతోనో ఆ మేధావుల్ని సమర్థించడం.

ఈ నాలుగు అంశాలు, వాటి మధ్యవున్న సారూప్యత నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అందువల్ల “why such intolerance? when do we learn to respect difference, either view point or color?” అన్న అఫ్సర్ గారి ప్రశ్నల్ని ఈ సందర్భంగా వారికే వేస్తున్నాను.

@@@@@

సారంగ ప్రచురించిన “కలాం ప్రజల మనిషి కాదు”పై వచ్చిన ప్రతిస్పందనల గురించి ఫేస్‍బుక్ లో ఒక మిత్రుడికి జవాబునిస్తూ అఫ్సర్ గారు ఇలా అన్నారు – “[…]పరమతసహనం అనే భావన అప్పుడెప్పుడో విన్నాం, ఇప్పుడు కనీసం సహనం కూడా మిగలడంలేదు![….]

కానీ పై రెండు సందర్భాలలోనూ పరమత దూషణను చేసింది ఎవరన్నది అఫ్సర్ గారికి తెలియదా?

పురుష సూక్తం పై, మాజీ రాష్ట్రపతి పై వచ్చిన రచనల్ని సహేతుకంగా ప్రశ్నించిన వారు పరమతద్వేషులుగాను, అకారణంగా, ఆధారరహితంగా సనాతన ధర్మాన్ని ఆడిపోసి, అవహేళన చేసినవారు పరమతసహిష్ణులుగా అఫ్సర్ గారు ఏ ఆధారాలతో వర్గీకరించారు? ఈ వర్గీకరణ స్వవచోఘాతం కాదా? ఇలాంటి భావాలను అఫ్సర్ గారు, వారి అభిమానులు బహిరంగంగా చూపడం వెనుక గల ఆంతర్యం ఏమిటి?

వీటికి సమాధానాలను నేను చెప్పలేను. చెప్పగలిగిన వారే చెప్పాలి లేదా ఈ వ్యాసం చదువుతున్న పాఠకులు తమకు తామే వెదుక్కోవాలి.

ఈ వైరుధ్యాలతో బాటు మేధావులైన కొద్దిమంది ద్వంద్వప్రవృత్తుల్ని పాఠకుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది:

 • అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత పదవి వరకూ ఎదిగిన డా. కలామ్ గారిలో సారంగ రచయిత తప్పులు పట్టడమే గాక “కలాం – ప్రజల మనిషి కాదు” అని కూడా ఏకపక్ష తీర్మానం చేయడం జరిగింది. అలా ఏకపక్షంగా తీర్మానించడం వారి జన్మసిద్ధ హక్కు అన్న ధోరణిలో సమర్థించే వారున్నారు. అదే జన్మసిద్ధ ప్రశ్నాధికారంను వాడి “ఇది సరైన వ్యాసం కాదు” అని ప్రశ్నించిన వాళ్ళను ఛాందసులు, సంఘ వ్యతిరేకులు అన్న ముద్రల్ను ఈ మేధావులే వేస్తున్నారు. ఇటువంటి పక్షపాతయుక్తమైన భావనలు, దుష్ప్రచారాలు ప్రజాస్వామికమైనవేనా?
 • “కొన్ని వందల గండ్రగొడ్డళ్ళు దూసుకువస్తూనే ఉన్నా”యని అఫ్సర్ గారు తల్లడిల్లిపోయారు. అదేవిధంగా “ఇలాంటి పక్షపాతపు వ్రాతల్ని ఓ నిజజీవిత లక్ష్య సాధకుడిపై అతను చనిపోయిన రోజునే వ్రాసి ప్రచురించకండి” అని మాలాంటి వారు తల్లడిల్లకూడదని హెచ్చరిస్తున్నారు కొందరు మేధావులు. ఇదేనా సమన్యాయం, సామ్యవాదం?
 • యాకూబ్ మెమెన్ లాంటి ఉగ్రవాదికి బహిరంగ మద్దతను ప్రకటిస్తూ వేలాది ముస్లింలు, వామపక్షీయులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్ళిన ఈ స్వేచ్ఛా భారతంలో ఇస్లామ్ పవిత్ర గ్రంథాలతో బాటు భగవద్గీతను కూడా చదివే ఓ ముస్లింపై అనవసరమైన రాజకీయ అక్కసును వెళ్ళగక్కకండి అని అభ్యంతరం చెబితే అది మతఛాందసమా? ఇదేనా లౌకికవాదానికి ఈ మేధావులు ఇస్తున్న కొత్త నిర్వచనం?
 • ఓ ’మైనార్టీ క్రిస్టియన్’ మేధావి, ఓ ’మైనార్టీ ముస్లిమ్’ మేధావిని విమర్శ పేరుతో తిడితే, ఆ తిట్టును మహాద్భుత విమర్శగా ఓ ’మైనార్టీ ముస్లిమ్’ సాహిత్యకారుడు సమర్థిస్తున్నారన్నది సూర్యబింబమంత స్పష్టంగా కనబడుతోంది. అయితే, ప్రతి విషయాన్నీ కుల, మత కళ్ళద్దాలలోనుండి మాత్రమే చూసే మేధావులకు ఇప్పుడు, ఇక్కడ ’మైనార్టీ’ వాదం గానీ, మైనార్టీల ఆత్మగౌరవం గానీ గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం! ఇదే వ్యాసాన్ని రఘోత్తమరావు వ్రాసివుంటే ఇప్పటికి సవాలక్ష ’గండ్రగొడ్డళ్ళ’తో బాటు కోర్ట్ కేస్‍లు కూడా కసిదీరా కౌగిలించుకునేవేమో! ఇదేనా సర్వధర్మసౌభ్రాతృత్వం?
 • “పరమత సహనం” గురించి ఎల్లప్పుడూ చాటిచెప్పే మేధావులకు కలామ్ గారు ఆచరణలో చూపింది అటువంటి సహనమేనన్న విషయం ఎందుకు స్ఫురించడంలేదు? ఈ విస్మరణ, విస్మృతి ఉద్దేశపూర్వకం కావా?
 • భగవద్గీతను చదువుతూ, హిందూ గురువులకు నమస్కరించడమే కలామ్ చేసిన ద్రోహంగా ఈ మేధావులు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వీరు చెప్పే సెక్యులర్ నీతుల్నే ఆచరణలో పెట్టి చూపించిన వారిని విమర్శ పేరుతో అడుగడుగునా అవమానించడం ఏ రకపు ఆలోచనా విధానం? ఇదేనా విమర్శలకు వీరు ఏర్పరిచిన అత్యున్నత ప్రమాణాలు?
 • బి.జె.పి. పార్టీ ఎంపిక చేసిన తోలుబొమ్మగా కలామ్ గారిని చిత్రీకరిస్తున్న మేధావులకు ఆ బిజేపి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటేనే ఏర్పడిందన్న విషయం తెలియదా? రాష్ట్రపతి పదవి నుండి తొలగిన మరుక్షణమే కలామ్ గారిని ప్రజలు మర్చిపోతారని జర్నలిస్ట్ వీర్ సాంఘ్వి చేసిన ఊహ ఏ కారణం వల్ల నిజం కాలేదో ఈ మేధావులకు తెలియదా? ప్రజా నాడిని పసిగట్టలేని వారు మేధావులెలా అవుతారు?
 • పై చెప్పిన వీర్ సాంఘ్వి ఆర్టికల్ శైలిలోనే సారంగ రచయిత ఆ వ్యాసాన్ని వ్రాయడం జరిగిందని నేను భావిస్తున్నాను. మరి ఆ రచయిత కలామ్ గారిపై ఓ ముస్లిమ్ జర్నలిస్ట్ వ్రాసిన ఈ ఆర్టికల్‍ను ఎందుకు చదవలేదు? అంటే “యది అనుకూలం సుఖం, యది ప్రతికూలం దుఃఖం” అన్న స్వార్థమా?
 • ఇద్దరు మాజీ రాష్ట్రపతులకు పని కల్పించుకుని మరీ కుల, మత ప్రాతిపదికన పోలికలు పుట్టించిన వ్యాసంలో ఆ ఇద్దరిలో ఒకరిని పెద్దగీతగా చూపించడానికి మరొకరిని కించపరచడం జరిగింది. దీని కంటే ఆ మొదటివారు చేసిన గొప్ప కార్యాలను, సాధించిన విజయాలను, సమాజంలో తీసుకువచ్చిన మార్పులను, చెప్పిన మంచి మాటలను వివరంగా వ్రాసివుంటే రచయిత ఉద్దేశం నేరవేరేది కాదా? కేవలం తిట్లతోను, హేళనతోను, చవకబారు తర్కంతోను మాత్రమే వ్యాసాలు వ్రాయాలా? ఇదేనా రచయితలు చూపవలసిన ప్రజ్ఞ?

ఈ రెండు ఘటనల అనుభవం ద్వారా నేను తెలుసుకొన్నదేమిటంటే – ఈ మేధావులు కోరే ప్రజాస్వామ్యపు రూపరేఖలు స్వపక్ష సహనం, పరపక్ష నిందనతో కూడినవి. ఇటువంటి ఏకపక్షీయ నిరంకుశ భావి భారతదేశాన్నా ఈ మేధావులు సాధింపజూస్తున్నారు. ఇది ప్రజాహితమో కాదో విజ్ఞులైన పాఠకులే నిర్ణయించుకోగలరు.

–స్వస్తి–


Raghothama Rao C

Raghothama Rao C

Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.

You may also like...

