నాటకరత్న నరేంద్రమోడీ – నిప్పులాంటి నవ్యాంధ్ర నిజాలు

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 • 57
 • 5
 •  
 •  
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  64
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అటు భాజపా నుంచి, ఇటు వైయస్సార్సిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దాకా అందరూ తెదేపాని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ నలుగురితో నారాయణా అన్నట్లు, నాలాంటివాళ్ళు కూడా కొన్ని రాళ్ళేసి కూర్చున్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్లు, ప్రజాస్వామ్యానికి సాక్షీభూతమైన పార్లమెంటులో నిజాలు నిప్పురవ్వల్లా మెరుస్తూనే ఉంటాయి. అందంచందంలేని మొగుడులా మంచం నిండా ఉన్న మోడీ, ఖాళీ ఉన్నంతమేరే కాళ్ళు జాపుకోమని ఆంధ్రులకు సలహాలివ్వపూనటం చూస్తుంటే, మెత్తగా ఉంటే మొత్తబుద్ధయ్యిందన్న సామెత గుర్తుకొస్తుంది. ఇక పార్లమెంటులో మన ఎంపీలు ఏం చేసారు అనే విషయానికి వద్దాం..

నర్సాపురం నుండి ఎన్నికైన భాజపా ఎం.పి. గోకరాజు గంగరాజు 83% హాజరుతో, రెండు చర్చల్లో పాల్గొని 210 ప్రశ్నలు వేసారు. పాస్‌పోర్ట్ జారీలో జరుగుతున్న ఆలస్యంతో మొదలైన ఆయన ప్రశ్నల పరంపర మార్స్ మిషన్ దాటి, 5జి టెక్నాలజీ మీదుగా క్యాన్సరుకు ఇమ్యునో థెరపీ వరకు సాగింది. అడిగినవి చెత్త ప్రశ్నలనైతే అనలేము కానీ, ఆ ప్రశ్నలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రత్యేకించి ఆంధ్రాకు సంబంధించినది కనిపించలేదు. కనీసం నర్సాపురానికి సంబంధించింది కూడా లేదు! గుడ్డిలో మెల్లలా, ఆంధ్రాలో ఫిషరీస్ యూనివర్సిటీ అవసరం గురించిన జరిగిన చర్చలో (20-ఏప్రిల్-2015) మాత్రం పాల్గొన్నారు. ఆ చర్చలో ఏం తేల్చారని అని మాత్రం ప్రశ్నించొద్దు.

ఇక 97% హాజరుతో 11 చర్చలలో పాల్గొని 249 ప్రశ్నలు వేసిన విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు దగ్గరకి వద్దాం. ఈయన ప్రశ్నల పరంపర కూడా గోకరాజు పద్ధతిలోనే సాగింది కానీ, విశాఖ గురించి కానీ, ఆంధ్రా గురించి కానీ ఒక్క ప్రశ్న కూడా మచ్చుకైనా లేదు.

భాజపా సభ్యులతో పోలిస్తే, వైయస్సార్సిపి, తెదేపా సభ్యులు చాలావరకు మెరుగు అనిపించారు. మచ్చుకి ఇద్దరిద్దరు చొప్పున తెదేపా నుంచి సినీ నటుడు మురళీమోహన్, గల్లా జయదేవ్‌లను, వైఎస్సార్సిపి నుంచి కొత్తపల్లి గీత, మేకపాటి మోహన్ రెడ్డిలను పరిశీలిద్దాం.

కొత్తపల్లి గీత (వైయస్సార్సిపి) 97% హాజరుతో, 81 చర్చలలో, 560 ప్రశ్నలు వేస్తే, 8 ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి (వైయస్సార్సిపి), 91% హాజరుతో, 59 చర్చలలో 301 ప్రశ్నలు వేస్తే, 12 ఆంధ్రాకు సంబంధించినవి. మురళీమోహన్ (తెదేపా) 83% హాజరుతో, 52 చర్చలలో 196 ప్రశ్నలు వేస్తే, 16 ఆంధ్రాకు సంబంధించినవి. గల్లా జయదేవ్ (తెదేపా) 83% హాజరుతో 104 చర్చలలో 410 ప్రశ్నలు వేస్తే, 22 మన రాష్ట్రానికి సంబంధించినవి. వీరిలో కూడా ప్రత్యేక హోదా గురించి ఎక్కువగా మాట్లాడింది కూడా తెదేపా సభ్యులే.

