కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

కాల్‌షీట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాజకీయ కంకణం తొడుక్కునే పవన్‌కళ్యాణ్, నాలుగేళ్ళ నిద్ర తర్వాత, మురిగిపోయిన లడ్లలాంటి ప్యాకేజీ గురించిగాను తను చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వానికి తప్పును సరిదిద్దుకునేందుకు 15 ఫిబ్రవరి దాకా టైమిచ్చాడు.

నాలుగు సంవత్సరాలు తానా అంటే తందనా అంటూ, ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా, ప్రత్యేక ప్యాకేజీని ప్రత్యేక సాయంగా ఇష్టం వచ్చినట్లు ప్రస్తావిస్తున్నా నోరు మెదపని నారా బాబుగారు మార్చి 5 దాకా వేచి చూస్తామంటున్నారు.

ప్రత్యేక హోదా కోసం ఈయన చేసే పోరాటం ప్రజల కోసమా, లేకుంటే ఎన్.డి.ఎ.కు తెదేపాని దూరం చేసి తను దగ్గరయ్యే పథకమో తెలీదు కానీ, ప్రత్యేక హోదా ప్రకటించేందుకు కేంద్రప్రభుత్వానికి 16 ఏప్రిల్ దాకా సమయమిచ్చాడు జగన్‌మోహనుడు.

 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా దాదాపు ఇలాంటి తంతులన్నీ నడిపారు, ఇప్పుడు మరోసారి రీ ప్లే అవుతున్నారు అంతే. నిజంగా ప్రజల ఆకాంక్షల పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల వీరందరికీ నిజాయితీ ఉండి ఉంటే, తమ తమ రాజకీయ స్వార్థాలను పక్కనపెట్టి, ఐకమత్యంతో పోరాడి ఉండేవారు. కనీసం, ఆ దిశగా ప్రయత్నమైనా చేసి ఉండేవాళ్ళు.

ఆయా తారీఖుల తర్వాత వీరంతా ఏమేం పీక గలరో, ప్రజలు ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చే ఉంటారు. నిష్ఠూరంగా చెప్పాలంటే, వీరు పీకి పారేసేదీ లేదు, పొడి చేసేదీ లేదు. పేనుకు పెత్తనం ఇచ్చినట్లు, కేంద్ర ప్రభుత్వం ముందు ఒకరినొకళ్ళు నగ్నంగా నిలబెట్టుకొని, రాష్ట్ర శ్రేయస్సును పణంగా పెట్టిన మొనగాళ్ళే వీళ్లందరూ. వీళ్ళ నగ్న స్వరూపాలు చూసి, ఓసోస్, ఆంధ్రులంతా ఇంతేనా అని కేంద్ర నాయకులు చేసే వెటకారాలు, వేళాకోళాలు వాళ్ళ బడ్జెట్టుల ద్వారా ప్రస్ఫుటమౌతున్నాయంటే ఆశ్చర్యం లేదు.

ఇప్పుడు కొందరు చేసే రాజీనామాల ప్రస్తావన 2014నాటి సంగతులు కొన్ని గుర్తుకుతెస్తున్నాయి. విభజనకు ముందు “రాజీనామా వల్ల తెలంగాణా వస్తుందా” అని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించేవాళ్ళు. విభజన తర్వాత, “రాజీనామా వల్ల సమైక్యాంధ్ర వస్తుందా” అని ఆంధ్రా కాంగీయులు కూడా ప్రశ్నించారు. చివరికి, రాజకీయాల్లో చిరుజీవి చిరంజీవి కూడా అవేలాంటి ప్రశ్నలు వేసి ప్రజలను మభ్యపెట్టాడు. కావూరి లాంటి వాళ్ళైతే, “రాజీనామాల వల్ల ఉపయోగంలేదు. కనీసం ఇప్పుడు ఈ పదవి అడ్డంపెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడొచ్చు” అనే నీతి వాక్యాలు కూడా చెప్పాడు.

ఆ కావూరి సాంబశివరావే, ఆంధ్రాలో కాంగ్రెస్‌కు పుట్టుగతులుండవని భాజపాలోకి దూకేసి మనపాలిట మళ్ళీ దాపురించాడు. అధికార పార్టీ సభ్యుడైనా, పదవి లేక పాపం ఈయన పోరాటం చేస్తున్నట్లు లేడు! అవేలాంటి మాటలు తెదేపా నేతల నోటి నుంచి కూడా వస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. అన్నీ ఆ తాను గుడ్డలే.

నిజానికి ఇలాంటి రాజకీయులకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కానేకాదు. వారివారి వ్యాపార ప్రయోజనాల కోసం ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి దూకటం, లేదంటే అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రాకులాడటం మాత్రమే ముఖ్యం. 18-ఫిబ్రవరి-2014 దాకా, తెలంగాణా వచ్చే వ్యవహారం కాదు, మా తడాఖా చూపిస్తామని ఉత్తరకుమార ప్రతిజ్ఞలు చేసిన ధీరులు వీళ్ళే. ఇలాంటి ఆంధ్రా నేతలకే బిస్కెట్లు ఇచ్చినట్లు రోడ్ల కాంట్రాక్టులు పడేసి, విభజనలో వాళ్ళెవరూ నోరెత్తకుండా కుక్కిన పేనుల్లా పడి ఉండేట్లు చేసింది సోనియమ్మ. ఆ తర్వాతి కథ మనకందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ కాంగీయులను దులిపిపారేసిన తెదేపా, ఇప్పుడు చేస్తున్నది అదే పని.

