ఉడతల ఊపులు

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
 •  
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares
Like-o-Meter
[Total: 0 Average: 0]

మొత్తానికి భాజపా, తెదేపా కలిసి మొన్నటిదాకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు చూపించారు. మార్చి అయిదు నుంచి ఫస్ట్ అండ్ సెకెండ్ షో చూపిస్తారేమో! చూపిస్తే చూపించారు గానీ, ఇద్దరూ కలిసి ప్రజలకు మాత్రం చెవుల్లో పూవులు పెట్టేసారు. 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకోసారైనా బాబుగారు మండిపడేవారు. నిజంగా పడేవారో కాదో తెలీదు కానీ,  అలా అని, రోజుకోసారైనా ఈ టీవీలో, ఎబిఎన్‌లో వార్త వచ్చేది. మరి ఈ నాలుగేళ్ళల్లో కింద మీద పడటమైతే చూసాం కానీ, ఈయన మండిపడటం చూడలేదు. అంత నాడు లేదు, ఇంత నాడు లేదు, సంత నాడు కట్టింది ముంతంత కొప్పు అన్నట్లు, నాలుగేళ్ళపాటు ప్రజలను మభ్య పెట్టి, వందిగా నరేంద్ర మోడీని కీర్తించి, రాష్ట్రానికి వచ్చిన ప్రతి భాజపా ప్రతినిధి సేవలో తరించి, శాలువాలు కప్పిన నారావారు,  హఠాత్తుగా అగ్గి మీది గుగ్గిలంలా మారితే ఆశ్చర్యంగా లేదు!

ఆచారానికే ఆరు మూరలు, గోచీ కోసం మూడు మూరలు చాలు అన్నట్లు, హోదా కన్నా ప్యాకేజీలోనే మనం ఎక్కువ పోగేసుకోవచ్చు అని పరవశించి పోయిన బాబుగారు గోచీ చింకిపోతున్నదని అకస్మాత్తుగా గగ్గోలు పెట్టటం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఇన్నాళ్ళు మూగపోవటానికి, ఓటుకు నోటులో ఇరుక్కుపోవటమే కారణమా? ఇప్పుడు నోరు పెగలటానికి, గుజరాత్‌లో చావు తప్పి కన్ను లొట్టబోయిన భాజపా నాయకత్వమా? నాలుగో ఫ్రంటుకు నారావారికి నాయకత్వం వహించమని ఏమైనా పిలుపులు వచ్చాయా? లేక, నిజంగానే ప్రజల పక్షాన పోరాడాలనే ఉత్సాహమా? చివరిదే నిజమనుకుందాం మార్చి 5 దాకా.

సీతమ్మ శీలాన్నే శంకించిన పలుకాకులు లోకులు, చంద్రన్నని కూడా శంకించటంలో ఆశ్చర్యం లేదంటారు, ఆమాటకొస్తే, అందులో అసలు అర్థమేలేదంటారు అభిమాన కార్యకర్తలు. అర్థాలు, అనర్థాలు, అపార్థాలు అన్నిటినీ ఆపాదించటానికి ఇద్దరు పాపాల భైరవులని ఆల్రెడీ కనిపెట్టే ఉంది తెలుగుదేశం. కాబట్టి, తమ తప్పిదాలు కప్పిపుచ్చుకుంటూనే, కాంగ్రెస్‌కో, జగన్‌కో శాపనార్థాలు తగిలించటం వీళ్ళకి తోక ఊపినంత సులభం. ఎందుకంటే, తెలుగుదేశంలో తలలకి, తోకలకీ ఊపటమే తెలుసు. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని ఆలోచన చేయాల్సిన తలలు తోకలతో బంధించబడ్డాయి. అవి బాబుగారి వేలికో, వ్యాపార మంత్రుల కాళ్లకో ముడివేయబడి ఉంటాయి.