సరే, ఇక ఈ విషయాలు పక్కన పెట్టి, ప్రత్యేక హోదా గురించి పార్లమెంటు రికార్డులలో ఏముందో చూద్దాం. 22-జులై-2014న జయదేవ్ తదితరులు ప్రత్యేక హోదాపై లేవనెత్తిన సూటి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజుజు బదులిస్తూ, 2-మార్చి-2014న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం అయిదు సంవత్సరాల ప్రత్యేక హోదాను అమలుచేయాల్సిందిగా ప్రణాళికా సంఘాన్ని ఆదేశించినట్లు తెలిపాడు. విచిత్రం ఏమిటంటే, 2-మార్చి-2014లో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినా పనులు జరగలేదు. తిరిగి ఈ విషయాన్ని మురళీమోహన్ 22-డిసెంబరు-2014న ఓ చర్చలో లేవనెత్తినా ఉపయోగం లేకపోయింది.

20-మార్చి-2015న, ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేవనెత్తిన ప్రత్యేక హోదా ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్‌హా బదులిస్తూ, మొదటిసారి ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రస్తావించాడు. అదే ప్రశ్నలో ప్రస్తావించబడ్డ రాజధాని నిర్మాణానికి కావలసిన సహాయంపై కూడా, ఒక్కసారి మాత్రమే రాజధాని నిర్మాణానికి ప్రత్యేక సహాయం చేయగలమని కూడా సమాధానమిచ్చాడు. ఈ విషయాన్ని నిరశిస్తున్నట్లుగా 6-మే-2015న జరిగిన చర్చలో ముత్తంశెట్టి ఈ అంశాన్ని తిరిగి లేవనెత్తాడు.

సరే, రాజధాని నిర్మాణానికి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్ళు సరిపోతాయో, లేక యాభైవేల కోట్లైనా సరిపొవో అనే విషయాలు కూడా కొద్దిగా పక్కన పెట్టి, ఆ విషయపరంగా జరిగిందేమిటనేది ఓసారి గమనిద్దాం.

24-ఫిబ్రవరి-2015న కేశినేని శ్రీనివాస్ రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు, కేంద్ర ఆర్ధిక సహాయమంత్రి హరిభాయ్ పరాఠీభాయ్. ఏమనంటే, కె.శివరామకృష్ణ అనే ఐ.ఏ.ఎస్., అధికారి నేతృత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీ నియమించటం జరిగిందని, వారి నివేదిక ఆగస్టు, 2014న అందిందని, ఆ నివేదికకు అనుగుణంగా సరైన చర్యలు తీసుకోమని రాష్ట్రప్రభుత్వానికి పంపామని ప్రశ్న వేసినంత సూటిగా జవాబు ఇచ్చాడు.

28-ఏప్రిల్-2015న కేశినేని శ్రీనివాస్ తదితరులు ఆంధ్ర రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికై శివరామకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులపై ప్రశ్నించగా, ఈ హరీభాయ్ గారే, 4,49,505 కోట్లు అవసరమౌతాయని సూచనప్రాయంగా కమిటీ తెలిపిందని పార్లమెంటులో చెప్పాడు.