2 Responses

 1. శ్రీనివాసుడు says:

  రఘోత్తమరావుగారూ,
  మీరు పైన చెప్పిన సారంగ, దాని సారథి, దానిలో వ్రాసే శీర్షిక, రచయిత అందరూ ఈ మధ్య ఒక గ్రంథచౌర్యం విషయమై కుక్కిన పేనుల్లాగా సమాధానం యివ్వడంలేదు.
  ఈ మధ్య తెలంగాణా దురభిమానుల, ప్రాంతీయ రేసిస్టులవలె కనబడు వ్యక్తి ఒక శీర్షికలో ఆంధ్రావారు తెలంగాణా భాషని సర్వనాశనం చేసారని వ్రాసారు. దానిని నేను ఖండిస్తూ ఓ యుద్ధం చేసాను.
  **1954-55 నాటికే వలసదారుల ప్రభావానికి లోనై తెలంగాణ భాష కనుమరుగైపోతుండడం**
  తెలంగాణా భాష కనుమరుగైపోవడం, అజంత పదాలేవీ నోరుతిరగకపోవడానికి కారణం 1954-55 నాటి వలసదారులా? ఎవరా వలసదారులు? వాళ్లల్లో క్రీ.శ. 1400 నుండి పాలించి, మాతృభాషకు బదులుగా ముందు ఫారసీ లోను, తరువాత ఉర్దూలోను పరిపాలన నడిపి, బోధనా మాధ్యమాన్ని ఉర్దూనే ప్రధానం చేసి, పరిపాలనను ప్రజల నుండి దూరం చేసిననవాళ్లుే ఉన్నారా, లేరా? వలసదారుల పరిపాలన పోయి నాలుగేళ్లయింది కదా? సమగ్ర భాషా నిఘంటువులతో బాటు దృశ్య, శ్రవణ, ముద్రణా మాధ్యమాలన్నింటిలోను తెలంగాణా భాషే పెట్టుకోవడానికి ఎవరైనా వలసదారులు అడ్డంపడ్డారా? ప్రస్తుతం అవే కదా సాధారణ ప్రజానీకంతో సహా అందరి పలుకుబడులను నిర్దేశించి, ప్రభావితం చేస్తున్నది. ప్రాంతీయ రేసిజాన్నే పెంచి ప్రోత్సహించే తీరులేనే విశ్లేషణలు సాగిస్తూ దాన్నే పట్టుకు వ్రేలాడి, అక్కసుతో మాత్రమే విషయాన్ని చూస్తే ఎప్పటికీ అమ్మనుడిని కాపాడలేరు.‘‘
  దాని లంకె… https://magazine.saarangabooks.com/%e0%b0%9c%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf-%e0%b0%86%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%95%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95/

  తరువాత, ఈ మధ్య ఓ పదిహేనురోజుల క్రితం పందెం అనే కథ నందగిరి ఇందిరాదేవిగారు వ్రాసారు, అతి గొప్ప తాత్త్విక కథ అని పరిచయం చేసారు . ఆ కథలో రెండు మూడు వాక్యాలు చదవగానే అది అనువాద కథ అని నాకు స్ఫురించింది. అంత ప్రాథమిక పరిశీలన లేనివాళ్లు కథా సమీక్షకులు ఎలా అయ్యారో నాకు అర్థంకాలేదు. నేను వెదికితే అదే కథను *ది బెట్* అనే పేరుతో అన్టన్ చెహోవ్ 1889 లో వ్రాసారని కనబడింది. మొత్తం కథ చదివాను. పేర్లు, కాలవ్యవధి, స్థలం లాంటివి తప్పితే మిగతా ప్రతి వాక్యమూ తెలుగులోకి అనువదించి తన కథగా రచయిత్రి 1941 లో గృహలక్ష్మి అనే పత్రికలో అచ్చువేసుకున్నారు. ఈ దారుణాన్ని వాళ్ల దృష్టికి తీసుకువెళితే ఇంతవరకూ సమాధానం లేదు. కనీసం ఏమాత్రం లజ్జ లేకుండా ఆ సమీక్షని అలాగే వుంచి ఆ కథ, తాత్త్వికత రచయిత్రిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

  ఈ గ్రంథచౌర్యం గురించి ఇద్దరు ముగ్గురు తెలంగాణా రచయితలకు చెప్పాను. వారు దారుణం అన్నారే గానీ ఏమీ స్పందించలేదు.
  దయచేసి ఈ విషయంలో మీకు స్పందించాలని అనిపిస్తే గ్రంథచౌర్యాన్ని అరికట్టే ప్రయత్నం చేయగలరు.

  https://magazine.saarangabooks.com/%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%a4%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b0%a4%e0%b0%a8%e0%b1%81-%e0%b0%9a%e0%b0%be%e0%b0%9f%e0%b1%87-%e0%b0%aa%e0%b0%82/

  ఆ పత్రికలో దాదాపు నేనొక్కడినే ఆ అసంబద్ధ, రేసిస్టు, దురభిమాన, విద్వేష వ్యాసాలకు బదులు వ్రాస్తున్నది. మిగతా వ్యాఖ్యాతలందరూ దాదాపు భజంత్రీలే. ఒంటిరి పోరాటం చాలా కష్టంగా వున్నది.

 1. January 2, 2019

  […] వ్రాసిన “అబ్దుల్ కలాం – దళిత, మైనార్టీ, సెక్యుల…” వ్యాసంలో కొందరు మేధావుల లోని […]

Leave a Reply