రాజీనామలు అనేవి ప్రజాస్వామికంగా ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచే సాధనాలు మాత్రమే కావు. ప్రజల పట్ల తమ బాధ్యతను తాము నెరెవేర్చలేకపోతున్నందుకు కారణాలు వివరించి, మళ్ళీ ఆ ప్రజల తీర్పును కోరుకునే అరుదైన అవకాశం. నిజాయితీగా వాడితే దీనినిమించిన ఆయుధం లేదు. అంచెలంచెలుగా కాదు, ఒక్కసారిగా, ఒకే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎం.పీ.లు పార్టీల కతీతంగా ప్రజల శ్రేయస్సు కోసం రాజీనామాలు చేస్తే, ఏ ప్రభుత్వం దిగిరాదు? ఆ తెగువ, ఐకమత్యం మన ఆంధ్రా నేతల నుంచి మనం ఆశించలేం. పొరుగు రాష్ట్రాలలో వారి ఉనికికి సంబంధించిన ఏ విషయమైనా వివాదమైతే, ఆయా రాష్ట్రాలలోని పార్టీలన్నీ కలిసి బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తాయి. మన దౌర్భాగ్యం మనకు అటువంటి ఆలోచనలే రావు, అటువంటి నాయకులే లేరు.

అయినదానికి కానిదానికి అల్లరిచేసే చిల్లరపార్టీలు కమ్యూనిస్టులు రంగంలోకి దిగారు, నాలుగేళ్ళ తర్వాత! చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే విభజన జరిగిందని ఇప్పటికీ దుమ్మెత్తిపోస్తున్నారు కానీ, కనీసం ఆంధ్ర ప్రజలకు సంఘీ భావమైనా ప్రకటించలేదు ఆంధ్రా కాంగీ నాయకులు. తిమ్మిని బమ్మి చేయటానికే అన్న అపఖ్యాతి మూటకట్టుకుంటూ పవన్ కళ్యాణ్ ఓ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసాడు. ఇంకా ఏ నిజం నిర్ధారించాలని ఈ ప్రయత్నం? నిజానికి, పాత రాజధానితో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణా కన్నా, పాత పేరుతో కొత్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రాకు అన్యాయం జరిగిందనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానమే లేదు. ఇప్పటివరకూ దాదాపు 13 వేల కోట్లు ఇచ్చామని భాజపా అధికారికంగానే ప్రకటించింది. రాజధానే కాకుండా, తగినంత మౌలిక సదుపాయాలేవీ లేని ఈ కొత్తరాష్ట్రానికి 13వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి?

మరో ముఖ్య విషయం, సి.జి.ఎస్.టి. కింద, డిసెంబరు, 2017 వరకూ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వపు వాటాగా వసూలైన సొమ్ము దాదాపు 5 వేల కోట్ల రూపాయలు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలకు పన్నురాయితీలు ఇవ్వాల్సి వస్తుందని, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సహాయం అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన కేంద్రం, మన రాష్ట్రం నుంచి వసూలు చేసుకున్న సొమ్ము, వాళ్ళు చేసిన సహాయంలో దాదాపు మూడింట ఒకవంతు పై మాటే! కళ్ళకు కట్టినట్లు ఇంత దారుణం కనిపిస్తున్నా, ఎవరి కళ్ళకు గంతలు కట్టటానికి ఈ ప్రయత్నం? కేంద్ర నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటే, ప్రత్యేక దర్యాప్తు చేసుకోవచ్చు. అంతేకానీ, ఆ మిషతో ఇంతకు మించి సాయం చేయము అని అంటే అది తప్పు కాదా?

వీటితోపాటు విచారించాల్సిన మరో ముఖ్యమైన విషయం – మన సినీనటుల బాధ్యత లేమి. ఒక్క చిన్న నటుడు శివాజీ తప్పించి, ఇంతవరకూ మరే సినిమా నటుడు కూడా ఆంధ్రాకు జరిగిన, జరుగుతున్న అన్యాయంపై పెదవి విప్పలేదు. తొడలు కొట్టి, మీసాలు మెలేసి, అరడజను సుమోలు గాలిలోకి లేపే ఈ వీరాధివీరులు, గట్టిగా కాకపోయినా కనీసం నత్తిగా కూడా మాట్లాడటంలేదు. ఇదీ మన దౌర్భాగ్యం. ఇటువంటి సినీదద్దమ్మలు మనకు ఆదర్శం. వీళ్ళ పటాలకు పాలాభిషేకాలు చేసి, కటౌట్లు ఊరేగించి, శతదినోత్సవాలు చేస్తాం. పిచ్చి పీక్సుకి వెళ్ళినప్పుడు, వేరే హీరో అభిమాని పీక కోయటానికైనా సందేహించం. రాజకీయాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏ ప్రేక్షకులే దేవుళ్ళని కల్లబొల్లి కబుర్లు చెబుతారో, ఆ ప్రేక్షక దేవుళ్ళే అయిన ఈ ప్రజలకు కష్టం కలుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు మూసుకు కూర్చునే ఈ హీరోలు మనకు అవసరమా?

ఏదేమైనా, ఈ కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు రాష్ట్రానికి ఏమాత్రమూ మేలు చేయవని ఓ నిరాశా, నిస్పృహతో… ఈ నాలుగు లైనులు… ఎవరు ఏ గాడిదో  2019 నాటికి ప్రజలే నిర్ధారించుకుంటారు.

Products from Amazon.in

You may also like...

Leave a Reply