రాజధాని కోసం 2,500 కోట్లు కేటాయిస్తే, రాష్ట్రం మరేదో పథకానికి ఈ నిధులు వాడి దుర్వినియోగం చేసిందని భాజపా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో, ఈ శివరామకృష్ణ కమిటీ, కొత్తరాష్ట్రంగా లోటు బడ్జెట్‌తో మొదలైన ఆంధ్రా ఆర్ధికాభివృద్ధికే 4.5 లక్షల కోట్లు అవుతాయని సూచనప్రాయంగా తెలిపిందా, అందులో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు కూడా ఉన్నాయా అనే అనుమానం కలగటం సహజం. నిజానికి, రాజధాని ప్రాంత కనీస మౌలికావసరాలకుగాను, 1536 కోట్లు అవసరమౌతాయని ఈ కమిటీ అంచనా వేసింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కమిటీ కూడా రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం మీద ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు. చండీఘడ్, గాంధీనగర్ తరహాలో నగరనిర్మాణం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి, పరిపాలనను, శాఖలను వికేంద్రీకరించమని చెప్పింది. అంత ఖచ్చితంగా చెప్పిన కమిటీ, శాశ్వత రాజధాని నిర్మాణానికి 1530 కోట్లు కేటాయించమని ఎలా చెబుతుంది? కాబట్టి, అప్పుడు ఆ కమిటీ చేసిన సిఫార్సు తాత్కాలికంగా ఇబ్బందులు అధిగమించేందుకు సూచించిదని ఎవరైనా అర్ధం చేసుకోగలరు. కాబట్టి భా.జ.పా. చేస్తున్న ఆరోపణలు నిస్సందేహంగా తప్పే.

మరో విషయం ఏమిటంటే, జె.సి.దివాకర్ రెడ్డి 23-డిసెంబరు-2014 నాడే  ఈ శివరామకృష్ణ కమిటీ ప్రత్యామ్నాయ రాజధాని గురించి నివేదిక ఇచ్చిందా అని సూటిగా అడిగాడు. అందుకు హరీభాయ్ పరాఠీభాయ్ అవుననే సమాధానం ఇచ్చాడు. కాబట్టి, తేలుతున్న విషయం ఏమిటంటే, ఈ కమిటీ సూచించిన ఆర్థిక సహాయంలో రాజధాని నిర్మాణం కూడా ఉన్నదే.

ఇక్కడ రంగులు మార్చే నాటకాలు వేస్తున్నదెవరు? మార్చి 2014లో ప్రత్యేక హోదా అమలుజరపాలని ప్రణాళికా సంఘాన్ని నిర్దేశించిన ప్రభుత్వం తొమ్మిది నెలలలో హఠాత్తుగా ఎందుకు మారిపోయింది? దాని వెనుక రాజకీయాలేమిటి? జాతీయ పార్టీలు, ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం చేయాలని ఎందుకు చూస్తున్నాయి? జాతీయ పార్టీల కుట్రలో ప్రాంతీయ పార్టీలు ఎందుకు భాగమౌతున్నాయి? ఆంధ్రులకు జరిగే ఈ అన్యాయంతో లాభపడేదెవరు? ప్రస్తుతానికి తేలని ప్రశ్నలివి.

ఏదేమైనా, మనలో మనకు ఐక్యత లేనంత వరకూ ఈ జాతీయపార్టీలు మనకు ద్రోహం చేస్తూనే ఉంటాయి, కల్లబొల్లి కబుర్లు చెబుతూనే ఉంటాయి. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్ ఒక్క తాటిపైకి రావాలి. అడిగినా పెట్టనప్పుడు, ఆరాటపడినా పెట్టనప్పుడు పోరాటమే మార్గం. మన హక్కుల కోసం చేసె పోరాటానికి ప్రజలు ఎప్పుడూ బాసటగా నిలుస్తారు. కావాలంటే, విశాఖ ఉక్కు పోరాటాన్ని స్ఫూర్తిగా మలుచుకుందాం. స్ఫూర్తి ప్రదాతలను స్మరించుకుందాం. ఆంధ్రుల అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి దేబిరించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని గ్రహించాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బలన్నట్లు, మోడీ కాటుకు, వోటుతో వేటు వేయాల్సిందే.

Products from Amazon.in

You may also like...

Leave a Reply