మొదటిసారి విన్నప్పుడు, పార్లమెంటులో గల్లా గారి గర్జన ఆంధ్ర రాష్ట్రంలో గల్లీ గల్లీ రీసౌండ్ అయ్యేట్లు వినిపించిందని అనిపించింది. మరోసారి తీరిగ్గా విన్నాక అర్ధమయ్యింది. గర్జనలోని తర్జనభర్జనలు,  దేబిరింపులు. విభజన చట్టంలోని అంశాలే ప్రస్తావించారు కానీ,  ముక్కుసూటిగా హోదా గురించో, ప్యాకేజీ చట్టబద్ధత గురించో ఒక్క మాట రాలేదు. సాక్షాత్తు, ఎన్నికల హామీనీ హుష్ కాకి అని ఎగరేసిన భాజపా ప్రభుత్వాన్నైనా, నరేంద్ర మోడీనైనా రేపు ఎలా నమ్మగలము అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

ప్రత్యేక హోదా ప్రస్తావన విభజన చట్టంలో లేదు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఇంతవరకూ చట్టబద్ధత కల్పించలేదు. ఆంధ్రాకు చేయాల్సిన సహాయానికి, బడ్జెట్‌తో సంబంధం లేదంటాడు న్యాయవాది అయిన ఆర్ధిక మంత్రి. ఈ మనిషినే, న్యాయవాదిగా పెట్టుకొని, కొన్ని వందల కోట్లు ఫీజు సమర్పించుకొని, కేంద్ర ప్రభుత్వం మీద దావా వేస్తే ఈ మాటలన్నీ మారకపోతే ఒట్టు!

ఇప్పటివరకూ, అంటే గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రం మనకు ఇచ్చిన నిధులు (అంటే, 1460 రోజులకు) దాదాపు 12,918 కోట్లు. అనగా, మోడీ ఎంగిలిచేత్తో రోజుకో పది కోట్లు కూడా మనకు విదిలించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎంత చదివించుకోవాల్సి వస్తున్నదనే విషయం వీళ్ళు అడగరు, వాళ్ళు చెప్పరు. మరి, అదేదో సభలో అమిత్ షా పంచె సవరించుకుంటూ లక్షన్నర కోట్లు ఇచ్చామని ప్రకటించాడే అనడిగితే, అది చేయబోయే సాయం అంటారు. అంచెలంచెలుగా ఇచ్చే ఈ సాయం, ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం అక్షరాలా మూడు లక్షల యాభై అయిదు వేల కోట్లు దాటింది! మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, డబ్బులు గల్లా దాటటం లేదు.

ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ప్రస్తావించలేదనే మెలికలు పెట్టిన పెద్ద మనుషులు రేపు మాత్రం ఈ సాయమంతా చేస్తారనే నమ్మకం ఏమిటి? ఒకసారి మోసపోయిన తర్వాత, మరోసారి కూడా మోసపోతే మూర్ఖుడంటారు. కాబట్టి, కనీసం ఈ ప్యాకేజుకు చట్టబద్ధత కల్పించాలని గల్లా గర్జించలేదే? మరో ముఖ్య విషయం, గాలిలో కట్టిన ఈ ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన మొత్తాన్ని ఎలా ఇవ్వాలనే విషయం పైన నాలుగేళ్ళుగా కసరత్తు చేస్తూనే ఉన్నారట!

ఉడుత ఊపే ఊపుళ్లకు కాయలు రాలవు. ఉడుంలా బిగించి కాయలు ఊడబీక్కోవాలి. కక్కిన కూటికి ఆశ పడకుండా, మన హక్కుగా మనకు రావలసినదానికి పోరాడాలి. విభజన చట్టంలోని అంశాలు ముఖ్యమైనవే, అయినా ముందుగా, అయితే ప్రత్యేక హోదా కోసం, లేదంటే ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కోసం పోరాడాలి. అది ఇప్పుడే జరగాలి, లేదంటే ప్రజలు 2019లో క్షమించరు. పిండాకూడు తినే పిశాచాలు మళ్ళీ పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదు.

ఏదేమైనా, తోకలూపే తెలుగుదేశం పోరాడుతుందనే అనుమానం అణువంతైనా లేదు.

Products from Amazon.in

You may also like...

Leave a Reply